కళ కళ కోసం కాదు. ఎప్పటి మాట ఇది! ఈ నినాదం వెనక ఎంత పోరాటం! ఈ నినాదం వెంట ఎన్ని త్యాగాలు! కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుర్తు చేయాల్సి వస్తోంది. చర్చ మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తోంది.
సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతించాడు. ఆయన పని చేసిన రంగంలో తనదైన బలమైన ముద్ర వేసిపోయాడు. దాని గురించి మీడియా ఆలపిస్తూనే ఉంది. దాన్నలా ఉంచితే రచయితగా ఆయనేమిటి, ‘వ్యక్తిగత’ రాజకీయ విశ్వాసాలపరంగా ఆయనేమిటి, ఈ రెండిటినీ కలిపి చూడాలా, వేరువేరుగా చూడాలా అనే ప్రశ్న ముందుకొచ్చింది. ఆయన స్వయంగా ప్రకటించి ఉన్నాడు గనక ఆయన రాజకీయ విశ్వాసాలు తేటతెల్లం. ఇంత స్పష్టంగా ప్రకటించాడు గనక దాని పట్ల ఎవరి వైఖరి అయినా స్పష్టంగానే ఉంటుంది. సాహిత్యం కూడా అంతే స్పష్టంగా రాసేవాళ్ళు ఉంటారు. అయితే సీతారామశాస్త్రి తానుగా వ్యక్తమైన రచన చేశాడా అంటే అలా కూడా ఎంతో కొంత చేసి ఉండవచ్చు కాని ఆయన దాదాపుగా సినిమా ద్వారానే వ్యక్తమయ్యాడు. సినిమా దేని కోసం ఉద్దేశించబడి ఉంటుందో ఆ పరిధిలోనే పాటలు రాశాడు. సినిమా ఏ భావాలను ప్రచారం చేస్తున్నదో ఆ భావాల పరిధి దాటి అతను రాసే అవకాశం కూడా లేదు.
ఉన్నంతలోనే మంచి పాటలు రాశాడబ్బా అనుకోవచ్చు. అసలు మంచి అంటే ఏమిటి? ఆయన పాపులర్ పాటలను తరచి చూస్తే వాటిలో పాలకవర్గ భావజాలం ఇమిడి ఉంటుంది. కాకపోతే సౌందర్యం తొణికిసలాడే పైపూతతో. చాలా మొరటుగా బండగా, రణగొన ధ్వనుల బూతు మాటల పక్కన కనీసం అవి వినసొంపుగా ఉంటాయి. పాలకవర్గ భావజాలం అలా కూడా జనాన్ని చేరుతుంది. చుట్టూ జరుగుతున్న ఘోరాన్ని చూసి చలించే సున్నితమైన స్పందన ఆ సాహిత్యంలో ఉందనుకోండి. అది హృదయాలను తాకుతుంది. అయితే అందులో అసలు వాస్తవం తలకిందులుగా ఉంటుంది. నిగ్గదీసి ప్రశ్నించాల్సింది పాలకుల్ని అయితే అది ప్రజలనే సిగ్గుమాలిన వాళ్ళని, నీతిమాలిన వాళ్ళని చెప్తుంది. చీకటి పోయి వెలుగు రావాలి అంటే సరిపోదు, చీకటికి కారణం చెప్పాలి. చెప్పకుండా దాస్తే అది దోపిడీ వర్గ సాహిత్యమే అవుతుంది. ఆధిపత్య భావజాలాన్ని, దోపిడీ నీతి సూత్రాలను ఎంత అందంగా చెప్తే అంత ఎక్కువగా ప్రజలు మోసపోతూ ఉంటారు. అందుకే త్రిపురనేని మధుసూదనరావు వంటి వాళ్ళు సంప్రదాయ సాహిత్యాన్ని, అభ్యుదయం ముసుగు తొడుక్కున్న సంప్రదాయ సాహిత్యాన్ని పని గట్టుకొని చీల్చి చెండాడారు.
వ్యక్తిత్వ వికాసం బాపతు సాహిత్యాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ నెత్తికెత్తుకుంటుంది. ఎందుకంటే అది దోపిడిని, వ్యవస్థీకృత అణచివేతను తెలివిగా మరుగున పడేస్తుంది. ఇటువంటి సాహిత్యం మార్కెట్లో మంచి సరుకు కూడా. బూతు సాహిత్యం పక్కన ఇది మంచి సాహిత్యంగానే కనపడుతుంది. అయితే అంతిమంగా రెండింటి ప్రయోజనం వ్యాపారమే. అయితే రెండోది ఎంత కాదన్నా మొదటిదానికన్నా మెరుగే. సీతారామశాస్త్రి పాటలు కూడా ఇలానే చాలా మందికి నచ్చుతాయి.
సినిమా చాలా శక్తివంతమైన కళ. అది అనేక కళల్ని కలబోసుకున్న ఆధునిక మాధ్యమం. ఇది ఎవరి గుప్పిట్లో ఉన్నదో చెప్పనవసరం లేదు. అత్యంత ప్రభావశీలమైన సినిమా కేవలం కళను అమ్ముకోవడం దగ్గరే ఆగలేదు. అది రాజకీయాలను, సామాజిక నీతిని శాసిస్తున్నది. సినిమా వాళ్ళు ఏం చెప్పినా అది వెనువెంటనే కోట్లాది జనానికి చేరుతుంది. చేరడమే కాదు, ఆమోదం పొందుతుంది. సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితం, అభిరుచులు, విశ్వాసాలు జనంలో చాలా క్రేజీ అవుతాయి. తనకున్న పాపులారిటీ వల్ల సీతారామశాస్త్రి రాజకీయ విశ్వాసాలు కూడా సమాజంలో తగినంత ప్రాచుర్యం పొందుతాయి. ఆయన రాజకీయ విశ్వాసాలతో మనకెందుకు, హాయిగా ఆయన పాటలు వినవచ్చు కదా అంటే కుదరదు. కనీసం సామాజిక బాధ్యత ఫీలయ్యేవాళ్ళు, సమాజానికి బాధ్యత పడినవాళ్ళు ఇలా అనడానికి లేదు. అవి ఫాసిస్టు రాజకీయాలైతే, ‘వాటితో మనకేంపని’ అనడం కేవలం ఉదారవాదం కాదు, రియాక్షనరీ అవుతుంది.
తమకు అనుకూలంగా ఆయన మాట్లాడిన మాటలను ఫాసిస్టులు బ్రహ్మాండంగా వాడుకుంటారు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు ఆ మాటలను ఎంతగా ప్రచారం చేసేకుంటారో ఊహించవచ్చు. మరి ప్రజారాజకీయాలు ఏం చేయాలి? చనిపోయాక అంతా మంచే మాట్లాడాలని సానుభూతి ప్రకటించాలా? ఈ శుద్ధమానవతావాదం సరైనదేనా? ఆయన జీవితం, ఆచరణ ప్రజాశత్రువులకు మేలు చేసినప్పుడు, ఆయననో రోల్ మోడల్ గా ప్రచారం చేస్తున్నప్పుడు, ఏది మంచో తేటతెల్లం చేయాల్సిందే. ఆయన ఏ వర్గమో, ఏ వర్గం కోసం ఆయన రచనలు చేశాడో చెప్పాల్సిందే.
నిజానికి వ్యక్తిగా సీతారామశాస్త్రే కాదు, రచయితగా సీతారామశాస్త్రి కూడా ఆధిపత్య వర్గమే. కొద్దిపాటి సంస్కరణలు ప్రతిపాదించిన ఒకటి ఆరా పాటలు తప్ప (అవి కూడా సినిమా చెప్పిన నీతి పరిధిలో), ఆయన పాటలు సున్నితంగా, ఆలంకృతంగా చెప్పిన భావాలు ఆధిపత్యవర్గానికి చెందినవే. ఎవరైనా ఆయన రాసిన ఒక్కో పాటను తీసుకొని శాస్త్రీయ పద్దతిలో వాచక విమర్శ చేస్తే అది తేలిపోయే విషయమే. కాబట్టి సీతారామశాస్త్రి పట్ల, ఆయన సాహిత్యం పట్ల కూడా విమర్శనాత్మకంగా ఉండాల్సిందే.
మళ్లీ మౌలిక ప్రశ్న దగ్గరికొస్తే, కళ కళ కోసం కాదు. వ్యాపారం కోసం అసలే కాదు. మానవ సమాజపు ఉమ్మడి జ్ఞానం నుండి, సృజనాత్మక నుండి అది పుట్టింది. జ్ఞానం మీద ఆధిపత్యం ప్రకటించుకున్న బ్రాహ్మణవర్గం ప్రజల జ్ఞానాన్ని, సృజనాత్మకను కాదంది. పెట్టుబడిదారీ వ్యవస్థ కళను అంగట్లో సరుకు చేసింది. నిజమైన మానవ స్పందనలను, జీవన సంఘర్షణలను తొక్కిపట్టి క్రుతక విలువలను ఊరేగించింది, ఊరేగిస్తున్నది. ఆ హోరులో కొట్టుకుపోకుండా శ్రామికవర్గాల, ప్రజాఉద్యమాల సాంస్కృతిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పక్షం వహించే రచయితలు, కళాకారుల బాధ్యత.
ఆ పాటల్లో ఏముంది? అంతా అదే.. అసలు ఫక్తు బ్రాహ్మణీయ వ్యవస్థ దర్పణాలే
Varalakshmi garu —u r right madam -cini politics every corner —
మంచి అభిప్రాయం
✊✊
Maa Satyam
సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రసీమలో రాసిన పాటల పై పి .వరలక్ష్మి గారు రాసిన లోతైన తార్కిక తాత్విక విశ్లేషణలో నిశితమైన గతితార్కిక విమర్శ దృష్టితో వ్రాసినట్లు కనిపిస్తుంది. చదువరులను ఆలోచింపజేస్తుంది.
నిజంగానే నేను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటలను కొన్ని సందర్భాలలో గోప్ప అనుభూతి పొందినప్పటికీ పాటల తత్వమేదో అందకుండా తెలియని భ్రమలోకి తీసుకెళ్ళేది.
ఈ విమర్శనాత్మకమైన వ్యాసము లో చాలా విషయాలు తెలుసుకోగలిగాను.
వ్యాసములో వారన్న మాటల్ని గుర్తు చేస్తూ
” చీకటి పోయి వెలుగు రావాలి అంటే సరిపోదు, చీకటికి కారణం చెప్పాలి. చెప్పకుండా దాస్తే అది దోపిడీ వర్గ సాహిత్యమే అవుతుంది.” 👍🙏
చీకటి పోయి వెలుగు రావాలి అంటే సరిపోదు, చీకటికి కారణం చెప్పాలి. చెప్పకుండా దాస్తే అది దోపిడీ వర్గ సాహిత్యమే అవుతుంది.. ee line tho sootigaa cheppesaaru🔥