అన్నా! ఆర్కె!!
భోరున వర్షం
వడి వడిగా పారాల్సిన
చంద్రవంక పారనని మొరాయించింది

నాగులేరు నా వల్ల కాదని
కారంపూడి కనుమల్లో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది
పుల్లల చెరువు నీరు నీ దాహార్తి తీరుస్తా రమ్మంటూ ఆహ్వానిస్తుంది

కాకిరాల కనుమలు
నీవొస్తావని కళ్ళల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నాయి
బొల్లాపల్లి బోడులు నీ పాద స్పర్శ కోసం తండ్లాడు తున్నాయి
గుత్తికొండ బిలం లో
మన పార్టీ అంటూ నీవు చేసిన ప్రసంగం ఇంకా ప్రతిధ్వనిస్తోంది

మాచెర్ల డిగ్రీ ప్రాంగణం లో నీవెగురేసిన
రాడికల్ జెండాల రెపరెపలు పల్నాడు దాటి
రాష్ట్ర సరిహద్దులావల మహోద్యమ కెరటాలై ఎగిసాయి

యుద్ధం జరగాలి
శాంతి కావాలంటూ చర్చలకై
నల్లమల తోరణం చిన్నారుట్ల నుండి
నీ అడుగుల సవ్వడి మరో చరిత్ర దిశగా

అసంపూర్తి చర్చల నేపథ్యం లో
మళ్లీ అడవి బాట పాలుట్ల దగ్గర ప్రవేశం
ఎన్నెన్నో ఎన్ కౌంటర్లు
గాయాలు త్రుటిలో ప్రాణాలతో
నీ నడక నీ నమ్ముకున్న సిద్దాంతం
తుమృకోట బాలుడి ప్రస్థానం
బడిపంతులు పిల్లవాడే
తుపాకీ పడితే ఎలా వుంటుందో
నీ జీవితమే నిదర్శనం
అన్నా జోహార్లు!!

Leave a Reply