ఉమేష్ పాల్ హత్య నిందితుడు, మాజీ రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల నుండి తన ప్రాణ రక్షణ కోసం చేసిన విజ్ఞప్తిని స్వీకరించడానికి గత నెలలో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తరువాత ఆ రాష్ట్ర పోలీసులే  అతని కొడుకును ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేశారు, ఆ తర్వాత అతనితో పాటు అతని సోదరుడిని పోలీసు కస్టడీలో వుండగా ముగ్గురు దుండగులు కాల్చి చంపారు.

అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై విచారణకు విశ్రాంత సుప్రీం కోర్టు జడ్జి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏప్రిల్ 17న సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలు అయింది.

మన దేశంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్ హత్యల మీద ఇటీవలి సంవత్సరాలలో తీవ్రమైన చర్చ, పరిశీలన జరుగుతోంది. తరచుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలే చేస్తున్న ఈ చట్టవ్యతిరేక హత్యలు న్యాయపాలన, మానవ హక్కులు, జవాబుదారీతనం గురించిన ప్రశ్నలను లేవనెత్తాయి.

దీనికి ప్రతిస్పందనగా న్యాయవ్యవస్థ, ప్రత్యేకించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని భారత పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా కాలక్రమంలో తీర్పులు వెలువరించింది. న్యాయవ్యవస్థ ఎన్‌కౌంటర్ హత్యలలో ఎలా జోక్యం చేసుకుంది అనే అంశాన్ని, కొన్ని ముఖ్యమైన కేసులు, కోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఈ కథనం పరిశీలిస్తుంది.

నిజం తెలుసుకోవాల్సిన అవసరం.

 చట్ట వ్యతిరేక హత్యలు జరిగినప్పుడల్లా, ఒక వ్యక్తి తన రక్షణ కోసం వున్న ప్రాథమిక హక్కునూ, నేరం రుజువయ్యేవరకు నిర్దోషిగా భావించాలనే నేరచట్ట ప్రధాన సూత్ర ఉల్లంఘన వల్ల తన కేసును నిరూపించుకొనే అవకాశాన్నీ కోల్పోతున్నాడు. ఆత్మరక్షణ కోసం సహేతుకమైన శక్తిని ఉపయోగించడం వల్ల హత్య జరిగినట్లయితే మాత్రమే ఇది సమర్థనీయమౌతుంది. అయితే, ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, అది బూటకమా, అసలైనదా అనేది ఇతరులకు తెలియదు. మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నకు ఎక్స్‌ట్రా జ్యుడీషియల్ ఎగ్జిక్యూషన్ విక్టిమ్ ఫ్యామిలీస్ అసోసియేషన్ (చట్టవ్యతిరేక హత్యల బాధిత కుటుంబాల సంఘం) & మరొకరు v.యూనియన్ ఆఫ్ ఇండియా & మరొకరు, 2016 కేసులో సుప్రీం కోర్టు సమాధానం ఇచ్చింది. ఈ కేసులో మణిపూర్ పోలీసులు, సైన్యంతో సహా కేంద్ర సాయుధ దళాలు జరిపిన 1528 చట్ట వ్యతిరేక హత్య కేసులు బూటకపు ఎన్‌కౌంటర్లుగా ఆరోపణకు గురయ్యాయి. ఈ ఆరోపణలు పూర్తిగా లేదా పాక్షికంగా నిజమా లేదా పూర్తిగా పనికిరానివా అని కోర్టు గమనించింది. ఎన్‌కౌంటర్ వాస్తవమా కాదా అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి వుంది. అయితే ఏ సందర్భంలోనైనా నిజం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది.

 “చట్టం న్యాయంతో మమేకం కావాలంటే నిజం తెలుసుకోవాలి. బూటకపు ఎన్‌కౌంటర్లు లేదా న్యాయవిరుద్ధమైన ఉరిశిక్షలు జరిగాయా? ఒకవేళ జరిగివుంటే, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినవారు ఎవరు? ఆ తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా వారి బంధువులతో ఎలా ప్రవర్తించాలి అనే అంశాల్ని నిర్ధారించడానికి నిజానిజాలు తెలుసుకునే కసరత్తు తప్పనిసరి” అని వివరించింది.

ఆత్మరక్షణ, ప్రతీకారంలో వున్న తేడాఒక ఎన్‌కౌంటర్‌ బూటకమా లేదా నిజంగా జరిగిందా అని నిర్ధారించడానికి ఆత్మరక్షణ- మితిమీరిన ప్రతీకారం మధ్య వున్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి.

మంజీత్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ (2014) కేసులో సుప్రీం కోర్టు స్వీయ రక్షణ హక్కు, ప్రతీకారానికి మధ్య తేడాను చూపింది. ఆత్మరక్షణ హక్కు లేదా వ్యక్తిగత రక్షణ హక్కు, మితిమీరిన బలాన్ని ఉపయోగించడం లేదా ప్రతీకారం మధ్య వున్న తేడాను గుర్తించాలని కోర్టు వివరించింది. చాలా సరళంగా చెప్పాలంటే, ఆత్మరక్షణ లేదా వ్యక్తిగత రక్షణ హక్కు అనేది తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగించుకునే హక్కు తప్ప ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు.

రోహ్తాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా-2013 కేసులో ఒక కరడుగట్టిన నేరస్థుడిపై కూడా ప్రతీకార బలాన్ని ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

 “అతను [అప్పీలుదారు] పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కానీ ఒక వ్యక్తి కరడుగట్టిన నేరస్థుడు లేదా ప్రకటిత నేరస్థుడు అయినంత మాత్రాన అతన్ని క్రూరంగా చంపడానికి వీల్లేదు.” అయితే దర్శన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, 2010 కేసులో సుప్రీం కోర్ట్ ఇలా పేర్కొంది: “దురాక్రమణదారు వల్ల మరణం లేదా తీవ్రమైన గాయమవుతుందనే నిజమైన భయం ఉంటే, ఆ సందర్భంలో వ్యక్తిగత రక్షణ హక్కు చంపడానికి దారితీయవచ్చు. స్వీయ-రక్షణ హక్కును అమలుచేయడానికి కేవలం సహేతుకమైన భయం సరిపోతుంది. కానీ అప్పుడు కూడా స్వీయ-రక్షణ హక్కు అనేది తనను తాను రక్షించుకునే హక్కు మాత్రమే కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు అని చట్టం చెబుతుంది.”

మిలిటెంట్లు, తిరుగుబాటుదారులు లేదా తీవ్రవాదులు అని బాధితులపై ఆరోపణలు వచ్చినప్పుడు న్యాయస్థానాల ముందున్న సమస్య చాలా ఇబ్బందికరంగా మారుతుందని అని అంటూ ఎక్స్‌ట్రా జ్యుడీషియల్ ఎగ్జిక్యూషన్ విక్టిమ్ ఫ్యామిలీస్ అసోసియేషన్ (చట్టవ్యతిరేక హత్యల బాధిత కుటుంబాల సంఘం) & మరొకరు v.యూనియన్ ఆఫ్ ఇండియా & మరొకరు-2016 కేసులో సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన పరిశీలన చేసింది. “అటువంటి సందర్భాలలో (కోర్టుతో సహా) ఎవరైనా సరే అవసరమైన బలప్రయోగ స్థాయిని మితిమీరిందా లేక ప్రతీకార చర్యనా అని ఎలా అంచనా వేస్తారు? ఇలాంటి కేసుల్లో న్యాయస్థానం చేసే పరిశీలన వల్ల మిలిటెంట్లు, తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులతో ఒక చేతిని వెనుకకు కట్టుకొని పోరాడే పరిస్థితికి తనను నెడుతుందని రాజ్యం చేసే ఫిర్యాదు లేదా విమర్శ సరైనది కాదని, ఇలాంటి సందర్భాల్లో ఎన్‌కౌంటర్ లేదా ఆ చర్య విచారణలో లేదని, దర్యాప్తులో ఉన్నది పొగ వచ్చే తుపాకి” అని జోడించింది.  “ఒక చర్యలో బలాన్ని ఉపయోగించడం, ఈగను చంపడానికి పెద్ద సుత్తి లాంటి ప్రాణాంతక శక్తిని ఉపయోగించడం మధ్య గుణాత్మక వ్యత్యాసం ఉంది; ఒకటి ఆత్మరక్షణ చర్య అయితే మరొకటి ప్రతీకార చర్య.” అని కోర్టు అభిప్రాయపడింది.

ఇదే కేసులో నాగా పీపుల్స్ మూవ్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కేసును ప్రస్తావిస్తూ, దుర్వినియోగం లేదా అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదు లేదా ఆరోపణ వస్తే కనక మణిపూర్‌లోని కల్లోలిత ప్రాంతంతో సహా సాయుధ బలగాల వల్ల సంభవించే ప్రతి మరణాన్ని “పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉందని” పేర్కొంది.

మణిపూర్ పోలీసులు లేదా కేంద్ర సాయుధ బలగాలు మితిమీరిన బలప్రయోగం లేదా ప్రతీకార బలాన్ని ఉపయోగించడం అనుమతించబడదని ఎక్స్‌ట్రా జ్యుడీషియల్ ఎగ్జిక్యూషన్ విక్టిమ్ ఫ్యామిలీస్ అసోసియేషన్ & మరొకరు v.యూనియన్ ఆఫ్ ఇండియా & మరొకరు, 2016 కేసులో కోర్టు నిర్ధారించింది. చేయవలసిన- చేయకూడని పనులు, కనీస బలగాన్ని ఉపయోగించే తప్పనిసరి పరిస్థితుల గురించి సైనిక సిబ్బందికి వున్న పది ఆదేశాల్లో ఈ విషయం స్పష్టంగా వుంది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడిన ప్రాంతంలో కూడా ఈ సూత్రం సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం క్రింద వర్తిస్తుంది. కేంద్రంలోని ఇతర సాయుధ దళాలకు, మణిపూర్ పోలీసులకు ఈ సూత్రం వర్తించకూడదనడానికి ఎటువంటి కారణం లేదని కోర్టు పేర్కొంది.

నిందితుడు క్రూర నేరస్థుడు కాబట్టి పోలీసులు అతన్ని చంపడం సమర్థనీయమా?

నిందితుడు ఒక క్రూరమైన నేరస్థుడు కాబట్టి పోలీసులు అతన్ని చంపడం న్యాయమా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. పోలీసులు నిస్సందేహంగా నిందితులను అరెస్టు చేసి విచారణకు తీసుకురావాలని,  నిందితుడు భయంకరమైన నేరస్థుడు కాబట్టి నిందితుడిని చంపడం పోలీసు అధికారుల కర్తవ్యం కాదని ఓం ప్రకాష్ అండ్ అదర్స్ v. జార్ఖండ్ రాష్ట్రం 2012 కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది.

నేరస్థులను తుడిచి పెట్టి, ఆ ఘటనను ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించే,తుపాకి పేల్చడానికి తహతహ లాడే  పోలీసు సిబ్బందిని పదేపదే హెచ్చరించాము, ఇలాంటి హత్యలను ఖండించాలి. మన నేర న్యాయపాలనా వ్యవస్థ వాటిని చట్టబద్ధమైనవిగా గుర్తించలేదు” అని కోర్టు వివరించింది. అది “రాజ్య ప్రాయోజిత ఉగ్రవాదం” అని కోర్టు వ్యాఖ్యానించింది. తమ విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులపై దాడి చేసి చంపిన సందర్భాలు ఉన్నాయని కూడా ఇదే కేసులో కోర్టు గుర్తించింది.

ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయనే వాస్తవాన్ని కోర్టు గమనించాలి.

నేరస్థులను అరెస్టు చేసే చట్టపరమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు, పోలీసులు తమ భద్రతను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరై నేరస్థులపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వచ్చిన పోలీసు అధికారులకు విచారణ జరపడానికి వుండే ఆంక్షలు రక్షణ కల్పిస్తాయి.

నురేమ్‌బెర్గ్ విచారణలోలాగా ఉన్నతాధికారి ఆదేశాలిచ్చాడనే సాకుతో చేసే “ఎన్‌కౌంటర్” హత్యలను క్షమించడానికి వీల్లేదు. ఎంతటి పై స్థాయివారైనా సరే తమ పై అధికారులు లేదా రాజకీయ నాయకుల ఆదేశాలను అమలు చేస్తున్నామనే సాకుతో “ఎన్‌కౌంటర్” పేరుతో హత్య చేస్తే పోలీసులను క్షమించేదిలేదని ప్రకాష్ కదం వర్సెస్ రాంప్రసాద్ విశ్వనాథ్ గుప్తా కేసులో సుప్రీం కోర్టు హెచ్చరించింది.

న్యూరెమ్‌బర్గ్ విచారణలో నాజీ యుద్ధ నేరస్థులు “ఆదేశాలంటే ఆదేశాలే” అనే అభ్యర్ధనను తీసుకున్నప్పటికీ వారిని ఉరితీశారని కోర్టు నొక్కి వక్కాణించింది. బూటకపు “ఎన్‌కౌంటర్” చేయమని ఒక పోలీసు అధికారిని ఎవరైనా ఉన్నతాధికారి చట్టవిరుద్ధంగా ఆదేశిస్తే, అలాంటి చట్టవిరుద్ధమైన ఆదేశాన్ని అమలు చేయడానికి నిరాకరించడం అతని విధి, లేకపోతే అతనిపై హత్యా నేరం మోపబడుతుంది, దోషిగా తేలితే మరణశిక్షకు గురవుతాడు.

“ఎన్‌కౌంటర్” తత్వశాస్త్రం నేర తత్వశాస్త్రం అని, పోలీసులందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. “ఎన్‌కౌంటర్” పేరుతో ప్రజలను చంపి దాని నుండి తప్పించుకోవచ్చని తుపాకీ పేల్చడానికి ఉబలాటపడే పోలీసులు భావిస్తున్నారు. అలాంటి వారు తమకు ఉరిశిక్ష పడవచ్చని తెలుసుకోవాలి అని కోర్టు వివరించింది.

ఎన్‌కౌంటర్ బూటకమని తేల్చే అంశాలు

రోహ్తాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా & అదర్స్- 2013 కేసులో, హర్యానా రాష్ట్రం, రేవారి జిల్లా, బవార్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధం చేసిన ఐదుగురు పోలీసులపై ఐపిసి సెక్షన్లు 302 (హత్యకు శిక్ష), 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యం అదృశ్యం కావడం లేదా నేరస్థుడిని రక్షించేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం)  కింద ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు అయింది. 2008లో నార్నాల్‌లోని రేవారి రోడ్డులో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో అప్పీలుదారు కుమారుడు సునీల్‌ను హత్య చేసినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌పై సీబీఐ  దర్యాప్తుకు ఆదేశించాలని కూడా విజ్ఞప్తి చేసింది.

ఎన్‌కౌంటర్ బూటకమని నిర్ధారించడానికి కోర్టు ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకుంది (ఎ) మరణించిన వ్యక్తి దూకుడుగా ఉన్నాడనే పోలీసుల కథనానికి అనుగుణంగా రికార్డులో సాక్ష్యాధారాలు లేవు (బి) బుల్లెట్ గాయాల స్వభావం, స్థానం (అంటే, కీలకమైన భాగమైన ఛాతీపైన గాయాల స్వభావం, స్థానం వెనుక భాగంలోలాగే) హతుడి ‘దూకుడు’కు భిన్నంగా వుంది. అంటే బుల్లెట్లు ప్రవేశించిన ప్రదేశం చుట్టూ నల్లబడటం, కనబడుతున్న మచ్చలను బట్టి  3-8 అడుగుల దూరం నుండి కాల్చినట్లుగా వుంది (సి) ఆరోపించిన విధంగా జరిగిన ‘ఎన్‌కౌంటర్‌’ లో పోలీసులు ఎవరూ గాయపడలేదు, ( ఇ) నిర్దోషిగా ప్రకటించినట్లు చెబుతున్న సహ నిందితుడు కూడా నేరం జరిగిన ప్రదేశంలో ఉండటం, (ఎఫ్) మరణించిన వ్యక్తిని రోడ్డుపై పోలీసు బృందం గుర్తించి, ఆపై ఎన్‌కౌంటర్‌లో చంపారనడం నమ్మశక్యం కాదు, (జి) ప్రాథమికంగా అనుమానాస్పద మరణం కేసుగా కనిపిస్తున్నప్పటికి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం, ఆ విధంగా సిఆర్‌పిసి సెక్షన్ 154 ఆదేశాన్ని ఉల్లంఘించడం, (కేసుపెట్టదగిన నేరం విషయంలో పోలీసు స్టేషన్‌కు బాధ్యత వహించే పోలీసు అధికారికి అందించిన ఏదైనా సమాచారం, అతను లేదా అతని ఆదేశానుసారం ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్‌లో వ్రాయాలి. ఇచ్చిన సమాచారం మౌఖిక లేదా వ్రాతపూర్వకంగా ఉండవచ్చు, దానిని ఇచ్చే వ్యక్తి సంతకం చేయాలి) (h) ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి స్వతంత్ర ఏజెన్సీకి దర్యాప్తును అప్పగించడం కాకుండా, తహశీల్దార్ విచారణను నిర్వహించడం, అది కూడా సంతృప్తికరంగా లేని పద్ధతిలో లేకపోవడం.

2003లో జాతీయ మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించడానికి పోలీసులు నిరాకరించడం ఆందోళన కలిగిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్‌కౌంటర్ మరణంపై దర్యాప్తు చేయాల్సిన రెండు కీలక మార్గదర్శకాలను పోలీసులు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాఫ్తు చేయాలి, పోలీసులకు వ్యతిరేకంగా నేరపూరిత హత్య కేసును ఫిర్యాదు చేసినప్పుడు, తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఈ కేసులో, తన కుమారుడు సునీల్‌ను పోలీసులే హత్య చేశారని ఆరోపిస్తూ అప్పీలుదారు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కూడా నిరాకరించారు. అయితే, ఘటన జరిగి ఏళ్లు గడిచిపోయాయి కాబట్టి  దర్యాప్తు చేయడం అసాధ్యమని విచారణకు ఆదేశించేందుకు కోర్టు నిరాకరించింది. కస్టడీ మరణం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఖైదీల హక్కులకు స్పష్టమైన ఉల్లంఘన అని పేర్కొంటూ, అప్పీలుదారు తండ్రికి 20 లక్షల పరిహారం మంజూరు చేయడం ద్వారా ఉపశమనం కలిగించింది.

పోలీసుల అధికార దుర్వినియోగాన్ని ఎలా తనిఖీ చేయాలి?

దీనికి డి.కె.బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ (1997) కేసులో,. చర్య పారదర్శకత, జవాబుదారీతనం బహుశా ఈ కోర్టు నొక్కిచెప్పాల్సిన రెండు సాధ్యమైన రక్షణలు అని సుప్రీంకోర్టు సమాధానం ఇచ్చింది. ప్రాథమిక మానవ విలువలకు అనుగుణంగా పని సంస్కృతి, శిక్షణ, పోలీసు బలగం  ధోరణిని సరిగ్గా అభివృద్ధి చేయడం పట్ల కూడా శ్రద్ధ పెట్టడం అవసరం. పోలీసుల శిక్షణా విధానంలో పునర్నిర్మాణం అవసరమని కోర్టు నొక్కి చెప్పింది. బలాగాల్ని ప్రాథమిక మానవీయ విలువలతో నింపి రాజ్యాంగ ధర్మం పట్ల  సున్నితంగా వ్యవహరించేట్లు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

పోలీసు బలగాలపై ప్రజలకు విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం ఉపయోగకరంగా, ప్రభావవంతంగా ఉంటుంది అని పీయూసిఎల్ v స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర & ఇతరులు, 2014 కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

చట్టపాలన అమలయ్యే సమాజంలో న్యాయం జరగాలంటే, చట్ట వ్యతిరేక హత్యలను సక్రమంగానూ, స్వతంత్రంగానూ దర్యాప్తు చేయడం చాలా అవసరం అని  కోర్టు పేర్కొంటూ ఈ కిందివాటితో సహా బూటకపు ఎన్‌కౌంటర్‌లను తనిఖీ చేయడానికి కోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది:

నేర కదలికలు లేదా తీవ్రమైన నేరారోపణకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి పోలీసులకు ఏదైనా సమాచారం అందినప్పుడల్లా, ఆ సమాచారాన్ని ఏదో ఒక రూపంలో, ప్రధానంగా కేసు డైరీలో లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ రూపంలో వ్రాయాలి.

పైన పేర్కొన్న విధంగా ఏదైనా సమాచారం ఆధారంగా ఎన్‌కౌంటర్ జరిగితే, అందులో పోలీసులు తుపాకీని ఉపయోగించినట్లయితే, దాని ఫలితంగా మరణం సంభవించినట్లయితే, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎలాంటి ఆలస్యం లేకుండా కోడ్ సెక్షన్ 157 ప్రకారం పంపాలి. (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 157, మెజిస్ట్రేట్‌కు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాపీని వెంటనే పంపడం పోలీసుల విధి. ఈ తప్పనిసరి విధిని నిర్వర్తించడంలో పోలీసులు విఫలమైనప్పుడు, కారణాలను తెలియచేయడం వారి చట్టపరమైన బాధ్యత. ) అలా పంపేటప్పుడు సెక్షన్ 158 కింద సూచించిన విధానాన్ని అనుసరించాలి. (సెక్షన్ 158 ఎలా పంపాలో వివరిస్తుంది. (1) సెక్షన్ 157 కింద మేజిస్ట్రేట్‌కు పంపిన ప్రతి నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే, సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీసు ఉన్నతాధికారి కోర్టుకు ఏ మాత్రం ఆలస్యం జరగకుండా సమర్పించాలి).

ఘటన/ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర దర్యాప్తును సిఐడి లేదా మరొక పోలీసు స్టేషన్‌లోని పోలీసు బృందం సీనియర్ అధికారి పర్యవేక్షణలో నిర్వహించాలి.

పోలీసు కాల్పుల్లో సంభవించే అన్ని మరణాల కేసుల్లో సెక్షన్ 176 ప్రకారం మెజిస్ట్రియల్ విచారణ తప్పనిసరిగా జరగాలి. దాని నివేదికను సెక్షన్ 190 ప్రకారం అధికార పరిధి కలిగిన జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌కు పంపాలి.

గాయపడిన నేరస్థుడు/బాధితుడికి వైద్య సహాయం అందించాలి. అతని/ఆమె స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ లేదా మెడికల్ ఆఫీసర్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌తో రికార్డ్ చేయాలి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, వాటిని చట్టంగా పరిగణించాలని సుప్రీం కోర్టు మార్గదర్శనం చేసింది. (భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం, సుప్రీం కోర్ట్ రద్దు చేయకపోతే లేదా శాసనసభ ఆ తీర్పుకు వ్యతిరేకంగా చట్టాన్ని ఆమోదించినట్లయితే తప్ప సుప్రీం కోర్ట్ చేసే అన్ని తీర్పులకు భారత భూభాగంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉంటాయి.) చట్టబద్ధమైన పాలన సాగాలి.

గత ఏడాది హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషన్‌ హైదరాబాద్‌ పోలీసుల వాదనలను తోసిపుచ్చింది. నలుగురు నిందితులను పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా కాల్చిచంపారని, వారి మరణానికి దారి తీస్తాయని తెలిసి కూడా కాల్పులు జరిపారని తేల్చింది.

సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ విఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని కమిషన్ 2019 డిసెంబర్‌లో జరిగిన హైదరాబాద్ ఎన్‌కౌంటర్ హత్యలపై దర్యాప్తు చేసి, నిందితులు పోలీసు సిబ్బంది కాల్చిన బుల్లెట్ల గాయాలతో మరణించినట్లు నిర్ధారించింది.

తెలంగాణ రాష్ట్రం వాదిస్తున్నట్లు పోలీసులు ఆత్మరక్షణ కోసం లేదా అనుమానితులను మళ్లీ అరెస్టు చేసేందుకు కాల్పులు జరపలేదని తెలిపింది. ఎన్‌కౌంటర్ హత్యలకు సంబంధించి పియుసిఎల్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో తీర్పు ప్రకారం సుప్రీం కోర్టు ఆదేశాలు అనుసరించలేదని, ప్రతీకాత్మకంగా మాత్రమే పాటిస్తున్నారని కమిషన్ గుర్తించింది. పోలీసులు తమ వ్యక్తిగత రక్షణ అనే మినహాయింపును ఉపయోగించడానికి కూడా వీల్లేదని కమిషన్ పేర్కొంది.

కమీషన్ నివేదికలో “మూక దాడి హత్యలు ఆమోదయోగ్యం కానట్టే తక్షణ న్యాయం అనే ఆలోచన కూడా ఆమోదయోగ్యం కాదు. ఏ క్షణంలోనైనా చట్ట పాలన తప్పనిసరి. నేరాలకు శిక్ష విధించడం అనేది చట్టబద్ధంగా మాత్రమే జరగాలి” అని పేర్కొంది.

అనువాదం : పద్మ కొండిపర్తి

https://www-livelaw-in.translate.goog/articles/judicial-intervention-in-encounters-in-india-supreme-court-atiq-ahmed-226875

Leave a Reply