పిల్లల సినిమాలని వాటి సమీక్షలని విశ్లేషించే ముందు మనం మన బాల్యంలోకి తొంగి చూడాలి. మనల్ని ఆకట్టుకున్న సినిమాలు, మనపై ప్రభావం చూపిన సినిమాలు గుర్తొస్తాయి. అవి ఎందుకు ప్రభావం చూపించాయో ఇప్పుడు వయసుపెరిగాక మరో కోణంలో అర్థమవుతుంది.

వాటిని పిల్లల కోసం తీసిన సినిమాలుగా, పిల్లల గురించి పెద్దల కోసం తీసిన సినిమాలుగా విభజించవచ్చు. పిల్లల కోసం తీసిన సినిమాలు ఏ వయసు వారి కోసం తీశారో కూడా చూడాలి. ఎందుకంటే, వారి వారి వయసుని బట్టి జ్ఞాన సముపార్జన, అవగాహన వుంటాయి. వారి మానసిక ఎదుగుదలకి అనుగుణంగా మనం వారికి విజ్ఞానాన్ని అందించగల్గితే వారు ఎంతో బాగా ఎదుగుతారు.

నా చిన్నప్పుడు చూసిన సినిమాల్లో నాకు బాగా గుర్తుండిపోయిన దృశ్యం `‘మాబాబు’ సినిమాలో సావిత్రి తన కొడుక్కి పాడి వినిపించే ‘చల్‌ చలో అని స్వారీ చేసెను టక్‌ టక్‌ టక్‌’ అనే ఫాంటసీ. తర్వాత చాలా ప్రభావం చూపింది ‘కాబూలీవాలా’ సినిమా. అందులో మాట్లాడే పక్షి, చందమామలో రాట్నం వడికే ముసలమ్మ ఇప్పటికీ గుర్తు. టాగూర్‌ కథని బిమల్‌రాయ్‌ సినిమాగా తీస్తే, బల్‌రాజ్‌ సహానీ ఆ పాత్రకి ప్రాణం పోశాడు. ఆ సినిమా పిల్లల్ని ఎంతగా ఆకట్టుకుందంటే, మా స్కూల్లో ఆ సినిమా ఘట్టాలను, ‘కాబూలీవాలా’ పాటని కలిపి నాటకంగా వేసి మెప్పించారు. ‘మినీ’ పాప ఆ పాత్రని వేసిన మా స్నేహితురాలు పల్లవి ఇప్పటికీ గుర్తు.

ఆ తర్వాత కాలంలో నాన్నతో సెకండ్‌ షోలకి వెళ్ళి చూసిన జెర్రీ లూయీ, నార్మన్‌ విజ్‌డమ్‌ల కామెడీ నచ్చేది. పెరుగుతున్న కొద్దీ చార్లీ చాప్లిన్‌ సినిమాలు నచ్చేవి. కామెడీ వెనక వున్న విషాదం, మానవత్వం అబ్బురపరిచేవి. రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఆవేశకావేషాలు, యుద్ధ తంత్రాలు, యుద్ధం సృష్టించే బీభత్సాల నేపథ్యంలో వచ్చిన ‘బ్రిడ్జ్‌ ఆన్‌ ద రివర్‌ క్వాయ్‌’, ‘బాటిల్‌ ఆఫ్‌ ది బల్జ్‌’ వంటి సినిమాలు నచ్చేవి. ఆ తర్వాత శాంతారాం, గురుదత్‌, రాజ్‌కపూర్‌ సినిమాల పరంపర. ఆదివారం మార్నింగ్‌ షోలో ‘చెమ్మీన్‌’ వంటి మళయాళం సినిమాలు ఇతర ప్రాంతీయ భాషల సినిమాలని పరిచయం చేశాయి. కాలేజీకి వచ్చేసరికి క్లాస్‌మేట్స్‌తో రొమాంటిక్‌ సినిమాలు చూసినా, ఆల్టర్నేటివ్‌ సినిమాల మీద మక్కువ పెరిగింది.

ఇతర జీవకోటితో పోలిస్తే మనిషి మెదడు ఎంతో పరిపక్వం చెందింది. గర్భస్థ శిశువుగా వుండగానే మొదలయే మెదడు ఎదుగుదల మొదటి వెయ్యి రోజుల్లో, అంటే రెండేళ్ళు నిండే సరికి చాలా వరకు పరిపక్వమవుతుంది. ఆ తర్వాత మనకు అందిన సమాచారాన్ని గ్రహణ శక్తితో, జ్ఞాన సంచయంతో, జ్ఞాపక శక్తితో, విచక్షణతో, సమస్యాపూరణతో విశ్లేషించుకునే ప్రక్రియనే జ్ఞానం అనవచ్చు.

సంవత్సరం లోపు పిల్లల్లో దాన్ని ‘సెన్సరీమోటర్‌’ దశ అంటాము. వారి జ్ఞానం పరిమితం. సంకేతాలు ఉండవు. వారి అనుభవాలకే అది పరిమితం. బుడిబుడి నడకల బుజ్జాయిల్లో ఒకటి నుంచి ఐదేళ్ల వరకు సంకేతాలు అర్థమవుతాయి. వారి భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. జ్ఞాపక శక్తి, కాల్పనికత వృద్ధి చెందుతాయి. దీన్ని ‘ప్రీ ఆపరేషనల్‌ దశ’ అంటాము. ఇందాక చెప్పుకున్న కాబూలీవాలా పాట, మా బాబు పాట అలాంటి కాల్పనికతలని ప్రేరేపిస్తాయి. ‘మాయాబజార్‌’ సార్వజనీనత ఈ కోవలోకి రావచ్చు. మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన కథలకి మన ఊహాశక్తిని జతచేసిన అద్భుత వయసు అది. పదిపన్నెండేళ్ల వయసు వరకు ‘కాంక్రీట్‌ ఆపరేషనల్‌ దశ’ అంటాము. వీరి తెలివి క్రమ పద్ధతిలో, సహేతుకంగా ఉంటుంది. వీరికి సరైన, శాస్త్రీయమైన పద్ధతిలో విజ్ఞానాన్ని అందించగల్గితే వీరు అద్భుతాలు సృష్టించగలరు. వీరు యదార్థమైన వస్తువులకు సంకేతాలు రూపొందించగలరు. కౌమార దశ నించి పెద్దయ్యేవరకు అది ‘ఫార్మల్‌ ఆపరేషనల్‌ దశ’. వీరు నిగూఢమైన అంశాలను సహేతుకమైన సంకేతాలతో సరిపోల్చగలరు.

పిల్లల మానసిక ఎదుగుదల కోసం వారి కల్పనాశక్తి చాలా అవసరం. కాల్పనికతకి, సృజనాత్మకతకి మధ్య సుసంపన్నమైన సంబంధం ఉంది. అలానే, వాస్తవికతని అర్థం చేసుకోవాలంటే కాల్పనికత అవసరం. ఏడేళ్ల వరకు వారికి నిజానికి, ఊహకి మధ్య తేడా తెలీదు. ఆ రెంటి నడుమ వారి ప్రపంచం విస్తరిస్తుంది. వాళ్లు అబద్ధం చెపుతున్నారని మనం అపోహ పడతాము. ఏడేళ్ల తర్వాత ఊహాశక్తి వల్ల జ్ఞాన సముపార్జన పెంపొందుతుంది. జీవితానుభవాల నించి, సంస్కృతి నించి, మానసిక స్థితిగతుల నించి మన ప్రాపంచిక దృక్పథం వృద్ధి చెందుతుంది. ఇలాంటి అభివృద్ధికి దోహదపడేది మంచి సినిమా ` అందునా, మంచి పిల్లల సినిమా!

‘వైగోట్స్కీ’ అనే రష్యన్‌ మానసిక నిపుణుడు చెప్పినట్టు, ‘‘సామాజిక కార్యాచరణ’’ మనిషి మేధోపరమైన అభివృద్ధిని నిర్దేశిస్తుంది. అలానే, ‘‘ఆలోచనా విధానం పెంపొందాలంటే భాష ఎంతో అవసరం. సామాజిక కార్యాచరణ ద్వారానే పిల్లల ఆలోచనల్లో, అవగాహనలో మార్పు వస్తుంది. దీనంతటికీ మంచి బాల సాహిత్యం ఎంతగానో దోహదపడుతుంది. అలానే, దేశ విదేశాల ప్రయోజనాత్మకమైన పిల్లల సినిమాలు కూడా వారి మానసిక వికాసానికి దారితీస్తాయి.’’

‘మార్క్‌కెర్మోడ్‌’ అనే ఒక ఆంగ్ల చిత్ర విమర్శకుడు చెప్పినట్టు, ‘‘పిల్లల సినిమా అంటే ఏమిటి? అది పిల్లల ఎదుగుదలని గుర్తెరిగిన సినిమానా? అది బహుశ బాల్యం గురించిన సినిమా కావచ్చు. అది చిన్నదైనా, పెద్దదైనా అందరినీ అలరించగలిగిన వైవిధ్య భరితమైన సినిమా కావచ్చు. లేదా ఏ పిల్లలైనా చూడగలిగిన సినిమా కావచ్చు. పెద్దలకి మాత్రమే నియమితమైన సినిమా కాకపోవచ్చు.’’

పిల్లల్ని ఎలాంటి కథలు ఆకట్టుకుంటాయి? ‘రిచర్డ్‌పెక్‌’ అనే రచయిత చెప్పినట్టు, ‘‘కథ అనేది ఒక తలుపు లాంటిది. అది ప్రపంచానికి దారి చూపుతుంది. కథ అద్దం లాంటిది ` అది వీక్షకుల ముఖాన్ని ప్రతిబింబిస్తుంది. కథ ఒక ప్రశ్న ` అది ఎదురుచూడని సమస్య. కథ ఒక మార్గం ` మనల్ని సుదూర ప్రాంతాలకి తీసుకెళ్ళే దారి. కథ ఒక గవాక్షం, కథ ఒక తాళం చెవి. కథ ఒక వైట్‌ హౌస్‌ ` సముద్రాన్ని వెలిగిస్తుంది.కథ మొదలు ` కథ చివర. కథ మధ్యలో మనకి ఒక నేస్తం కూడా దొరకవచ్చు!’’ అంతటి పరిధి వున్న కథల్లో పిల్లల్ని ఆకట్టుకోగల వస్తువులు కొకొల్లలు. కొందరిని హాస్యం ఆకట్టుకుంటుంది. చమత్కారం కితకితలు పెడుతుంది. జానపద కథలు ఊహాలోకాల్లోకి తీసుకుపోతాయి. చారిత్రక ఘట్టాలు గత చరిత్రని పరిచయం చేస్తాయి. ఇతర దేశాల కథలు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. కథా వస్తువు, పాత్రల చిత్రణ, కథ వెల్లడయే విధానం, హావభావాలు, భాష, సందేశం, అన్నీ పిల్లల్ని ఆకట్టుకుంటాయి. బాలల చిత్రోత్సవాల్లో వారి హావభావాలు, చప్పట్లు, ఆనందోత్సాహలు చూస్తే వారిని ఎలాంటి కథలు కదిలిస్తాయో అర్థమవుతుంది. బాలల చిత్రోత్సవాల్లో వారితో కలిసి సినిమాలు చూస్తుంటే మనం కూడా పిల్లలమైపోతాం. ఆంక్షలు, పరిమితులు మర్చిపోయి మనమూ కేరింతలు కొడతాం.

ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి ఇరాన్‌, పాలస్తీనా పిల్లల సినిమాలు. వారి సంక్లిష్ట పరిస్థితుల నించి అద్భుతమైన కళాఖండాలు రూపొందాయి. తీవ్రమైన ఆవేదన, పేదరికం, కలలు, సాఫల్య వైఫల్యాలు ప్రతిబింబించే ఈ సినిమాలు పిల్లలు కోల్పోతున్న బాల్యాన్ని చూపిస్తాయి. యుద్ధ వాతావరణంలో శాంతియుత జీవన కాంక్షని వెల్లడిస్తాయి. రకరకాల మానసిక సాంఘిక ఘర్షణల్లో పిల్లల జీవితాలు ఎదుర్కొనే ఒడిదుడుకులను ప్రతిఫలిస్తాయి. వారికి మెరుగైన జీవితాన్ని అందించలేకపోతున్న సామాజిక బాధ్యతని అవి ప్రశ్నిస్తాయి. వయసుకి మించి భారాన్ని మోస్తున్న ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటని కలవర పెడతాయి.

ఎన్నో సంవత్సరాలుగా మంచి సినిమాలని, కళాత్మకమైన, సందేశాత్మకమైన సినిమాలని, ఆ మాధ్యమాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న సినిమాలని ఆర్ధ్రంగా సమీక్షిస్తూ వచ్చిన శివలక్ష్మి, ప్రత్యేకించి పిల్లల సినిమాలపై సమీక్షలని ఈ సంపుటిలో పొందుపరిచింది. వీటిలో కొన్ని సినిమాల నేపథ్యాన్ని వివరిస్తే, కొన్ని విజయాలని సూచిస్తుంది. కొన్ని సినిమాలని కూలంకషంగా చర్చిస్తూ ఎన్నో ఆలోచనలని రేకెత్తిస్తుంది. ఏ సినిమా ఏ వయసు పిల్లలకి ఉద్దేశించ బడిరదో చెప్తూ, దాన్ని పెద్దలు కూడా ఎందుకు చూడాలో చెప్తుంది. ఆయా దేశ కాలపరిస్థితులని మన ముందు పరుస్తూ, మన దేశ కాల పరిస్థితులకి వాటిని ఎలా అన్వయించుకోవచ్చో, విపులీకరిస్తుంది. ఎన్నో దేశాలకి చెందిన డైరెక్టర్లు దృశ్యమాధ్యమాన్ని

ఉపయోగించుకున్న తీరు, వారు పొందిన అభినందనలు, బహుమతులు మనకి గుర్తుచేస్తుంది. మొత్తం మీద, వైవిధ్యభరితమైన ఈ సినిమాల్లో మనం మునిగితేలుతాము. ఆ పాత్రల భావావేశాల్లో ఓలలాడతాము. కొన్ని పాత్రల వెంట పరుగులు పెడతాము. ఆ సినిమాని మనం కూడా చూడగలిగితే ఎంత బాగుండేది అని ఆరాటపడతాము.

ఈ పిల్లల సినిమాల సమీక్షల పరంపరలో మహిళా దర్శకుల సినిమాలు కూడా

ఉన్నాయి. వారివారి అనుభవాలతో, ఆలోచనా ధోరణితో వారు కథని మలచిన తీరుని కూడా శివలక్ష్మి విపులీకరిస్తుంది. వారి దృష్టి కోణాన్ని మన ముందు

ఉంచుతుంది. ఈ మాధ్యమంలో కూడా వారు తీసిపోరని నిరూపిస్తుంది. మహిళా దర్శకులు నిర్మించిన బాలల సినిమాల్లో చెప్పుకోదగ్గది ‘తైనా’ అనే ఆదివాసీ బాలిక కథ. అమెజాన్‌ అడవిని సంరక్షించే ఇతివృత్తంలో స్నేహం, సాహసం, ప్రకృతిల మేళవింపు కనిపిస్తుంది.

సున్నితమైన కౌమార దశలో తల్లితండ్రుల ప్రేమ, అండ కొరవడితే అడ్డదారులు తొక్కే బాలుడి కథ ‘మదర్‌, ఐ లవ్‌యు’. భావి పౌరుల కీలకమైన అభివృద్ధి దశలో తల్లితండ్రులు, టీచర్లు, సమాజం మొత్తంగా ఎలా బాధ్యత వహించాలో తెలియజెప్పే మంచి సినిమా ఇది. ఒంటరి తల్లి బతుకుబాటలో సతమతమవుతూ కొడుకుపై కేంద్రీకరించకపోతే కలిగే అనర్ధాన్ని చూపే కథ.

జాతి విద్వేషాలు పిల్లల మధ్య స్నేహానికి ఎలా గండికొడతాయో చెప్పే కథ ‘గర్ల్‌ ఫ్రమ్‌ గోరీ’. జర్మన్‌, రష్యన్‌ జాతుల మధ్య ఘర్షణని ఈ సినిమా చిత్రిస్తుంది. జార్జియన్‌ మహిళ తీసిన సినిమా ఇది. ‘‘దేశాల కతీతంగా, జాతులకతీతంగా ప్రచండమైన ఆగ్రహాలను సైతం అద్భుతమైన స్నేహాలుగా మలచుకోవడమెలాగో పిల్లలకి మాత్రమే సాధ్యం. అవి తెలుసుకోవాలంటే పిల్లలూ పెద్దలూ అందరూ ఈ సినిమా చూడాల్సిందే’’ అంటుంది శివలక్ష్మి. ‘క్లాస్‌ ఆఫ్‌ ఫన్‌’ సినిమా చదువుని ఒక బోర్‌గా కాక సరదా సరదాగా సాగించాలనే సందేశంతో అలరిస్తుంది. క్యూబాలో ధనిక, పేద పరిస్థితుల్లో ఇద్దరు బాలుర కథ ‘హబానా స్టేషన్‌’. ఆ వ్యత్యాసాల మధ్యనే ఈ పిల్లల స్నేహం వెల్లివిరియడం చూస్తే, పిల్లల్ని మంచి వైపుకు మరల్చుకోవడంలో పెద్దల బాధ్యత ఎంత అవసరమో అర్థమవుతుంది. అసమానతల మధ్య క్యూబాలో బస్తీ పిల్లలకి, ధనిక పిల్లలకి మధ్య కుదిరిన స్నేహాన్ని వివరించిన శివలక్ష్మి అక్కడ ఉన్న లోపాలని, వైరుధ్యాలని సహేతుకంగా వివరిస్తే బాగుండేది. ‘కాటికాపరి కూతురు’ అనే ఎస్టోనియా సినిమా పిల్లల్ని నిర్లక్ష్యం చేసే తల్లితండ్రులనించి పిల్లల్ని రక్షించవలసిన సామాజిక బాధ్యతని సూచిస్తుంది. అననుకూల వాతావరణంలో పిల్లలు తమ బాల్యాన్ని పోగొట్టుకోవడాన్ని ఇది చిత్రీకరిస్తుంది. డౌన్స్‌ సిండ్రోమ్‌ పాపతో స్నేహం ఒక అద్భుతమైన అంశంగా ఉంటుంది. యూరప్‌ దేశాల పేదరికానికి కారణం ప్రపంచీకరణే అని శివలక్ష్మి సూచిస్తూ, పిల్లల్లో సహజంగా ఉండే దయాగుణాన్ని కొనియాడుతుంది.

రష్యన్‌ సినిమా ‘చింటి’ లో ఒక చీమ ఎంతో శ్రమకోర్చి తాజ్‌మహల్‌ నమూనాని కట్టి చూపుతుంది. శ్రమ సాఫల్యాన్ని ఈ యానిమేషన్‌ చిత్రం ఎంతో అందంగా వెల్లడిస్తుంది. పెద్దలు పెట్టిన పేర్లు పిల్లలకి నచ్చవు. దక్షిణ అమెరికన్‌ సినిమా ‘అనైనా’లో పేరు తెచ్చిన తంటా కనిపిస్తుంది. తోటి విద్యార్థుల అవహేళనతో కించపడి, ఆ బాధలో సంఘ వ్యతిరేక కార్యాలకి పాల్పడే పాపని కనిపెట్టిన ప్రిన్సిపాల్‌ చాకచక్యంగా ఈ ఘర్షణకి తెరదించడం బాగుంది.

‘గర్ల్‌రైజింగ్‌’ అనే న్యూయార్క్‌ డాక్యుమెంటరీ వివిధ దేశాల్లో ఆడపిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఎదుర్కొంటున్న హింసని చూపుతుంది. తొమ్మిది దేశాల ప్రతినిధులు ఈ అడ్డంకుల్ని అధిగమిస్తామని వాగ్దానం చేయడం ఆశని రేకెత్తిస్తుంది. చదువు కోసం, కళల కోసం పాటుపడుతున్న ఆడ పిల్లల కథనాలని చిత్రించిన రిచర్డ్‌ రాబిన్స్‌ మూలకారణాలని వెతక్కపోవడం వల్ల వారికి పూర్తి మేలుచేయడం లేదేమోననే సందేహాన్ని వెలిబుచ్చుతుంది శివలక్ష్మి.

పిల్లలకి అమితమైన, అనంతమైన, అంతులేని ప్రేమ ఎంత అవసరమో, వారు ఆ ప్రేమ కోసం ఎంతలా తపిస్తారో నెదర్లాండ్స్‌నించి వచ్చిన ‘కౌబాయి’ సినిమాలో చూపుతారు. తల్లితండ్రుల మధ్య సఖ్యత లేకపోతే పిల్లల జీవితాలు ఎలా చిందరవందరవుతాయో, ఆ లోటుని పూడ్చుకోవడానికి వారు పెంపుడు జంతువుల మీద, స్నేహితుల మీద ఎలా ఆధారపడతారో కనిపిస్తుంది. ప్రేమ లేకపోతే వారు తమలో తాము ముడుచుకు పోతూ, న్యూనతకి గురవుతూ బతుకుతారు, లేకుంటే ఆ అననుకూల పరిస్థితుల్లో అసాంఘిక శక్తులుగా మారతారు. నేరస్తుల చరిత్రని తిరగతోడితే, దాదాపు ఎనభై శాతం మంది జీవితాల్లో ఈ కుటుంబ కలహాలు, బీభత్సాలు కనిపిస్తాయి. అందుకే పిల్లలు కావాలనుకునే ప్రతి వారు వారికి సుందరమైన జీవితాన్ని, ఆనందమయమైన భవిష్యత్తుని ఇవ్వగలమా లేదా అని ముందుగా చూసుకోవాలి.

‘తూర్పుగాలి’ అనే జర్మన్‌ సినిమాలో శాస్త్రవేత్తలైన తల్లితండ్రులు, గుర్రాలకి శిక్షణ ఇచ్చే అమ్మమ్మ ` అందరూ కలిసి ఒక టీనేజ్‌ బాలిక వైఫల్యాలని ఎద్దేవా చేస్తూ వుంటే, అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటూ ఆ బాలిక ఒక పొగరుబోతు గుర్రాన్ని మచ్చిక చేసుకుని టోర్నమెంటులో విజయం సాధిస్తుంది. తన ప్రతిభని చాటుకుంటుంది. తగిన అవకాశాలు కల్పిస్తే పిల్లలు ఎలా రాణించగలరో చెప్పే చిత్రమిది. కొంగల వలసని, ఇగోర్‌ అనే బాలుడు వలస వెళ్లవలసిన పరిస్థితులని పోలుస్తూ చెప్పే కథ ‘ఇగోర్‌’ది. ఇతను కూడా పక్షులతో స్నేహం ద్వారా విడిపోయిన తల్లితండ్రుల మధ్య నలిగిపోకుండా బయటపడతాడు. ‘‘గతకొన్ని దశాబ్దాలుగా స్వంత ఊరు, స్వంత దేశం, ‘మాతృభూమి’ అనే భావనలు నాటకీయంగా వలసల వల్ల మార్పు చెందుతున్నాయి. ఇది ఒక సామాజిక విషాదం’’, అంటూ దర్శకుడు అన్ని దేశాల్లో పెరుగుతున్న విడాకుల రేటుని చూసి చింతిస్తారు.

ఇరాన్‌లో ‘‘హయాత్‌’’ అనే పన్నెండేళ్ల పాప, తన తండ్రి అనారోగ్యంతో సతమతమవుతున్న తల్లి బాధ్యతని స్వీకరిస్తూ, బొంగరంలా తిరుగుతూ ఇంటిపనిని, తమ్ముళ్ల సంరక్షణని చేపట్టి, అంత వత్తిడిలోనూ పరీక్ష రాయడం, అందుకోసం తన స్నేహితులు, టీచర్లు సహకరించడం చూపే అందమైన సినిమా ‘హయత్‌’. అసమ సమాజంలో నిరంతర పోరాటంలో సాగే మహిళల జీవితాన్ని, ఎడతెగని ఇంటి పనితో సతమతమయే స్త్రీల జీవితాన్ని ఈ సినిమా చూపుతుంది. మహిళలు సంపూర్ణంగా విముక్తి చెందాలంటే వారిని ఈ దుర్భరమైన ఇంటి చాకిరి నించి విముక్తం చేయాలని లెనిన్‌ నొక్కి చెప్పిన విషయం గుర్తొస్తుంది. ‘‘పిత్రుస్వామ్య సమాజంలో లోతుగా పాతుకుపోయిన సంప్రదాయవాద ఆలోచనల ఫలితంగా ప్రతికూల సంకట స్థితుల్లో ఇరుక్కుపోతున్న మహిళల కష్టాలపై దృష్టి సారిస్తుంది ఈ సినిమా,’’ అని వివరిస్తుంది శివలక్ష్మి.

తల్లిని కోల్పోయిన బాలుడు ‘నానో’ అపరాధ పరిశోధనాత్మక ప్రవృత్తితో చేసే ప్రయాణాన్ని చూపే డచ్‌ సినిమాలో అతను తల్లి కోసం పడే ఆరాటం కనిపిస్తుంది.

కాశ్మీర్‌ నుంచి వచ్చిన ‘నూరే’ సినిమాలో పిల్లలు శాంతికోసం, సాధారణ జీవితం కోసం అలమటించడం కనిపిస్తుంది. ఒకప్పటి అందమైన కాశ్మీరం ఇప్పుడు కల్లోల కాశ్మీరంగా మారడం, ప్రతి ఇంటి మీద తుపాకి గుళ్ల గుంటలు కనిపించడం, ఆర్మీ క్యాంపులు, లాండ్‌ మైన్లను దాటుకుంటూ బడికి వెళ్లడం, నేలమాళిగ బంకర్లలో ఆటలు, భోజనాలు, పేలుళ్ల వల్ల చెదిరిపోయిన పెళ్లి వేడుకలు మనల్ని కలవరపెడతాయి. ఒకరోజు ‘నూరే’ నిద్రపోదు. ఆ రోజు కాల్పుల శబ్దం వినపడదు. అందుకని, తను నిద్రపోకపోతే కాల్పులు ఆగిపోతాయి అనే ఊహతో ఆ పిచ్చిపిల్ల

రాత్రుళ్లు నిద్రపోవడం మానేస్తుంది. అలాంటి వాతావరణంలో తన సహచరులని కోల్పోయిన శివలక్ష్మి కొడుకు స్నేహితుడు ఎలా పొగిలి పొగిలి ఏడ్చాడో చెప్తూ శివలక్ష్మి పిల్లల శాంతి కాముకతని కొనియాడుతుంది.

చెక్‌ రిపబ్లిక్‌లో ప్రేగ్‌నగర విద్యార్థులు వేసవి సెలవుల్ని చరిత్రని శోధించడంకోసం వినియోగిస్తారు. ‘మారాల్‌’ సినిమాలో బొహేమియాలో అంటరానితనం, ఊచకోతలు, జాతుల మధ్య విద్వేషాలు సాగించిన మారణకాండ, వారి విముక్తి కనిపిస్తుంది. డచ్‌ సినిమా ‘పాపాస్‌ టాంగ్‌’లో నృత్యంతో అనుబంధాన్ని పెనవేసుకున్న తండ్రీ కూతుళ్ల కలలు విడాకుల వల్ల కల్లలు కావడం కనిపిస్తుంది. తాతా మనుమల అనుబంధాన్ని తెలిపే జపాన్‌ యానిమేషన్‌ సినిమాలో అగ్ని వల్ల మానవాళి పొందుతున్న ప్రయోజనాన్ని చూపిస్తారు. ‘హోరైజన్‌ బ్యూటిపుల్‌’ అనే సినిమాలో ఇథియోపియన్‌ వీధి బాలలు

తమ న్యూనతని అధిగమించి, అసాధ్యమనుకున్న ఫలితాలను సాధించడం, ధైర్య సాహసాలు ప్రదర్శించడం కనిపిస్తుంది. కలలను సాకారం చేసుకునే వీధి బాలుడి కథ ఇది.

అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే పసందైన కథలు తీయని కలలకి దారితీసే ‘బంగారు మామిడిపండు’ సినిమాలో తెలుగు దర్శకుడు, చిన్ని చిన్ని కోరికలు కూడా తీరని చిన్న పిల్లల నిస్సహాయతని చూపుతూ, అసమానతలని ప్రశ్నిస్తాడు.

కొన్ని ప్రదేశాలు, పల్లెలు, పర్వతాలు, వరదలు, మంచు, మారుమూల గ్రామాలు పిల్లలకి ఎన్ని కష్టాలు తెచ్చిపెడతాయో, వారిని ఎలా వేధిస్తాయో చెప్పే సినిమాలు చాలా వచ్చాయి. నార్వే నించి వచ్చిన ‘టు గార్డ్‌ ఎ మౌంటెన్‌’ అలాంటి సినిమా, కొండల మధ్య తప్పిపోయిన గొర్రె పిల్లని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో తన చిట్టి తమ్ముణ్ణి కోల్పోయిన అన్న కథ ఇది. అందరికీ జీవితం వడ్డించిన విస్తరి కాదు అని తెలియజెప్పే ఈ కథలో పిల్లలు పడే రకరకాల యాతనలు కనిపిస్తాయి.

కాశ్మీరీ కథ ‘తోలుబొమ్మ’ పోలికలు, పోటీతత్వం వల్ల కలిగే అనర్ధాలని చెప్తుంది. చిన్న వయసులో తల్లిని కోల్పోయిన లోటు పూడకముందే ఇతర పిల్లలతో పోల్చి చూసి, అన్నిట్లో వెనకపడటాన్ని చూపి ఎద్దేవా చేస్తుంటే కుంచించుకుపోయే పిల్లల సినిమా ఇది. పోటీతత్వాన్ని వినాశనకారిగా ప్రోత్సహించే విద్యావ్యవస్థలు పిల్లల్లో సంకుచితత్వాన్ని, స్వార్థాన్ని ఎలా పెంచుతాయో, పక్కవాడి ఓటమి మీద తమ విజయాలను నిర్మించుకునే దుర్మార్గాన్ని ఎలా ప్రోత్సహిస్తాయో మనం చూస్తున్నాం. బడిలో వెనకబడిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ, వారిని కూడా తమ స్థాయికి ఎదిగించే సౌభ్రాతృత్వాన్ని జన చైనాలో చూశాం. అందరికీ ఎదిగే అవకాశాలను కల్పిస్తూ, వారి ప్రగతికి దోహదపడే సోషలిస్టు విద్యా వ్యవస్థ మాత్రమే ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకుపోగలదు.

ఇరాన్‌ నుంచి రెండు అద్భుతమైన సినిమాలను శివలక్ష్మి చాలా చక్కగా విశ్లేషించింది. ‘నా మిత్రుడి ఇల్లెక్కడ’ అనే అబ్బాస్‌ కియరోస్తమీ సినిమా, ‘చిల్డ్రెన్‌ ఆఫ్‌ హెవెన్‌’ అనే మాజిద్‌ మాజిదీ సినిమాలు పిల్లల మనస్తత్వాన్ని, వారి ఆకాంక్షలని, వారి ప్రేమానురాగాలని, బాధ్యతని, వారి కోరికలని చూపిస్తూనే, ఆ దేశపు దారిద్య్రాన్ని, అసమానతలని కూడా చూపిస్తాయి. మొదటి కథలో తన స్నేహితుడిని టీచర్‌ శిక్షిస్తారేమోననే భయం తరిమితే, రెండో కథలో చెల్లి కాలి జోళ్లని తిరిగి సంపాదించాలనే అన్న తాపత్రయం కనిపిస్తుంది. పిల్లల స్వచ్ఛత, పరస్పర సహకారం, స్నేహశీలత మనల్ని ఆకట్టుకుంటాయి. యుద్ధ వాతావరణంలో, నిరంతర సంఘర్షణలో అతలాకుతలమవుతున్న ఇరాన్‌ ఇంత మంచి దర్శకులని, అందమైన సినిమాలని అందించడం అబ్బురమనిపిస్తుంది. పిల్లల సినిమాలకి వీరు కొత్త ఒరవడిని, సాంద్రతని సమకూరుస్తున్నారు. ఆ వివరాలన్నీ శివలక్ష్మి మాటల్లో చూడాల్సిందే.

‘ఒసామా’ సినిమా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల పాలనలో మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న దుర్భర జీవితాన్ని చిత్రిస్తుంది. అందమైన వాతావరణంలో, సంపూర్ణంగా విచ్చుకోవలసిన లేలేత వయసులో పిల్లలు ఆసాధారణ అనుభవాలతో, గిడసబారిపోవడం, అననుకూల పరిస్థితుల్లో తల్లడిల్లిపోవడం, అమానుషంగా మారిపోవడం, అసహజంగా తయారుకావడం మనకి అనేక సినిమాల్లో కనిపిస్తుంది. పాలస్తీనా, రువాండా, ఇరాన్‌, కాశ్మీర్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఫ్రాన్స్‌, నైజీరియా వంటి అనేక దేశాల కథల్లో ఛిద్రమైపోతున్న బాలల జీవితాలు కనిపిస్తాయి. ‘ఒసామా’ అలాంటి ఒక హృదయ విదారకమైన కథ. స్త్రీలు మాత్రమే మిగిలిన ఒక ఇంట్లో, ఆకలిని జయించడంకోసం ఆడపిల్లని మగపిల్లవాడిగా మార్చి పనికి పంపితే, అక్కడ ఆమె పెద్ద మనిషి కావడంతో గుట్టు బయటపడి ఆమెని నిర్బంధిస్తారు. ఎన్నో అమానుషమైన శిక్షలు వేస్తారు. వెలుగు చూడని ఇలాంటి ఎన్నో కథలు మనచుట్టూ జరుగుతూనే ఉంటాయి.

పిల్లల సినిమాలు హాయిగా నవ్విస్తూ ఆనందాన్నివ్వాలి. చార్లీ చాప్లిన్‌లా మానవత్వాన్ని చాటాలి. పిల్లల సృజనాత్మకతకి దారులు వెయ్యాలి. అసాధారణ జీవితాలని పరిచయం చేయాలి. అలాంటి దుర్భర జీవితాలని అధిగమిస్తూ పిల్లలు పడే ఆరాట పోరాటాలని చూపాలి. అలాంటి పిల్లలకి చేయూతనివ్వగలిగేలా శాంతి కాముకులని ప్రేరేపించాలి. శివలక్ష్మి సమీక్షించిన సినిమాలన్నీ ఈ కోవలోకి వస్తాయి. పిల్లల హక్కుల సాధనని నిలబెడతాయి.

ప్రతి బడిలో ఇలాంటి మంచి సినిమాలు నెలకు ఒకటైనా చూపించగలిగితే, పిల్లల దృష్టి విస్తరిస్తుంది. వాటి మీద చర్చపెడితే, వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. ప్రతి పాఠశాల, ప్రతి టీచరు ఈ కార్యక్రమాన్ని చేపట్టగల్గితే, పిల్లల్ని టిక్‌టాక్‌ల నించి, స్మార్ట్‌ఫోన్‌ కల్చర్‌ నించి కాపాడి, దృశ్య మాధ్యమం కూడా ఎలా మేలు చేయగలదో నిరూపించవచ్చు.

రకరకాల ఇతివృత్తాలని, పాత్రలని, స్వభావాలని, సందర్భాలని, వైరుధ్యాలని, పిల్లల ఔన్నత్యాన్ని, డైరెక్టర్ల మనోభావాలని, నైపుణ్యాన్ని, ఎంతో కమిట్‌మెంట్‌తో వివరించిన శివలక్ష్మి నించి మరెన్నో సమీక్షలని ఆశిస్తూ, ప్రపంచ బాలల సినిమాలని ఇంత అందంగా విశ్లేషించినందుకు ఆమెని అభినందిస్తున్నాను.

డాక్టర్‌ నళిని
పిల్లల వైద్య నిపుణులు
హైదరాబాద్‌

Leave a Reply