అసలింకా నడవాల్సిన దారి తెల్సిందా ? ఈలోగానే ‘నడచిన దారంటే’ దేన్ని గురించి రాయమని ? ఎంతో కలసివస్తే (?) తప్ప, వయసెప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. స్థిర చరాస్థులు; వాటికోసం చేసే అప్పులూ, కట్టే వడ్డీలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు; పండుగలూ, పబ్బాలూ, ఫంక్షన్లూ, దర్బార్లూ, జబ్బులూ, మందులూ, ఒకటేమిటి ? అన్నీ పెరుగుతాయి. వీటి మధ్య గడుస్తున్న కాలమే నన్ను నడిపిస్తున్న దారా ? అలా అని, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళనట్లేదు. దారంటే; అసలేం తెలియకుండా వేసిన తొలి అడుగు. తెలిశాక ఆగలేని బ్రతుకు. ఏం ? నువ్వే ఎందుకు రాస్తావు కవిత్వం ? నిన్నే ఎందుకు పట్టి లాగేస్తుందది ? నువ్వూ ఒక పది మందిలోంచి వచ్చినవాడివేగా ? ఏం ? అది మర్రిమానుకు మల్లెతీగలా నిన్నే ఎందుకు చుట్టుకుంది ? చిన్నప్పట్నుంచీ నువ్వున్నట్టే, ఏ మధ్యతరగతి ఇరుకు డాబా ఇంటి మెట్ల మీదనే ఎందుకు కవిత్వమంటే మనసును విశాలం చేసుకున్నావు ? ఏం, సత్యన్నారాయణపురం అగ్రహారమో, పెజ్జోనిపేట రైల్వే క్వార్టర్సులోనో ఉన్న మిత్రులకెందుకు నీకున్న ఈ పిచ్చి లేదు ? కళాసాహిత్యాలు సమానమైనవే. కానీ అవి గిల్లే గిచ్చే నువ్వూ నేనూ మాత్రం ప్రత్యేకమైనవాళ్ళం. అలా అని మనలోని ప్రత్యేకత మనది కాదు, మనల్ని నడిపిస్తున్న దారిది. ఏం నడిపిస్తే, తొలి అడుగు వేసిన గుర్తుంది చెప్పు ? 

నాకిప్పుడు ‘ఈ మట్టినాకు పట్టెడన్నం పెట్టి పాలుతాపిందన్న’ చెరబండరాజు ఇష్టమంటాననుకో, ‘పొలాలలో పరిగె గింజ ఏరుకునే వేళలందు అమ్మా, నన్ను కన్నందుకు విప్లవాభినందనలన్న’ శివసాగరుడంటే ప్రాణప్రదమంటాననుకో; భద్ర జీవి చూపెట్టే విప్లవ ప్రేమని ఒప్పుకోరు. ఒప్పుకున్నా, మధ్య మధ్యలో తిలక్ కవితా పంక్తుల్ని ఉటంకించిన ప్రేమ లేఖల్ని తలుచుకున్నామనుకో, లేదా ‘నా కఠిన పాద శిలల క్రింద బడి నలగి పోయే నెన్నెన్నియో మల్లెపూలు మున్నని’ కృష్ణ శాస్త్రిని కలవరించాననుకో, అడుగడుగో విప్లవకారుడిలో భగ్న ప్రేమికుడంటారు. ఎవ్వరేమన్నా ఈ ప్రేమలు పూలై పూచిన దారిలోంచి నువ్వు తొలి అడుగు వేస్తావు. అప్పుడు నీలో వాటి నేపధ్యాలు తెలియవు. వాదాల భేదాలూ తెలియవు. తెలుగు వ్యాకరణానికి ట్యూషన్ పెట్టిన అమ్మకే ఎలా తెలుసా ? అనిపిస్తుంది. నేనక్కడ కోటేశ్వర శర్మ గారు ‘బుద్ద దేవుడి భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి’ అని కరుణశ్రీ గారి పద్యం చదివినప్పుడు దార్లో పడ్డానని. లేదా స్కూల్లో చూడామణి గారు నన్నె చోడుని కుమార సంభవంలోని తపస్సు చేస్తున్న పార్వతి సౌందర్యాన్ని మహాద్భుతంగా వర్ణించిందంతా ఇంట్లో వల్లిస్తోంటే నాన్నకెందుకు కోపమొచ్చింది ? దారితప్పినా పరీక్ష మాత్రపాసయ్యాను కదా ? ఇవేవీ ఇప్పుడు చెప్పినట్టు జరగవు. జరిగిందాంట్లోంచి పడుతూ లేస్తూన్నప్పటి కొత్త నడకల్ని జ్ఞాపకం చేసుకోవడమే. అంతమాత్రాన నడకొచ్చేసిందనా ? కాదు. నవ్వొచ్చినా మోచిప్పలు పగిలిన విషయమూ చెప్పుకోవలసిందే. 

నీకు దళితులెవరు ? వాళ్ళనెందుకు చంపి బస్తాల్లో కుక్కి చుండూరు కాలవలో పడేశారో అప్పుడు తెలియదు. అంత ఛాన్సుండదు. వయసో, ఇంట్లో వాతావరణమో ఇంకోటో ఆ అవగాహనాలేమికి కారణమవుతుంది. మరి మనకి ఆ విషయం పై ఆసక్తి కలిగిన విషయమెలా తెలుస్తుంది. చంపిన వాళ్ళతో స్నేహం చేసినవాడు, వాళ్ళతో కలసి జైలుకెళ్ళి మళ్ళీ బయటకొచ్చి, ఈలోగా సర్వ నాశనమయ్యిన తన కుటుంబం బాధనే  ప్రపంచం బాధగా చెప్పి నీ దూరబ్బంధువొకడు ముసలి కన్నీళ్ళు కారుస్తాడు. అంతే కాదు. మనింట్లోనే ఒక మతాంతరమో, కులాంతరమో ఉన్నపళంగా జరిగిపోద్ది. నువ్ దాన్ని జరగనివ్వకూడదని శత ప్రయత్నం చేస్తావు. ఎందుకు ? అమ్మాయి తెల్లగా లేదనో, ఆ అబ్బాయి మన అమ్మాయంత అందంగా లేడనో; లేదా వాళ్ళని స్కూల్లో వేసినప్పుడిచ్చిన సర్టిఫికేటేదో మనకివ్వలేదన్న విషయం గుర్తొస్తుంది. అదే పెద్ద తేడా అయి కూర్చుని, పేర్లు మార్చేసి, పద్దతులు మార్చేసి, బొట్లూ, మెట్టెలూ లాంటి విషయాలు ఎక్కువైపోతాయి. ఇవన్నీ జరిగేప్పటికి, నువ్ మద్దూరినో, కలేకూరినో, తేరేష్ బాబునో, ఎవ్వర్నీ చదివుండవ్. సునీల్ కుమార్ గారు రాసిన ‘ధూ’ కధని కూడా ఆ తర్వాతే ఐదువందల కాపీలు మిత్రులందరికీ పంచి ఉంటాను. అయితే కొన్ని రోజులకి ‘లాభ నష్టాల వైకుంఠపాళీలో నువ్వూ మనిషన్న సత్యం నేనెప్పుడో మర్చిపోయాను. నేను మదమెక్కిన ఆర్య సంతతి వాణ్ణి’ (మాకు మేమే, మీకు మీరే) అని వ్యంగ్యంగా రాయగలుగుతాను. నల్లజండాలు, అట్రాసిటీ అన్న కవితలు కూడా రాశాను. మనలో ఒక స్పృహ కలిగే ముందు అనేకానేక సంఘర్షణలకు గురవక తప్పదు. బాధితుడెవ్వడో నీకు సహజంగా తెలియాలి. అతిశయంగా కాదు. ఆ క్రమంలోనే నీకూ నీ సున్నితత్వానికీ ఒక ఆకారం ఏర్పడుతుంది. 

పద్యం రాస్తే శ్రోత్రియులే రాస్తారని అనుకుంటారంతా, కానీ ‘నిఖిల లోక మెట్లు నిర్ణయించిన తరుగు లేదు నాకు, విశ్వనరుడ నేను’ అని జాషువా ఎంత గొప్పగా రాసేడు చూడు అని తాటి శ్రీకృష్ణ మేష్టారు లాంటి వారు చెప్పినప్పుడు వెన్నులో పాకిన సర్ప స్పర్శ నాకింకా గుర్తుంది. ఆయన వల్లే వివి ని తొలిసారి దగ్గరగా చూశాను. చూసి, క్లాస్రూం నుండి బయటకెళ్ళే ఆ సిద్దార్థా కాలేజీ (1997) చెట్ల కింది దారి ఉత్త సన్నటి మట్టి దారి మీదే నడవడం నేర్చుకున్నాను. నాకింకా గుర్తుంది. కాలేజీ మాగజైన్ కోసం ‘ప్రకృతి కన్య నా ప్రేయసి’ అని రాసి పట్టుకెళ్తే అక్కడ నన్ను చూసి ‘మో’ నవ్వారు. ఆ తరువాత చాన్నాళ్ళకి వివి కోసం ‘ తిరగబడ్డం నేర్పించిన ఇంట్లోకి తడిసిన సుడిలోంచి ఆరుతూ వచ్చేస్తాడు’ (నేను పుట్టిన ఇల్లు) అని రాసుకున్నాను.

ఈ స్వగతమంతా ఒక చిన్న భాగమే. వ్యక్తిగతాంశాల్లోంచి మనం పడ్డ పెనుగులాటని వేరు చేసి చూడ్డం కష్టం. నవ్వొస్తుంది. రెండింటి మధ్య నలిగిపోవడం, కడకు నీకు మనశ్శాంతి నిచ్చే ఒంటరితనంలోనో, కుదిర్తే నది ఒడ్డునో కూర్చోని సేదదీరడం; ఉత్త రివాజు. లేకపోతే నీకు చిన్నప్పటి నుంచే కులమతాల మీద, సామాజిక వివక్షల మీద మొదటిరోజు నుండే పేద్ద అవగాహన కుదిరేయదు. ఆ మానసిక పరిపక్వత కలగడమే నువ్వు నడవడం కదా ? ఇంతకీ ఏం నడిచాం ? నిజం చెప్పనా ? యాంటీ స్టేట్ రాస్తే ఏమన్నా చేస్తార్రా ? తప్పు కదా అని భయపెట్టే నాన్నలు, ఎప్పుడూ ఏడుపులూ పెడబొబ్బలు తప్ప ఇంకేవీ రాయవా అనే అమ్మలూ మనమేం రాయాలో నిర్దేశించరు. ‘ప్రపంచీకరణ పేదరికం నడుం చుట్టుకుని ఇంకా సహజీవనం చేస్తూనే ఉంది’ (విలీనంలోంచి విలీనంలోకి) అని రాస్తావు, ‘పిల్లి గడ్డాలు కట్టుకున్న లుంగీ గళ్ళ మీద చదరంగం ఆడు, లేదా వైకుంఠ పాళీ’ (పౌరసత్వం పురిటి నొప్పులు) అని అంటావు. ఏది ఏమయినా నువు హర్టవుతావు చూడు, ఆ క్షణంలోంచి బద్దలవుతావు. ఆ విస్పోటనలోంచి నువ్వొక రూపాన్ని తీసుకుంటావు. అలా రూపరడం నీ దారి. కాదు కాదు నిన్నెవరో వేలు పట్టుకుని నడిపిస్తున్న దారి. కేవలం చదివిన పుస్తకాలే నడిపిస్తాయా ? చేంతాడంత లిస్టుంటుంది. కొంతమంది మనుషులు నిన్ను తెగ ప్రభావితం చేస్తారా ? అదింకో పెద్ద సముద్రమంత ఉంది. కాదనలేను. వీటన్నింటికీ అతీతంగా నీ స్వభావంలోంచే నువు కర్పూరంలా ముట్టుకుంటావు. ఆ స్వభావ మూలకమేమిటి ? 

పెద్దపల్లిలో (2004) ఉద్యోగంలో చేరినప్పుడు చూసిన తెలంగాణ పల్లెలు, పార్వతీపురంలో పని చేసినప్పుడు తిరిగిన గుమ్మలక్ష్మీపురం, కట్టుబడి మొదలయ్యిన తోటపల్లి రిజర్వాయరు, బద్వేలు దగ్గర బ్రహ్మం గారి మఠం, చండీగఢ్ విశాలమైన పార్కులూ, అమ్రిత్సర్ లోని జలియన్వాలాబాఘ్ స్మారక స్తూపం, ఆ బావి, సిరిసిల్ల చుట్టు పక్కల గ్రామాలూ, అక్కడ నిలబడ్డ స్తూపాలూ; ఒకటని చెప్పడం సాధ్యం కాదు. మనల్నవన్నీ తయారుచేస్తాయి. ఫార్మ్ (Form) చేస్తాయి. ఆ ప్రదేశాల్లోంచి పలికే మానవోద్వేగాలు నిన్ను పట్టి ఊపేస్తాయి. ఏ ? నిన్నే ఎందుకు ఊపేస్తాయి ? నీతో బాటు చుట్టూ చాలా మంది ఉన్నారుగా ? అంటే నవ్వొస్తుంది. మనకిలా అనిపిస్తుందనేగా, మనకనిపించడాన్ని చూసి మనల్ని నలుగురూ ప్రేమించేది. ప్రేమలోని ఆ తరంగ దైర్ఘ్యమే (Frequency) కదా, దారంతా అలసిపోని బలాన్నిస్తుంది. ఆ అపేక్ష కొంతమంది చూపులో, స్పర్శలో, నవ్వులో అన్నింటిలో నిన్నంటేపెట్టుకుని ఉంటుంది. వయసుతో సంబంధం లేదబ్బా. అది జరామరణాల్లేని పీకులాట. ‘వెళ్ళిపోయ్యావా మల్లోజుల’ అనే పాట ఎందుకో ఊహ తెలిసినప్పటి నుంచీ చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. 

క్రేజీగా ఫీలవ్వడమనేది ఎల్ల కాలం ఉండదు. కాలేజీ రోజుల్లోంచే కవి గారూ అని పిలిపించుకోవడం భలే గమ్మత్తుగా ఉండేది. మొదటి సంకలనం ‘అద్వంద్వం’ (2018) అచ్చేసినపుడు కూడా కొంత అది పని చేసుండింది. కానీ రాన్రానూ ఒక వాక్యం రాయాలంటే నువు భయపడతావు. తప్పో ఒప్పో. ఇది నిజం. అది ముడుచుకుపోవడమో కాదు, విచ్చుకోలేకపోవడమూ కాదు. కారా మాష్టారు చనిపోయాక అతని కధల్లో ‘కుల స్పృహ’ ఉందా ? శ్రీశ్రీ తెలంగాణ సమస్య గురించి రాయలేదే ? వీరేశ లింగాలూ, గురజాడలూ బ్రాహ్మణేతర వర్గాల గురించి పట్టించుకోలేదే ? తిలక్ శ్రీశ్రీ కన్నా గొప్పవాడెందుక్కాదు ? విప్లవశ్రేణుల్లోనూ వివక్షలుంటాయి తెలుసా? — ఇలాంటివేవో కొన్ని కొన్ని నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తాయి. నువు మానవసమాజాన్ని నడిపిస్తున్నదేంటి ? అందులోని ‘బ్యూటీ’ నెలా నిర్వచించుకోవాలి ? అన్న పరిశోధనలు చేస్తుంటావు ? ఇదంతా ఫిలాసఫీ అనిపించుకోదని తెలుసు. నేనిప్పటికీ జగద్గురు శంకరాచార్యుడు, గౌతమ బుద్దుడు, కారల్ మార్క్సు, అంబేద్కరుడూ ఇంకా ఎవరెవరో గానీ, వీళ్ళు చెప్పిందంతా మంచేనా అని శల్య శోధన చేయలేదు. గబుక్కున వాళ్ళని ‘రిఫర్’ చేసుకోవల్సిన అగత్యం ఏర్పడినప్పుడు మాత్రం నీ వివేచన తప్పించుకోలేనిది. కాకపోతే ఎన్ని ఎక్కువసార్లు వాళ్ళ జీవిత పుటల్ని తిరగేస్తే (Turn) అంత జ్ఞాన కుసుమ వికాసమన్నమట (Learning). వాళ్ళంతా చాలా ‘రాపిడి’ కి గురయ్యారు. మరి మనమో ? మనకుమనం ఒక నిలకడకి రావడానికి చాలా కష్టపడతాం. వస్తు శిల్పాల స్పృహ అలా పడ్డ కష్టంలోంచి వొచ్చిందే. మంచో చెడో ? ఆ ఒరిపిడే ఎప్పటికప్పుడు దారిలో దీపంలా వెలుగుతోంది.

జీవన దుక్ఖం ఎల్లప్పుడూ వెంటాడుతుంది. నిస్సహాయత, దౌర్భల్యం, అవసరాలూ, ఆకలీ దాహం, నిద్రా, మెలకువ — ఇవన్నీ గమనానికి చోదకాలు. మొత్తం రాసిన కవితలన్నీ వంద లోపే ఉంటాయి.ఇప్పటికీ అంత త్వరగా కవిత రాయలేను. వస్తువు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అప్పుడే కలం కదులుతుంది. వస్తువే శిల్పాన్ని నిర్దేశిస్తుందని బాగా నమ్ముతాను. వస్తువును రొమాంటిసైజ్ చేయవలసిన అవసరం లేదు. పోయం అంటే మెత్తగానే ఉండాలని లేదు. ఇదీ ఈ మధ్య కలిగిన అవగాహన. వచ్చే యేడన్నా రెండవ కవిత్వ సంపుటి వేయాలి. వ్యాసాలు వందకు చేరువవుతున్నాయి. ఈలోగా వ్యాసాల పుస్తకం తేవాలి. ఇలాంటి ఆశలెన్నైనా కూడా అవన్నీ సహజమైనవి. నాకు ప్రక్రియతో పని లేదనిపిస్తుంది. కవి కానివాడు ఏ ప్రక్రియా చేపట్టలేడు. లోపలెంతో కొంత కవిత్వ లక్షణం లేకుండా ఏ ఇతర ప్రక్రియైనా రూపు దాల్చదు. అది ఎమోషనల్ అయినా, కాకపోయి తార్కికమైనా భేదం ఉండదు.

కానీ ఉద్యోగం చేసుకుంటూ రాసుకోవడం చాలా కష్టమనిపిస్తుంది. మనమొక్కళ్ళమే ఈ పని చేస్తున్నామా ? కాదు కదా ? మరింకేమిటంట ? ఇష్టమైనవాళ్ళకోసం హృదయమెంత తహ తహ లాడిపోతుంది. ఇదీ అంతే కదా ? అనిపిస్తుంది. అయినా ఇప్పటిదాకా ఎంత కాలం వృధా అయిపోయింది ? ఇంకా చదవాల్సిందెంత మిగిలి ఉంది ? ఎన్ని ఊసులు రాసుకోవాలి ? ఈలోగా రాసిందెంత చెరిపేసుకోవాలి ? టీఎమ్మెస్నో, మద్దుకూరి చంద్రశేఖరాన్నో, జీవీ సుబ్రమణ్యాన్నో, ఆర్ ఎస్ సుదర్శనం, రారా లాంటి వార్ని జ్ఞాపకం చేసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దృక్పధాల సంగతి పక్కన పెడతాను. వాళ్ళొక చూపునివ్వడం మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేని అనుభూతి. పేర్లు చెబితే విడ్డూరమనుకుంటారు గానీ, పాపినేని శివశంకర్, కొప్పర్తి, రెంటాల శ్రీవెంకటేశ్వర్రావు, కాత్యాయని విద్మహే, రమా సుందరి, పాణి, అద్దేపల్లి ప్రభు, వెంకట కృష్ణ లాంటివాళ్ళు చూపుని కాపాడుతున్న కనురెప్పలు. అరుణతార, మాతృక, ప్రస్థానం, చెకుముకి పత్రికలు నాకు లోవెలుగు. హెచ్చార్కే రస్తా, అఫ్సర్ సారంగా ఆన్లైన్ పత్రికలు నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. అలాగే యాకూబ్ గారి కవిసంగమం గమ్యాన్నెప్పటికప్పుడు సరిచేసుకునే వీలునిచ్చిన ఆకురాయి. దూరాల్ని కలిపేసిన దారం. ఇవేవీ లేకపోతే నేన్నిజంగా ఒంటరివాణ్ణి. రెండు కాళ్ళూ తెగినవాణ్ణి. 

రాయడానికేం గానీ స్కూలు రోజుల్నుంచే రాయడం మొదలెట్టాను. కాలేజీ కాలంలోనైతే అదొక పిచ్చి వ్యామోహం. అయితే తొలినాటి నుండీ మానవ జీవితమే కాన్వాస్ కావడం ఆనందాన్నిస్తుంది. ఫక్తు ఉద్యోగ జీవితానికి లోబడి పోయినప్పుడు శ్రీశ్రీ విశ్వం నాకొక మలుపునిచ్చాడు. అనంతపురం ఉమ్మడిసెట్టి రాధేయ గారు కూడా నా కాళ్ళకి చక్రాలనిచ్చారు. వీళ్ళలాంటివాళ్ళు కుర్రాళ్ళకి చెప్పలేనంత బలం. అసలు కుర్రాళ్ళతో పనేమిటి ? వాళ్ళు రెండింటి మధ్య వారధి కడతారు. రెండు ప్రపంచాల మధ్య; రెండు విరుద్ధాల మధ్య; అగాధాల మధ్య. ఉన్నదున్నట్టు మాట్లాడతారు. దాపరికాలు లేకుండా మొహమాటాలు పోకుండా ఉంటారు. ముఠాలు కట్టేవాళ్ళని, కవిత్వాన్ని స్వప్రయోజనానికి వాడుకుంటున్న వాళ్ళనిష్టపడరు. బాకాలూదేందుకు సిద్దపడరు. సొంత గొంతుతో అరుస్తారు. ఏ యుగ వ్యక్తిత్వం దానికుంటుంది. అనిల్ ఉంటాడు, పాయల మురళీ, సుంకర గోపాల్ ఇంకా ఒకరిద్దరు నక్షత్ర కాంతితో మెరిసే స్త్రీ మూర్తులుంటారు; కొత్త కొత్తగా వాక్యం రాసే స్నేహితులుండటం జీవితంలో ఎప్పుడూ జరిగే మేలు. వస్తువులు, శిల్పాలు, నిజాయితీ, నిబద్దత వగైరా సమస్త వయ్యారాలన్నీ మిత్రుల దగ్గర దాచాలన్నా దాగవు. వాళ్ళకి మనం వేసే అడుగులు తెలిసిపోతాయి. సభల్లో కలుస్తాం కదా ? అదాటున ఏదో ఒకటి మాట్లాడతాం కదా ? పాటలో, పద్యాలో పాడతాం, వింటాం కూడా కదా ? మనమేమిటో ఇట్టే తెలిసిపోతుంది. అందుకే మనం వేసే అడుగుల్లో మిత్రులుంటారు. వాళ్ళ వలనే మంచు దుప్పట్లలోంచైనా దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదన్నా రాసిందాన్ని మొహమాటానికి బాగుందనే వాళ్ళు నచ్చరు. ప్రీజుడీస్ తో మాట్లడ్డం కూడా ద్రోహమే అనిపిస్తుంది. సర్వ అసమానతల మీద కత్తి దూసే సాహిత్యంలో కూడా అసమానతలుండకూడదు. 

నాకిప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా తెలుస్తున్నాయి. ఏం రాయాలో, ఎలా రాయాలో. రాసిందానికెలా కట్టుబడి ఉండాలో. కట్టుబడిందాని కోసం ఎంత జీవితం జీవించాలో ? చుట్టూ ఉన్న సామాజిక ఆర్ధిక రాజకీయ అరాచకాలు, వాటి మీద అన్నివైపులనుండీ వెల్లువెత్తే నిరసన, అయిష్టం, కోపం అన్నీ మన దారికి కారణమవుతాయి. షాహీన్ బాగ్, జామియా యూనివర్సిటీ గోడ, కాశ్మీర్ లో క్షతగాత్రులు, ప్రాణ త్యాగాలకు వెరవని మావోయిస్టు ఉద్యమం, డిల్లీ బోర్డర్ లో రైతులు, పాలస్తీనా మీద ఇజ్రాయిల్ దాడులు — ఇలా మన ఆలోచనలపై ఎన్ని పక్షులొచ్చి వాలతాయి. వాటి కళ్ళలోకి మనల్ని తొంగి చూడమంటుంటాయి ? ఆ కన్నుల్లోని మూగతనమో, రెక్కల్లో కూడదీసుకునే బలమో ; ఇవే. వీటి మధ్యనుంచే పాదం కదిపేందుకు కాళ్ళను, కాళ్ళలోని బలాన్నీ కూడదీసుకుంటాను. అలా రాజకీయ సిద్దాంత వెలుగులోంచి సృజనాత్మకంగా కదిలినప్పుడే నడుస్తున్నామని చెప్పుకోవాలి. లేకపోతే కాదు. ఆ దిశగా నేనొక్క అడుగు మాత్రమే వేసినట్టు భావిస్తున్నాను. అదిగో అదిగదిగో మొయిల్దారిన బయల్దేరెను; జన సామాన్యుని మహా రధ చక్రాల్. రధ చక్రాల్. రధ చక్రాల్.

2 thoughts on “ఒక్కడుగు

  1. “రాజకీయ సిద్దాంత వెలుగులోంచి సృజనాత్మకంగా కదిలినప్పుడే నడుస్తున్నామని చెప్పుకోవాలి. లేకపోతే కాదు.”
    యు ఆర్ వెరీ స్పెషల్…. నీ వాక్యం, రాసే షైలీ వీతిని ఇష్టపడితే. ఇలా రాసే మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ ఓపెన్ గా ఉండే ఆ యాట్టిట్యూడ్ ఇంకా నచ్చుతుంది.

Leave a Reply