మనసు మత్తడి పోస్తున్నది కలలను
కానీ మనసుకు ఆవల పని చాలా మిగిలున్నది నేస్తం!

ఇంకా కొన్ని దేహాలపై 
కాంక్షలు దాడులు చేస్తున్నవి!

ఇంకా కొన్ని నేరాలకై
ప్రజాస్వామ్య పావురం గొడుగు పడుతున్నది!

ఇంకా పార్లమెంటు అసెంబ్లీ భవనాలు
ఏదో అంటరానితనాన్ని పాటిస్తున్నవి!

ఇంకా ఓ ఆడకూతురు
పెందలకడనే మరణిస్తున్నది

ఇంకా విద్య 
పౌష్టికాహార లోపంతో జబ్బుపడి తల్లడిల్లుతున్నది!

ఇంకా ఓ సంచారి
సాయంకాలానికి ఓ చెట్టును, ఓ ముద్దను అర్థిస్తున్నాడు!

ఇంకా నగరం
రోజుకో బిచ్చగాణ్ణి అపస్మారక స్థితికి చేరుస్తున్నది!

ఇంకా పల్లె దేహం
వలసలతో సలసల కాగుతూనే ఉంది!

ఇంకా ఈ స్వరాజ్యం
బానిసత్వపు అవార్డులు ప్రకటిస్తూనే ఉన్నది!

ఇంకా కాలం నిండా
మరణ శిక్షలు బతుకు పేరుతో కారుచౌకగా అమ్మబడుతూనే ఉన్నవి!

ఇంకా ఓ పిచ్చుక గూడు
చోరీకై ప్రయత్నించబడుతూనే ఉన్నది!

మాట్లాడుకుని లాభం లేదు
ఓ కొడవలి కావాలి ఓ సుత్తెను పట్టాలి మన కోసం పూచిన నక్షత్రాల వెలుగులో నడవాలి!

ఇంకా మనసు కలల మత్తడి పోస్తూనే ఉన్నది...
కానీ విరామ సమయాలకు ఆస్కారం లేదు...!

ఓ క్షణం అలసిన పాదాలను చల్లటి నీళ్ళతో కడుక్కొని 
మెత్తటి నవ్వుల పువ్వులను చల్లి మత్తడికి కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ నడక సాగిద్దాం!

2 thoughts on “కలలతో పయనించే కాలం రాలేదింకా

 1. ✊✊💓
  మా సత్యం
  జి కళావతి గారి కవితలోని వాక్యాలు
  “మాట్లాడుకుని లాభం లేదు
  ఓ కొడవలి కావాలి ఓ సుత్తెను పట్టాలి మన కోసం పూచిన నక్షత్రాల వెలుగులో నడవాలి!”
  నిరంతర అప్రమత్తతో పోరాటానికి సంసిద్ధం అవ్వాలని అంతర్లీనంగా ప్రతీకాత్మకంగా తెలియజేశారు.

Leave a Reply