పట్టుపరుపులు లేవు
జారి పడేంత నునుపైన కట్టడాలూ లేవు

అప్పుడంతా
నడక నేర్పిన పూల దారుల పెరళ్ళవి
ఆకాశాన్ని పొదివిపట్టిన ఆనందమది
నిలబడిన నేల మట్టిని శ్వాసించిన ఒకానొక విజయమది
అప్పట్లో మనుషులుండే వారని చెప్పుకునే అరుదైన క్షణాలూ అవే!

ఇప్పుడు
ఏవేవో లెక్కలు వేసుకుని రెండుగా చీలిపోయాం
ఇద్దరి మధ్యా కొలవలేనంత దూరం
వేలు పెట్టి చూపిస్తూ!
కూడికలు ముందు స్థానంలో ఉన్నాయనుకుంటాం కానీ
ఆకాశాన్ని భూమిని మింగేసిన లెక్కకు తేలని
తీసివేతల జాబితా అదంతా!
మెదడు అట్టడుగు పొరల్లో
పూడుకు పోయిన అవశేషాల నిండు గర్భమది!

ఈ మాట వినగానే గుండె పాతాళంలోకి జారిపోయిందా!?
నీ చోటు ఇదేనని నొక్కి వక్కాణిస్తోందా!?
ఎవరు ఏమైనా అనుకోనీ
ఒక మాట మాత్రం చెప్పుకోవాలి
ప్రపంచమిప్పుడు విలువల్ని వివేకాన్ని
ప్లాస్టిక్ జార్ లో కుదించిన అనాగరిక కుగ్రామం!

మడిసి గోస ఎవరికీ పట్టనప్పుడు
ప్రశ్నించడమే ప్రశ్నార్ధకమైనప్పుడు
స్వేచ్ఛకు అర్ధమేముందిక!
వేళ్ళతో నొక్కితే కాళ్ళ ముందు మఠం వేసుకునే
స్విగ్గీ జొమాటో సంస్కృతి మనది
ఒంటికాలు అభివృద్ధి మనది
నుదుళ్ల మీద ఏవో గుర్తింపు ముద్రలు

ఇదంతా గొప్ప పరిణామం అనుకున్నాం కానీ
వేలుకి అంటిన సిరా చుక్కని కూడా
రక్తంలా పిండుకు తాగుతున్నది ఎవరు?
ప్రలోభాలు జీవితాన్ని నిలబెట్టవని తెలిసీ
అవినీతి పీఠాల్ని మోస్తున్న బలహీనులం!

ఎగిరే సత్తా తనలో ఉన్నప్పుడు
రెక్కలు తుప్పుపట్టేదాకా ఉన్న చోటునే ఉండాలని
ఏ పక్షీ కోరుకోదు
ఆకాశం హద్దుగా బతుకుతుందే కానీ
అంతటా తానై సాటి జీవజాతుల్ని శాసించాలనీ అనుకోదు!

ఈ రహస్యాన్నైనా కలిసి ఛేదిద్దాం మిత్రమా
చెయ్యి కలుపుతావా!

Leave a Reply