కులం గురించి దళితవాదం చర్చిస్తుందని, జెండర్ గురించి స్త్రీవాదం చర్చిస్తుందని, ఒక్కో అస్తిత్వ సమస్యను ఆ నిర్దిష్ట అస్తిత్వవాదమే చర్చిస్తుందని, లేదా పరిష్కరిస్తుందనే  అస్తిత్వ వాదాల భావజాల వాతావరణం నెలకొని ఉన్న ఈనాటి సందర్భంలో ‘’స్త్రీవాద దృక్కోణంలో జెండర్, కులం’’ అనే ఈ పుస్తకం రావడం ఎంతో ఆహ్వానించదగింది.

మన అంతరాలవారీ  సామాజిక వ్యవస్థలో జెండర్, కులం అనేవి విడివిడిగా కనబడుతున్నప్పటికీ, వాటి మధ్య నున్న సంబంధాలను లోతుగానే కాకుండా శాస్త్రీయంగా విశ్లేషించిందీ పుస్తకం. సుదీర్ఘ  పరిణామ క్రమంలో ఆ రెండింటి సాన్నిహిత్యం కారణంగా ఏర్పడిన వాటి  ఉమ్మడి చరిత్ర క్రమాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని రచయిత్రి ఉమా చక్రవర్తి గుర్తించమంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే వాటి చారిత్రిక పరిశీలనకు పూనుకోవాల్సిందేనని అంటారు ఉమ.

అయితే అంతకంటే ముందుగా, కులానికి, జెండర్ కూ  గల విధినియమాలు వివిధ ప్రాంతాలలో విభిన్నంగా ఉన్నాయనే వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలంటారు. వేర్వేరు చోట్ల కుల వ్యవస్థ తీవ్రత వేర్వేరుగా ఉండి, అది పితృస్వామిక అణచివేత పై తదనుగుణమైన ప్రభావం వేసిందని అంటారు. అలా గాకుండా, జెండర్, కులం అనే అస్తిత్వాల ప్రత్యేకతలను గుర్తించకపోవడం వల్ల చాలాకాలం పాటు  వాటి పట్ల యాంత్రిక వైఖరి ఉండింది. ఫలితంగా మార్చడానికి అసాధ్యమైన కులానికో, లేక పితృస్వామ్యానికి సంబంధించిన పవిత్ర, అపవిత్ర చట్రానికో చెందినవారిగా స్త్రీలను గురించి భావించడం జరిగింది.

ముఖ్యంగా మండల్ వ్యతిరేక ఆందోళన అనంతరకాలంలో కుల వైరుధ్యాలు తీవ్రతరమై కులం గురించిన విశ్లేషణ పదునెక్కింది. దళితులుగా అగ్ర కులాల నుండి,  శ్రామికులుగా భూస్వాముల నుండి, స్త్రీలుగా తమ కుటుంబాల్లోని పురుషుల నుండి మూడు రకాల భారాన్ని మోస్తున్న దళిత స్త్రీలపై కొనసాగుతున్న అతి తీవ్రమైన అణచివేత రూపాలను పట్టించుకోవడంలేదని దళిత స్త్రీవాద విమర్శల్ని  మహిళా ఉద్యమం ఎదుర్కొన్నది. ఆ తర్వాతనే కులానికీ, జెండర్ కూ  మధ్యనున్న దృఢమైన  సంబంధాలపై స్త్రీవాద మేధావులు తమ దృష్టి సారించారు. అంతేగాదు, కులం గురించి, జెండర్  గురించి లోతైన అవగాహననిచ్చే పరిభాషను కూడా వారు రూపొందించ సాగారు. అందులో భాగంగానే మండల్  వ్యతిరేక ఆందోళన అనంతర కాలంలో ‘బ్రాహ్మణీయ పితృస్వామ్యం’ అనే మాట ముందుకు వచ్చింది. అది వేరు వేరు చోట్ల వేర్వేరుగా అమలు కావడం వల్ల పితృస్వామ్య విధానపు  ఆచరణలో విస్తృతమైన వైవిధ్యం చోటుచేసుకుందని ఇటీవలి స్త్రీవాద అధ్యయనాలు కూడా  వెల్లడించాయి. ఇలా జెండర్, కుల అణచివేతలపై పోరాడడానికి నూతన అవగాహనను కూడా అందిస్తుందీ పుస్తకం.

జెండర్ పై కులం గురించి, కులం ప్రభావం గురించి మారుతున్న దృక్పథాలను ఇందులో వివరించారు. గతంలో కులానికున్న కర్మకాండ  పైననే నొక్కు ఉండగా, ఇప్పుడు రచయిత కులానికుండే సాంస్కృతిక అణచివేత పార్శ్వాన్ని నొక్కిచెప్పారు. ఇక్కడ దళిత స్త్రీ ఎదుర్కొనే సాంస్కృతిక దోపిడి  ఆర్థిక దోపిడి కంటే అత్యంత అమానవీయమైనదిగా పేర్కొనడం జరిగింది. అతి దారుణమైన కులవ్యవస్థను మనమింకా  పవిత్రత, అపవిత్రత అనే ద్యయంలోంచి  మాత్రమే చూడకుండా, భౌతిక వనరుల లభ్యతలో  అసమానతల ప్రాతిపదికగా ఏర్పడిన ఆధిపత్యం- లొంగుబాటు, దోపిడీదారులు- పీడితులు వంటి ఎన్నో వైరుధ్యాల సంఘర్షణా  పునాదిగా కులవ్యవస్థను చూడాలి. ఆత్మగౌరవాన్ని, మానవ హోదాను నిరాకరించి దళితులకు వ్యక్తిత్వం అన్నదే లేకుండా చేసే కులాధిపత్యం శ్రేణీకరణను, దాని భావజాలాన్ని తీవ్రంగా గర్హించాలి. కులాధారిత  విధులను దళితుల మీద మోపుతూ అసలైన జ్ఞాన క్రమానికి, అధికారానికి వాళ్లను దూరం చేస్తున్నారని గ్రహించాలి. ముఖ్యంగా పీడిత కులాల్లోనూ, స్త్రీలలోనూ ఉన్న నైపుణ్యాలను ‘జ్ఞానం’గా గుర్తించడానికి బ్రాహ్మణీయ కులవ్యవస్థ నిరాకరిస్తుందని తెలుసుకోవాలి.

ముఖ్యంగా మన దేశంలో అనాదిగా జెండర్ వర్గీకరణ/ విభజనీకరణ ఎలా కొనసాగుతూ వస్తుందో, దాని లక్ష్యం ఏమిటో ఇందులో రచయిత వివరించారు. అపవిత్రత  అనే భావన నిమ్నకులాల స్త్రీలనే కాదు అగ్రకులాల (స్త్రీల)నే కాదు, అగ్రకులాల స్త్రీలను  కూడా లొంగుబాటు స్థితిలో అట్టి పెడుతుందని మనం గ్రహించాలి(క్లాడ్ మిలాసోక్స్). ఒకవైపు అగ్ర కులాల్లో బలవంతపు వైధవ్యం కొనసాగిస్తూనే, మరోవైపు కింది కులాల్లో బలవంతపు వితంతు వివాహాలు కొనసాగించడమనేదాన్ని బ్రాహ్మణీయ కుల వ్యవస్థ కుటిలత్వానికి నిదర్శనంగా చూడాలి. ఎందుకంటే- బలవంతపు వైధవ్యం  వలన (అగ్రకులాల స్త్రీలకు చెందిన ఆస్తి) భూమి మీదనే గాక, వారి పునరుత్పత్తి శక్తి పై కూడా నియంత్రణ సాధించడమే కులవ్యవస్థ లక్ష్యం. అలాగే నిమ్నకులాల్లో బలవంతపు వితంతు పునర్వివాహాల వలన  సంతానం అభివృద్ధి అయి,  తగినంత శ్రమశక్తి సరఫరా అవుతుందన్నది వారి నిగూఢ ఆంతర్యం.

ప్రాచీన సమాజంలో జెండర్ పరమైన అంతరాల వ్యవస్థ లేదని, ఆహార సంపాదనలో స్త్రీకున్న స్థానం పురుషుడి కేమీ తీసిపోనిదని చెప్పవచ్చు. పైగా స్త్రీకున్న పునరుత్పత్తి శక్తి  కారణంగా ఆమెకు ఆనాటి సమాజంలో గౌరవం ఉండేదన్న విషయం ఆనాటి చిత్రాలను చూస్తే తెలుస్తుంది. మెసొపొటేమియా తదితర ప్రాచీన సాంస్కృతిక  ఆవాసాలలో మాతృదేవతల  చిత్రాలు విస్తృతంగా కనబడుతుండడాన్ని బట్టి తొలినాటి మత భావనల్లో  స్త్రీకి ఒక  మార్మిక శక్తి ఉన్నదని వారు భావించారని, అందుకే ఆనాటి ప్రజలు మాతృ దేవతలను ఆరాధించేవారని, ఆనాటి మాతృప్రధాన సమాజంలో పురుషులకు స్త్రీలపై, స్త్రీల లైంగికతపై ఎటువంటి నియంత్రణ, ఆధిపత్యమూ లేదని చెప్పవచ్చు.

కానీ ఆ తర్వాతి కాలంలో సమాజంలో వర్గ విభజన, సంక్లిష్ట ఆర్థిక విధానం, బలమైన రాజ్యమూ  క్రమంగా ఏర్ప డసాగాయి. వర్గ విభజన ప్రారంభంతో పాటే  స్త్రీల పునరుత్పత్తి సామర్థ్యంపై ఒకవైపు పాలకుడు, మరోవైపు కుటుంబ యజమాని పురుషుడి నియంత్రణా మొదలై కొనసాగుతూ వస్తోంది.

ఏదేమైనా భారత ఉపఖండంలో అనేక రకాల సాంఘిక వ్యవస్థలు, ఉత్పత్తి విధానాలు గతంలో ఏర్పడి ఈనాటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో, వివిధ కాలాలలో కుల ప్రాతిపదికన రూపొందిన పితృస్వామ్యానికీ, ఆదివాసి తెగలలోని పితృస్వామ్యాలకూ మధ్య  ఎంతో వ్యత్యాసమున్నదన్న వాస్తవాన్నీ  మనం చూడవచ్చు. అత్యంత భిన్నత్వంతో, తీవ్ర అసమానతలతో కూడిన సాంఘిక వ్యవస్థలు ఎన్నో  శతాబ్దాలుగా సాగిన ఫలితంగా కులవ్యవస్థ ఏర్పడడమే కాకుండా, భారతదేశంలోని వివిధ ఆదివాసీ పితృస్వామ్యరూపాలు  కూడా ఆధిపత్య పితృస్వామ్య నమూ నా ప్రభావానికి లోనయ్యాయని కూడా చెప్పవచ్చు.

మొత్తంమీద  వర్ణసంకరం అనే సాధనం ద్వారా కుల వ్యవస్థ విస్తృతి  చెందడమూ, కులాల శ్రేణిలో ఆయా కులాల నిర్దిష్ట స్థానాలను అనుసరించి స్త్రీల లైంగికత్వం పై భిన్న రూపాలలో నియంత్రణ ఏర్పడడమూ  జరిగింది. ఆ విధంగా లైంగిక, శ్రామిక అమరికలతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణాలలో భాగంగా అనేక విధాలుగా లైంగికీకరించబడిన  కుల సంప్రదాయాలు రూపొందాయి. ఈ క్రమంలో అస్పృశ్యత కూడా విస్తరించి దేశంలోని అనేక ప్రాంతాల్లో అత్యంత సంక్లిష్ట రూపం సంతరించుకున్నది. ఇటువంటి కీలకాంశాలైన కులప్రాతిపదిక గల పితృస్వామిక నిబంధనలు (వ్యవసాయ సమాజంలోని మౌలికమైన) ఉత్పత్తి సంబంధాలతో ముడిపడి ఉండడం వలన (ఒక నిర్దిష్ట ప్రాంతంలోని) కులవ్యవస్థకు, పితృస్వామిక విధానాలకు కూడా రాజ్యం నుండి మద్దతు లభించింది.

ఇలా చరిత్రలో  పితృస్వామ్యం అవతరించి బలపడి కొనసాగుతుండడం వల్ల స్త్రీల  అప్రధానీకరణ వేగంగా జరిగింది. ఉత్పత్తి వనరులపై స్త్రీలకు యాజమాన్యాన్ని నిరాకరించడమే గాకుండా, వారి పునరుత్పత్తి శ్రమా, ఉత్పత్తి శ్రమలను  పురుషులకు అప్పగించడం వలన స్త్రీలు తమకు తామే (పురుషుల) ఆస్తులుగా మారిపోయారు. పైగా, కుటుంబ వ్యవహారాల్లో, గృహ సంబంధమైన కర్మ క్రతువులలో కూడా వారికి ఎటువంటి స్వతంత్రతా  లేదు.

మరి  స్త్రీలపై అమలయ్యే నియంత్రణ విషయానికొస్తే- ఆ  విధానాలు మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటి భావజాలం, రెండవది స్త్రీలను నియంత్రించేందుకు రక్త సంబంధీకులకు  అనుమతినిచ్చి క్రమబద్ధీకరించే హక్కు, మూడవది రాజ్యాధికారం.

భావజాలం విషయం  చూస్తే-  స్త్రీల (శరీర ధర్మాల)ను నియంత్రించడానికి స్త్రీ ధర్మాన్ని, పతివ్రతా  ధర్మాన్ని ఒక శక్తివంతమైన భావజాలంగా తయారు చేశారు. శారీరక లక్షణాల రీత్యా స్త్రీలైన వారిని మచ్చిక చేసుకొని సాంఘిక జీవులుగా మార్చింది ఈ స్త్రీ ధర్మమే. ఈ  ధర్మమే స్త్రీలలో అంతరీకరణ   చెందడం వల్ల తమ లైన్గికత్వాన్ని తామే నియంత్రించుకునే విధంగా  స్త్రీలు నమూనాలుగా తయారు కావడమే బ్రాహ్మణీయ పితృస్వామిక సమాజానికి అవసరం.

అయితే బ్రాహ్మణీయ పితృస్వామిక సమాజం అంటే అది కేవలం జెండర్ ఆధిపత్యం గల  సమాజం మాత్రమే కాదు. జెండర్, కుల ఆధిపత్యాలతో కలగలిసి నిర్మితమైన సంక్లిష్ట సామాజిక సంబంధాల వ్యవస్థ. ఆ వ్యవస్థ కొనసాగడంలో రాజ్యం పాత్ర  ఉండకుండా ఏ కాలమూ  లేదు.

ఇలా అనడం అంటే వివిధ అస్తిత్వాల ఉనికినీ, వాటి ఆకాంక్షలను  తక్కువ చేయడం ఎంత మాత్రమూ  కాదు. చారిత్రికంగా ఆ అస్తిత్వాలు ఎలా రూపొంది  ఉనికిలోకి వచ్చి కొనసాగుతున్నాయో  లోతుగా పరిశీలించి, అవి  నిర్వహిస్తున్న సామాజిక పాత్రను  శాస్త్రీయంగా అర్థం చేసుకోవడమని అర్థం.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే-  ఉమా చక్రవర్తి ఎలాగైతే జెండర్ కు, కులానికి మధ్యనున్న సంబంధాలను లోతుగా చారిత్రిక పరిశీలన చేసి ఈ పుస్తకంలో కొన్ని నిర్ధారణలలు  ప్రకటించిందో  అలా చేయడమని అర్థం. ఇదంతా ఆమె స్త్రీవాద దృష్టి కోణంలో  నుంచే  చేశానని చెబుతోంది. చెప్పాలి కూడా.

కాని  ఈ పుస్తకం చదువుతుంటే అస్తిత్వాలను పరిశీలించే దృష్టికోణం, చేపట్టాల్సిన  వాదం ఇలా ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే- ఉమా చక్రవర్తి దృష్టికోణం పాక్షికమైనది కాదు. అధ్యయనానికి తానెంచుకున్న స్త్రీ   పురుష సంబంధాలను ప్రభావితం చేస్తున్న సకల అంశాలను ఆమె చారిత్రకంగా పరిశీలించారు. కులం, జెండర్  అనే రెండు అస్తిత్వాలకు మధ్య పని చేస్తున్న అన్నిఅంశాలను/సంబంధాలను ఆమె  గతితార్కిక భౌతికవాదం కోణంలో విశ్లేషించారు.

రచయిత లక్ష్యం స్త్రీ పురుష సమానత్వం కాబట్టే  ఈ పుస్తకానికి ‘’స్త్రీవాద దృక్కోణంలో జెండర్, కులం’’ అనే శీర్షికను పెట్టిందని  మనకు అర్థమవుతుంది. కానయితే  సకల పీడిత ప్రజల అస్తిత్వాల పోరాటాలు అంతిమంగా స్త్రీ పురుష సమానత్వం గానే  పర్యవసించాలి గదా. అందుకే అన్ని అస్తిత్వ‘వాదా’ల్లోకెల్లా  స్త్రీ’వాదం’ వేరయా అని అనాలనిపిస్తుంది.  ఇది అత్యంత మౌలికమైనది. సకల పోరాటాలకు గీటురాయి వంటిది. ఎందుకంటే, స్త్రీ పురుష సమానత్వం అనే లక్ష్య సాధనే విభిన్న అస్తిత్వాలు, వాటి పోరాటాల ప్రమేయం లేకుండా, ఇంకా బాగా చెప్పాలంటే- వర్గ పోరాటాల ప్రమేయం లేకుండా జరిగేది కానే కాదు.

చివరగా ఈ పుస్తకాన్ని రాసిన స్త్రీ వాద రచయిత్రి , చరిత్రకారిణి ఉమా చక్రవర్తి గారిని, దీన్ని ఎంచుకొని ప్రచురించినందుకు మలుపు నిర్వాహకులు బాల్ రెడ్డి గారికి, చక్కగా అనువదించిన చూపు కాత్యాయని గారికి అభినందనలు చెప్పకుండా ముగించలేను.

Leave a Reply