పెరూ కమ్యూనిస్టులకు సంఘీభావం!
అభిమయేల్ గుజ్మన్ పార్థివ శరీరాన్ని అతని సహచరులకు అప్పగించండి!
అరెస్ట్ నుండి నేటి వరకు మొత్తం 29 సంవత్సరాల పాటు అమెరికా సహాయంతో, చిత్రహింసలపాలు చేసి నిదానంగా నిర్మూలించే అల్పసంఖ్యాత ప్రభుత్వాల విధానం ఫలితంగా ఖైదు చేయబడిన పెరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడి మరణించాడు. అభిమయేల్ గుజ్మన్ను అక్షరాలా కొన్ని మీటర్ల వెడల్పు ఉన్న భూగర్భ బోనులో ఖననం చేసారు; ఒక విస్తృత, ప్రజాదరణ పొందిన సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు మాత్రమే కాకుండా, ప్రతిఘటించినందుకు, తనని బందీ చేసినవారికి లొంగిపోనందుకు, తన భావజాలాన్ని విడవనందుకు కూడా అతన్ని శిక్షించారు. ఇన్ని సంవత్సరాలనుండి జైలులో జరిగిన మారణకాండలకు, వేలాది కమ్యూనిస్ట్ రాజకీయ ఖైదీల అమానవీయ పరిస్థితులకు పెరూలోని అల్పసంఖ్యాత ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.
అభిమయేల్ గుజ్మన్ మరణం పెరూలోనూ అంతర్జాతీయంగానూ మరొకసారి కమ్యూనిస్ట్ వ్యతిరేక ఉన్మాదాన్ని రగిలించింది. 1980-1990 దశాబ్దాలలో పెరూలో జరిగిన సాయుధ సంఘర్షణ వాస్తవాలపైన యింతకు ముందెన్నడూ లేనంతగా, సమన్వయంతో కూడిన పైశాచికత్వమూ, అపనిందలు, తప్పుడు ప్రచారం జరగడాన్ని మనం చూస్తున్నాం. కమ్యూనిస్టులను హింసకు పాల్పడేవారనీ, తీవ్రవాదులని, నిరాయుధ రైతులు, విద్యార్ధులు, కార్మికరంగ కార్యకర్తల మారణకాండకు బాధ్యులైనవారు, హింసలు, అదృశ్యాలు, చట్టవిరుద్ధమైన అధికారాలు, ఇతర నేర చర్యలలో నిపుణులైన ఫాసిస్ట్ సైన్యం, అవినీతి బూర్జువా రాజకీయ నాయకులు, వాషింగ్టన్, CIA లలో జీతాలకు పనిచేసే ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అండీస్‌లోని స్థానిక మహిళలకు భారీ ఎత్తున కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిపే కార్యక్రమాన్ని కూడా ప్రణాళిక వేసి అమలు చేసే స్థాయికి చేరుకున్న వారు, దేశ సంపదను దొంగిలించిన వారు, మెజారిటీ ప్రజలను పేదరికం, నిరక్షరాస్యతలో బలవంతంగా ఉంచిన వారు, కమ్యూనిస్టులను రాక్షసులుగా నిందించే సాహసం చేస్తున్నారు! వారితో ఒక పాలక మేధావుల సమూహం ఉంది, వారిలో కొందరు ప్రజాదరణపొందిన, విప్లవోద్యమాన్ని దూషిస్తూ తమ జీవనోపాధులను నిర్మించుకున్న పశ్చాత్తాపం చెందిన వామపక్షవాదులు, ఈ చివరి రోజులలో ప్రధాన అంతర్జాతీయ మీడియాలో కమ్యూనిస్ట్ వ్యతిరేక విషాన్ని చిమ్ముతున్నారు.
జాతీయభద్రత, అంతర్గత శాంతి భద్రతల కారణంగా చనిపోయిన రాజకీయ ఖైదీలను వారి కుటుంబాలు, సహచరుల ఇష్టానికి వ్యతిరేకంగా దహనం చేయడానికి అనుమతినిచ్చే సాధారణ ఆరోగ్య చట్టంలో పొందుపరిచిన చట్టపరమైన నిబంధనను ఆమోదించడం అనేది ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాద, అనాగరికతల క్రూరత్వాల శిఖరాగ్ర స్థాయిని సూచిస్తుంది. ’పవిత్ర విచారణ’ చీకటి సంవత్సరాలకు సమానమైన చర్య, ఇది అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలను, యుద్ధ సమయాల్లో చనిపోయిన వారికి యివ్వాల్సిన గౌరవాన్ని కూడా నిరాకరిస్తుంది. ఈ నిబంధనను కాంగ్రెస్‌లోని అన్ని మితవాద, సోషల్ డెమోక్రటిక్ పార్టీలు ఓటు వేశాయి, తన ప్రభుత్వంలోని మంత్రుల విభేదించినప్పటికీ కూడా అధ్యక్షుడు కాస్టిల్లో ఆమోదించాడు.
నియమాలు, సంప్రదాయ చట్టం ప్రకారం గుజ్మాన్ మృతదేహాన్ని ఖననం చేయడానికి అతని సహచరులకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న ప్రపంచంలోని ప్రజాస్వామ్య ప్రజలకు మా మద్దతును కలుపుతాము. మేము పెరూ కమ్యూనిస్టులందరికీ సంఘీభావాన్ని తెలియచేస్తున్నాం. రాజకీయ ఖైదీల విడుదలని, వారి హక్కులను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నాం. పెరూలో, అంతర్జాతీయంగా కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదాన్ని, కొత్త ’పవిత్ర విచారణ’ని ఖండిస్తున్నాం. కమ్యూనిస్టు ఆలోచనలు మరణించవు, కమ్యూనిస్టు ఆలోచనలు దహనం కావు!
ఇంటర్నేషనల్ బ్యూరో
ఏథెన్స్ సెప్టెంబర్ 2021
* యూరోప్, అమెరికా అంతటా మతవ్యతిరేకతను నిర్మూలించడానికి, అలా చేసినవారిని శిక్షించడానికి కాథలిక్ చర్చిలో ఏర్పాటు చేయబడిన ఒక శక్తివంతమైన కార్యాలయం ‘పవిత్ర విచారణ’. 12 వ శతాబ్దంలో ప్రారంభమై, వందల సంవత్సరాల పాటు కొనసాగి, హింసల తీవ్రత, యూదులను, ముస్లింలను హింసించినందుకు అపఖ్యాతి పాలైంది.