ఏ బిందువు దగ్గర మొదలు పెట్టాలో తెలిస్తే చివరాఖరి వాక్యమేదో స్పష్టమౌతుంది. ఆరంభం, కొనసాగింపు తేలికయిన విషయం కాదు. విరసం ఆరంభం కూడా ఆలా జరగలేదు. నిరసన, ఆగ్రహ ప్రకటన ద్వారా మాత్రమే విప్లవ రచయితల సంఘం ఏర్పడలేదు. ఒక నిర్మాణం వెనుక అచంచల విశ్వాసం, నిమగ్నత మాతమ్రే సరిపోదు. ప్రజల నుండి ప్రజలకు ప్రవహించే సన్నటి నీటిధార అనేక దాహార్తులను తీర్చుతూ, అనేక ఖాళీలను పూరిస్తూ సాగవలసి ఉంటుంది. ఈ నడకలో కొన్ని ఖాళీలు కొత్తగా కనబడవచ్చు. దేనికయినా అన్వేషణే ముఖ్యం.
విరసం యాభై ఏళ్ల సందర్భంగా పర్స్పెక్టివ్ ప్రచురణగా ‘50 ఏళ్ల విరసం పయనం ప్రభావం’ అనే పుస్తకం వచ్చింది. దానికి ప్రతిస్పందనే పాణి రాసిన ఈ ‘కల్లోల కాల ప్రతినిధి`దృక్పథాల సంభాషణ’. ఈ పుస్తకంలోని రచయితలకు ఏభై ఏళ్ళ విప్లవ రచయితల సంఘం నడక, నిరంతరం మారుతున్న తెలుగు సాహిత్యావరణానికి విరసం నిర్మిస్తూ ఉన్న భూమిక గురించి తెలుసు. మూడుతరాల మేధో సృజనకారుల గమనంలో ఇది వున్నది. ఏదో ఓ దశలో విరసం ప్రభావానికి లోనుకాకుండా ఈ తండ్లాటతో మనకేం పని అనుకొని పక్కకు వైదొలిగే తెలుగు సాహిత్యకారులు లేరు. ఈ అర్ధశతాబ్ద కాలాన్ని ఎలా చూచినా, ఎలా అంచనా వేసినా ఈ సంబంధమే సంఘర్షణాత్మకం.
భారత సమాజం అనేక ఆకాంక్షలతో తనను తాను వెతుక్కున్న కాలం ఇది. సమాజపు నూతన ప్రజాస్వామ్య ఆకాంక్షలకు, వైయక్తిక ఆకాంక్షలకు మధ్య ఘర్షణ ఉన్నది. సకల సృజనాత్మక రంగాలలో రెండు భిన్న ప్రపంచాల మధ్య ఊగిసలాట వున్నది. ఒకటి వర్గం. రెండవది వర్గాతీత వైఖరి. ఈ రెండూ ఏభై యేళ్ళ ప్రయాణంలో అనేక రూపాల్లో విస్తరించాయి. ఇంకో పక్క బ్రాహ్మణీయ హిందూత్వ రాజకీయాలు. ఇవన్నీ విరసం మొదలైన కాలంలోనే బీజరూపంలో మొలకెత్తాయి. అక్కడి నుంచి విరసం కొనసాగుతున్న ఈ కాలం పొడవునా అనేక సవాళ్ళుగా మారాయి.
విరసం ప్రవాహగతి ఈ మొత్తంలో భాగంగా నిర్ణయమైంది. అయితే ఏ దరికి చేరాలనే స్పష్టత విరసానికి వుంది. తీరంపై నిలబడి ఉన్న రచయితలు ఈ ప్రవాహాన్ని ఎలా గతితార్కికంగా చూస్తున్నారనేది ప్రధానమైన అంశం. పర్స్పెక్టివ్ ప్రచురించిన పుస్తకంలో తమను తాము ఈ ప్రవాహంలో భాగంగా చేసుకున్న రచయితలూ ఉన్నారు. ఈ చూపులన్నిటిలోని విమర్శనాత్మకతను విరసం అన్ని దశలలోనూ పట్టించుకున్నది. దేనిని వదిలించుకోవాలో, దేనిని స్వీకరించాలో గుర్తించి ఒక స్పష్టమైన నడకను విరసం కొనసాగించింది. ఏభై ఏళ్ళ విరసం పయనం అనేక భావసంఘర్షణల మధ్య కొనసాగింది. ముందు చెప్పిన రెండు ఆలోచనా స్రవంతుల మధ్య విరసం బలమైన ఆధునిక భావజాల పునాదిని ఏర్పరచుకున్నది. తెలుగు సాహిత్య సాంస్కృతిక మేధో రంగాలకు ఆధునికతను విప్లవాత్మకంగా అందించింది.
‘పయనం ప్రభావం’లోని అన్ని పరిశీలనలను, విమర్శలను చర్చించడానికి ఈ విప్లవాత్మక ఆధునికతే ప్రమాణం. కాలం తూనికలో జరిగిన అనేక మార్పులను, సాహిత్య ధోరణులను అర్థం చేసుకోడానికి ఇదే ఆధారం. వీటి మధ్య విరసంకు ఎక్కడా వూగిసలాట లేదు. తొంభైల తర్వాత తెలుగు సాహిత్యానికి సంబంధించి అనేక సాహిత్య ధోరణులు, భిన్న అస్తిత్వాలు తమదయిన కంఠస్వరాన్ని వినిపించాయి. ఈ అస్తిత్వ వ్యక్తీకరణల వెనుక ఆర్థిక, సామాజిక అసమానతల పునాది వున్నది. స్త్రీలు, దళితులు, మైనారిటీలు సాహిత్యరంగంలోకి ప్రత్యేకమైన దారి చేసుకొని వచ్చారు. ఈ కంఠస్వరాలు తొంభైవ దశకంకు ముందు లేవని కాదు. అయితే ఇంతగా ఉ లేవు. తమ జీవితంలోని అనేక కోణాలను వ్యక్తీకరించాలనే ఎరుక లేదు. అస్తిత్వ ధోరణులు తొంభైల తర్వాత స్థిరీకరణ చెందాయి. ఈ అస్తిత్వ ధోరణులు ఆనాటి రచయితలు ఎలా స్వీకరించారు? ఎలాంటి వైఖరి తీసుకున్నారు? అనేది వేరే చర్చ. విరసం ఈ సాహిత్య ధోరణులను ఎలాంటి ఊగిసలాట లేకుండా స్వీకరించింది. తన సాహిత్యావరణలోకి అనువర్తింపచేసుకుంది. ఈ అనువర్తనం వెనుక విరసంకు పై పై ఆలోచనలు లేవు. విరసానికి విప్లవోద్యమంతోపాటు భిన్న అస్తిత్వాల నేపథ్యం కూడా ఉన్నది. విరసం నిర్మాణంలోనే ఈ అస్తిత్వాల భూమిక వున్నది. అస్తిత్వ గొంతుల వెనుక దాగిన పెయిన్ విరసం అవగాహనలోకి రావడానికీ విరసం నిర్మాణమే చోదక శక్తిగా వున్నది.
విరసం ఏర్పడ్డాక మూడు తరాల రచయితల పుట్టుక, కొనసాగింపు ఉన్నది. విరసం ఆరంభ దినాలలో సాహిత్యరంగంలో తనదయిన ముద్రను అన్ని సాహిత్య ప్రక్రియలలో వేయగలిగింది. అయితే కొత్త రచయితలు, కొత్తదారులు వేసుకుంటున్న సాహిత్య సందర్భం కూడా వున్నది. సాహిత్యంలో నూత్న ప్రయోగాలకు, సృజనాత్మక వ్యక్తీకరణలో తమదయిన శైలి, శిల్పపరమైన ప్రయోగాలు ఉన్నాయి. తొంభైల తర్వాత విప్లవోద్యమంతోపాటు తెలుగు సాహిత్య వస్తువు మారింది. జీవితంలో అనేక పార్శ్వాలు, కొత్త తరహా జీవన విధానం మనుషుల మధ్య, మానవసంబంధాల మధ్య తలెత్తిన అంతరాలూ ఇవన్నీ సాహిత్య వస్తువులుగా మారుతున్న దశలోకి విరసం ఎదిగింది. ఈ దశలో ఏం రాస్తున్నది? ఏం మాట్లాడుతున్నది? విరసం తన రచనా తాత్వికతను మార్చుకున్నదా? ఎలా మార్చుకున్నది? దీనికి ఈ ముప్పై ఏళ్ల సాహిత్యమే రుజువు. నూత్న రచయితలను, ఆ రచయితలు చేస్తున్న వ్యక్తీకరణలు, ప్రయోగాలను విరసం నిశితంగా గమనిస్తున్నది. విరసంలోని నూతన తరం రచయితలు ఈ కొత్త వాతావరణంలో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. బైటి రచనా సంవిధానపు లోతుపాతులను గమనిస్తూనే తమ రచనలను విప్లవీకరిస్తున్నారు.
భారత సమాజం వర్గ`కుల సమాజం. పితృస్వామ్య సమాజం. ఇంకా అనేక అంతరాల సమాజం. వీటిని భారత ముఖచిత్రంపై లేకుండా చేయాలి. బ్రాహ్మణీయ భావజాలంతో ముడిపడివున్న భారతీయ సాంస్కృతిక, జీవన విధానాన్ని, మత, కుల, పితృస్వామ్య, సకల ఆధిపత్య భావనలను నిర్మూలించడానికి విప్లవ దృక్పథంతో విరసం సృష్టిస్తున్న సాహిత్య పరిధి చాలా విశాలమైనది. ఒక దశాబ్ది కాలంగా విరసం బ్రాహ్మణీయ హిందుత్వతో తలపడుతున్నది. భారత సమాజంలోని ద్వేషభావం విరసం అవగాహనలో వుంది. అనేక ఆంక్షల మధ్య ఏభైఏళ్ళ కాలం గడిచింది. భారత విప్లవోద్యమాన్ని ఎత్తిపడుతూ, విప్లవ మార్గమే అనుసరణీయమని, భారత ప్రజల విముక్తి విప్లవాచరణలోనే వుందని, విప్లవం విజయవంతం కావడానికి సాహిత్య కార్యాచరణ వుండాలని విరసం నిరూపించింది. ఈ వెలుగు నీడల మధ్యే విప్లవ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నది. కేవలం ప్రచారం మాత్రమే కాదు. సిద్ధాంత వెలుగులో రచనలు బలమైన వ్యక్తీకరణగా ఎంచుకుంది. కొన్నిటిని త్యాగం చేసింది. భూస్వామ్య సంస్కృతి చుట్టూ నిర్మితమైన భావజాలాన్ని, దాని సాంస్కృతిక అంశాలను ధ్వంసం చేయగలిగింది. భూస్వామ్య, పెట్టుబడిదారి వర్గాల భావజాల చట్రాన్ని ఛిద్రం చేస్తూ తెలుగు సాహిత్యానికి ఆధునిక, విప్లవ చైతన్యాన్ని అందిస్తోంది. ఏక కాలంలో అనేక అంశాలపై, ద్వంద్వ నీతులపై పోరాడి తనదయిన సాహిత్య, సాంస్కృతిక పునాదిని నిర్మించింది. దీని పట్ల విరసం వెలుపలి మేధో, రచనా ప్రపంచానికి వ్యతిరేకత ఉండొచ్చు. అంగీకారముండవచ్చు. తమ భద్ర జీవితాల్ని విరసం పరీక్షకు పెడుతున్నదని ఆందోళన చెందవచ్చు. విరసం నిర్మాణంలో, కొనసాగింపులో పొరపాట్లు, తప్పిదాలు, ఉండవచ్చు. సభ్యుల్లోనూ కొన్ని బలహీనతలు ఉండవచ్చు. అన్ని విషయాల్లో స్వీయ విమర్శలతో తిరిగి కూడగట్టుకుంటూ ఉండవచ్చు. కానీ విరసం గమనం, గమ్యం మాత్రం ఏ కాలంలోని ప్రజా సాహిత్యానికైనా దిక్సూచి.
ఎ.కె. ప్రభాకర్ సంపాదకత్వంలో వచ్చిన పుస్తకంపట్ల విరసంకు సమ్మతమో? వ్యతిరేకతో లేదు. తనను తాను చూసుకోడానికి అది కూడా ఒక మంచి అవకాశం. పర్స్పెక్టివ్ ప్రచురించిన ‘విరసం పయనం ప్రభావం’లోని వ్యాసకర్తలతో పాణి చేస్తున్న సంభాషణే ఈ పుస్తకం. ఇది వాళ్లకు సమాధానం కాదు. వాదోపవాదం కాదు. సమర్థన కాదు. వాళ్ల దృక్పథాలతో సంభాషణ. ఒక సామూహిక గానానికి సిద్ధం కావడం. కొనసాగవలసిన సుదీర్ఘ ప్రయాణానికి దారిని సరి చేయడం. దాని కోసం ఆ రచయితల సూత్రీకరణలను, విమర్శలను, సూచనలను విరసం ఆచరణ వైపు నుంచి చూశాడు. యాభై ఏళ్ల విప్లవ సాహిత్యోద్యమం మీద సాగిన ఈ చర్చనంతా తెలుగు సాహిత్య చరిత్రలో భాగంగా పరిశీలించాడు. మార్క్సిస్టు సాహిత్య విమర్శ, సిద్ధాంతం వైపు నుంచి తెలుగు సమాజ సాహిత్య చలనాల్లో భాగంగా మిత్రుల భిన్న దృక్పథాలను పరామర్శించాడు. ఇదంతా నిర్మాణమవుతున్న చరిత్రను విశ్లేషించే ప్రయత్నం. మనందరం జీవిస్తున్న ఈ కల్లోల కాలానికి ప్రతినిధి అయిన విప్లవ, విప్లవ సాహిత్యోద్యమం తరపున సాగిన సంభాషణ ఇది. సంక్షుభిత వర్తమానంలోంచి చరిత్ర ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని నూతన తీరాల కోసం సాగిస్తున్న అన్వేషణఇది.
ఇదొక ప్రయాణం. విరసాన్ని ఇలా కూడా చూడవచ్చు. మీ అభిప్రాయాలను ఇట్లా కూడా చూడమని చెప్పడమే చరిత్రను అర్థం చేసుకోడానికి దోహదం చేస్తుంది. దానికి తగినట్లు పని విధానాన్ని సమీక్షించుకొని ముందుకు వెళతామని చెప్పడమే ఈ రచన ఉద్దేశం.
విరసం ప్రయాణిస్తున్న ఈ కాలం వైవిధ్యభరితమైన సంక్షుభిత కాలం. తెలుగు సమాజంలో, తెలుగు సాహిత్యంలో అనేక భిన్న వైఖరులు అత్యంత వేగంగా వచ్చిన కాలం. విరసం వర్గపోరాట సాహిత్య కేంద్రం. అందుకే విరసానికి ఒంటరి గానం కాదు. సామూహిక గీతం.