సమాజంతో సంబంధం కలిగిన రచయితలు మాత్రమే తమ సాహిత్య సృజనలోకి సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా ఎంపిక చేసుకొని ప్రజల్ని ఆలోచింపచేస్తారు. సామాజిక బాధ్యత, నిబద్దత కలిగిన రచయిత అట్టడుగు శ్రామిక వర్గాలవైపు నిలబడి అక్షరీకరిస్తాడు. ఇలాంటి కోవకు చెందినవారే నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన రచయిత మడుమనుకల నారాయణ. పాలమూరు అధ్యయన వేదికలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న నారాయణ వేదిక ద్వారా పొందిన సామాజిక జ్ఞానంతో కవిత్వం, పాటలు, కథల ద్వారా సాహిత్య సృజనతో సామాజిక చలనాలను ఆవిష్కరించారు. రచయితగా తన అనుభవాలను, తన చుట్టు జరుగుతున్న పరిణామాలను సమాజంతో పంచుకోవడానికి నారాయణ కథా పక్రియను ఎంచుకున్నారు. ‘ఎర్రదుక్కి’ కథల సంపుటిలో పదకొండు కథలున్నాయి. ఈ కథలకు పాలమూరు, నల్లమల, తెలంగాణ ప్రజల జీవితాలే నేపథ్యంగా నిలిచాయి. ఒక్కో కథ జీవన అనుభవంలోంచి పుట్టుకొచ్చి కథగా పుటం పెట్టబడింది. విభిన్నమైన ఇతివృత్తాలను, తనదైన భాషాశైలీతో కథనం ముందుకు నడిపించారు.
చీకటిమయమైన జీవితాల్లో వెన్నెల వెలుగుల సంతోషాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అందులో పల్లెప్రకృతిలో రాత్రివేళ వెన్నెల వెలుగులో ఎన్ని అందమైన జీవన ఆకాంక్షలు విరభూస్తాయో ఆ బాల్యానికే తెలుసు. తరగతి గదిలో చందగ్రహణం పాఠం మరచిపోవచ్చునేమో కానీ అమ్మ చేతి గొరు ముద్దలు తింటూ విన్న చందమామ కథలు ఎలా మరచిపోగలం. చందమామ గురించి, అమ్మచెప్పిన కథలు జీవితాంతం మనల్ని వెంటాడే జ్ఞాపకాల వెన్నెల్లో నడిపిస్తూనే ఉంటాయి. నల్లమల అడవుల్లో ‘కాముని పున్నమినాడు’ పిండారబోసినట్లు తన ఊరిలో మధురమైన జ్ఞాపకాలు ఊరిస్తాయి. తన జీవితంలో ఒక్క కాముని పున్నమి బాగా గుర్తుంది. నలుగురు మిత్రులు తమ ఊరి పెద్దమనిషి ఎడ్లబండిని చెరువు దగ్గరి మామిడి చెట్ల కింద కట్టేసి ఆటపట్టించడానికి ప్లాన్ చేసుకుకున్నారు. కానీ ఆ రాత్రి ఆ చెట్టు కింద రక్త పుమడుగులో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి కనిపిస్తాడు. చివరకు అతన్ని పక్కూరి ఆస్పత్రిలో చేర్పిస్తారు. ఉదయం వెళ్లి చూస్తే అతడెవరో ? ఏమయ్యాడోనని ?! తల్లి ఎపుడూ జ్ఞాపకం చేస్తుంది. రెండేళ్ల తర్వాత పున్నమి వెన్నెలనాడు యక్షగానం రిహర్సల్ చేస్తుండగా నక్సల్ దళం వచ్చి తనను కాపాడిన యువకుడిని చూపుతూ మిగతా సభ్యులకు పరిచయం చేస్తాడు. ఆ పలకరింపు, ఆ చల్లని వెన్నెల్లో కరస్పర్శ పున్నమి చంద్రుణ్ణి తాకినంతగా గుర్తుండిపోయిన రోజు. ప్రజల కోసం త్యాగాలు చేసే యోధుల కరచాలనం మరుపురాని అనుభూతులను మిగిల్చింది.
‘ముప్పయి ఏళ్లకే ముసలితనమొస్తదని’ పాలమూరు గోసను పాటగా మలిచిన గోరటి వెంకన్న బాలయ్య ముఖం మీద పడిన ముడతలు చూసే ఆ పాట కట్టి వుంటాడు. బాల్యం నుంచి తనతోపాటు పెరిగి, ఆటపాటల్లో భాగమైన ఎద్దును కరువు బాధలతో అమ్ముకొన్న ‘బొల్లెద్దు’ కథ. ‘ఎద్దును నా బిడ్డలెక్క పెంచిన. ఏడగట్టినా అరకపనికి పోతది. బోలెడంత మంది అడిగిపోయిండ్రు. నా రాత బాగాలేక గీ సంతకు కొట్టుకొచ్చిన. ధర ఇరవైవేలైతే మాట్లాడుండ్రి’ కరాఖండిగా చెప్తడు బాలయ్య. కరువు కాటకాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రథమ పురుషలో చిత్రించారు రచయిత. ఈ కథ ఒక్క రైతు జీవితం మాత్రమే కాదు. కరవు బాధితులైన పేద రైతులందరి వ్యధగా అర్థం చేసుకోవాలి. పశువులకు మేత లేక కళ్ల ముందే ఓ బర్రె చనిపోతుంది. బతికున్న ఎడ్ల గోస చూడలేక, దొడ్లనే చస్తయేమోనన్న బాధతో బాలయ్య తల్లి అమ్ముకరమ్మని బతిమాలుతుంది. బొల్లెద్దును మూడుసార్లు సంతకు అమ్మడానికి తోలుకుపోయి బాలయ్యకు మనసురాక మళ్లీ ఇంటికి తీసుకొస్తడు. కరవుకాలంలో సరైన బేరం రాకపోవడంతో తన ‘బొల్లెద్దు’తో ఉన్న అనుబంధం యాదికొచ్చి తన్నుకొస్తున్న దు:ఖాన్ని దిగమింగుతడు బాలయ్య. ఊర్లో పటేలు బట్టకోడెను బొల్లెద్దు లొట్టపీసు చెట్లల్లకు తరిమేసిన తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. బొల్లెద్దును చివరకు నాలుగు వేలకు అమ్ముకొని విషాదంగా వెళ్తుండగా సంత మొత్తం నల్లని మేఘాలు కొమ్ముకొని భారీ వర్షం పడుతుంది. కథలో పాఠకుణ్ణి ఆకట్టుకోవడానికి వర్ణణాత్మకమైన కథన శైలీ అద్భుతంగా నడిపించడంలో రచయిత విజయం సాధించాడు. ప్రాణప్రదంగా పెంచుకున్న మూగజీవాలు వర్ష బీభత్సంలో దారి తప్పకుండా తనకు బతుకునిచ్చిన ఇంటికే ‘బొల్లెద్దు’ చేరడంతోనే కథ కొత్త మలుపు తిరిగింది. పశువుల కోసం రైతుల తపనను అద్బుతంగా రూపుకట్టారు రచయిత. ఇలాంటి కథలు జీవితానుభవంలోంచే పుట్టుకొస్తాయి తప్ప శూన్యంలోంచి సృజనాత్మకథ సాధ్యం కాదు. వర్షాలకు నిండిన చెరువులకు, వివిధ చేతి వృత్తులకు, రైతు జీవితానికి మధ్య వున్న సంబంధాన్ని కథనంలో చక్కగా చూపించారు.
సమాజం వెలివేసిన మాలమాదిగల ఇండ్లకు మరింత దూరంగా బుడగ జంగాల కులానికి చెందిన యక్షగాన కళాకారుడి మీద రాజద్రోహం ముద్రపడిన బర్లుకాసే ‘సోమయ్య’ గాథ. ప్రాపంచిక దృక్పథం కలిగిన రచయిత కావడం వల్లనే స్థల, కాలపరిస్థితులను కథల్లో ఉన్నదేదో ఉన్నట్లుగానే చిత్రించడమే కాకుండా సామాన్యుల మీద పోలీసుల దమనకాండను అద్భుతంగా అక్షరీకరించారు. పాత్రికేయునిగా రచయిత కథను ఉత్తమ పురుషలో నడిపించారు. రోజు యధార్థాలను వార్తలుగా ప్రచురించే విలేఖరులకు సైతం ‘భావప్రకటన స్వేచ్ఛ’ గురించి రూపంలో గొప్పగా చెబుతున్నప్పటికీ సారంలో నిజాలు రాసే విలేఖరులకు నిత్యం కత్తిమీద సాములాంటిదే. అందుకు బర్లుకాసే ‘సోమయ్య ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశాడా’! శీర్షికతో వార్త రాసినందుకు బెదిరింపులు వస్తాయి. అవి నేటికీ తప్పని పరిస్థితే ఉంది. అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన బుడగజంగాల సోమయ్య పశువులకాపరి. ఊర్లోని బర్లన్నీ కాస్తూ ఏమిచ్చినా తీసుకొని జీవితం గడుపుతున్న సామాన్యుడు. యక్షగాన కళాకారుడుగా ప్రజల తలలో నాలుకలా ఉండే మంచిమనిషి సోమయ్య రాజద్రోహి అయ్యాడు. గ్రామంలో ఓ షావుకారి దుకాణం మీద కరువుదాడిలో జనం తిండిగింజలు, సరుకులు పంచితే తెచ్చుకున్నందుకు సోమయ్య మీద పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేస్తారు. పాలకులు అంధులైనపుడు పాలితులైన ప్రజలు దేశద్రోహులుగానే రాజ్యం ముందు నిలబడి నలిగిపోతారు. టాడా చట్టాలు రద్దయినా సోమయ్య అండర్ ట్రయల్ ఖైదీగా ఏడాది జైలు జీవితం గడుపుతాడు. జైలు అధికారుల చిత్రహింసలు, వేధింపులకు గురవుతాడు. జైలు కొచ్చిన కొందరు విప్లవకారులతో విచారణ ఖైదీల హక్కుల చైతన్యం పొందుతాడు. తన యక్షగానం పాటలు మరిచిపోయి ప్రజాఉద్యమాల గీతాలు పాడటం నేర్చుకుంటాడు. జైలు జీవితం సోమయ్యను మరింత ప్రజలకు చేరువగా చేసింది. నల్లమల పరిసర గ్రామీణుల నిత్య నిర్భంద జీవితాలను చిత్రించిన కథ. రచయితకు పాత్రికేయ వృత్తిలో ఉన్న అనుభవాల నేపథ్యమే కథనం చిత్రణకు కొత్తరూపు కట్టించగలిగారు.
పేద దళిత రైతు కుటుంబం తమ కూతురు పెళ్లి కోసం విలువైన భూములను అమ్ముకొని అదే భూముల్లో కూలీలుగా పనిచేస్తున్న ‘భూమ్కుట్ర’లోని మాయ మర్మాలను విప్పిచూపారు. పాలకులు, పెట్టుబడిదారులు కుమ్ముక్కై అభివృద్ధి ముసుగులో చేస్తున్న విధ్వంసాన్ని పట్టిచూపారు. విమానాశ్రయాలు, రింగురోడ్ల అభివృద్ధి పేరుతో ప్రధాన రహదారుల వెంట ఉన్న పేదల భూములను మాయమాటలతో అమ్మిస్తున్న రియల్టర్ల వికృతచర్యలను కథకుడు ఎం.నారాయణ మన ముందుంచారు. పొలిశెట్టిపల్లికి చెందిన రైతు దంపతులు రేణమ్మ, మాసయ్యను తన సాగుభూమికి దూరం చేసి కూలీపనివాళ్లుగా మార్చిన రియల్ వికృతాన్ని బయటపెట్టింది కథ. ప్రధాన రహదారికి ఆరు ఎకరాలు వ్యవసాయ భూమి కలిగిన రేణమ్మ,మాసయ్య దంపతులు ఇంటర్ చదివిన కూతురు పెళ్లి కోసం రియల్ ఎస్టెట్ బ్రోకర్ల మాటలకు మోసపోయి ఆరు ఎకరాలు అమ్ముకుని కూలీలుగా పనిచేసుకొని బతుకుతున్న దుర్భరమైన స్థితి. కథలో నాలుగు పాత్రలతోనే విషయాన్ని గంభీరంగా, తనదైన శైలిలో ముందుకు సాగుతూ పాఠకుడిని తన వెంట తీసుకొని వెళ్తాడు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సందర్భంలో రాసిన కథ. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పెట్టుబడిదారుల మోచేతిల కింద ఉన్న తెలంగాణ నాయకుల తీరును, ఢిల్లీ నాయకత్వం నిర్లిప్తతను గురించి తల్లీకొడుకుల మధ్య జరిగిన చర్యల్లో ఓ ‘అమ్మతీర్పు’తో కొడుకు గుండెల్లో ఆత్మస్థైర్యం నింపుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతీ గల్లీ, ఇల్లు చర్చోప చర్చలకు కేంద్రంగా వెలుగొందాయి. నిత్యం తెలంగాణ ఉద్యమ పరిణామాలను కొడుకుల కంటే ఉద్యమకారుల తల్లులే విషయాలను ముందుగా తెలుసుకుంటున్నారనిఈ కథలో ఎల్లమ్మ పాత్ర ఆంతర్యంలో తెలుస్తుంది. పొద్దంత ఉద్యమంలో పాల్గొని సాయంత్రం ఇంటికి చేరిన కృష్ణ దిగులు ముఖాన్ని అర్థం చేసుకుంటుంది. తల్లులే పెద్ద సైకాలజిస్టులని మనకు తెలుపుతుంది కథ. ‘నీవేం దిగులు పెట్టుకోకు బిడ్డా!’ సచ్చిపోయిన పిల్లల తల్లులు అగుడైతుండ్రు. సచ్చి సాధించేదేమి లేదు. కొట్లాడి తెచ్చుకోవాలి’ ఎల్లమ్మ పిలుపు ఉత్తమ సందేశాన్ని అందించారు నారాయణ. కథకుడిగా ఇంతకంటే తన కర్తవ్యాన్ని ఏం చెప్పగలడు. ఇదే కదా సమాజానికి కావాల్సింది. ఈ మిరపకాయలు దేవరకొండ అంగల్ల కొనుకొచ్చినవి. ఈ రోకలి నల్లమల్ల అదవిలనే మీతాత కొట్టుకొచ్చిన ఎర్రసండ్ర కట్టెతో చేసింద’ని ఎల్లమ్మ ప్రతీకాత్మకంగా చెప్పడంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని స్పురింప చేస్తు కథను ముగించడం అద్భుతం.
అట్టడగు పీడిత సామాజిక వర్గానికి చెందిన ఎంకన్న ఒక్కగానొక్క కొడుకు ఉన్నతంగా చదువుకొని ఉద్దరిస్తాడనుకుంటే చీడపురుగులా తయారవుతున్న రవికి బుద్ది చెప్పాలన్నంత కోపం తెప్పించిన ‘నెగడి’ కథ. తాను పెద్దగా చదువుకోకపోయినా కొడుకు బాగా చదువాలని ఏ తండ్రి అయినా ఆశపడతాడు. అలాగే ఎంకన్న తన కొడుక్కు కావాల్సిన అన్ని అవకాశాలు కల్పిస్తాడు. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెలా మరో దారిన పోతున్న రవిని చూసి ఎంకన్న గుండె మండిపోతుంది. తాగుడు, జల్సాలకు బానిసవుతాడు. ఓ ఆడ పిల్లను సైతం ఏడిపించి తన్నులు తిన్నకూడా మార్పురాదు. తెలంగాణ ఉద్యమం ధూందామ్ సభ ఏర్పాట్లు ఊర్లో జరుగుతుంటే సమైక్యవాదాన్ని వినిపిస్తున్న సినిమా నటుల ఫ్లెక్సీలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి పెద్ద రగడ చేస్తాడు. తెలంగాణ వాదులు దేహశుద్ది చేసి ఇంటి వద్ద వదిలేస్తారు. తెలంగాణ ఉద్యమం మీద అవగాహన కలిగిన ఎంకన్న కొడుకు సంఘ వ్యతిరేక చర్యకు ఆగ్రహంలో రగిలిపోతడు. మద్యం మత్తులో మంచంలో ఉన్న కొడుకును దానికే కట్టేసి తగలబెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తాడు. ఊరంతా ఎంకన్నను అడ్డుకొని, రవిని చీత్కరించుకుంటారు. తనను క్షమించమని తల్లి కాళ్లుపట్టుకుని వేడుకుంటాడు. తప్పు ఎవరు చేసినా తప్పె. కొడుకు చర్యలను తప్పు పడుతూనే తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తున్న కొడుకు శిక్షించడానికి సిద్దపడిన ఎంకన్న ధర్మాగ్రహాన్ని తెలుపుతుంది. ఇది కేవలం ఎంకన్న వ్యక్తిగత సమస్య కాదు. మూడుకోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాళ్ల వైఖరిపట్ల సమాజ ఆగ్రహంగా అర్థం చేసుకోవాలి.
యురేనియం తవ్వకాల కోసం నల్లమల అడవుల మీద కార్పొరేట్ బహుళజాతి సంస్థ కన్నుపవడ్డది. ప్రజలను అభివృద్ధి పేరుతో వాళ్ల భూముల నుంచి తరిమివేసి నిరాశ్రయులను చేసే డీబీర్స్ కంపెనీ కుట్రలను ‘ఎర్రదుక్కి’ లో ప్రజలు పటాపంచలు చేస్తారు. వలస జీవన విధ్వంసాన్ని, రైతాంగ జీవితంలోని వెతల్ని కథలో వర్ణణాత్మక శైలీలో చెప్పాడు నారాయణ. గ్రామీణ రైతు జీవితంలో కులసంబంధాల కంటే మట్టి మనుషుల మధ్య విలువల అనుబంధాను చక్కగా కళ్లకు కడుతారు. తమ వ్యవసాయ భూముల్లో సాగుపనుల్లో నిమగ్నమైన లచ్చమ్మ, సాయిలు, బాలయ్య, గౌరమ్మ వద్ద ఊర్లకు పోలీసులు, రెవిన్యూ ఆఫీసర్లు వచ్చారని శీను ఎగపోసుకుంటూ పరుగెత్తుకొస్తాడు. యురేనియం తవ్వకాలకు డీబీర్స్ కంపెనీకి అప్పగిస్తూ సర్కార్ ఆదేశాలిచ్చిందని ఆఫీసర్లు చెప్పడంతో గ్రామస్తులు మండిపడుతారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలోనే సీమాంధ్ర పెట్టుబడి పాలకులు తెలంగాణ సహజవనరులను దోచుకొనే కుట్రకు డీబీర్స్తో చేతులు కలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైనప్పటికీ మరోసారి యురేనియం తవ్వకాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యుహరచన చేశాయి. ‘సేవ్ నల్లమల’పేరుతో మేథావులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఉద్యమించడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణకు సంఘటితంగా పోరాడితే అంతిమ విజయం ప్రజలదేనని ‘ఎర్రదుక్కి’ వాస్తవిక కథనం గుర్తు చేస్తుంది.
కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోలేని మూఢభక్తుణి ఆరాటాన్ని ‘వాల్‌పేపర్’లో చూస్తాం. తమ కృషి పట్ల తనకే శాస్త్రియ విశ్వాసంలేని మనుషులు నిత్యకృత్యంగా మనకు కనిపిస్తూనే ఉంటారు. ‘అదికాదే పవిత్రమైన దేవుడి బొమ్మ మూసీ మురికి నీళ్లలో పడిపోవడం…రామరామా…పాపమే! అంటాడు వెంకటేశ్వర్రావు. విలువైన జ్ఞాపకాలు ఫోటోలు పోయినందుకు బాధపడని భర్త చాదస్తపు మనస్తత్వానికి భారతి బాధపడుతుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు అనారోగ్యంపాలైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన గడ్డుకాలమిది. కార్పొరేటు ఆస్పత్రుల మాయమాటల గుట్టును ‘సంతోష్‌నగర్ బస్ స్టాఫ్‌లో’ విప్పుతాడు రచయిత. ఈ కథలోనే ఉపకథగా ఉన్న మరోఅంశం పాఠకుడి హృదయాన్ని కలిచివేస్తుంది. సురేష్ తన ఊరికి వెళ్లడం కోసం సంతోష్‌నగర్ బస్ స్టాఫ్‌లో నిలబడుతాడు. జ్వరంతో ఉన్న బాలికను ఒడిలో పడుకోబెట్టుకొని కొడుకు కోసం అరవై ఏళ్ల వృద్ధ మహిళ పడుతున్న ఆవేదన సురేష్ చెవిన పడుతుంది. నగరంలో ఏడేళ్లుగా వుంటున్న కొడుకు జాడకోసం జ్వరం వచ్చిన మనవరాలిని ఒడిలో వేసుకొని ఆకలిదప్పులతో బస్ స్టాఫ్‌లో కూర్చుంటుంది. సురేష్‌కు వాళ్లది కల్వకుర్తని తెలియడంతో కుడుపుల పేగులు దేవినట్లయితుంది. ఎట్టకేలకు సురేష్ కృషితో తల్లి, బిడ్డ కొడుకు గెలవయ్య చెంతకు చేరుతారు. ఇది వలస బతుకు కన్నీటి దృశ్యం. రచయిత దైనందిన జీవితంలోని తన కళ్లెదుట జరిగిన సాధారణ సంఘటనలను సైతం కథగా మలచడంలో మంచి నిపుణత కలిగిన రచయితగా దృగ్గోచరమవుతాడు.
డెబ్బయి ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఏవర్గాలకు పంద్రాగస్టు సంబరాలను పంచుతుందో ? ఏ కులాలు ఇంకా రాజ్యాంగంలో అందించిన ఫలాలు పొందకుండా కుయుక్తులు చేస్తున్న శక్తుల గురించి ‘ఎగరీ ఎగరని జెండా’ చెబుతుంది. గ్రామ మహిళ సంఘం అధ్యక్షురాలు మాదిగ రామూలమ్మ. ఆ ఊరి దొర భార్య యశోద మహిళ సంఘం కార్యదర్శిగా ఉంటారు. స్వాతంత్య్ర దినోత్సవంనాడు మహిళా సంఘం భవనం ముందు జాతీయజెండాను యశోద ఎగరవేయాలని ఊరి దొర కుయుక్తి పన్నుతాడు. దళిత యువకులు రాములమ్మను జెండా ఎగరేయాలని ప్రొత్సహిస్తారు. ప్రసాదరావు తమ్ముడు రాములమ్మ మీద భర్త చంద్రయ్యతో గొడవ చేయించి అర్థాంతరంగా వేడుకల నుంచి తరిమేయిస్తాడ్షు ఈ కథలో నారాయణ తాను నిర్మించిన పాత్ర మాదిగ రాములమ్మ వేడుకల ఏర్పాటులో శ్రమైక జీవితాన్ని కళ్లముందుంచుతాడు. శ్రామిక జీవితంతో సంబంధం లేకుండా అగ్రకులాధిపత్యంతో అట్టడుగు శ్రామిక జీవితాలకు ఆత్మగౌరవం దక్కకుండా చేస్తున్నారు. సామాజిక జీవన సంఘర్షణను, ఆత్మగౌరవాన్ని అద్భుతంగా అక్షరీకరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్యలన్నీ ‘పరిష్కారం’ అవుతాయనీ తెలంగాణ ప్రజానీకం కలగన్నది. సమగ్ర సర్వేతో సామాజిక, ఆర్థక నేపథ్యాలను అధ్యయనం చేసి సర్కార్ సమగ్ర అభివృద్ధికి బృహత్ ప్రణాళికను రచిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఎన్యూమరేటర్లకు పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న రామస్వామి సమాజం పట్ల అమితమైన ప్రేమ,బాధ్యత కనిపిస్తుంది. ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాజనంగా వేతనాలిస్తాడట. అది మనకు నష్టమట గదా! మంచి ఫిట్మెంటుతో మనకు పి.ఆర్.సి ఇస్తేనే మేలు’ అన్నాడు మరో టీచర్. ఏడేళ్లు గడిస్తే తప్పా ఉద్యోగులకు పి.ఆర్.సి దక్కని దుస్థితి తెలంగాణ ఉద్యోగులది. ఓ వృద్ధురాలి కొడుకు ఇరవైఏళ్ల కిందట అన్నల్ల కల్సిపోయిండని’ తెలిశాక ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారమేదో ఇక్కడ దొరికినట్లయి తల భారతమంతా దిగిపోయింది రామస్వామికి. నారాయణ కథను చాలా సాధారణంగా ఎత్తుకొని పాఠకునిలో సరికొత్త వెలుగులు నింపి సంతృప్తినిచ్చే ముగింపుతో కథను చక్కగా ముగిస్తాడు. ప్రతీ ఒక్కరు ‘ఎర్రదుక్కి’లోని సామాన్యుల కథల వెతలను చదవడం ద్వారా సామాజిక, వలస జీవితాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతాయి.
ఎర్రదుక్కి కథలను దున్నిత తీరు బాగుందన్న.
👌👌👌ఈ పుస్తకం ఎక్కడ కొనవచ్చు..? పబ్లిషర్స్ ఎవరు?