పార్టీ, మంజీర, మాస్టారు లేకపోయి వుంటే నేను కథలు రాసి వుండేదాన్ని కాదేమో. రచయితను మించి కథ వుండదు అని భావిస్తాను. కథలు ఎట్లా రాసానో చెప్పే ముందు నా బాల్యం, అప్పటి నా ప్రపంచం గురించి కొంత చెప్తాను. అందునా గ్రామీణ ఆడపిల్లలకు ఇంటిపని, వాటికి తోడు నిబంధనలు దాటుకుని రావాల్సి వుంటుంది. సమయమూ తక్కువ దొరుకుతుంది. ఇవన్నీ అధిగమించి చదవాలి.
ఆడపిల్లగా నిర్బంధాల మధ్య పెరిగాను. పల్లెటూరు, చిన్న ప్రపంచం నాది. మా నాయిన మమ్మల్ని ఇల్లు కదలనిచ్చేవాడు కాదు. మా నాయిన తోబుట్టువుల ఇళ్లకి తప్పితే ఎక్కడికీ పంపేవాడు కాదు. మా అమ్మ వడ్ల మిల్లు పట్టేది కాబట్టి ఎప్పుడూ జనం వుండేవాళ్లు ఇంట్లో. అందువల్ల పెద్దయ్యే వరకు నాకు ‘కులం’ అంటే ఏందో తెలియదు. సాయంత్రమైతే మా అమ్మ బయట గడప ముందర కూచునేది. చుట్టుపక్కల వాళ్లందరూ వచ్చి అమ్మ చుట్టూ చేరేవారు. మా తాటికల్ గ్రామంలో నా చిన్నతనంలో కరెంట్ వుండేది కాదు. కాబట్టి అమావాస్య రాత్రుళ్లు వాళ్ల దగ్గర కూచుని ముచ్చట వినేదాన్ని. వెన్నెల రాత్రుళ్లు అయితే తోటి పిల్లలతో ఆడుకునేదాన్ని.
తర్వాత నకిరేకల్‌కు వచ్చి స్థిరపడ్డాం. అప్పటికి నాకు నిండా తొమ్మిదేళ్లు లేవు. నకిరేకల్‌లో మా ఇంటి దగ్గర నాఈడు పిల్లలు లేకపోవడంతో ఆటపాటలు బంద్. ఇక్కడ కూడా చీకటైతే మా అమ్మ చుట్టూ చేరేవాళ్లు అమ్మలక్కలు.
బడికి, లేదంటే వడ్లు పట్టుడు – ఇదే నా లోకం. అప్పుడప్పుడు లేకపోతే మా పెదనాయిన వాళ్లింటికి పోయేదాన్ని. మా పెదనాయిన పెద్దకోడలు కథలు బాగా చెప్పేది. అప్పుడప్పుడు బడి అయిపోయిన తర్వాత, సెలవు రోజుల్లోనో వాళ్లింటికి వెళ్లేదాన్ని. ఆమె రాట్నం తిప్పుకుంట కథలు చెప్తుంటే పిల్లలం ఆమె చుట్టూ కూచునేవాళ్లం. ఇదొక్కటే నాకున్న గవాక్షం.
మాట్లాడుడు తక్కువ. నన్ను ఎవరైనా తిట్టినా ఎదురుచెప్పడం తెలియదు. మాట్లాడటం ఇంకా తగ్గించేదాన్ని. అంతే. పైగా వాళ్లు ఇలా తిట్టారని వచ్చి మా అమ్మకు చెప్పాలని గానీ, అట్లా చెప్పొచ్చనే విషయం గానీ నాకు తెలియదు. అందుకే అందరూ నన్ను ‘పిచ్చి రామక్క’ అనేవాళ్లు.
అయితే చిన్నప్పటి నుంచి మనుషులను బాగా పరిశీలించడం అలవాటు. అప్పటి వరకు మంచిగా ఉన్నవాళ్లు పంచాయితీ వస్తే బండబూతులు తిట్టుకునేవాళ్లు. కష్టం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి కలుసుకునేవాళ్లు, ఆదుకునేవాళ్లు. చిత్రంగా అనిపించేది. దొంగ ఏడుపులు అర్థమయ్యేవి, వ్యవహరించే తీరునుబట్టి అబద్ధాలు చెప్తున్నారని తెలిసేది. ముఖ్యంగా ఆడవాళ్ల కలబోతలు, ఆప్యాయతలు, సహానుభూతులు చుట్టరికాలకు, కులాలకు అతీతంగా ఉండటం… చూస్తూ వుండేదాన్ని.
మా అమ్మానాన్నలకు మేము ఎనిమిది మంది సంతానం. మా నాయిన సర్పంచ్, ఆయుర్వేద వైద్యుడు, చండ్రపుల్లారెడ్డి పార్టీ (జనశక్తి) రాజకీయాల్లో తలమునకలై వుండేవాడు. మా తాటికల్ గ్రామం అప్పట్లో జనశక్తి పార్టీకి కేంద్రంగా వుండేది. పార్టీ నాయకుడు ఒకరు పని మీద మా ఇంటికి వచ్చాడట. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అతన్ని తీసుకుని మా నాయిన వెళ్లిపోయి పావుగంట కూడా కాకముందే పోలీసులు ఊరిని, మా ఇంటిని చుట్టుముట్టారట. అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. అలాగే చిన్నప్పుడు రష్యన్, చైనా సినిమాలకు మా నాయన ఆధ్వర్యంలో పొలోమని తాటికల్ గ్రామం నుంచి అందరూ నడుచుకుంటూ 5 కి.మీ. దూరంలోని నకిరేకల్‌కు వెళ్లి, చూసి వచ్చేవాళ్లం. జనశక్తి పార్టీ మీటింగ్‌లకూ వెళ్లేవాళ్లం.
చిన్నప్పుడు చూసిన పురాణ సినిమాల్లో చెట్టు చాటుకు వుండి రాముడు వాలికి బాణం వేసి చంపడం అన్యాయమనిపించేది. నిప్పుల్లో దూకిన సీత పిచ్చిదా అనిపించేది. పాండవులు మోసగాళ్లు అనిపించేది. కర్ణుడు అంటే బోలెడంత ఇష్టముండేది.
నేను ఏడవ తరగతిలో వుండగా మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకుండింది. దాదాపు ఏడాదిన్నర పాటు హైదరాబాదు చుట్టూ తిరుగుతూ వుండేది. దాంతో బడికి పోవడంతో పాటు వడ్ల మిల్లు, వంట బాధ్యత నా మీద పడింది. వడ్లు పట్టడానికి అందకపోతుండే. స్టూలు వేసుకుని నిలబడి వడ్లు పట్టేదాన్ని. అంతేకాదు, నా కంటే చిన్నవారైన చెల్లె, ఇద్దరు తమ్ముళ్ల బాధ్యత కూడా నాదే. అప్పటికి మా చిన్నతముమడు నాలుగేండ్లవాడు. ఇక తీరిక అనేదే వుండేది కాదు నాకు.
మా పెద్ద తమ్ముడు శ్రవణ్ మూడవ ఏటనే బడికి పోవడం మొదలుపెట్టాడు, మా చెల్లితో పాటు. వాడు 3వ తరగతి నుండే ఆరేండ్ల వయసు నుంచే లైబ్రరీకి వెళ్లేవాడు. వేమన పద్యాలు ఎన్నో కంఠతా వచ్చేవి. తనే స్వయంగా ఎన్నో పద్యాలు రాసాడు (అప్పుడు ఇంత స్పృహ లేదు కాబట్టి అవేవీ దాచి వుంచలేకపోయాం). కొన్ని చందమామ పుస్తకాలను అప్పుడప్పుడు ఇంటికి తెచ్చుకుని చదివేవాడు. వాటిని నేనూ చదివేదాన్ని. అట్లా నాకు ఎనిమిది లేదా తొమ్మిదో తరగతిలో అనుకుంటా బడి పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు చదవడం ప్రారంభించిన. ఈలోగా అమ్మ ఆరోగ్యం బాగుపడింది. నాకు కొంత తీరిక సమయం దొరికింది. ఎప్పుడన్న ఒకసారి లైబ్రరికి పోయేదాన్ని. ఓసారి మా నాయిన ‘చిల్లర దేవుళ్లు’ చదవమని నవల ఇచ్చాడు. అట్లాగే మా క్లాస్మేట్ ఒకామె డిటెక్టివ్ నవలలు చదివేది. వాటినీ చదవడం మొదలుపెట్టిన. కానీ, అన్నీ ఒక్కలాగే అనిపించేది. ఆ తర్వాత యండమూరి నవలలు కొన్ని చదివాను. ఈ కథలన్ని బయట జరుగుతాయా అనిపించేది. అవీ బోర్ కొట్టాయి. ఈ యండమూరి నవలలను డిగ్రీ తర్వాత కూడా రెండు, మూడు చదివి పక్కన పెట్టేసిన. ఇక ఎన్నడూ ఆయన రచనలు ముట్టలేదు.
నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వుండగా అమ్మకు తెలియకుండా మిల్లు అమ్మారు. అప్పటి నుంచి ఇంట్లో ఆర్థిక సంక్షోభం. ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ హైదరాబాద్‌లో పెద్దన్నయ్యవాళ్ల దగ్గర వుండి చదువుకోవాల్సి వచ్చింది. డిగ్రీ సెకండ్ ఇయర్లో అమ్మవాళ్లు హైదరాబాద్ వచ్చేదాకా నాకు కుదురనేదే లేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మహిళా సంఘం పరిచయం. నిజానికి అప్పటికి మహిళా సంఘానికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. పది మందికి పైగా అమ్మాయిలం వుండేవాళ్లం. వరకట్నం, సారా సమస్య, అప్పుడే ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సరళీకరణ విధానాలపై కాలేజీల్లో, వీధుల్లో స్ట్రీట్ప్లేలు వేసేవాళ్లం. రాజకీయ, సిద్ధాంత, సాహిత్య పుస్తకాలు చదవడమూ పెరిగింది. నా దృష్టికోణం మరింత విస్తృతమవడం మొదలైంది. ఈ క్రమంలోనే ‘పిల్లులం కాదు, పులులం’ అనే కవిత రాసాను. ఇదే నా మొట్టమొదటి రచన.
ఆ తర్వాత చదువుతున్న బీఈడీ వదిలేసి పార్టీలోకి ఫుల్‌టైమర్‌గా, మంజీర (మఠం రవికుమార్) సహచరిగా ‘క్రాంతి’ (ఏపిసి యూనిట్)లోకి వెళ్లాను. మంజీర కవి. తను అమరుడయ్యాక విరసం ‘మంజీర మూడ్స్’ పేరుతో కవిత్వ సంపుటిని తీసుకువచ్చింది. ‘ఉప్పుతిని’, ‘పెద్దకొడుకు’ వంటి కొన్ని కథలు రాసారు. ఇక తను రాసిన వ్యాసాల గురించి చెప్పనే అక్కరలేదు. అవన్నీ సేకరిస్తే పెద్ద సంపుటి తయారవుతుంది. మంజీర ‘రాడికల్ మార్చ్’ పత్రికను ఒంటిచేత్తో నడిపాడు. ‘క్రాంతి’కి జాతుల సమస్యపై రాసిన వ్యాసాలన్నీ తనవే. నేషనల్ మంజీర, ఇంటర్నేషనల్ టాపిక్స్ మాస్టారు (ఐ.వి.సాంబశివరావు) రాసేవారు. ఈ ఇద్దరే ‘క్రాంతి’ని నడిపారు.
ఇక మా రూమ్‌కు వచ్చి, పోయేవాళ్లతో, మాస్టారుతో ముచ్చట్లు. మా దగ్గరికి వచ్చే కామ్రేడ్స్ దాదాపు అందరూ ‘‘ఏం పుస్తకాలు చదివినవు కరుణా?’’, ‘‘ఏమన్నా రాస్తున్నవా?’’, ‘‘రాయడానికి ప్రయత్నించు’’ అంటూ పలకరించేవారు.
మా గదిలో సామాను కంటే పుస్తకాలే ఎక్కువ. ప్రేమ్‌చంద్, శరత్, రాహుల్ సాంకృత్యాయన్, రావిశాస్త్రి, కారా, త్రిపురనేని గోపీచంద్, చాసో, కొడవటిగంటి కుటుంబరావు, రంగనాయకమ్మ రష్యన్, చైనా సాహిత్యం తదితర పుస్తకాలతో పాటు పార్టీ, సిద్ధాంత గ్రంథాలు వరుసబెట్టి చదివిన. న్యూస్పేపర్ల ఆదివారం అనుబంధం, సాహిత్య పేజీని అక్షరం వదలకుండా చదివేవాళ్లం నేను, మంజీర.
ఇంట్లో చాలా చాలా తక్కువగా మాట్లాడే మంజీర… అప్పుడప్పుడు మసక చీకట్లు ముసిరే సమయంలో బయటకు తీసుకువెళ్లేవాడు. అట్లా గల్లీలల్లో నడిపిస్తూ తనే ఎక్కువగా మాట్లాడేవాడు – సాహిత్యం, రాజకీయాలు, పర్సనల్ విషయాలు. కథ, లేదా కవిత… ఏదైనా సరే, అది బాగుంటే ఎందువల్ల బాగుందో, బాగా లేకపోతే దేనివల్ల బాగాలేకుండా పోయిందో చెప్పేవాడు. ఈ చర్చలు కథలు రాయడంలో నాకు చాలా వుపయోగపడినవి (అడవిలో పని చేస్తున్నప్పుడు కూడా రాసిన వుత్తరాల్లో కథల గురించే ఎక్కువగా వుండేది). మంజీర సహచర్యం నా రాజకీయ, సాహిత్య దృక్పథాన్ని విశాలం చేసింది.
ఈలోగా మా యూనిట్లోకి కంప్యూటర్లు రావడం, ఫెయిర్ కాపీయింగ్‌కి బదులు డైరెక్టుగా డీటీపీ చెయ్యడం ప్రారంభమైంది. కంప్యూటర్లు వచ్చాక ఎన్నో పుస్తకాలను టైప్ చెయ్యడంతో పాటు, ఒక ప్రూఫ్ కూడా చూసేదాన్ని (రెండవ ప్రూఫ్ మంజీర చూసేవాడు). ఈ టైపింగ్, ప్రూఫ్‌రీడింగ్ వల్ల చాలా పుస్తకాలను చదివే అవకాశమూ దక్కింది.
మాస్టారు ప్రతి రోజూ ఇంటికి వచ్చేవారు. రావిశాస్త్రి సాహిత్యం గురించి విసుగు విరామం లేకుండా చెప్తుండేవారు. ముఖ్యంగా ఆయనకు మనసు బాగా లేకపోతే రావిశాస్త్రి కథలను చదివి, తేలికయ్యేవారు. కారా కథల గురించీ చెప్పేవారు. దాదాపు సాయంత్రాలన్నీ గంటలు గంటలు సాహితీ ముచ్చట్లే. రావిశాస్త్రి గారు కథ రాసి, అది వారి సాహితీ మిత్రుల ముందు పెడితే… ఆ కథను చదివి, అందులో ఒక కొత్త పోలిక లేదా పదం పడినా దాని గురించి చర్చించేవారట, విశాఖ బీచ్ ఒడ్డున ఏదో షాపులో కూర్చుని. వాటి ప్రాధాన్యత అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసినా చెప్పేవారు లేరు. అదీగాక విన్న విషయాలను కూడా చాలా చాలా మర్చిపోయాను. కాకపోతే వాటి సారం ఇమిడిపోయింది. రాసేటప్పుడు అవన్నీ నా మీద ప్రభావం చూపుతాయని అనుకుంటాను. సరే, ఈ క్రమంలోనే రావిశాస్త్రిగారు చనిపోయినప్పుడు ‘ఛాత్రిబాబుకు ముత్యాలమ్మ నివాళి’ రాసాను, పూర్తి ఉత్తరాంధ్ర యాసలో (రావిశాస్త్రి గారి రచనలు చదివి నాకు ఉత్తరాంధ్ర యాస వినకుండానే ఒంటబట్టింది). ముత్యాలమ్మ పాత్ర రావిశాస్త్రి ‘మాయ’ కథలోనిది. ఇది రావిశాస్త్రి ప్రత్యేక సంచికగా తెచ్చిన ‘అరుణతార’ పత్రిక వెనక అట్ట మీద పడింది. ఇది నా రెండో రచన.
తొలి కథ, కమామీషు :
అయితే రావిశాస్త్రి కథలు రాసే విధానం నాపై చాలా బలంగా పడింది. దానికితోడు కథలు రాయడం గురించి కారాగారి పుస్తకం ‘కథాకథనం’, రావిశాస్త్రి గారి ‘రావిశాస్త్రీయం’ చదివాను. కథ నడిచేకాలంలో స్థానిక పరిస్థితుల గురించి రాయడంలో కొ.కు. గారి ‘చదువు’ నవల ప్రభావం కూడా నాపై బలంగా వుండింది. ఆ నవల చదివినప్పుడు నేను కూడా ఆ పక్కనే వుండి చూస్తున్నానా అనిపించింది. అంతేకాక మా అమ్మ ముచ్చట చెప్తే ఒకమాట ఎక్కువ, ఒకమాట తక్కువ అన్నట్టుగా కాకుండా సంఘటనను చిత్రిక పట్టేది. మా నాయన ఎంత నిర్బంధంలో పెంచినా ఆయన వ్యక్తిత్వం, తిప్పిన మీటింగ్‌ల ప్రభావం, మాస్టారు, మంజీర సాహిత్య చర్చలతో పాటు ఇవన్నీ కథ రాయడంలో నాకు తోడ్పడ్డాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే… మా ఆర్గనైజర్ సంవత్సరంలోగా అమ్మ కథ రాయాలని నా దగ్గర మాట తీసుకున్నది – పార్టీలోకి ఫుల్‌టైమర్‌గా వచ్చేటప్పుడు (తను కూడా రచయిత్రి, కవయిత్రి). సంవత్సరం కావస్తుండగా కథ రాసావా అంటూ లెటర్ రాసింది. ఇక కథ రాయడం మొదలుపెట్టిన.
అట్లా మొదటి కథ బాగా తెలుసున్న మా అమ్మ గురించి… కొంత ఇతర విషయాలు జోడించి, పార్టీలోకి వచ్చాక ఏర్పడిన దృష్టికోణంలోంచి ‘తాయమ్మ కథ’గా రాసాను. ఈ రాజకీయ దృక్పథం నాకు ఏర్పడి వుండకపోతే అల్లుడు మిల్లును ఎందుకు అమ్మాడో బహుశా నేను పట్టుకోకపోతుంటినేమో. ఈ కథను మా దగ్గరకు వచ్చిన కేంద్ర కమిటీ సభ్యుడికి ఇచ్చాను. చదివారు. కానీ ముగింపు బాగాలేదని, ఉద్యమంలోకి వెళ్లినట్టు రాస్తే బాగుంటుందన్నారు. అట్లా రాయనని నేనన్నాను
అట్లయితే ఇది కథగా పనికిరాదన్నారు ఆ కామ్రేడ్.
తాయమ్మ కథలో ఎక్కడా ఉద్యమ వాతావరణాన్ని రాయలేదు. అట్లాంటప్పుడు ఉద్యమంలోకి వెళ్లినట్టు ఎట్లా రాయాలి? అదే రాయాల్సి వస్తే అది వేరే కథ అవుతుంది కదా. చాలా దుఃఖంగా, బాధగా అనిపించింది.
‘తాయమ్మ కథ’ను ఏడుపుతో ముగించడానికి కారణం… ఒక సామాన్య స్త్రీ, ఎవరి అండాలేని స్త్రీ వ్యవస్థతో (పితృస్వామ్య వ్యవస్థలో భాగమైన భర్త, అల్లుడు, ఆడబిడ్డ మొగుడు మొదలైన వారితో) తన శక్తిమేరకు పోరాడి, ఓడినప్పుడు దుమ్మెత్తి పోయడం, ఏడవడం తప్ప ఏం చేయగలదు. దుమ్మెత్తి పోయడమనేది కూడా ఆమె స్థాయిలో ధిక్కారమే కదా. పాత్రకు మించిన స్వభావాన్ని అంటగట్టడం ఎట్లా?
ఈ విషయాన్ని మంజీరతో చెప్పాను. ‘‘అవన్నీ ఏమీ పట్టించుకోకు. నీది చాలా మంచి కథ. నేను చెప్తున్నాను కదా. ముందు కథను పోస్ట్ చెయ్యి’’ అంటూనే, ‘‘ప్రింటింగ్‌కు పంపకముందు కథలను ఎవరికీ చూపించకు’’ అన్నాడు.
అయితే ఈ కథ పంపిన మూడు సంవత్సరాలకు ప్రింట్ అయ్యింది. అందువల్ల ‘తాయమ్మ’ తర్వాత రాసిన కథలు ముందుగా ప్రింట్ అయ్యాయి.
ఇక అప్పట్లో ఏ కొత్త విషయం విన్నా, ఒక రిపోర్టు చదివినా కూడా కథ రాయాలనిపించేది. అట్లా రాసినవే ‘రేపటి గెరిల్లాలు’, ‘కొత్త చిగుళ్లు’, ‘తగినశాస్తి’ కథలు. అప్పట్లో బయటి కథలను ‘కరుణ’ పేరుతోను, ఉద్యమ కథలను ‘టుంబ్రి’ పేరుతోను రాసాను
ఎట్లాగూ పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి… నేను పుట్టినప్పుడు పెట్టిన పేరు సుమంగళి. మా ఇంటి పక్కనే పద్మ అనే అమ్మాయి వుండేది. చిన్నప్పటి నుంచి నాకు మంచి దోస్తు. బడి ఎగ్గొట్టి ఆమెతో పాటు బర్లు కాయడానికి పోయేదాన్ని. అదీగాక క్లాసులో మంగళి, మంగళి అని ఏడిపిస్తున్నారని, నాకు పద్మ పేరు పెట్టాలని మూడు రోజులు అన్నం మానేసానట. పొద్దంతా గోడకు నిలబడే వుండి, రాత్రి కూడా ఆ గోడ దగ్గరే పడుకున్నానట. చివరికి మూడో రోజు నన్ను బడికి తీసుకుపోయి పేరు మార్పించాక అన్నం తిన్నానట. అట్లా సుమంగళిని కాస్త పద్మగా మారాను – రెండవ తరగతిలో.
‘తాయమ్మ కరుణ’గా మారడం గురించి చెప్తాను. ‘తాయమ్మ కథ’ రాసిన తరువాత ముఖ్యంగా వాసిరెడ్డి నవీన్ వాళ్లు తెస్తున్న కథా వార్షిక ‘కథ 96’లో ముద్రించడం, ఆ సంకలనం ఆవిష్కరణలో కారా మాస్టారు చివరి ఏడుపు సీన్ చదవడం, ‘‘తాయమ్మ కథలో ఏ పదం తీసేస్తారో చెప్పండి’’ అని వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు అన్నారట. అట్లా ఆ కథ ‘కథ 96’లో పడిన తరువాత బహుశా ‘తాయమ్మ కరుణ’ను అయ్యాను. అలాగే నేను కథలు రాయని కాలంలో విరసం కామ్రేడ్ ఒకరు ‘కరుణ’ పేరుతో రాసారు. అందువల్ల ఆ తర్వాత పంపిన కథలకు ‘తాయమ్మ కరుణ’ పేరుతో అరుణతారకు రచనలు పంపాను. కాంటాక్టు మిస్సయి ఇక నేను బయటనే వుంటున్న క్రమంలో రైటర్స్ ఎవరైనా పేరు అడిగితే కరుణ అని చెబితే, వెంటనే వాళ్లు ‘తాయమ్మ కరుణ’నా అని అడిగేవారు – అరుణతార చదవనివారు కూడా. ఒక కథ ద్వారా రచయిత్రిని ఇంతగా గుర్తుంచుకుంటారా? చాలా ఆశ్చర్యం, ఆనందం అయ్యేది. అలా నేను ‘తాయమ్మ కరుణ’గా స్థిరపడ్డాను.
కథలంటేనే ఇష్టం :
కవిత్వం కూడా కొంత రాసాను. కానీ ఒక విషయాన్ని సంపూర్ణంగా కథ ద్వారానే పాఠకుడికి తెలియజేయవచ్చు అనిపిస్తుంది నాకు. అందులో మాట్లాడటం ద్వారా కంటే రాత ద్వారానే వ్యక్తపర్చుకోగలిగే స్వభావం నాకుండటం వల్ల కూడా కథలు రాయడానికి కారణం అయింది.
చూసిన వాటిని, చదివిన వాటిని కథల్లో ఇమడ్చి రాస్తాను. చాలా వరకు నేను విన్నవి, కన్నవి మాత్రమే కథలుగా రాసాను. కట్టు కథలు రాయలేదు. ముఖ్యంగా నాకు తెలియని విషయాలను రాసినా తెలిసిన మనషులకు, మనస్తత్వాలకు అన్వయిస్తాను. ‘ముదునష్టపు రోజులు’ కథను అలాగే అన్వయించి రాసాను. ఈ కథను పేపర్లో ఓ మూలకు వచ్చిన చిన్న వార్తను చదివి రాసాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలు పొందాలనుకునేవారు జన్మభూమి కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలనే నిబంధన వుండింది. అందువల్ల ఆ కార్యక్రమానికి వృద్ధులే ఎక్కువగా వస్తున్నారని, అధికారులు వచ్చేవరకు గంటల తరబడి వేచి వుండి, వారు చెప్పింది విని పెన్షన్ మంజూరు కాలేదని తెలుసుకుని నిరాశగా వెనుదిరుగుతున్నారని, ఊర్లో ఎవరైనా చనిపోతేనే పెన్షన్లు ఇస్తున్నారని వార్త సారాంశం.
దండకారణ్యంలో వుండగా కథలు తక్కువగా రాసాను (ఆ బాకీ ఇప్పుడు తీరుస్తున్నాను).
నేను దండకారణ్యం నుంచి నల్లమలకు వచ్చిన తర్వాత ‘చనుబాల ధార’ రచయిత కౌముది పరిచయం అయ్యాడు. నా సహచరుడు శ్రీధర్ (మంజీర) మాటల సందర్భంలో నేను అక్కడే వున్నానని చెప్పడంతో, తీవ్రమైన జ్వరంతో సెలైన్ ఎక్కించుకుంటున్నామాట్లాడాడు. ‘తాయమ్మ కథ’కు ఎంత పేరొచ్చిందో చెప్పాడు. ఆ కథ ప్రింటయిన తర్వాత ఆరేండ్లకు 2002వ సంవత్సరంలో గానీ ఆ విషయం నాకు తెలియదు. 1998లో అనుకుంటా రవిశర్మ దండకారణ్యంలో కలిసినప్పుడు తాయమ్మ కథ ‘కథ 96’లో పడిందని చెప్పాడు. కానీ వివరంగా తెలిపింది మాత్రం కౌముదినే. స్వచ్ఛమైన మనసు కౌముదిది. అప్పుడే చెప్పాడు – శ్రీకాకుళంలో కారా మాస్టారు నిర్వహించే కథానిలయం ఉందని, అక్కడ వుండి చదువుకోవచ్చని, వుండటానికి ఏర్పాట్లు కూడా వున్నాయని.
ఒకసారి నేను బయటకు వచ్చినప్పుడు కథానిలయం వెళ్లాను. తీరా చూస్తే అక్కడ వుండనివ్వడం లేదు. వేరే వాళ్ల ఇంట్లో వుంటూ కథానిలయానికి రోజూ పొద్దున వెళ్లి, సాయంత్రం వరకు వుండేదాన్ని. 10 రోజులో అంతకంటే ఎక్కువేనో వున్నాను. నిజానికి నాకు షెల్టర్ ఇచ్చిన వారికి నా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ తెలియదు. కారా మాస్టారు నా గురించి అడిగితే తప్పుడు వివరాలు చెప్పాను కానీ మహానుభావుడు రెండో రోజుకే నేనెవరో గుర్తుపట్టారు. కానీ గుర్తుపట్టనట్టే వ్యవహరించారు. మాస్టారు ఉదయం పూట రెండు, రెండున్నర గంటలు సాహిత్యంపై క్లాస్ తీసుకునేవారు. తను చెప్పిన వాటిని నోట్ చేసుకొమ్మని చెప్పారు. కథా ప్రారంభం, కొనసాగింపు, ముగింపు; కథకు వస్తువు ఎంపిక, శిల్పమూ, విశ్వజనీన కథ ఎట్లా అవుతుంది… ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. ఆ నోట్స్ ఎక్కడో పోయింది. ఈ సందర్భంగా కారా మాస్టారు అన్నమాట చెప్పడం అసందర్భం కాదనుకుంటా. ‘‘తాయమ్మ కథ చదివి వేరేలా వూహించుకున్నాను. దానికి పూర్తి భిన్నంగా వున్నావమ్మా’’ అన్నారు మాస్టారు. నేను ఉద్యమంలో పని చేసి వచ్చానంటే కూడా చాలా మంది ఇలాగే ‘‘మీరు అలా వుండరే’’ అంటారు.
కథానిలయంలో కారా మాస్టారు చెప్పిన క్లాసులు కథ రాయడంలో నాకు చాలా వుపయోగపడినవి. కథానిలయం నుంచి వచ్చిన తర్వాత రాసిన కథే ‘కవులమ్మ ఆడిదేనా?’. శిల్ప రిత్యా ఇది చాలామందికి నచ్చింది. శిల్పం గురించి వచ్చింది కాబట్టి ఇక్కడే దాని గురించి నా అభిప్రాయం పంచుకుంటాను.
శిల్పం :
ఏ కథ శిల్పం ఆ కథకు తగ్గట్టే వుంటుంది. కథ చెప్పే తీరే శిల్పమని నేననుకుంటాను. వినసొంపుగా చెప్పడం వల్లనే కదా కథలు వింటాము. అట్లనే కథ రాయడం కూడా పాఠకుడిని చదివించేలా వుండాలనుకుంటాను. కథ చదువుతుంటే పక్కన కూసుని ముచ్చట చెప్తున్నట్టు వుండాలి. పేపర్ నా అత్యంత సన్నిహితుడు/సన్నిహితురాలైతే… దానితో ముచ్చటిస్తున్నట్టుగా వుంటుంది, కథ రాసేటప్పుడు నాకు. కథ రాసేటప్పుడు నవ్వుతాను, కొన్నిసార్లు ధారపాతంగా ఏడుస్తాను, కోపగించుకుంటాను… ఏ పాత్ర ఎట్లా ప్రవర్తిస్తే నేను అట్లా వుంటాను. కథ రాసేటప్పుడు పాత్రలతో మమేకత ఉండాలి. అట్లాగే నిజాయితీ తప్పనిసరి.
పాత్ర మనని నడిపిస్తది అని ఎక్కడో చదివాను. చదివినప్పుడు నేననుకున్నాను – పాత్రలను ప్రవేశపెట్టిందే రచయిత కదా. మన ప్రవేశపెట్టిన పాత్రలు మనను నడపడమేమిటి? అని. అది నాకు ఎరుకలోకి వచ్చింది. నిజం… పాత్ర కథను నడిపిస్తుంది. ‘సహచరులు’, ‘వాళ్లు’ కథలు రాస్తున్నప్పుడు నాకు అది అనుభవంలోకి వచ్చింది. ఆపేద్దామనుకున్నా రాయిస్తుంటాయి పాత్రలు.
అట్లని శిల్పం కోసమే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నదీ లేదు. వస్తువును బట్టి కథ దానికదే శిల్పాన్ని ఎన్నుకుంటుంది. కాకపోతే నేను కథ ప్రారంభం గురించి మాత్రం కొద్దిగా ఆలోచిస్తాను. వస్తువు గురించి ముందే అనుకుంటాను కాబట్టి కథ రాయడమంటూ మొదలుపెడితే దానికది నడుస్తూ పోతుంది. కథను ఇట్లాగే నడపాలని అనుకోను. ముగింపు ఇట్లా ఉండాలని కూడా అనుకోను. ఒక్కో కథా వస్తువును బట్టి శిల్పమూ, కొనసాగింపూ, ముగింపూ తయారైవుతుంది. అంతే.
కానీ, ‘నీళ్లెంత రుచి’ కథ రాసినప్పుడు మాత్రం ముగింపు కష్టమైంది. అంతకుమించితే కథ సాగదీత అవుతుంది. అప్పుడు మాత్రం పాణి సలహా అడిగాను (‘అరుణతార’ కథల ప్రత్యేక సంచికకు కథ రాయమని తను ఫోన్ చేసి వుండె). ఇంతకుమించి ఎప్పుడూ ఎవరి సలహాను ఏ కథ విషయంలోనూ తీసుకోలేదు. నా ప్రతీ కథ దానికదే ముగింపును ఎన్నుకుంటది
‘తాయమ్మ కథ’ మంజీరచదివినా ‘ఇలా రాయి, అలా రాయి’ అంటూ ఏ సలహా ఇవ్వలేదు. ‘బాగుంది, రాయమనే’వాడు. అంతే. ప్రింటింగ్‌కు ముందు ఇంకెప్పుడూ తను నా కథలను చదివింది కూడా లేదు. ‘తాయమ్మ కథ’, ‘తగినశాస్తి’, ‘కొత్తచిగుళ్లు’, ‘రేపటిగెరిల్లాలు’ కథలు మాత్రమే మంజీర, నేను కలిసి వున్నప్పుడు రాసినవి. ఆ తర్వాత అడవిలోకి వెళ్లడం… తన ఏరియాలో తను, నా ఏరియాలో నేను పని చేసాము. దీంతో నా కథలు ప్రింట్ అయిన తర్వాతనే చదివాడు.
నా కథలపై ఇతరుల విమర్శ :
తాయమ్మ కథను మొదట చదివినవారు కథే కాదన్నారు. ముగింపు బాగాలేదన్నారు. అది ఇంతకుముందు కూడా చెప్పాను. ‘కథ రాయాలి’ అనే కథను భూదాన్ పోచంపల్లిలో జరిగిన కథా వర్క్‌షాపులో చదివినప్పుడు ఎన్ని విమర్శలో. అసలు ఇది కథే కాదన్నారు. ఒక్క సంగిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రం కథని సమర్థించారు. అందువల్ల దేనికీ పంపలేదు. అముద్రిత కథగా నా ‘జీవితం’ కథా సంపుటిలో వేసాను. ఒక సింగిల్ వుమెన్, దిగువ మధ్యతరగతి మహిళ… కథ రాయాలంటే ఎదురయ్యే ఇబ్బందుల గురించిన వస్తువు అది. ఇకపోతే, ఈ మధ్య అక్కడెక్కడో జరిగిన మీటింగ్‌లో మహిళలు రాయడానికి తమకంటూ ఒక టేబుల్ కూడా వుండదని మాట్లాడినవి నిజాలైనప్పుడు నా కథ ఎందుకు కథ కాకుండా పోయిందో?
సరే, దీనికంటే ముందు మరో వర్క్‌షాప్‌లో చదివిన కథ ‘అమ్మ’. తమ పిల్లల మృతదేహాలను మాయంచేస్తే, చూడక పోవడం వల్ల వాళ్లు చనిపోయారని తెలుస్తున్నా తల్లిదండ్రులకు ఎక్కడో చిరుఆశ – ‘బతికే వున్నాడేమో’ అని. మల్లేశం తల్లి గురించి విన్నప్పుడు ఈ కథ నేను రాస్తానన్నాను. నేనే రాస్తానని షహీదా అన్నది. అందుకని లోపల వుండగా రాయలేదు. అదే కథను బయటికి వచ్చాక రాసాను. కొడుకు వస్తాడని పొలం దారులెంట ఎప్పుడూ ఎదురుచూసే తండ్రి గురించి కూడా విన్నాను. కానీ రాయలేకపోయిన. సరే, ఈ ‘అమ్మ’ కథను వర్క్‌షాప్‌లో మొదట మెచ్చుకున్నవారే, చివరికి విమర్శించారు. కథలో ఇంత దుఃఖం వుండొద్దన్నారు. మరికొందరు… బయట దుఃఖం వుంటే కథలోకి రాకుండా ఎట్లా పోతుంది అన్నారు.
అట్లాగే లామకాన్ లో జరిగిన మరొక కథా మీట్ లో ‘సహచరులు’ కథ చదివాను. ఒక రచయిత్రి విరుచుకుపడింది. బి.వి.ఎన్. స్వామి గారు చాలా బాగుందన్నారు. (పై మూడు కథల సందర్భంలో ప్రింట్ అవ్వకముందు కథను చూపించొద్దు అన్న మంజీర మాట మరోసారి గుర్తుకువచ్చింది).
‘బాధ్యత’ కథ చదివిన చాలామంది ‘తల్లిదండ్రులను కూతురు పట్టించుకోవడం లేదని రాయకుండా వుండాల్సింది’ (దాదాపు ఇదే అర్థంలో) అన్నారు. నేను కథను సరిగా చెప్పలేకపోయిన్నా అనుకున్నాను. కానీ, మరికొందరు నేను చెప్పదల్చుకున్న విషయాన్ని సరిగానే అర్థం చేసుకున్నారు. వస్తువ్యామోహం బాధ్యతలను పట్టించుకోకుండా చేస్తుందనేదే వస్తువు. దీనికి కారణం పెట్టుబడిదారుడు తాను ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రజలచేత కొనిపించడానికి చేస్తున్న కుట్రలో భాగం.
‘చుక్కాని’ కథ కృత్రిమంగా వుందని. నిజంగానే ఆ కథను రాయాలనుకుని ‘పని గట్టుకుని’ రాసాను. వస్తువు సరైనదే అయినా కథ చెప్పడంలోనే లోపం వుంది – ట్రూట్రాన్స్లేషన్లాగా, మరీ వాస్తవికంగా.
‘పిచ్చుకల పిచ్చి’ ఓ పత్రిక వారు వాస్తవికంగా వుందని వేసుకోవడానికి నిరాకరించారు. కథ ప్రథమ పురుషలో సాగుతుంది. నాకు సంబంధం లేని కథ. ఇంకో పత్రిక వారు చాలా బాగుందని వేసుకున్నారు. కథ చదివిన మరికొందరు వెస్ట్రన్ స్టైల్లో వుందన్నారు.
‘పిల్లలు’ కథ ఆంధ్రజ్యోతిలో ప్రింటయినప్పుడు తిడుతూ, మెచ్చుకుంటూ ఎన్ని ఫోన్లో! ఒక ఫోన్ కాల్ గురించి తప్పక చెప్పాలి. ‘వాళ్లకు పిల్లలు కనాలని వుంటదంటూ కథ రాయడమేమిటి? అన్నీ తెలిసే లోపలికి పోతరు. వాళ్లకు అట్లెందుకుంటది?’ అని. దాదాపు ఇదే అర్థంలో నాతో దెబ్బలాడిండు ఒకాయన. బహుశా అతను సంఘాల్లో పనిచేస్తున్న వ్యక్తి అయ్యి వుంటాడు. పార్టీలో పనిచేసేవారు అన్నింటికి అతీతులనే అపోహ కారణం కావచ్చు. సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తుతం నేను రాస్తున్న కథల గురించి కొంత వివరణ.
ఉద్యమంలో ఏం జరుగుతుందో, ఎంత మానవీయంగా, ప్రజలపట్ల బాధ్యతగా ఎలా వుంటారో, అసలు వారి జీవితం ఎలా గడుస్తుందో… ఇత్యాది విషయాలేవీ బయటివారికి తెలియవని అర్థమైంది. అందువల్ల, నా 14 ఏండ్ల ఉద్యమంలో నేను విన్నవాటిని, చూసినవాటిని కొన్నింటిని కథలుగా రాస్తున్నాను (నిజానికి చాలా మర్చిపోయాను
ఏది ఏమైనా ఉపయోగపడే విమర్శలను స్వీకరించాలని కాలక్రమంలో అర్థమైంది.
నా కథపై నా విమర్శ :
‘తాయమ్మ కథ’లో భర్త పరమ దుర్మార్గుడు. అతను ఇంట్లో వ్యవహరించే తీరు గురించి మాత్రమే రాసాను. నిజమే. కానీ, నాణానికి మరోవైపు చూడలేకపోయాను అనిపిస్తుంది. కమ్యూనిస్టు, అందునా సీపీ గ్రూపు నాయకుడైన తాయమ్మ భర్త… బయట ఎంతో మందికి ఆరాధ్యుడు. చేతికి ఎముకలేని మనిషి. ఈ తీరును కూడా గుర్తించి, రాసి వుంటే కథ మరోలా వుండేదేమో. ఆనాడు పార్టీలో పనిచేసే పురుష కామ్రేడ్స్‌ను పితృస్వామ్య భావజాలంపై పార్టీ అంతగా చైతన్యవంతం చెయ్యలేదేమో (ఎప్పటికైనా తాయమ్మ భర్త గురించి మరో కథ రాయాలి. రాస్తానో లేదో).
‘కవులమ్మ ఆడిదేనా’ కథ ముగింపు గురించి మరొకరు, ‘‘అదేంటమ్మా అలా ముగించావు? వృద్ధులు ఎక్కడన్నా గడపదాటి వెళ్తారా? ఎన్ని కొట్లాటలైనా ఇంట్లోనే వుంటారు కదా’’ అన్నారు. కవులమ్మ నిజంగానే బయటికి వెళ్లిపోయింది కానీ కూతురు దగ్గరికి చేరింది. కూతురు కూడా ఆదరించకపోతే ఏమి చేసునో తెలియదు. అందుకే కొద్దిగా ఆలోచించి ‘‘నిజమే సార్’’ అన్నాను. భౌతిక వాస్తవాలను మరింత గమనించాలని అనుకున్నాను.
అందరూ ఒకేలాగ వుండరు కదా. ఈ కథ రాసిన కొన్ని సంవత్సరాలకు కవులమ్మను కలిసినప్పుడు తెలిసింది – భర్త చనిపోయినప్పుడు ఎంత మంది చెప్పినా వెళ్లలేదట. ఆ కాలం మనుషులు లోకం ఏమనుకుంటుందో అనైనా వెళ్తారు. కానీ ఆమె వెళ్లలేదు – ఇంట్లోనే గాజులు, బొట్టు తీసేసుకుందట. అది ఆమె ధిక్కారం.
కథల గురించి నాకందిన సూచనలు :
నేను దండకారణ్యం పోయిన కొత్తలో మొదటిసారి సాధన (‘రాగో’ నవలా రచయిత) నాతో మాట్లాడుతున్నప్పుడు ‘‘కొత్తచిగుళ్లు కథ రాసిన టుంబ్రి నువ్వేనా’’ అని చాలా సంతోషపడ్డడు. ఈ కథ చదివి బాలల సంఘాల మీద దృష్టి పెట్టామని చెప్పాడు.
2000 డిసెంబర్లో అనుకుంటా… రాత్రి అన్నం తిని, మంట దగ్గర కూచున్న రామన్న (గణపతి)… అన్నం తిని వెళుతున్న నన్ను పిలిచి చాలాసేపు మాట్లాడారు. ‘‘మంచి విషయాలు అందరూ రాస్తారు, పార్టీలోని లోటుపాట్లపై విమర్శనాత్మక కథలు రాయ’’మని ప్రత్యేకంగా చెప్పారు.
మంజీరను తప్పక గుర్తుచేసుకోవాలి. చైనా సాహిత్యం పార్టీలో అంతా మంచే జరుగుతదన్నట్టుగా వుంటుందని, రష్యన్ సాహిత్యంలో పార్టీలోని పెడధోరణులపైనా విమర్శ వుంటుందంటూ ‘అపరిచిత’ నవలను ఉదాహరణగా చెప్పాడు ఓసారి. నేను కథలు రాయడం ఆగిపోయిన కాలంలో ‘‘కరుణను అందరూ మరిచిపోతారు. సంవత్సరానికి ఒక్క కథైనా రాయి’’ అని ప్రోత్సహించేవాడు.
నేను బయట వుంటున్నాను కానీ గాలిలో దీపం లాగా వుంది నా పరిస్థితి. పార్టీ కాంటాక్టు మిస్సయ్యింది. అప్పటికి మంజీర అమరుడయ్యి ఏడాది. అమ్మ వాళ్ల అంటే తోబుట్టువుల సపోర్టు లేదు. అత్తింటి వారూ అంతే. సరెండరా కాలేదు. రెక్కలు తప్ప ఏమీ లేవు (వాసిరెడ్డి నవీన్ గారు, కె.శివారెడ్డి గారు కలిసి హైదరాబాద్ మిర్రర్ అనే పత్రికలో ఇప్పించిన ఉద్యోగంతో పొట్టకు గడుస్తుంది). మనుషులేమో చాలా మారిండ్రు. అసలు అదో లోకంలో వుండేదాన్ని. బతికి వున్నాను. అంతే.
అట్లాంటి సమయంలో వరంగల్‌లో జరుగుతున్న విరసం కథా వర్క్‌షాపుకి వెళ్లాను. పాణికి తప్ప నేనెవరో అక్కడెవరికీ తెలియదు. తుమ్మేటి రఘోత్తం గారిని మొదటిసారి చూసింది అక్కడే. నేను బాగా నవ్వుతున్నప్పుడు సడన్‌గా ‘‘ఎందుకమ్మా అంత దుఃఖం’’ అన్నారు ఆయన. నవ్వుతున్న నా మొఖంలో గూడుకట్టున్న దుఃఖం ఆయనకెలా కనపడింది? అట్లా కదా మనిషి లోతుల్లోకి తరచి చూడాలి, అట్లా కదా అందరికీ కనిపించని కోణాన్ని కథకులు పట్టుకోవాల్సింది.
ఈ సందర్భంగా మరొకరి గురించి కూడా చెప్పుకోవాలి. ‘జీవితం’ సంపుటికి రాసిన ముందుమాటలో వరవరరావు గారు ‘పిల్లలు’ కథ గురించి నేను ఏమని అనుకుని రాసానో దాన్ని పట్టుకున్నారు. అలాగే, పాఠకుడు కనిపెట్టినా, కనిపెట్టకపోయినా రికార్డు కావాలనే వుద్దేశంతో ‘సహచరులు’ కథలో రాసిన విషయాన్ని ఏ.కె.ప్రభాకర్ గారు కనిపెట్టారు.
అల్లం రాజయ్యగారు ‘జీవితం’ ముందుమాట రాసాక మాట్లాడుతూ… పార్టీ గురించి ఎంత మంచి కథలు రాసావమ్మా! ఇలా ఎవరూ రాయలేదు. రాయండి – అని ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. బహుశా అదే నన్న లోపలి కథలు రాయడానికి పురికొల్పింది.
విరసం వర్క్‌షాపులు కూడా కథలను విశ్లేషించడంలో చాలా మెరుగుపడ్డాయి. నేను కథను తీసుకుపోక పోయినా ఇతర రైటర్స్ కథలను విశ్లేషించడాన్ని వినడం కోసం వెళ్తుంటాను.
రాయాలనుకుని రాయనివి :
నా అనుభవాలను నవలగా రాయాలని కె.శివారెడ్డిగారు చెప్పారు. అలాగే కొల్లాపురం విమల గారు కూడా నా ఆత్మకథను నవలగా రాయమని పలుమార్లు ఇప్పటికీ అడుగుతూనే వున్నారు. మంజీర గురించి నవల రాయాలని ఎన్నాండ్లుగానో అనుకుంటూనే రాయడం లేదు నేను.
ఈ సందర్భంగా మాస్టారును కూడా గుర్తు చేసుకోవాలి. ‘‘కొడవటిగంటి కుటుంబరావు తర్వాత మిడిల్‌క్లాస్ వారి గురించి కథలు బాగా రాయగలవు నాన్న రాయి’’ అన్నారు. ఆ పనీ అంతగా చెయ్యలేకపోయాను (‘లాభం-నష్టం = మానవ సంబంధాల బలి’, ‘బాధ్యత’ కొంతవరకు అలాంటివే).
ప్రపంచీకరణ నేపథ్యంలో దోపిడీ, మోసం అనేది సామాన్య జనం వరకు పాకడం, తమ స్వప్రయోజనం కోసం ఏ విలువలనూ పట్టించుకోకపోవడం, మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవడం నన్ను చాలా కలిచివేస్తున్న అంశాలు. ఈ గ్లోబలైజేషన్ వల్ల, స్మార్ట్ ఫోన్ల వల్ల ప్రజల జీవితాల్లో రాపిడ్గా వచ్చిన మార్పుల గురించి, అభివృద్ధి చెందిన దేశాలు, చెందని దేశాల ప్రజలందరినీ పెట్టుబడిదారులు ఒక్కలాగే మోల్డ్ చేస్తున్న తీరు గురించి కథలు రాయాలని అనుకోవడమే కానీ, ఇప్పటి వరకు రాయలేదు. రాయాలి.
రాసి పోగొట్టుకున్న కథలు :
దండకారణ్యంలో వున్నప్పుడు నేను కథలు తక్కువగా రాసాను. రాసినవి కూడా దొరకలేదు. ‘విప్లవ మహిళ’ రచనలన్నీ దాదాపుగా నావే. అందులోవి దొరకలేదు. ఇక లోపల నుంచి బయటి పత్రికలకు పంపిన కథలు కొన్ని మిస్సయ్యాయి. అలా మిస్సయిన మూడు కథలు మాత్రం గుర్తున్నాయి. ఒకటి, ఒకే భావజాలంతో ఉద్యమంలో పనిచేస్తున్న సహచరుల మధ్య ఎలాంటి గొడవలు, ఎందుకు వస్తాయనే కథ; రెండు, జైలు పోరాడి నక్సలైట్ కామ్రేడ్స్ పోరాడి సాధించుకున్న విజయాలు, తమను తాము ఎలా నిలబెట్టుకుంటారనే కథ; మూడు, దండకారణ్యంలో నన్ను కదిలించిన ఒక చిన్నారి కథ.
కథను నేను ఎందుకు రాస్తానంటే…
కథగా రాయకుండా వుండలేని కథలు రాసాను. నేనేదైనా రాస్తే మంజీర చాలా సంతోషించేవాడు – నాతో నాకోసం మాత్రమే ఒకటి, రెండు గంటలైనా గడిపేవాడు. అందుకోసం కొన్ని కథలు రాసాను. కొన్ని ‘ఇది కథగా రాస్తే బాగుంటది’ అనుకున్నవి రాసాను. ఇప్పుడు కూడా అలా రాస్తాను. కానీ…. నన్ను కోల్పోతున్నాననే ఆందోళన కలిగినప్పుడు, నాకు నేను ఓదార్పు నిచ్చుకోవడానికి, ఏకాకినయ్యానే భావన కలిగినప్పుడు, ఉక్రోషంతోనూ రాసిన కథలు వున్నాయి. కథ నాకు ఆలంబన, బహుశా నా అస్తిత్వం కూడా.
కరుణ గారి స్వ పరిచయం లో కథకులు నేర్చుకునేవారు నేర్చుకోవచ్చు
Thank you sir
కురణ మేడం కు అభినందనలు