నా ప్రశ్నల బాణం
నీ మనోభావాన్ని గాయపరిస్తే
నీ జవాబు ఈటెను
నా మెదట్లో దించిపారేయ్
ఆలోచన అరుగు మీద
ఇద్దరం పొట్లాడుకుందాం
చర్చల బీళ్ళను
సంఘర్షణల నాగళ్ళతో దున్నిపారేద్దాం
కొత్తగా మొలకెత్తిన దారులగుండా
ఒకే పాదంతో నడుద్దాం రండి

మెట్ల కుల కట్టడాల్లో
పై మెట్టు మినహా
కింది మెట్లన్నీ మనవే
మనువు
నిన్నూ నన్నూ
వైరి గుర్రాలను చేసి
తన రథానికి కట్టుకొని
రథయాత్ర చేస్తున్నాడు

మిత్రమా
రాయి రాయి రాజుకొని
రగిలి వెలిగినప్పటినుండే కదా 
చరిత్ర ప్రారంభమైంది
రండి
మన మెదళ్ళను
జ్ఞానం ఆకురాయి మీద సానపెడుదాం
నువ్వు, చీకటి గర్భగుడిలో
ఆలోచనలని
శిలావిగ్రహాన్ని చేసి కూర్చున్నావని ప్రశ్నిస్తున్నాను
లేదా, నా వెలుతురు కన్నులో 
చీకటి నలుసేధైనా ఉంటే 
వేలెత్తి చూపమని అడుగుతున్నాను

జ్ఞానం చర్చల రాస్తా మీద నడుస్తుంది
అజ్ఞానం మూర్ఖత్వం మూకదాడై విస్తరిస్తుంది

One thought on “ఒకే పాదంతో నడుద్దాం రండి

 1. నీ తో నడవలని వుంది
  నీ పాదాల సవ్వడినీ వింటూనే ఉన్నాను
  నీ నడక పూల వనంలోకి వెళ్ళే ముల్లదారని తెలుష్టునేవుంది
  కానీ నేను నా కుట్టుంబం అనే
  బంధంలో కొట్టుకుంటున్నాను
  నా స్వర్దనికి నెనే సిగ్గుపడుతున్నా

Leave a Reply