నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగియక ముందే మరో వివాదస్పద అంశం కొత్తగా ముందుకొస్తున్నది. ఇప్పుడు “వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు(పిడిపిబి) 2021” పేరుతో మరో వివాదం ముంచుకొచ్చింది. వ్యక్తిగత గోప్యతను మానవ హక్కుగా గుర్తించే అంతర్జాతీయ ఒప్పందంపై 1948లోనే భారత్‌ సంతకం చేసింది. ఏడు దశాబ్ధాలు గడిచినా ఆమేరకు పటిష్ట చట్టాన్ని రూపొందించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించడానికి 128 దేశాలు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చాయి. వ్యక్తుల వివరాలు అంగడి సరకులు కాకూడదంటే దేశీయంగా అందుకు తగిన ఏర్పాట్లు అత్యవసరమని అత్యున్నత న్యాయస్థానం లోగడే స్పష్టీకరించింది. వ్యక్తిగత గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కుగా అభివర్ణించిన న్యాయపాలిక దాని పరిరక్షణ బాధ్యతను పాలకుల బుజస్కందాలపై మోపింది. ఈ నేపథ్యంలో ఈ(పిడిపి) బిల్లు పూర్వాపరాలు ఏమిటో చూద్దాం.

2012లో యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్‌ పథకం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కెఎస్‌ పుట్టస్వామి సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని, రాజ్యాంగంలోని 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల్లో అధికరణ 21 ప్రకారం గౌరవ పరంగా జీవించే హక్కు ఉల్లంఘనకు గురైందని ఆయన తన రిట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సెంటర్‌ ఫర్‌ సివిల్‌ సోసైటీ(సిసిఎస్‌), మాథ్యూ థామస్‌, రాఘవ్‌ టంఖా, కళ్యాణి మీనన్‌ సేన్‌, రామ్‌ ప్రసాద్‌ మిసల్‌, శాంతా సిన్హాతదతరులు ఇంప్లీడ్‌ అయ్యారు. ఈ కేసును సుప్రీంకోర్టు 2017 ఆగష్టులో విచారణకు స్వీకరించింది. మొదట పుట్టస్వామి కేసు విచారించిన త్రిసభ్య ధర్మాసం ఇందులో రాజ్యాంగ పరమైన అంశం ఉన్నందున విసృత ధర్మాసం విచారించాలని సూచించగా, మొదట అయిదుగురితో కూడిన ధర్మాసనం, అంతిమంగా 9 మందితో కూడిన ధర్మాసనం విసృతంగా చర్చించి ఆగష్టు 17, 2017న తాత్కాలిక తీర్చు నిచ్చింది. అందులో గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీమ్‌ ధర్మాసం ఏకగ్రీవంగా గుర్తించింది. గోప్యత హక్కు అనేది ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్చలో అంతర్గత భాగమని, అలాగే రాజ్యాంగంలోని 3వ భాగంలో భాగమేనని పరమోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కీలకాంశమైన సమాచార భద్రతపై మేలిమి సూచనలు అందించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎన్‌ శ్రీకృష్ణ సారథ్యంలో పలువురు నిపుణులతో కేంద్రం జూలై 2017లో ఒక నిపుణుల సంఘాన్ని కొలువతీర్చింది. ఆ కమిటీ పిడిపికి చట్టం చేయాలని సిఫార్సు చేస్తూ ఒక ముసాయిదాను 2018 జూలై 28న ప్రభుత్వానికి అందజేసింది. ఒకవైపు బి.ఎన్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక, మరోవైపు సుప్రీంకోర్టు తీర్చు వెలుబడిన నేపథ్యంలో “వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు-2019ని ఎలక్ష్టానిక్స్‌- ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిశంబర్‌ 11, 2019న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రాథమికంగా దేశంలోని వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కోసం ఓ నియంత్రణ వ్యవస్థను చట్టం ద్వారా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వ్యక్తిగతం, సున్నితం, కీలకం అంటూ వ్యక్తిగత డేటాను 3 వర్గాలుగా వర్గీకరించి, ప్రతి వర్గానికీ ప్రత్యేకమైన విధివిధానాలు నిర్ణయించింది. భారత పౌరుల డేటాతో వ్యవహారాలు నడిపే దేశ, విదేశీ సంస్థలన్నీ ఈ ప్రతిపాదిత చట్టానికి లోబడాల్సి ఉంటుంది. ఉల్లంఘనలకు పాల్పడితే చెల్లించాల్సిన పెనాల్టీలనూ పేర్కొన్నారు. దీనిపై రెండేళ్ల చర్చోపచర్చల తరువాత ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జె.పి.సి)కి అప్పగించారు.

ఈ బిల్లుపై ఏర్పాటైనా జెపిసి నవంబర్‌ 22న ఆ బిల్లుకు ఎలాంటి మార్పులు సూచించకుండానే ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలను ఔదలదాల్చినట్లుగా జెపిసి సారథి పి.పి.చౌధురి చెబుతున్నారు. కానీ, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరి అనుమతి లేకుండా ప్రభుత్వం వాడుకోవచ్చని జెపిసి సిఫార్స్‌ చేసింది. మధ్యవర్తులుగా వ్యవహరించని అన్ని సోషల్‌ మీడియా వేదికలను (ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర కంపెనీలను) ఇకపై ప్రచురణకర్తలుగా భావించాలి. తమ వేదికపై (ప్లాట్‌ఫామ్‌ పై) బహిరంగపరిచే వ్యక్తుల అభిప్రాయాలకు ఆయా సోషల్‌మీడియా కంపెనీలు బాధ్యత వహించాలి. వారు ఏ సమాచారమైతే ఇస్తారో అందుకు వారు బాధ్యత వహించాలని జెపిసి సిఫార్సు చేసింది. టెక్నాలజీని నిర్వహించే మాతృ సంస్థ భారత్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తప్పఏ సోషల్‌ మీడియా ష్లాట్‌ఫారమ్‌ను కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతించరాదు.

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరహాలోనే సోషల్‌ మీడియాకూ చట్టబద్ధమైన మీడియా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని జెపిసి సిఫార్సు చేసింది. ప్రైవేట్‌ సంస్థలను నియంత్రిస్తూనే కేంద్రానికి, సిబిఐ, ఇడి, రా(ఆర్‌ఎడబ్యూ) లాంటి సంస్థలకు మినహాయింపులిస్తూ విస్పృతాధికారాలు కట్టబెట్టింది. పౌరుల, సంస్థల తాలూకు సమాచారాన్ని సేకరించటం, దాన్ని వినియోగించటంలో ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలకు ఈ చట్టం నుంచి అన్ని మినహాయింపులు ఉంటాయి. రోజువారి సాంకేతికత వినియోగం పెరుగుతున్న కొద్దీ పౌరుల వ్యక్తిగత, ఆర్థిక, సామాజిక సమాచారాన్ని దుర్వినియోగం చేసే ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యక్తుల గోప్యతను ప్రభుత్వ,ప్రైవేట్‌ సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా రూపొందించిన ‘వ్యక్తిగత సమాచార పరిరక్షణ(పిడిపి) బిల్లు-2019 ప్రకటిత లక్ష్యాలకు భిన్నంగా ఉండడం శోఛనీయం. మొత్తంగా ఈ బిల్లులో చట్టం పరిధి నుంచి ప్రభుత్వ సంస్థలకు గుంపగుత్తగా మినహాయింపులు దఖలుపరచే నిబంధనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వ్యక్తిగత గోప్యతపై ప్రభుత్వ పెత్తనానికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ సంఘం జెపిసిలో విబేధాలు తలెత్తాయి. అధికార పార్టీ సభ్యులు ఏకాభిప్రాయానికి తిలోదకాలిచ్చి మెజారిటీ ఉందని ఏకపక్షంగా దీనికి ఆమోదం తెలపడంతో ఆరుగురు సభ్యులు తమ అసమ్మతిని తెలియజేస్తూ నోట్‌లు సమర్పించారు. వ్యక్తిగత గోప్యతపై ప్రభుత్వానికి అధికారం ఉండాలన్న వివాదాస్పద నిబంధనను తొలగించాలని వారు ఆ అసమ్మతి నోట్‌లో స్పష్టం చేశారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. పేరుకే ఇది వ్యక్తిగత సమాచార్‌ పరిరక్షణ బిల్లు అని… లోపల అంతా ప్రభుత్వానికి విచక్షణారహితమైన అధికారాలను కట్టబెట్టే నిబంధనలున్నాయని విమర్శిస్తున్నాయి.

ప్రధానంగా బిల్లులోని 35వ క్లాజ్‌ ప్రకారం ‘దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, విదేశాలతో సంబంధాలు, దేశంలో శాంతిభద్రతల దృష్టా… ప్రభుత్వ సంస్థలు వ్యక్తిగత సమాచారం ‘సేకరించినప్పుడు ఆ సంస్థలకు ఈ బిల్లులోని ఏ నిబంధనలూ వర్తించవు. ఈ క్లాజ్‌ ప్రజల వ్యక్తిగత స్వేచ్చకు గొడ్డలిపెట్టు. బిల్లులోని మరో వివాదాస్పద అంశం క్లాజ్‌-12(ఏ), దీని ప్రకారం… ప్రభుత్వం ఒక చట్టబద్ధమైన పనికోసం ఒక వ్యక్తి సమాచారాన్ని ఆ వ్యక్తి ఆమోదం లేకుండానే సేకరించవచ్చు. దీనిద్వారా ప్రభుత్వం పౌరుల భావ ప్రకటనా స్వేచ్చపై యథేచ్చగా ఆంక్షలు మోపే ప్రమాదం ఉంది. బిల్లును వ్యక్తిగత సమాచార పరిరక్షణ అని చెప్తన్నప్పటికీ… వ్యక్తిగతేతర సమాచారానికి కూడా వర్తించే విధంగా బిల్లులోని అంశాలున్నాయి. ఇది పూర్తిగా వేరే అంశం కాబట్టి… దానిపై విడిగా మరొక చట్టం చేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. బిల్లులోని నిబంధనల అమలుకు సమాచార పరిరక్షణ ఆథారిటీని నియమించాలని బిల్లు చెప్తున్నది. ఈ అథారిటీ చైర్‌పర్సన్‌, సభ్యుల నియామకాన్ని కేంద్రం చేతుల్లో పెట్టింది. అంతేకాదు కేంద్రం ఆదేశాల మేరకు పనిచేయాలని స్పష్టం చేసింది. అంటే, ఈ సంస్ధ స్వతంత్రంగా పని చేయటం వీలుకాదు. ఇది సిబిఐ, ఈడీ లాగా మరో కేంద్ర ప్రభుత్వ సంస్థగా మారిపోయే ప్రమాదం ఉన్నది.

ప్రభుత్వం ఎవరి అనుమతి లేకుండానే డేటాను వాడుకొనే బిల్లులోని క్లాజు 35 సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు అసమ్మతి తెలుపుతున్నాయి. ఈ మినహాయింపు క్లాజుపై కమిటీ సమావేశాల్లో చాలా వివరంగానే చర్చ సాగింది. “ప్రజా భద్రత, సార్వభౌమాధికారం, విదేశాలతో స్నేహ సంబంధాలు, దేశ భద్రత” పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థపైనైనా ఈ క్లాజును ఉపయోగించవచ్చు. అయితే మినహాయింపునకు కారణాల్లో “ప్రజా భద్రత” అనే పదాన్ని తొలగించాలని సభ్యులు వాదించారు. ఇలాంటి మినహాయింపులు ఇవ్వాలంటే జ్యుడీషియల్‌ లేదా పార్లమెంటరీ పర్యవేక్షణ ఉండాలని కూడా వారు సూచించారు. పౌరులకు సంబంధించిన డేటాను యాక్సెస్‌ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించే అవకాశాముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే జెపిసి ప్రతిపక్షాల ప్రతిపాదనను తోసిపుచ్చింది. చరిత్రాత్మక సుప్రీం తీర్పు ప్రాతిపదికన శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్న ప్రమాణాలకు తగ్గట్టు ఈ బిల్లు లేదన్నది స్పష్టం. డేటా దుర్వినియోగాన్ని అరికట్టే “డేటా రక్షణ ప్రాధికార సంస్థా సభ్యుల ఎంపిక విధివిధానాలూ పలుచబడ్డాయనేది మరో అభ్యంతరం. దేశభద్రతతో పాటు కొత్తగా “ప్రజాజీవన భద్రత” మిషతోనూ ప్రభుత్వ సంస్థలు ఈ చట్టం పరిధిలోకి రాకుండా, వ్యక్తిగత డేటాను వాడుకొనే వీలుండడం ఇంకో వివాదాస్పద అంశం. ఇది ఈ చట్టం ఉద్దేశాన్నే నీరుగారుస్తోందన్నది సామాజిక మేధావుల, ప్రతిపక్షాల అసమ్మతి స్వరం.

ప్రభుత్వాలు తల్చుకొంటే, “పెగాసస్‌తో తెలియని నిఘా సాధ్యమైన దేశంలో … ప్రభుత్వసంస్థలకిచ్చే ఈ అతి వెసులుబాటు ‘సైతం దుర్వినియోగం కాదన్న నమ్మకం లేదు. ప్రతిపక్షాలూ, పౌర సమాజం భావన, భయమూ అదే! ప్రైవేట్‌ సంస్థల నుంచి మన వ్యక్తిగత దేటా లీకు కావడం, వాటిని మూడో వ్యక్తికి అమ్మేయడం లాంటివి దేశంలో అనేకం చూశాం. ఆధార్‌ మొదలు బ్యాంకు ఖాతాల వివరాలు దాకా అనేకం అంగట్లో అమ్మకం కావడమూ చూశాం. ఈ బిల్లు దాన్ని ఏ మేరకు సమర్థంగా అరికడుతుందన్నది ఇప్పుడు కీలకం. అలాగే, వ్యక్తిగత డేటాను ఎక్కడ, ఎలా సురక్షితంగా భద్రపరుస్తారు. దానికి ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారన్నదీ కూలంకషంగా చూడాల్సి ఉంది. ఇది వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించే బిల్లు. మరి, గూగుల్‌ మ్యాప్స్‌ లాంటి వ్యక్తిగతేతర డేటా భద్రత మాటేమిటి అంటున్న సైబర్‌ చట్టాల నిపుణుల ప్రశ్నలూ కూడ పట్టించుకోవాల్సి ఉంది.

సమాచార యుగంలో వ్యక్తిగత గోప్యతకు ప్రభుత్వ, ప్రభుత్వేతర పక్షాల నుంచి ప్రమాదాలు ఎదురవుతున్నాయని జస్టిస్‌ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని నిలువరించేలా సమర్థ శాసనాన్ని రూపొందించే క్రతువులో భాగంగా పౌరుల వ్యక్తిగత ప్రయోజనాలు, న్యాయమైన ప్రభుత్వ బాధ్యతల మధ్య సంతులనాన్ని సాధించడంలో జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుందని ఉద్దాటించింది. అందువల్ల రాజ్యాంగ విలువల పరిధిలోని జీవించే హక్కులో అంతర్భాగమైన అంతరంగిక స్వేచ్చకు అంతరాయం కలుగకుంజడా బిల్లును సహేతుక విధివిధినాలతో రూపొందించాలని సుప్రీంకోర్టు 2017 లోనే స్పష్టం చేసింది. ఒక వ్యక్తికి సంబంధించిన ఏ అంశాన్నయినా వారికి తెలియకుండా సేకరించడం, వారి సంభాషణలను చాటుగా వినడం గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.

అయితే, చరిత్రాత్మకమైన సుప్రీమ్‌ తీర్చు ప్రమాణాలకు తాజా బిల్లు గండికొండుతోందని జెపిసిలోని ప్రతిపక్ష సభ్యులు గళమెత్తుతున్నారు. కీలకమైన సమాచార పరిరక్షణ ప్రాధికార సంస్థ (డిపిఎ)పై ప్రభుత్వ ప్రభావాన్ని అధికం చేసేలా విధివిధానాలకు రూపొందించినట్లు వారు ఆక్రేపిస్తున్నారు. దేశభద్రత వంటి అంశాల్లో వ్యక్తుల అనుమతులతో నిమిత్తం లేకుండానే సమాచారాన్ని సేకరించే అధికారాన్ని పోలీసు యంత్రాంగంతో పాటు ఇతర దర్యాస్త సంస్థలకు ప్రతిపాదిత బిల్లు కట్టబెడుతోంది. ఇప్పటికీ ఉపా చట్టం, సిబిఐ, ఇడి, ఎన్‌ఐఎ వంటివి ప్రభుత్వ జేబు సంస్థలుగా చట్టాలకు అతీతంగా అసమ్మతి గళాలను అక్రమంగా అణచివేస్తున్న ఉదంతాలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. కనుక అస్పష్టమైన నిబంధనలు పౌర స్వేచ్చకు విఘాతకరమన్నది నిర్వివాదాంశం! వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అతీతంగా ప్రైవేటు సంస్థలు వారి వివరాలు ‘సేకరించకుండా కట్టడిచేసే ప్రతిపాదనలు బిల్లులో ఉండాలి. వ్యక్తిగత స్వేచ్చ, గోప్యత లేని చోట దేశభద్రత ప్రమాదంలో పడడంతో పాటు నిరంకుశ పాలనకు దారి తీస్తుంది. కాబట్టి ఈ బిల్లు చట్టం కాకుండా బాధ్యత అందరి పైన ఉంది.

Leave a Reply