దేశములో మానవ హక్కుల పరిస్థితి దారుణంగా తయారైందని, తీవ్రవాద నిరోధక చట్టాల పేరుతో పౌర సమాజంపై ఆంక్షలు విధిస్తున్నారని, ఐరాస మానవ హక్కుల కమీషన్‌ ఆధ్వర్యంలో జెనీవాలో నవంబర్‌ 10న జరిగిన వార్షిక సమావేశంలో భారత్‌ను పలుదేశాలు నిలదీయడం జరిగింది. సభ్య దేశాలైన 193 దేశాలలో పౌర, మానవ హక్కుల పరిస్థితిపై ఐరాస మానవ హక్కుల మండలి ఐదు సంవత్సరాల కొకసారి సమీక్ష జరుపుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలకు పిలుపు నిస్తుంది. మానవ హక్కుల మండలిలో 43 దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలలోని మానవ హక్కుల పరిస్థితి నివేదికలపై సమీక్ష చేస్తారు. సభ్య దేశాల నుంచి మానవ హక్కుల సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జివోస్‌), పరిశోధన సంస్థలు, ప్రజాస్వామిక వాదులు హక్కుల పరిస్థితిపై పొందుపరిచిన నివేదికపై సమీక్షలు జరిపాయి. ఈ ఏడాది నవంబర్‌ 10 మూడు గంటల పాటు భారత్‌లోని వివిధ హక్కుల హననంపై సమీక్ష జరిగింది.

సమావేశం జరుగడానికి ముందుగానే వివిధ దేశాలు (స్పెయిన్‌, పనామా, కెనడా, జర్మనీ, కజకిస్తాన్‌, సాల్వేనియా) భారత్‌లో మానవ హక్కులు అమలు జరుగుతున్న తీరు- వాటి స్వభావాల గురించి రాతపూర్వకంగా ప్రశ్నలు పంపించాయి. వాటికి భారత్‌ రాతపూర్వకంగానే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ రిపోర్టుపై సమీక్ష జరుగుతుంది. సమీక్ష సమయంలో భారత్‌ ఇచ్చిన సమాధానాలతో తృప్తిపడని వివిధ దేశాలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి. ముందస్తుగా భారత్‌కు ప్రశ్నలు పంపిన మిత్రదేశం అమెరికా కుల, మత, లింగ సమానత్వం పట్ల వివక్ష చూపడం, జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ), ఉపా చట్టం, ప్రజా భద్రతా చట్టాలను దుర్వినియోగం చేయడం, ఐక్యరాజ్యసమితి తీర్మాణాలను అమలు జరుపుతామని భారత్‌ చేసిన వాగ్దానాల అమలును విస్మరించడం పట్ల అమెరికా భారత్‌ను ప్రశ్నించింది. అలాగే ‘విద్వేష ప్రసంగాల’ గురించి, కశ్మీర్‌లో ‘ఇంటర్‌నెట్‌ నిషేధాల గురించి’, కర్ణాటకలో హిజాబ్‌ వివాదం గురించి ప్రముఖంగా అభ్యంతరం చెప్పింది. మరొక దేశం బెల్జియం భారత్‌లోని పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), మత మార్పిడి నిరోధక చట్టం లాంటివి మైనార్టీలకు వ్యతిరేకంగా, వారిని లక్ష్యంగా చేసుకొని మతహింసకు పాల్పడడాన్ని ప్రశ్నిస్తూ, అసలు మైనారిటీల హక్కులను రక్షించే ఉద్దేశ్యం భారత్‌కు ఉందా? లేదా? అన్నది స్పష్టం చేయాలని డిమాండు చేసింది.    

భారత్‌లో ఇటీవలి కాలంలో శాంతియుతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న లేదా నిరసనలు వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు, పాత్రికేయులు, రచయితలు, రాజకీయ కలాపాలు సాగించే వారిని నిరంకుశ చట్టాల కింద ఎటువంటి నిర్ధారణ లేకుండా అరెస్ట్‌ చేసి, దీర్ఘకాలం జైలులో ఉంచడం పట్ల నవంబర్‌ 10న జెనీవాలో జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. భావప్రకటన స్వాతంత్య్రాన్ని బలోపేతం చేయడం కోసం తీవ్రవాద కట్టడి చట్టాలను సమీక్షించాలని పలు దేశాలు సూచించాయి. ఆ చట్టాల పేరుతో మానవ హక్కుల కార్యకర్తలు, శాంతియుతంగా నిరసన తెలిపేవారిని, రచయితలు, పాత్రికేయులను అణచివేతకు గురి చేస్తున్నారని సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. న్యాయపరమైన రక్షణలు ఉన్నప్పటకీ చట్టపరంగా భద్రత కల్పించాల్సిన చోట మత, లింగ, వివక్ష, హింస కొనసాగుతుందని అమెరికా ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేసింది. మానవ హక్కుల కార్యకర్తలపై, జర్నలిస్టులపై, అల్పసంఖ్యాక వర్గాలపై ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) వంటివి మోపుతున్నారని ఆయన నిలదీశాడు.

మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలను విచారణలకు ముందే దీర్ఘకాలం నిర్బంధిస్తూ, తీవ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు పెడుతున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను దృష్టిలో పెట్టుకుని, యుఎపిఎ వంటి చట్టాలను పరిశీలించి జర్నలిస్టుల స్వేచ్ఛను పరిరక్షించాలని కెనడా ప్రతినిధి సూచించారు. ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ చట్టాన్ని (ఎఫ్‌సిఆర్‌ఎ), చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిరోధక చట్టం(యుఎపిఎ) లను సమీక్షించాలని, భావ ప్రకటన స్వేచ్ఛను, పౌర సంస్థలను, మానవ హక్కుల పరిరక్షకులను కాపాడాలని ఎస్తోనియా కోరింది. ఇంగ్లాండ్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, బెల్జియం, లెగ్జింబర్గ్‌తో పాటు ఇతర ఐరోపా దేశాలు కూడ కోరాయి. పౌరసమాజాన్ని కాపాడాలని, అందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలని, భావప్రకటన-పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, వీటి అతిక్రమణలకు బాధ్యత  వహించాలని ఇటలీ కోరింది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం భారత శిక్షాస్మృతిలోని దేశద్రోహ నేరం, నేర పరిహారాన్ని రద్దు చేయాలని చెక్‌ రిపబ్లిక్‌ కోరింది.

భారత్‌లో ముఖ్యంగా కశ్మీర్‌లో 600 పైగా ఇంటర్‌ నెట్‌ సెంటర్లు మూతపడటం పట్ల పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే మెహతా మాట్లాడుతూ ఈ ఆంక్షలు అంతర్జాతీయ నిబంధనల్లోని 15(2) అధికరణల ప్రకారం ఉద్దేశపూర్వకంగా విద్వేషపూరిత ఉపన్యాసాలు నేరపూరితం అయినప్పుడు మాత్రమే సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. ఆరు వేల ప్రభుత్వేతర సంస్థలు ఎఫ్‌సిఆర్‌ఎ కింద తీసుకున్న లైసెన్స్‌లను భారత్‌ రద్దు చేయడం పట్ల ఐరిష్‌ ప్రతినిధి విచారం వ్యక్తం చేశాడు. దీనికి భారత ప్రతినిధి తుషార్‌ మెహతా స్పందిస్తూ కొన్ని సంస్థలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, చట్టబద్ద విధానాలను, విదేశీ మారక యాజమాన్య నిబంధనలను ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తున్నాయని, అటువంటి వారి పైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మెక్సికో, ఉరుగ్వే దేశాల ప్రతినిధులు ప్రజాస్వామ్యానికి పౌరస్వేచ్ఛ ప్రధానమన్నారు. పౌరస్వేచ్ఛ లేనిచోట ఓ ప్రజాస్వామ్యం మనజాలదన్నారు.

మతమార్పిడి వ్యతిరేక చట్టాలను భారత్‌ నిలుపుదల చేయాలని, రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛను అలాంటి చట్టాలు దెబ్బతీయకుండా చూడాలని డచ్‌ ప్రతినిధి కోరాడు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మైనార్టీల హక్కులను పునరుద్ధ్దరించాలని బ్రిటన్‌ కోరింది. రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులతో ప్రభుత్వం, స్థానిక చట్టాలు విబేధించకుండా చూడాలని వాటికన్‌ సిటి ప్రతినిధి కోరారు. మతస్వేచ్ఛను, విశ్వాసాల స్వేచ్ఛను గౌరవిస్తూనే మతం మారిన వారిని నిరోధించే, నిరుత్సాహపరిచే చట్టాలను రద్దు చేయాలని కోరారు. ముస్లింలను, ఇతర మైనారిటీలకు వ్యతిరేకంగా చేసే విద్వేష పూరిత ప్రసంగాలను ఖండించాలని అమెరికా కోరింది. ప్రపంచంలో అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్యం, సాంస్కృతిక వైవిద్యం ఉన్నదేశంగా భారత్‌కున్న గుర్తింపును నిలుపుకోవాలని అమెరికా కోరింది. పలు దేశాలు భారత్‌ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

హింసకు, శతృత్వానికి, వివక్షకు ప్రేరణ కల్పించేలా ఉన్న, మత విద్వేషాన్ని సమర్ధించే ప్రజా ప్రతినిధులు వాటికి బాధ్యత వహించాలని దక్షిణాఫ్రికా భారత ప్రభుత్వాన్ని కోరింది. జాతీయతను తిరస్కరించడం, నిర్బంధించడం, బహిష్కరించడం వంటి చర్యలు జరుగకుండా చూడడానికి పౌర నమోదు చట్టాన్ని అమలు చేయడాన్ని పునఃసమీక్షించాలని మెక్సికో కోరింది. 2019లో అసోంలో జాతీయ పౌర నమోదు చట్టాన్ని అమలు చేసిన భారత ప్రభుత్వం దాన్నిప్పుడు దేశమంతా అమలు చేయాలని చూస్తోంది. అప్పుడు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయని, హింస, వివక్ష కొనసాగుతోందని టర్కీ ఆరోపించింది. భారత ప్రతినిధి మాట్లాడుతూ బలవంతంగా మతమార్పిడులు జరగడాన్ని నిషేదిస్తూ ప్రభుత్వం చట్టం తెచ్చిందని తెలిపారు. ఐరాస చేసిన తీర్మాణాలను భారత్‌ తుంగలో తొక్కి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని అన్ని దేశాలు ఆరోపించాయి.

భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని బెల్జియం కోరింది. కశ్మీర్‌లో ఎన్నో అఘాయిత్యాలకు భద్రతాదళాలు పాల్పడ్డాయని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని బెల్జియం తీవ్రంగా ఆరోపించింది. అంతర్జాతీయ ఒప్పందాల వెలుగులో ఈ చట్టాన్ని మార్చాలని నార్వే కోరింది. రాష్ట్రాలు ఇచ్చే సమాచారం మేరకు ఈ చట్టానికి సవరణలు చేసినట్లు మెహత చెప్పిన మాటలతో ఎవరు సంతృప్తి చెందలేదు. చిత్రహింసలు, మానభంగాలు, ఎన్‌కౌంటర్లు, ఇతర క్రూరమైన పద్ధతులు, అమానుషం, దారుణంగా వ్యవహరించడం, శిక్షించడం పైన ఐరాస సదస్సు నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని 29 దేశాలు కోరాయి. ఐలాండు దేశాలు టోగో, బహమాన్‌, ఫిజి, జపాన్‌లు, ఆఫ్రికా దేశాల్లో ఘనా, నైజీరియా, కాంగో, అంగోలాలు, మధ్య ఆసియాలోని కజిస్థాన్‌కు ఉన్నాయి. మరణశిక్షను అమలు చేయడాన్ని నిలిపివేయాలని ఆస్ట్రేలియా నుంచి ఐస్‌లాండ్‌, లాటిన్‌ అమెరికాలోని చిలేతో సహా 17 దేశాలు కోరాయి. అలాగే కశ్మీర్‌కు సంబంధించి రద్దు చేసిన 370 అధికరణను పునరుద్ధరించాలని, ఐరాస మానవ హక్కుల హైకమీషన్‌ కశ్మీర్‌లో పర్యటించడానికి అనుమతించాలని, అరెస్టు చేసిన జర్నలిస్టులకు విడుదల చేయాలని పాకిస్థాన్‌ కోరింది.

మహిళల హక్కులు భారత్‌లో మృగ్యమయ్యాయని 44 దేశాల ప్రతినిధులు భారత్‌ను ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించాలని, భద్రతను కల్పించాలని, మహిళలకు వ్యతిరేకంగా జరిగే అన్ని రకాల వివక్షను తొలగించాలని, వారి సాధికారతకు బాసటగా ఉండాలని అన్ని దేశాలు కోరాయి. కార్మికుల్లో మహిళల నిష్పత్తి చాల తక్కువగా ఉందని, ఇది కూడ క్రమంగా తగ్గిపోతుందని చాలా దేశాలు ఆరోపించాయి. ఆడపిల్లల విద్యావకాశాలు పెంచి, వారిపై జరిగే లైంగిక దోపిడీని అరికట్టాలని, ట్రాన్స్‌ జెండర్‌ హక్కులను కాపాడాలని, వికలాంగుల పట్ల వివక్షను అంతమొందించాలని, హింసను నిరోధించాలని పలు దేశాలు కోరాయి. అయితే వీటి గురించి భారత ప్రతినిధి తుషార్‌ మెహత స్పందించలేదు. అలాగే పౌష్టికాహార లోపం, ఆహార భద్రతలకు సంబంధించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలు దేశాలు సూచించాయి.

పేదరిక నిర్మూలనపై ప్రత్యేక కృషిని కొనసాగిస్తూ ఆరోగ్య, మౌళిక సదుపాయాలను బలోపేతం చేయాలని, బాలబాలికలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలని రష్యా సూచించింది. ప్రజారోగ్యానికి కనీసం బడ్జెట్‌లో 3 శాతానికి పెంచాలని, ప్రజారోగ్యానికి చట్టం తీసుకురావాలని రష్యా కోరింది. స్విట్జర్లాండ్‌, ఈజిప్ట్‌తో సహా పలుదేశాలు ఆరోగ్యానికి నిధులు పెంచాలని కోరాయి. మహిళలు, బాలికలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశుభ్రత, ఉపాధి అవకాశాలు మెరుగుపరచే విధంగా చర్యలు చేప్టట్టాలని రష్యా, డెన్మార్క్‌, వియత్నాం, చైనాలతో సహా పలు దేశాలు సూచించాయి. లైంగిక హింసకు సంబంధించిన చట్టాల అమలును మెరుగు పరచాలని కెనడా పేర్కొన్నది. లైంగిక హింసను కట్టడి చేయడం కోసం జాతీయ స్థాయి చట్టం అవసరమని నార్వే చెప్పింది. మహిళలు, బాలలు, మైనారిటీలపై హింస, వివక్షలను ఎదుర్కొనే ప్రయత్నాలు పెరగాలని కోరారు.

నిజానికి ఐరాస మానవ హక్కుల మండలి చర్చించే అంశాలన్నీ భారత రాజ్యాంగంలో చాప్టర్‌ 3లో ప్రాథమిక హక్కుల రూపంలో, చాప్టర్‌ 4న ఆదేశిక సూత్రాల రూపంలో పొందు పరచబడ్డాయి. ప్రాథమిక హక్కుల్లో 19వ అధికరణ పౌర స్వేచ్ఛా, వాక్‌, సభా స్వాతంత్య్రాన్ని కల్పించాయి. అలాగే 22వ అధికరణ ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే హక్కు గ్యారంటీ చేయబడింది. ఈసారి భారత ప్రభుత్వం లిఖిత పూర్వకముగా ఐరాస మానవ హక్కుల మండలికి సమర్పించిన నివేదికలో హక్కుల అమలుకు సంబంధించి 122 అంశాలను ప్రస్తావించి, వివరణ ఇచ్చింది. దేశంలో 9, రాష్ట్రాల్లో 180 మానవ హక్కుల కమీషన్లు పనిచేస్తున్నాయని, ఇవి మానవ హక్కుల పరిరక్షణకు నిరంతరం, నిబద్ధతతో పనిచేస్తున్నాయని తెలిపింది. అలాగే దేశంలో చట్టబద్ధ పాలన కొనసాగుతుందని చెప్పుకుంది. ఈ నివేదిక ఆసాంతం తప్పుల తడక, ఆత్మవంచనతో కూడుకుని నేతి బీరలో నెయ్యి చందంగా ఉందని సులభంగానే అర్థమవుతుంది. రాజ్యాంగ అధికరణ 370 రద్దు, కశ్మీర్‌ విభజన తర్వాత అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని నివేదికలో పేర్కొనడం పచ్చి అబద్ధం. నిజం దాస్తే దాగదని ప్రభుత్వం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. 

గతంలో మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో వచ్చిన ఆరోపణలపై మానవ హక్కుల మండలి ఎత్తిచూపిన అంశాలపై భారత ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటామని ఇచ్చిన అనేక హామీలను ఆచరణలో నెరవేర్చలేదని సభ్య దేశాలు ఆరోపించాయి. ఐరాస మానవహక్కుల సమితిలోని సభ్య దేశాలు భారత్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి తాము సేకరించిన అనేక సంఘనటల గురించి ఆధారాలతో సహా చూపారు. అందులో భాగంగానే భారత్‌లో మైనారిటీ మతస్థులపౖౖె సామూహిక దాడులపై వచ్చిన పలు కథనాలు, స్త్రీలపై జరిగిన అత్యాచారాలు, బాలికలపై జరిగిన హింసాత్మక సంఘటనపై వివిధ సంస్థలు ఆడియో, వీడియో, కథనాలను, డాక్యుమెంటరీ సాక్షాలతో సహా ప్రదర్శించి భారత్‌ తలదించుకునేలా చేశాయి. తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచాయి. అలాగే భారత్‌లోని సాంఘిక అసమానతలు, వివక్షల గురించి మూడు ఆఫ్రికా దేశాలు సియెర్రా లియోన్‌, ఇథియోపియా, కామెరూన్‌లతో పాటు పసిఫిక్‌ దేశం, మార్షల్‌ దీవులు, కుల ఆధారిత వివక్షను అంతం చేయడం గురించి ప్రస్తావించారు.

పలు దేశాలు అన్ని వివక్షలు అంతానికి, మానవ హక్కుల అమలుకూ గట్టిగా పట్టుబడుతుంటే, భారత్‌ ప్రభుత్వ ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానం చెప్పారు. విచక్షణారహితంగా జరుగుతున్న అరెస్టుల గురించి వ్యక్తమైన ఆందోళనలను ప్రస్తావిస్తూ అటువంటివారు కోర్టులకు వెళ్లవచ్చు గదా అంటూ సలహా ఇచ్చారు. ఆయన సమాధానంలో సహేతుకత వ్యక్తం కాలేదు. న్యాయబద్ధత, చట్టబద్ధత, అంతర్జాతీయ ప్రమాణాలను గౌరవిస్తామని ఒక్క మాట చెప్పలేదు. జాతీయ భద్రత, తీవ్రవాద ముప్పు వంటి పడికట్టు పదాలను యదేచ్ఛగా ఉపయోగించారు. కానీ శాంతియుత నిరసనలు, భావప్రకటన స్వేచ్ఛ శాంతియుతంగా సమావేశాలు, ప్రదర్శనలు జరుపుకొనే వెసులుబాటు గురించి ఎటువంటి భరోసా ఇచ్చే విషయం మాట్లాడలేదు.  గత మూడు సమావేశాల సమీక్షలో ఎత్తిచూపిన మానవ హక్కుల ఉల్లంఘనలపై అబద్దాలు చెప్పినట్లుగానే ఈసారి కూడ అదేవిధంగా అసత్యాల చిట్టా నిస్సిగ్గుగా ప్రపంచ వీక్షణం ముందు పెట్టింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి వల్ల భారత్‌ మొసలికన్నీరు కారుస్తుంది గాని, ఎటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ లేదని ఆయన మాటలు విన్నవారికి స్పష్టం అవుతుంది.

భారత మిత్రదేశాలే మానవ హక్కుల అమలు విషయమై, మైనార్టీ మతస్తుల, ధలితులపై జరిగే వివక్షత గురించి నిలదీసినా, భారత ప్రభుత్వం మాత్రం తాను అమలు జరుపుతున్న నియంతృత్వ పోకడలను కొనసాగిస్తాననే విధంగానే భారత ప్రతినిధి వర్గానికి నేతృత్వం వహించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తనదైన రీతిలో మానవ హక్కుల కార్యకర్తల స్వేచ్ఛకు భారత్‌లో భంగం లేదని అంటూనే చట్ట పరిధిలో పని చేయాలి అంటూ జవాబు చెప్పారు. విచక్షణారహితంగా జరుగుతున్న అరెస్టుల గురించి వ్యక్తమైన ఆందోళనలను ప్రస్తావిస్తూ అటువంటి వారు కోర్టులకు వెళ్ళవచ్చు గదా అంటూ సలహా ఇచ్చారు. ఆయన వాదనలలో సహేతుకత వ్యక్తం కాలేదు. న్యాయబద్ధత, అంతర్జాతీయ ప్రమాణాలకు హామీ ఇస్తామని ఒక్క మాట కూడా పేర్కొనక పోవడం గమనార్హం. జాతీయ భద్రత, తీవ్రవాద ముప్పు వంటి పడిగట్టు పదాలను యధేచ్ఛగా ఉపయోగించారు. కానీ శాంతియుత నిరసనలు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశాలు, ప్రదర్శనలు జరుపుకొనే వెసులుబాటు గురించి ఎటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అంతర్జాతీయంగా  వస్తున్న వత్తిడుల కారణంగా మానవ హక్కుల పట్ల భారత ప్రభుత్వం ‘మొసలి కన్నీరు’ కారుస్తుంది గాని, ఎటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ లేదని భారత ప్రతినిధుల సమాధానాలు విన్నవారికి స్పష్టం అవుతుంది. 

Leave a Reply