Truly to sing, that is a different breath. Rainer Maria Rilke. (Austria poet)

ఇప్పుడు రాస్తున్న యువకులు అంతా తమ కొత్త గొంతుతో‌ ధిక్కార స్వరంతో‌ తమదైన నుడికారంతో రాస్తున్నారు. ఇటీవలి‌ విరసం సభలలో ఆవిష్కరించిన “నేల నుడికారం” కవిత్వం ఉదయ్ కిరణ్‌ రాసింది చదువుతుంటే మనల్ని మనంగా నిలవనీయని ఒక కుదుపు ఆ పదాల‌ పొందికలో చూసిన‌ అనుభూతికి లోనవుతాం. తీరికగా కూచుని కవిత్వం రాసే తరం కాదిది. పొట్టకూటి కోసం నిరంతరం శ్రమిస్తూనే తమ‌ రోజువారీ పనులు చేస్తున్నట్లుగానే ప్రజల పట్ల ఒక బాధ్యతగా రాస్తున్న యువతరమిది. చెప్పాలనుకున్నది సూటిగా గుండెల్లోకి గుచ్చుకున్నట్లు, నిద్ర పొరలను చీల్చే వాక్యాన్ని బాణంలా సంధించి వదిలే నేర్పరితనం ఉదయ్ కవిత్వంలో వుంది. ప్రస్తుతం దేశములో అమలవుతున్న ఫాసిస్ట్ రాజ్య నిర్బంధాన్ని అది అన్ని రకాలుగా ఆదివాసీ, దళిత, మైనారిటీ తెగలు కులాల మధ్య చిచ్చు పెడుతూ హిందూ కార్పొరేట్ శక్తులకు ఈ దేశ మూల సంపదను ధారాదత్తం చేసే కుట్రను, ఉద్యమిస్తున్న ప్రజలపై చేస్తున్న దాడులను వస్తువుగా స్వీకరించి పీడితుల గొంతుగా తనను తాను ప్రకటించుకున్న వాడు ఉదయ్ కిరణ్.

దేశమంతా మత పిచ్చితో

మారణహోమంలో

మునిగిపోతుంటే

మరెంత కాలం….

ఆ నాలుగు గోడల మధ్య

స్వప్నపు కాంతులంటూ

కలలు కంటావ్?

లే ఆ చీకటి

ప్రపంచం నుండి

బయటకు రా..

అని యువతరాన్ని ఎలుగెత్తి పిలుస్తూ కార్యాచరణ ప్రకటిస్తున్నాడు ఉదయ్.

ప్రశ్నించడం ఈ తరానికి‌ కావలసిన ముఖ్య లక్షణం. ప్రశ్నకు దూరమై కెరీరిజంలో పడి‌ తమకేమీ పట్టని నేటి యువతరంలో మేమూ ఉన్నామని ఉదయ్ లాంటి యువకులు మరింతగా కదలాల్సిన అవసరముంది. ప్రజల పట్ల‌ తమకున్న కన్సర్మ్ ఒక ధిక్కారపు గొంతుతో పలుకుతోంది.

అక్షరమే ఆయుధమై

గళం ఎత్తి‌ ప్రశ్నించినప్పుడు

అక్షరాల అణుబాంబులను

మనం కురిపించినప్పుడు

ప్రశ్నించిన వారిపై

ఒక పీడీ యాక్ట్

ఒక ఊపా

ఒక అర్బన్ నక్సలైట్ అని

జైలు గోడలు రుచి చూపిస్తున్న

బలవుతున్న సంఘటనను

మనం ఎదుర్కుంటూ నిట్టూర్పిడిచిన

ఆ క్షణాలు ఎప్పటికీ మరువలేనివి

అంటూ రాజ్యానికి ప్రశ్నించే వారంటే ఎంత భయమో తెలియ చేస్తాడు ఉదయ్.

అలాగే ఈ తరంలో అధిక శాతంలో లేని జవాబుదారీతనం మనం ఉదయ్ కవిత్వంలో చూసి అబ్బురపడతాం. ప్రజల పట్ల, ప్రజల పోరాటాల పట్ల తనకున్న మమకారంతో రేపేదయిన తమకు జరగరానిది జరిగితే తన కవిత్వమే గొప్ప హామీగా ఈ కవితలో మనకు ఇస్తాడు.

ఎప్పుడైనా నేను గుర్తొస్తే

కన్నీళ్ళు పెట్టుకోకండి

“కాలం చీకటి గర్భంలో నన్ను కంటుంది”

అన్న నా కవితలను ఒక్కసారి చదువుకోండి

అక్షర రూపంలో నేనెప్పుడూ

మీతో బతికే ఉంటాను

అని హామీ పడడం చూస్తుంటే ఈకాలం యువతలో ఎంత మెచ్యూరిటీ వుందని ఆశ్చర్యంగా వుంది. రేపటి యుధ్ధానికి తయారుగా వున్న కొత్త సైన్యాన్ని ప్రజలే తయారు చేస్తున్నారన్న భరోసా కలుగుతుంది.

ప్రేమను శాసిస్తున్న కులాధిపత్యాన్ని తామెలా ఎదర్కొంటున్నామో అది తమనెలా కల్లోల పరుస్తుందో తమ కలలను ఎలా చిదిమేస్తూ వుందో ఉదయ్ “అంటరాని ప్రేమ” కవితలో వ్యక్తపరిచిన తీరు తీవ్రమైన ప్రకంపనలు కలుగ చేస్తుంది.

అంటరాని మన ప్రేమలో

అంతు చిక్కని ప్రశ్నలెన్నో

నా నెత్తుటి ధారలతో

ఈ లోకం నుదుటిపై

సమాధానం రాయలేవా?

దేశమే కులం కంపుకొడుతోంటే

నీవు అడవంతా తిరిగి ఏరిన ఆ మల్లెల

సుగంధాల ఎరుపును ఎల్లెడలా

వెదజల్లవే చంచలా!! అని ప్రేయసిని కోరడం ఎంత దుఃఖదాయకం కదా?

చివరిగా తను ఈ యుధ్ధ సమయాన

యుద్ధం మాకేమీ కొత్త కాదు

హక్కులను గెలవడం కోసం

మరో పోరాటాన్ని సాగిస్తాం

నూతన స్వాతంత్ర్యం కోసం

మరో పోరాటాన్ని సాగిస్తాం…. అంటూ భవిష్యత్తు గురించి హామీపడడం ద్వారా ఈ తరం మరో పోరాటానికి సిద్దపడుతూ వుందన్నది గొప్ప భరోసా. ఈ నిర్బంధాల‌ నిరాశామయ కాలంగా ఆచరణకు దూరంగా వున్న వారు ఇంకేమీ లేదు అని నిట్టూర్పు విడుస్తున్న వేళ ఉదయ్ కిరణ్ ఈ ‘నేల నుడికారం’ కవిత్వ ప్రకటన గొప్ప ఆశను కలిగిస్తుంది. అందరూ చదవాలి చదివించాలి అని కోరుకుంటూ ఉదయ్ కు నా అభినందనలు.

Leave a Reply