కరోనా వ్యాధి మానవ జీవితాల్ని చిదిమి వేస్తున్నది. భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న భయం ఆందోళన కలిగిస్తున్నది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరం ఉన్నవారికి సాయం చేయడం, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా పాలకుల ప్రాథమిక కర్తవ్యం. అందువల్ల కరోనా కష్టకాలం నుంచి ప్రజలను ఆదుకోవడం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. మానవతా దృష్టితో చూసినా ఈ సంక్షోభ సమయంలో బాధిత ప్రజలకు అండగా నిలువడం అత్యంతావశ్యకం. యూరప్, అమెరికా వంటి దేశాల్లో ఆచరిస్తున్న విధానాన్ని సైతం పక్కన పడేసి నాటు వైద్య పద్ధతుల నాశ్రయించడం మోడీ ప్రభుత్వ విధానంగా ఉంది. కొవిడ్ వ్యాధిని నియంత్రించడంలో గానీ, బాధితులను ఆదుకోవడంలో గానీ ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయం. వలస కార్మికుల దగ్గరి నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు వరకు మోడీ ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణే.
ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధానమని మోడీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కరోనా రెండవ థ విజంభృణ సమయంలో చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ, ఛిద్రమైన బతుకులకు సాంత్వన కలిగించడానికి జూన్ 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మరో దఫా ఉద్దీపన రూ. 6.28 లక్షల కోట్ల ప్యాకేజీలో ఉద్దీపన కంటే రుణాలకు సంబంధించిన ఘోష ఎక్కువగా ఉంది. సామాన్యులకు లబ్ధి చేకూర్చే అంశం అతి స్వల్పంగా కనిపిస్తోంది. ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ రూ. 6.28 లక్షల కోట్లలో 90 శాతానికి పైగా రెండు కీలక రంగాలకే కేటాయించింది. అవి ఒకటి, ప్రభుత్వం గ్యారంటీలుగా ఇవ్వజూపిన రంగానికి రూ. 2,67,500 కోట్లు, రెండవది చతికిలపడిన విద్యుత్ పంపిణీ రంగానికి రూపాయలు మూడు లక్షల కోట్లు. ఇది కూడ విద్యుత్ రంగతంలో ఉన్న ప్రైవేట్ రంగం నష్టాలను పూడ్చడానికేనన్నది స్పష్టం. ఇంతవరకు కరోనా మొదటి ఉధృతిలో మూడుసార్లు రకరకాల ఉద్దీపన ప్యాకేజీలు, ఉపశమన చర్యలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం జూన్ 28న మరోసారి దెబ్బతిన్న అనేక రంగాలకు అండగా నిలవడం కోసం కరోనా రెండో ఉధృతి అనంతరం తొలిసారిగా చర్యలు ప్రకటించింది.
ఆర్థికరంగం అప్పుడప్పుడే కోలుకుంటోందని భావిస్తున్న వేళ కరోనా సెకండ్ వేవ్ నిజానికి పెద్ద దెబ్బే కొట్టింది. అంతకు మించి అనిశ్చితి నెలకొనేలా చేసింది. అందుకే, ఆర్థికమద్ధతు అందించాలంటూ ‘రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యవిధాన సంఘం’తో సహా పలువురు ఆర్థికవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు. ఆ నేపథ్యంలో ఆర్థికమంత్రి ఎనిమిది కీలక చర్యలతో తాజా ఉద్దీపన ప్యాకేజీ వచ్చింది. అయితే, ఇందులో నేరుగా లబ్ధిదారులకు ఇచ్చేదేమీ లేదు. కొవిడ్ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణసంస్థలకు ప్రభుత్వహామీగానే ప్యాకేజీలో ఎక్కువగా కనిపిస్తోంది. తొలిదశలో కరోనా బాధితులను ఆదుకునే విషయంలో తిమ్మిని బమ్మిని చేసిన కేంద్రం ఇప్పుడు ఏదో చేస్తుందనేది భ్రమే. అంతా ప్రచార ఆర్భాటమే తప్ప పేదలకు, శ్రమజీవులకు ఒరిగిందేమి ఉండబోదన్నది స్పష్టం. ఉపాధికి, ఉత్పత్తికి, ఎగుమతులను పెంచేట్టుగా, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య రంగాలకు ఊతం ఇచ్చేట్టుగా ఈ ప్యాకేజీ 15 రంగాలకు ఉద్దీపన కలిగిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం వాస్తవానికి దూరంగా ఉంది. ఈ ఉద్దీపన ప్యాకేజీలో బడ్జెట్ నుంచి నికరంగా వ్యయం చేసేదెంతో, నూతనంగా చేసిన కేటాయింపులు ఎంతో స్పష్టం చేయలేదు. ఈ తరహా ప్యాకేజీలు రుణ గ్రహీతలను దివాలాలూ, మూసివేతల నుంచి రక్షించగలవేమో కానీ, కరోనా కాటు పడ్డ ఆర్థిక రంగాన్ని ఉత్తేజితం చేసి ఉరుకులు పెట్టించేందుకు ఏమాత్రం దోహదపడదు.
మొత్తం ఉద్దీపన ప్యాకేజీలో దాదాపు సగం వరకు రుణగ్యారంటీలు, బ్యాంకులు రిస్కుతో కూడిన మరిన్ని రుణాల మంజూరుకు ఉద్దేశించినవే. గ్రామీణ బ్రాడ్‌బ్యాండు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలను ఎగుమతితో ముడిపడిన ప్రోత్సాహకాలు అందివ్వడం వంటివి దీర్ఘకాలికమైనవే తప్ప, తక్షణ ప్రభావం చూపగలిగే చర్యలు ఏమాత్రం కావు. కొవిడ్ సంక్షోభంతో చితికిపోయిన కీలక రంగాలు, కోట్లాది శ్రమజీవుల బతుకులు ఎలా తెప్పరిల్లేదీ అమాత్యులు వివరించలేదు! కేంద్ర ప్రభుత్వ నూతన ప్యాకేజీ చూపులకు ఏపుగా ఉన్నప్పటికీ, ఆర్థిక సంవత్సరం పొడుగునా సర్కారీ అదనపు వ్యయం రూ. 60 వేల కోట్లకు మించే అవకాశం లేనేలేదన్నది యదార్థం. ఈ ప్యాకేజీ నికర ప్రయోజనం జిడిపిలో కేవలం 0.3 శాతానికి పరిమితం కానుండగా సింహభాగం రుణ హామీలదేనంటే, ఉద్దీపన అరకొరేనన్నమాట! నిరుడు మే నెల రెండోవారంలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన యోజన రూపేణా అంతిమంగా కలిగిన ప్రయోజనం అంతంత మాత్రమేనని పలు అధ్యయనాలు, విశ్లేషణలు నిగ్గుతేల్చాయి. అటువంటిదిప్పుడు అత్యవసర రుణహామీ పథకం కింద నిరుటి మూడు లక్షల కోట్ల రూపాయల పరిమితిని ఇంకో లక్షన్నర కోట్ల రూపాయల మేర విస్తరించినా, బ్యాంకుల రుణ వితరణ మెరుగుపడనిదే కరోనా బాధిత వర్గాలు గట్టేక్కేదెలా? అసంఖ్యాక సంకక్షుభిత జీవితాలు అంకెల గిమ్మిక్కులతో అమాంతం బాగుపడిపోవన్నది అక్షర సత్యం.
నిజానికి, కరోనాతో గత ఏడాది మార్చిలో తొలిసారి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన రెండు రోజులకే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అసంఘటిత రంగ కార్మికులనూ, పట్టణ, గ్రామీణ నిరుపేద ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ప్రకటన అది. ఆ తరువాత నుంచి ‘ఆత్మనిర్భర్ ప్యాకేజీ’ లాంటి రకరకాల పేర్లతో కేంద్రం నుంచి వివిధ సందర్భాల్లో ఉద్దీపన ప్యాకేజీల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. వాటి పేర్లు, ఉద్దేశాలు ఏమైనప్పటికి కరోనా అనంతర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికంటూ లక్షల కోట్లు లెక్కల్లో కనిపించాయి. తాజా ఉపశమన చర్యలూ దానికి కొనసాగింపే. ప్రజల అసంతృప్తి పరాకాష్టకు చేరుతున్నప్పుడల్లా ఇలాంటి ప్యాకేజీలు వెలుగుచూడడం కరోనా కాలంలో పరిపాటిగా మారింది. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్దీపన ప్యాకేజీలన్నీ సరఫరా పెంపుకు మొగ్గు చూపుతూ వినియోగం పెంచేందుకు ఏ విధంగా తోడ్పడటం లేదు.
ఈసారీ ఉద్దీపనలో ఆయా రంగాలకు చేసిన కేటాయింపులు చూద్దాం.
1. కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ నిమిత్తం రూ. 1.10 లక్షల కోట్లు.
2.అత్యవసర రుణాల హామీగా రూ. 1.5 లక్షల కోట్లు.
3. విద్యుత్ పంపిణీదార్లకు ఆర్థిక సాయం రూ. 97,631 కోట్లు.
4. ఉచిత ఆహార ధాన్యాలకు రూ. 93,869 కోట్లు.
5. ఎగుమతి బీమా నిమిత్తం రూ. 88,000 కోట్లు.
6. ఎగుమతుల ప్రోత్సాహం కోసం రూ. 33,000 కోట్లు,
7. అదనపు ఎరువుల సబ్సిడీ రూ. 14,775 కోట్లు.
8. నూతన ఆరోగ్య పథకం రూ. 15,000 కోట్లు.
9. గ్రామీణ ఇంటర్నెట్ కోసం రూ. 19,041 కోట్లు.
10. విదేశీ పర్యాటకులకు ఉచిత వీసాల నిమిత్తం రూ. 100 కోట్లు.
11. ఈశాన్య ప్రాంత వ్యవసాయ కార్పొరేషన్‌కు రూ. 77 కోట్లు దీనిలో ఉన్నాయి.
వీటిలో గతంలో ప్రకటించిన ఆహర సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ రూ. 1,08,644 కోట్లు పోతే ఐదు లక్షల 21 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో పేర్కొనని ఉద్దీపనలు. కరోనా మూడో వేవ్ ముప్పు రానున్న నేపథ్యంలో ఆరోగ్య రంగం మీద, అందులోనూ ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి పెట్టడం విశేషం. అది కూడ మొదటి థలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ముందుకు రానందున కరోనా చికిత్సకు ముందుకు వస్తామంటే కార్పొరేట్ ఆస్పత్రుల కోసం ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు ‘నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్’ హామీ ఇవ్వనుంది.
ఈ పథకం ప్రైవేట్ వైద్య రంగానికి మేలు చేకూర్చనుంది. కరోనా వేళ ఆర్థిక వ్యవస్థ పట్ల, జనం ఇబ్బందుల పట్ల మోడీ ప్రభుత్వం సరైన ఆలోచన చేయనట్లు విదితమవుతుంది. ప్రభుత్వ ఆలోచనలో ఉన్నది ఆచరణలో ఎంత ప్రతిఫలిస్తుందన్నది మరో సందేహం. అందువల్ల విత్తమంత్రి తాజా అంకెల విన్యాసంలో నిజంగా ప్రజలకు అందేదెంత, జనం లబ్ధి పొందేదెంత అన్నది కాస్తంత లోతుగా పరిశీలిస్తే కానీ అర్థం కాదు. మొత్తం రూ. 6.28 లక్షల కోట్లలో అనేకం బ్యాంకులు అప్పులివ్వాల్సిన రుణ హామీ పథకాలు, లేదంటే ఇప్పటికే బడ్జెట్‌లో చూపిన వ్యయాలు. అలాగే, ఇందులో చాలా వరకు ఈ సంవత్సరానికి సంబంధించినవి కావు. అయిదేళ్ళ పాటు సాగే అనేక సంస్కరణల్లో అవి భాగం అనేది గమనార్హం. ఇక, ఈ ప్రకటించిన మొత్తంలో కేవలం పదో వంతే (దాదాపు రూ.55 వేల నుంచి 60 వేల కోట్లు). ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే అదనపు వ్యయం అని స్పష్టం అవుతుంది. ఇక, మరికొన్నేమో ప్రస్తుతం ఉన్న పథకాలు, గతంలో ప్రకటించిన పథకాల్లోనే చేసిన మార్పులు చేర్పులు.
ప్రభుత్వ అండతో వచ్చిన గ్యారెంటీలను చూసి, బ్యాంకులు మరింత రుణాలివ్వడానికి ముందుకు వస్తాయనే ఊహ మీదే ఈ ప్యాకేజీ రూపకల్పన సాగింది. అది ఏ మేరకు ఆచరణ సాధ్యమో ఇప్పటికిప్పుడు చెప్పలేము. గత ఏడాది ప్రకటించిన నవంబర్ వరకు ఉచిత ఆహార ధాన్యాల సరఫరా, ఎరువులపై పెంచిన సబ్సిడీ వంటి వాటిని కూడా ఇందులో చేర్చారు. అందుచేత ఈ ప్యాకేజీని చూసీ చూడగానే ఇది కూడా రుణానుబంధ సాయమేనని అర్థమైపోయింది. కొవిడ్ వల్ల ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మందికి, సెకండ్ వేవ్ వల్ల మళ్లీ అనేక కష్టాలు అనుభవించిన వలస కార్మికులకు ఈ పథకం నుంచి ఒరిగేదేమీ ఉండదని చెప్పవచ్చు. గత ఏడాది మే నెలలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో పేర్కొన్న రుణ సదుపాయాన్ని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇలు) పొందలేకపోయాయని అనుభవంలో నిగ్గు తేలింది. గత ప్యాకేజీ వల్ల తెలంగాణలోని 80 శాతం ఎంఎస్‌ఎంఇలకు ఎటువంటి ప్రయోజనం సిద్ధించలేదని, 20 శాతం ఎంఎస్‌ఎంఇలు తిరిగి కోలుకోలేని విధంగా మూతపడిపోయాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ స్వయంగా ప్రకటించారు. కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న ఈ కాలమంతా లక్షలాది ప్రజలు తమ ఆదాయాలను, జీవనోపాధిని కోల్పోయారు.
ఈ సమయంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ దేశాల్లో సార్వత్రిక నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా ఆరు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజ్‌ను అమలు జరపాలని ప్రతిపాదించింది. దానిలో నగదు బదిలీతో పాటు శాశ్వత ఆస్తుల కల్పన వంటి చర్యలున్నాయి. నరేంద్రమోడీ సర్కార్ అలాంటి ఆలోచనలో లేదు. ద్రవ్యలోటును అదుపులో ఉంచే పేరుతో ప్రభుత్వం ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ ఆదేశించిన మేరకు కొన్ని స్వయం పరిమితులు విధించుకుంది. సిఎంఈఈ అధ్యయనం ప్రకారం, జూన్ 15 నాటికి నిరుద్యోగిత రేటు 12 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు చాలా అధికంగా దాదాపు 15 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది. 2021 జనవరిలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 40.1 కోట్లు ఉండగా మే చివరి నాటికి 36.6 కోట్లకు తగ్గింది. 2021లో లాక్‌డౌన్ల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికులు రోజువారీ ఆదాయంపై ఆధారపడిన పేదలే. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో రోజువారీ వేతన కార్మికులు 1.72 కోట్లకు పైగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. వ్యాపార రంగంపై ఆధారపడిన వారు ఈ రెండు నెలల్లో 90 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. అలాగే విద్యా, రవాణా, గృహనిర్మాణ రంగాల్లో కూడ చాలా మంది ఉపాధి కోల్పోయారు.
దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఇ) పరిశ్రమల రంగం పరిమిత పెట్టుబడులతో స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. విస్తృత ఉత్పాదనలతో దేశార్థికాన్ని ఉత్తేజపరచడంలో ముందుండే ఈ పరిశ్రమలు ఏటికి ఎదురీదుతున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఇ) రంగం పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జిడిపిలో 30 శాతం, ఎగుమతుల్లో 40 శాతం ఈ రంగం నుంచే వస్తుంది. ఈ రంగంలోని కన్సార్టియం ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(సిఐఏ) జూన్ 24న ప్రకటించిన సర్వే ప్రకారం 88 శాతం సూక్ష్మ లేదా చిన్న సంస్థలు గతేడాది ప్రకటించిన ప్యాకేజ్‌ను ఉపయోగించుకోలేదని తేలింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు నాలుగు కోట్ల మంది ఉన్నారు. వారికి భవిష్యత్ మీద ఆశలేదు. ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఇ సంస్థలుంటే వాటిలో కేవలం 50 లక్షల సంస్థలు మాత్రమే ప్రభుత్వ పథకాల నుంచి ఆర్థిక సాయం పొందాయి. ఎంఎస్‌ఎం పరిశ్రమల రంగానికి నికరంగా 45 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరముండగా బ్యాంకులు సమకూరుస్తున్నవి 18 శాతం లోపేనని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. కరోనా రెండవ తరంగంలో కేవలం ఐదోవంతు సంస్థలు మాత్రమే బతికి బట్టకడతాయని లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. నలభై శాతం సంస్థలు నెల రోజుల కంటే ఎక్కువ కాలం బతకలేవని తేలింది. గత సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కొన్నాళ్లకే వెలుగు చూసిన ‘పీఎం గరీబ్ కల్యాణ్ యోజన’ ప్రభుత్వ ఉదార సాయం కోసం ఆశగా నిరీక్షించిన ఎందరినో నిరాశపరిచింది. తదుపరి ఆర్థిక ఉద్దీపన ఏ తీరుగా ఉండాలన్న దానిపై ఫిక్కీ, అసోచామ్ వంటి వాణిజ్య సంఘాలతో పాటు ప్రముఖ ఆర్థికవేత్తలూ మేలిమి సూచనలెన్నో చేసినా అదంతా అరణ్యరోదనైంది.
కరోనా కారణంగా దేశంలో వినియోగ గిరాకీ తగ్గిపోయిందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సహేతుకంగా విశ్లేషించింది. గిరాకీ తిరిగి ఊపందుకుంటేనే ఆర్థిక, పారిశ్రామిక రంగాలు కోలుకుంటాయంటూ రిజర్వ్ బ్యాంక్ సైతం ఆ వాదననే సమర్థించింది. గిరాకీ పెరగాలంటే ప్రజల చేతుల్లో నగదు ఉండాలి. కనుకనే అర్హులైన పేదలకు ప్రభుత్వ ప్రత్యక్ష నగదు బదిలీపై సిఫార్సులు వెల్లువెత్తాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని, పట్టణ ప్రాంతాలకూ దాన్ని విస్తరింపజేయాలని, కొన్నాళ్లపాటు జిఎస్‌టి రేట్లు తగ్గించాలని… సూచనలెన్నో వచ్చాయి. ప్రభుత్వం పలు దఫాలుగా ప్రకటిస్తున్న ఉద్దీపనపై స్పష్టత అవసరం. ప్యాకేజీ వల్ల ఏయే వర్గాలకు ఎంతమేరకు ప్రయోజనం సమకూరింది. అందువల్ల ప్రభుత్వంపై పడిన భారమెంత? బ్యాంకుల అందించిన మొత్తమెంత? ఇటువంటి గణాంకాలు ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటి చెబుతాయి. నిజానికి గత ప్యాకేజీల్లో అమలైంది. నలభై శాతం లోపుగానే ఉందని బ్యాంకింగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం మే లో ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉద్దీపనలో ప్రభుత్వంపై పడిన భారం రెండు లక్షల కోట్ల రూపాయల లోపుగానే ఉంది.
భారత గోదాముల్లో దాదాపు ఏడు కోట్ల టన్నుల ధాన్యాలు మగ్గుతున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాటిని పంపిణీ చేసి, ప్రభుత్వం ఆర్థిక లెక్కల్లో చెప్పేసి సాయంగా ఘనతను చాటుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాపై పెద్దగా భారం పడకుండా ప్రచారం పొందడమెలా? అన్న అంశంపైనే కసరత్తు సాగిస్తున్నారు. తీవ్రమైన అంటురోగాల విషయంలో ప్రభుత్వ బాధ్యత అత్యంత కీలకమైనదని కరోనా ప్రపంచానికి చాటి చెప్పిన గుణపాఠం. ప్రభుత్వ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరచుకోవడం ద్వారానే ప్రజలపై భారం తగ్గుతుంది. తాజా ప్యాకేజీలో ధర్మాసుపత్రుల్లో పెట్టుబడులకు నిధులు కేటాయించలేదు. కానీ ప్రైవేట్‌గా కార్పొరేట్ ఆసుపత్రులు తెరుస్తామంటే 50 వేల కోట్ల రూపాయల వరకూ బ్యాంకు రుణాలకు ప్రభుత్వం హామీ ఇస్తానంటోంది. మోడీ ఫ్రభుత్వం అనుసరించిన అనుచిత రాజకీయార్థిక విధానాల వల్ల పేదలు మరింత పేదలు కాగా, మధ్యతరగతి భారీయెత్తున తగ్గిపోయిందని పలు అధ్యయనాలు స్పష్టం చేయడమే కాదు, ప్రజల జీవితానుభవమూ రుజువు చేస్తోంది.
కనుక ఈ ప్యాకేజీల ఫలితాలను ఏలినవారి మాటల్లో కాక, ప్రజల జీవితాల్లో చూడగలిగితేగానీ అసలు విషయం బోధపడదు. నిరుద్యోగం మరింత పెరిగిపోయింది. ఉపాధి తరిగిపోయింది. కుటుంబాల ఆదాయాలు సన్నగిల్లాయి. సామాన్యులు ఇన్నాళ్లూ కడుపుకట్టుకుని దాచుకున్న పొదుపు సొమ్మూ కరిగిపోయింది. కరోనా తొలి యేడాదిలోనే అదనంగా 23 కోట్ల మంది నిశ్శబ్ధంగా దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారు. అదే సమయంలో అత్యంత ధనికులు సంపద మాత్రం అమాంతం పెరిగిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలోనే లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ నికర లాభాలు 57.6 శాతం పైకి ఎగబాకాయి. దేశంలోని శతకోటీశ్వరులు సంపద ఏకంగా 35 శాతం పెరిగిపోయింది. దీనిని బట్టి ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో, ఈ ప్యాకేజీలు పరమార్థమేమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ కరోనా కాలమంతా, అసంఖ్యాకులైన భారత ప్రజలు తమ ఆదాయాలనూ, జీవనోపాధినీ కోల్పోగా, పిడికెడు మంది బడాబాబులు మాత్రం అంతులేని సంపద సొంతం చేసుకున్నారు. అంబానీ సంపద రూ. 8,400 కోట్ల డాలర్లకు (అంటే రూ. 6,13,000 కోట్లు) అదానీ ఐశ్వర్యం 7,800 కోట్ల డాలర్లకూ దూసుకుపోయాయి. అంటే (రూ. 5,70,000 కోట్లు). మోడీ పాలనలో పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారే పరంపర శరవేగంగా జరిగిపోయింది.
మరి ఈ ఉద్దీపనలు ఎవరిని ఉద్ధరిస్తాయంటే సంపన్నులనేనని సమాధానం వస్తోంది. కొవిడ్ కారణంగా దెబ్బతిన్న రంగాలకు చేయూత, రైతులకు రెట్టింపు రాబడి, ఎగుమతులకు ప్రోత్సాహం తదితరాల్ని వల్లెవేస్తూ పుండు ఒకచోట ఉంటే లేపనం మరోచోట చందంగా ఉద్దీపననూ ముక్తాయింప చేశారు. చిన్న పట్టణాల్లో మౌలిక వసతులూ సేవల మెరుగుదలను లక్షించి జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని పట్టాలకు ఎక్కిస్తే, కోట్లాది జీవితాలు బాగుపడుతాయి. వ్యక్తిగత ఆదాయాలు పెరిగేలా ఉపాధి, ఉద్యోగితల్ని గాడిన పెట్టాల్సి ఉంది. ఉపాధికి ఊతమిచ్చేలా సమగ్ర వాస్తవిక ఉద్దీపన ఒక్కటే ప్రస్తుత స్థితిలో సరైన పరిష్కారం! వినియోగదారుని జేబుల్లోకి నేరుగా నగదు చేరేట్టు చేయడం మీద ఫ్రభుత్వం దృష్టి ఇంకా రాకపోవడం విచిత్రంగా ఉంది. పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రజల చేతుల్లోకి నగదు బదిలీ చేసేందుకు మోడీ సర్కార్ ససేమిరా అనడం శోచనీయం. ప్యాకేజీ ప్రజల్లో నిబ్బరం కల్పించలేకపోతోంది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి మారితేనే తప్ప నూటికి ఎనభై శాతానికి పైగా ఉన్న పేదలకు న్యాయం జరుగదు, వారికి సరైన భరోసా కూడా దక్కదు.