శ్రీనివాస మూర్తి ‘ఖబర్‌కె సాత్‌’ పదిహేను కథలు చ‌ద‌వ‌డ‌మంటే రాయలసీమ ముప్పై సంవత్సరాల రాజకీయార్థిక పోరాటాల భావోద్వేగాలతో మిళితం కావ‌డ‌మే. 1978 నుండి మా వూరంత ప్రేమగా ` రాయలసీమతో నాకు అనుబంధం ఉంది. మధురాంతకం రాజారాం, నరేంద్ర, మహేంద్ర, పిసి నర్సింహారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వడ్డెర చండీదాస్‌, సింగంనేని నారాయణ, శేషయ్య, శశికళ, బండి నారాయణస్వామి, నాగేశ్వ‌రాచారి,  శాంతినారాయ‌ణ‌, దేవపుత్ర, కేశవరెడ్డి, నామిని, రాసాని, సడ్లపల్లి చిదంబర రెడ్డి, పాణి, వరలక్ష్మి, వెంక‌ట‌కృష్ణ‌, సుభాషిణి, రామ‌కృష్ణ‌, రాప్తాడు గోపాలకృష్ణ, చక్రవేణు, సౌదా,  త్రిపురనేని శ్రీనివాస్‌, విష్ణు వంటి ఆత్మీయులంద‌రితో క‌లిసి తిరిగిన రోజుల‌వి.    విద్యార్థి ఉద్యమాలు, విరసం, విప్ల‌వోద్య‌మాల మ‌ధ్య  ఈ కథల కాలం ఇంకా  రూపొందుతూ ఉన్న‌ది. 

నక్సల్బరీ నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం దేశమంతా విస్తరించినట్లుగానే 1968 వరకే రాయలసీమకు చేరింది. అప్పటి కోపోద్రిక్త రాయలసీమ విద్యార్థి యువజనులు గ్రామీణ ప్రాంతాలల్లో, రైతాంగంలో పనిచేయనారంభించారు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి ప్రాంతంలో మ‌హ‌దేవ్, అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరాములు వంటి వాళ్లు విప్ల‌వోద్య‌మాన్ని నిర్మించే  పనిచేశారు. అప్పటి నుండే  నిర్బంధం అరెస్టులు, ఎన్‌కౌంట‌ర్లు.  1974లో ఏర్పడిన రాడికల్‌ విద్యార్థి సంఘం ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత రాయలసీమలోని మారుమూల గ్రామాలల్లోకి వెళ్లి ఉత్పత్తి శక్తుల, వనరుల, సామాజిక సంబంధాల‌ గురించి శాస్త్రీయ అధ్యయనం చేసింది. అది రాయలసీమ విద్యార్థి యువజన కార్యాచరణ కమిటీ (ACRSY) ఏర్పాటుకు దారితీసింది. దాని ఆధ్వర్యంలో కరువు, నీటిలో ఉద్యోగాల్లో సక్రమ వాటా కోరుతూ రాయలసీమ ఉద్యమం మొదలైంది. అప్పటి నుండి రాయలసీమలో క్షేత్రస్థాయి పాత వ్యవస్థకు, కొత్తగా రూపొందుతున్న వ్యవస్థకు పరిమాణాత్మక పోరాటాలను రాయలసీమ సాహిత్యం చిత్రించడానికి ప్రయత్నం చేసింది.  

ఇలాంటి పోరాట క్రమంలో`మొదట ఉత్పత్తి వనరుల విధ్వంసం, భీభత్స జీవితాల మీద‌, ముఖ్యంగా కరువు పరిస్థితుల మీద చాల సాహిత్యం వచ్చింది. క్రమంగా ఇక్కడి ‘ప్రకృతి’ కల్పించిన  తక్కువ వర్షపాతంతో  పాటు అర్ధవలస ` అర్ధ భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలు  కూడా కరువుకు కారణంగా గుర్తించారు. ఉత్పత్తి వనరుల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ఈ వైరుద్యాన్ని వాడుకొని  అగ్రకులం దోపిడి పీడనతో ఎదిగి మొత్తం రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితికి కారణభూతంగా తేలింది. ఈ అవగాహనతో చక్రవేణు కసాయి కరువు కథల సంపుటి వచ్చింది. ఆ తరువాత తీవ్రమైన ముఠాతగాదాలు రక్తసిక్త పల్లెలు ` కులాల మధ్య హత్యలు పెరిగిపోయాయి. ప్రజాస్వామిక ఉద్యమాలు పెరిగి  ప్రజల్లో చైతన్యం పెరిగి పోరాటాలు బ‌ల‌ప‌డ్డాయి. దీంతో క్రూర‌మైన‌ భూస్వామిక శక్తులు  గ్రామాలనొదిలి రియల్‌ ఎస్టేట్‌ ` కార్పొరేట్‌ కాలేజీలు, వైద్యం, మైనింగ్‌ లాంటి వాటిలోకి తరలిపోయి ` సేఫ్ జోన్లు ‘ చూసుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో రాయలసీమ అంతర్గత వలసదోపిడి ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి, నీటి ప్రాజెక్టుల గురించి  ఉద్యమాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. 

రాష్ట్రమంతటా జరిగినట్లుగానే రాయలసీమలో తీవ్ర నిర్బంధం అమ‌లైంది.  ఎన్‌కౌంటర్‌ హత్యలు జరిగాయి. ఇలాంటి చారిత్రిక నేపథ్యంలో 1980ల  విద్యార్థి, పౌరహక్కుల, విరసం లాంటి సంస్థల నుండి ఎదిగిన తరంలో శ్రీనివాసమూర్తి ఒకరు. ఈ సుదీర్ఘ వ‌ర్గ‌పోరాట సంఘ‌ర్ష‌ణ నుంచి ఆయ‌న  ‘సేద్యం’ వంటి క‌థ‌లు రాయ‌డం మొద‌లుపెట్టాడు.   పాత కొత్తల సంకుల సమరంలో ` నిలబడి ` బతుకుతెరువు కోసం కార్పొరేట్‌ కాలేజీలో లెక్చరర్‌గా  ప‌ని చేసినా  ఆ సలపరం తగ్గలేదు. (చక్రవేణు, రాప్తాడు గోపాలకృష్ణ ఈ ఒత్తిలో నలిగిపోయి అర్దాంతరంగా అసహజ మరణాలపాలయ్యారు.) ఆ పోరాటపు  ఒత్తిళ్ల‌ను, విజ‌యాల‌ను, గాయాలను తడుముకోవడమే ఈ  పదిహేను కథలు.  అలాంటి కొత్త ప్రపంచపు నిర్మాణ కలలను ఈ ఇరువై సంవత్సరాలు పదిలంగా దాచుకొని  రకరకాలుగా మారుతున్న రాయలసీమ ప్రజల ఆరాట పోరాటాలే అతన్ని నిలబెట్టాయి. మళ్లీ తను మొదలు పెట్టిన కథా సేద్యం  దు:ఖాలన్నీ కడిగేసుకొనే  కొత్త ప్రయాణం. ఇందులో ఒక్కొక్క అడుగు కూడదీసుకోవడమే ఇరువై సంవత్సరాల తరువాత రాసిన ఆరు కథలు. ఇరువై సంవత్సరాలు ఏమి రాయకుండా గునగునాయించుకోవడం ఎంత యాతనో? 

భారతీయ సమాజాన్ని విశ్లేషిస్తూ కారల్‌ మార్క్స్‌  భారతీయ గ్రామాలు పద్దెనిమిదవ శతాబ్దం దాకా కాన్‌సంట్రేషన్‌ క్యాంపులన్నారు. అప్పటిదాకా జరిగిన ప్యూడల్ యుద్ధాలలో, దండయాత్రలలో గ్రామాలది ప్రేక్షక పాత్రే. అయితే గ్రామాల మీదుగా వెళ్లే దండు దోపిడిని ఎదిరించేవారు. అంటే ` కులాలు ` ఉత్పత్తి విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోలేదు. యూరప్‌లో మొదట గ్రామాల విచ్ఛిన్నంతోటే బూర్జువా విప్లవం మొదలయ్యింది.     ఇలాంటి ఉత్పత్తి శక్తుల పెనుగులాటలో  బయటపడే మార్గం లేక  రాయ‌లసీమ‌లో వాళ్లలో వాళ్లు భీకర యుద్ధాలు చేసిన కులాల గురించిన క్షేత్ర స్థాయి రుజువులే    శ్రీ‌నివాస‌మూర్తి మొదటి  ఆయిదు కథలు.  

శ్రీశైలం ప్రాజెక్టుతో సాగు నీటి సౌకర్యం పెరిగి బాగుపడాల్సిన పుల్లన్న ముంపులో ఇరువై ఎకరాలు పోగొట్టుకొని నిర్వాసితుడయ్యిండు. వూరి రెడ్డి లాయర్లకు ఏజెంటుగామారి  భూములకు డబ్బులిప్పించి లాభపడ్డడు. కొడుకు చిన ఈరన్న బతక వలసపోయి నైపుణ్యం లేక, అక్కడి పరిస్థితులతో ఇముడలేక  మళ్లీ ఊరికి తిరిగొచ్చిండు. పుల్లన్న బతకడానికి చేపలు పట్టే పనికి దిగిండు. ‘వూరు మునిగింది’ కథ నిండా వూరు మునిగిన విషాదం. ఇది భారతీయ విధ్వంసకర అభివృద్ధి నమూనా. గ్రామాలల్లో ముఠా తగాదాల భీభత్సం వెనుక వున్న భూమిక దేవుని మాన్యం. ఊరు ఒక నిరంతరం రగిలే పొయ్యి, అది  ఎవరినైనా కాల్చిపారేస్తుంది. ఏదో ఒక ఆసరా పట్టుకొని ఊరు నుండి బయటపడినవారు బతికారు… లేనివారు ఒకరినొకరు ఏదో కారణంతో చంపుకున్నారు. విప్లవోద్యమం తెచ్చిన కొత్త సంఘటిత రైతాంగ పోరాటాలతో ఊళ్ల నుండి అగ్రకుల ప్యాక్షనిస్టులు పట్నాలు పట్టి రకరకాల వ్యాపారాలతో బాగుపడ్డారు… అలాంటి రాయలసీమ గ్రామాలల్లో ` వృత్తి పనివారు చేప‌ట్టిన‌ కొత్త నిర్మాణమే  ‘అడివోడు’  క‌థ‌. 

నిజానికి యూరప్‌ పెట్టుబడిదారుల్లో  ఎదిగి బూర్జువా విప్లవాన్ని నడిపింది ఇలాంటి వృత్తిపనివారే. మంగలి గూని మాదన్న,ఉప్పరి కిష్టన్న స్నేహితులు. ` కులకట్టడి ` ప్ర‌కారం మంగలి మాల మాదిగలకు క్షుర కర్మలు చేయకూడదు. ఉప్పరి ‘అడివోడు’  అన్ని వృత్తులు నేర్చుకొని రోడ్డుపక్కన మంగలి షాపు తెరిచి `కుల కట్టడిని బద్దలుకొట్టి మాల మాదిగలకు క్షుర కర్మచేశాడు. భూస్వామ్య కుల కట్టడిని ధిక్కరించాడు. జాతీయ పెట్టుబడిదారులుగా ఎదుగాల్సిన వీరిని  బ్రిటిష్‌ వలసపెట్టుబడి  అడ్డుకొని అగ్రకుల భూస్వాములను దళారి పెట్టుబడి దారులుగా మార్చింది. దళిత   మద్దన్నకు కూలి సరీగ యివ్వనందుకు  యువజన సంఘం నాయకుడు కూడా అయిన కొడుకు ఓబులేసు అడిగాడు. ఫ్యాక్షన్ నాయకుడు గౌడు ఓబులేసును హత్య చేయించాడు. యీ కేసు వాదించడానికి దళిత లాయర్‌ దేవ రత్నంకు భయం.అండగా యువజన సంఘం ముందుకు  వ‌చ్చినా అది  ‘మెడమీద వేలాడేకత్తి’.

మాల మాదిగ కులాలను ఏకం చేయాలనే కథ ‘ఏకం గార్రి’  మాల మాదిగల మధ్య ఏదో ఒక తంపుపెట్టి వాళ్లలో వాళ్లు కొట్టుకునే ఎత్తుగ‌డ‌ భూస్వాములది. ఈ గొడవల్లో  వాళ్ల భూమి కాజేయాల‌నుకుంటారు. ఈ ఎత్తును దళితులు తిప్పికొట్టడం ఈ కథ.

పార్ల‌మెంట‌రీ ఎన్నికలల్లో కుల రాజకీయాలను ఎంత చాకచక్యంగా వాడుకుంటారో ఓటు మల్లన్న క‌థ‌లో చాలా వ్యంగ్యంగా చిత్రించాడు.  బ్రాహ్మణీయ భూస్వామ్యంలో పితృస్వామ్య హింస మహిళల మీద ఎంత దారుణంగా ఉంటుందో ధ్వంస రచన కథ చెబుతుంది. కుటుంబం రాజ్యానికి సూక్ష్మ రూపం.  భూస్వామ్య సమాజంలో హింస  పాత కొత్త సమాజాల  మ‌ధ్య పెనుగులాటలో అనివార్యమైంది.  కుటుంబ చట్రం  పాత సామాజిక వ్యవస్థలో ఏర్పడింది.  వర్గ పోరాటంతో పరిస్థితులు మారుతూ ఉంటాయి. కుటుంబ చట్రం ఈ వత్తిడిని తట్టుకోలేదు. అట్లాగని పాత రూపంలో కొనసాగలేదు. కొత్త మానవీయ రూపం రూపొందించుకో వాల్సిందేనంటాడు మూర్తి. ఈ కొత్త చట్రం రూపొందించుకునే పోరాటమే నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం. అంటే అర్ధ వలస. అర్ధ భూస్వామిక వ్యవస్థను కూలదోయడం. 

మరో కథలో స్త్రీ పురుషుల పని విభజన  నిండా పేరుకపోయిన మురికితో ఆడవాళ్ల జీవితాలు ఎంత పాచి పట్టాయో మూర్తి రాశాడు. 

ఈ కథలన్నీ శ్రీనివాసమూర్తి ఉద్యమాలల్లో తన వంతు కర్తవ్యంగా పాల్గొంటూ  1990 నుండి 2000 దాకా రాసినవి. ఆ తరువాత ఇరువై సంవత్సరాల విరామం.  కార్పొరేటు కాలేజీలో లెక్చరర్‌ వృత్తి . ప్రపంచీకరణ తరువాత  యువతరాన్ని సామాజిక ఉద్యమాల నుండి దూరం చేసి ` వ్యక్తి కేంద్రంగా ` సరుకు అమ్మకపు ఏజెంట్లుగా సర్వీసు రంగమనే దగుల్బాజీ సామ్రాజ్యవాద మార్కెటు విస్తరణలో బలి పశువుల తయారీ కేంద్రాలుగా కార్పొరేటు విద్యారంగం మారిపోయింది. పోటీ అనే కత్తి అటు విద్యార్థుల మీద‌, ఇటు ఉపాధ్యాయుల  బతుకుల మీద వేలాడుతోంది. ఈ ప్రక్రియ ఎంత హింసాత్మకమో? మోసకారిదో? 

 ` హాయి హాయి ఆపదలు కాయి, కవుడు అను నొకకాపటి అనే క‌థ‌ల్లో దీన్ని చిత్రించారు. 

హింసాత్మక ఉత్పత్తి విధానంలో  మనుషులు, పశుపక్షాదులు, ఎట్లా విధ్వంసమౌతున్నాయో  పర్యావరణం మీద కొత్త ఆలోచనలతో మూడు కథలు రాశారు. కోవెలమావటి, స్వాములొచ్చారు, దొర్లుదొర్లు పుచ్చకాయ్ ` ఈ మూడు కథలు లోతైన తాత్విక నేపథ్యంలో రాసినవి. కాశ్మీర్‌లో జరుగుతున్న మారణకాండ మీద రాసిన  ‘ఖబర్‌కేసాత్‌’ ఒక  హృదయ విదారకమైన కథ. 

ఈ పదహారు కథల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగిన కథ ‘సేద్యం’.   ఉత్పత్తి శక్తులు తమ వికాసం కోసం నిరంతరం పోరాడుతూ ఉంటాయి. అలాంటి వర్గ పోరాటం పరిమాణాత్మక దశల గుండా సాగి గుణాత్మక మార్పుకు దారి తీస్తుంది. పాతది నశించి కొత్తది రూపొందుతుంది. ఈ నిరంతర వర్గ పోరాటం సేద్యం లాంటిది.   ప‌రిణామాత్మ‌క  పోరాటాలను గుర్తించినంత సులువుగా గుణాత్మ‌క  దశలను గుర్తించి చిత్రించలేం.  ఈ క్ర‌మాల్లో  భావోద్వేగాలు చెలరేగుతాయి. నిరాశ నిస్పృహలు చుట్టుముడుతాయి. అనేక కొత్త భావవాద సిద్ధాంతాలు ఈ దశలోనే బయలుదేరుతాయి. వాటికి భిన్నంగా స్ప‌ష్ట‌మైన దృక్ప‌థంతో కనిపించని ఆ లోపలి మార్పులను చిత్రించినవే ఈ కథలు.  ఇలాంటి అన్ని దశల గుండా తీవ్రమైన భావోద్వేగాలతో తగిన శిల్పంతో, భాషతో రాసిన ఈ పదహారు కథలు ముప్పయి సంవత్సరాల రాయల సీమలోని వర్గపోరాటాలను అధ్యయనం చేయడానికి, ముందుకు సాగడానికి దారి తీస్తాయి.  పాణి ఈ కథలకు రాసిన ముందుమాట చాలా విలువైనది. 

One thought on “క‌థ‌ల సేద్యం

  1. “కబర్ కే సాత్” కథా సంపుటి పై అల్లం రాజయ్య గారి సమీక్ష బాగుంది. శ్రీనివాసమూర్తి గారికి అభినందనలు.

Leave a Reply