నన్ను పదేపదే వెంటాడుతున్న
ఒక అస్పష్ట పీడ కల-

పోయినవారం కూడా ఇలాంటి కలే
మొన్నగాక అటుమొన్న కూడా ఇలాగే
నిన్నమాత్రం కొంత స్పష్టంగానే-

అలౌకిక వ్యవస్థను
నిలదీసి ప్రశ్నిస్తున్నందుకు
బొమ్మ ముసలి ఒకటి
నా కాలును నోటకరిచి
నడి సముద్రంలోకి లాక్కుపోయి
తెలియాడుతున్న రాళ్ళవంతెనపై
విల్లును నిలువుగా పట్టుకున్న
నామాలమనిషిని,
తన బృందాన్ని చూపించి
నన్ను వాళ్ళకి సాగిలపడమని ఆదేశిస్తున్నట్టు-

యాభైయ్యారు అంగుళాల ఛాతీతో
కపట విశ్వగురువొకాయన
మేధాజీవులందరినీ ఒకచోట చేర్చి
ఈ నేలను సస్యశ్యామలం చేస్తున్న
జీవనదులన్నిటినీ తనలోకే ప్రవహించేట్లుగా
ప్రణాళికలు సిద్ధం చేయమని
ఆదేశిస్తున్నట్లు-

‘అదెలా సాధ్యం!
జీవనదులు పంటచేలల్లోకి
ప్రవహించాలి గాని
నీలోకి ప్రవహింపజేయడం
కుదరదు గాక కుదరదు’
అనాలి అని అనుకుంటున్న
ఒక బుద్ధిజీవి మనసులోని మాట
పెదవి దాటకుండానే
ప్రభుభక్తులు ఎట్లా పసిగట్టారోగాని
అతడి మెదడులోని
ఆలోచనా తరంగాలను ఏ.ఐ. తో
నిర్వీర్యం చేసినట్లు-

అనేకమంది శంభూకులు,
అనేకమంది ఏకలవ్యులు
అనేకానేకమంది ధీరులు
విరబూయాల్సిన కాలమిది అంటూ
అక్షరాలతో అగ్నిపుట్టించగల బుద్ధిజీవులు
సామూహిక గానం చేస్తున్నట్లు-

అసంతృప్తితో రగిలిపోతున్న
ప్రకృతి శక్తులన్నీ
తమకితామే స్వేచ్చనిచ్చుకొని
పాలు కుడుస్తున్న పాపాయిల
దేహాల్లో పరకాయ ప్రవేశం చేసి
నగ్న సత్యాలను బహిర్గతం
చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు-
*
ప్రశ్నించడం ప్రభుద్రోహమైనచోట
శిరసెత్తి ఆత్మగౌరవాన్ని
గానం చేయలేని స్థితి ఉన్నచోట
రాజ్యపు నరనరాల్లో మతంమత్తు
క్రూరాతిక్రూరంగా భీతావహం సృష్టిస్తున్నచోట
అనేకానేక చూపుడువేళ్ళు
మొలకెత్తాల్సిన సమయమిది


లౌకిక వ్యవస్థను పునర్నిర్మాణం చేయడానికి
భూమి పులకించినప్పుడు
అభిషేకం చేయడానికి
మంచి కలగనడం తప్పు కాదుకదా!?

Leave a Reply