కర్నూల్ రాజవిహార్ సెంటర్ అత్యంత ఖరీదైన మనుసులు తిరుగాడే ప్రాంతం.పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, బహుళ  అంతస్థుల భవనాలు, సామాన్య మానవుడు అడుగు పెట్టలేని మౌర్య ఇన్ హోటల్, మెడికల్ కాలేజీ హాస్టల్, ఆధునికత పేరుతో కట్టేబట్ట కరువై ఖరీదైన  కార్లలో తిరిగే మనుషులు( చిరిగిన జీన్స్). వీటన్నిటి మధ్య ఎండిన ఎదకు చిన్నపిల్లను అతికించుకుని అడుక్కునే మహిళలు. వారికి తోడు చెదిరిన జుట్టు, చిరిగిన బట్టలతో వాహనాల పొగ మొత్తం మొఖానికి పులుముకుని నడుస్తూ అడుక్కునే బాలికలు. వారి దీనస్థితి  చూసి  ఎవరూ  జాలిపడరు. ఎందుకంటే వాళ్ళు “శికారీలు”.

మా చిన్న తనంలో శికారీలు అప్పుడప్పుడు అడుక్కోవడానికి మా ఊరికి వచ్చేది. ఆ రోజు ఊర్లో పెద్ద అలజడి శికారోళ్ళు వచ్చారు ,శికారోళ్ళు వచ్చారు అని జనమంతా ఏకమై వారిని ఊరి పొలిమేర దాకా తరిమేది. శికారోళ్ళు అంటే అతికిరాతకులు, దొంగలు, ఒంటరిగా మనిషి కనపడితే చంపేస్తారు అనే ప్రచారాలు ఉండేవి గ్రామాలల్లో. ఈ శికారి నవలలోని ‘నానా’లాగ ఎంతమంది ఆకలికి తట్టుకోలేక గ్రామాలలో అడుక్కోవడానికి వచ్చేవారో. ఆకలితో వచ్చి చేయి చాచిన వాడికి అన్నం పెట్టక పోగా  దొంగలని హంతకులని ఊర్లో నుండి తరుముతున్నప్పుడు వారి మానసిక పరిస్థితి మనిషిగా మనం వారి మనసులను చదవాల్సిందే.

 మా అమ్మ పుట్టినిల్లు కర్నూల్ కావడం వలన నేను ఎక్కువగా కర్నూల్లో ఉండేవాడిని. అయితే రోజు కొత్త బస్టాండుకు పోయే ప్పుడైనా, శ్రీరామా, ఆనంద్, వెరైటీ థియేటర్లలో సినిమాకు పోయినప్పుడైనా నిత్యం శికారాళ్లను చూస్తూనే పెరిగాను. ఆధునిక పోకడలు, సామ్రాజ్యవాద సంస్కృతి త్వరితగతిన పెరిగిపోతున్న ఆంధ్రరాష్ట్ర రాజధాని అయిన కర్నూల్ నగరంలో కేసి కెనాల్ ఒడ్డున నేటికీ ఆటవిక జీవనం కొనసాగిస్తున్న ‘శికారి’ల గురించి ఏనాడూ ఆలోచించలేదు. పాణి ఈ నవల ద్వారా ఇలాంటి వారు ఈ సమాజపు అట్టడుగున ఇంకా వున్నారు అని చెప్పే కృషి అభినందనీయం.

నవల చదువుతున్నంతసేపూ కెనాల్ కట్టపైన శికారీలు కాసే సారా ఘాటు వాసన మన నాసికా పుటలకు తగులుతూనే వుంటుంది. ఈ సారా కాయడం, అమ్మడం కోట్లకు కోట్లు సంపాదించడానికి కాదు. ఆ మాటకువస్తే వారికి రేపటి గురించిన ఆలోచన కూడా ఉండదు. సారా ద్వారా ఆ పూటకు తినడానికి దొరికితే చాలు అనుకుంటారు. అటువంటి వాళ్ళపైన ఎక్సయిజ్ , పోలీస్ జులూంలు, కేసులు,  లాయర్లు అందరు వారిని పీడించే వారే. ఈ విషయం లో లంబాడీలది, చెంచులది కూడా ఇదే స్థితే. నల్లమల లోని చెంచులు ఇప్పపూల సారా కాస్తే వారిపైన కేసులు పెట్టి వేధిస్తుంటారు. ఇక్కడ చెంచుల ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పాలి. రోజు రోజుకూ అంతరించి పోతున్న అరుదైన ఆదిమ మానవజాతి చెంచులు. దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంటే చెంచుల జనాభా తరిగిపోతున్నది.

 మనకు తెలియని శికారీల ఆచార వ్యవహారాలు , వారి ఇలవేల్పులు  ఈ నవల ద్వారా మనకు తెలుస్తాయి. ప్రతి జాతికి, ప్రతి కు లానికి వారి వారి ఆచారాలు వున్నట్లే శికారీలలో కూడా అన్న భార్యను కానీ, తమ్ముని భార్యని కానీ పెళ్ళి చేసుకునే ఆచారం వుంది. ఆచారం అన్ని ఆదిమ సమాజాలలో వుంటుంది. అదే సమయంలో ఏ మహిళతోనైనా వివాహేతర సంబంధం    పెట్టుకోవడం నేరంగా భావించే నైతిక విలువలు కలిగిన ఆచారం గొప్పది. వేటాడడం శికారీల ప్రధాన వృత్తి. ‘శికారి’అంటేనే వేట అని అర్థం. వేటకు పోయిన వాళ్ళు వేటను తెస్తే పోని వాళ్లకు కూడా వేటమాంసం పంచి ఇచ్చే గొప్ప మానవతా ఆచారం నవల ద్వారానే మనకు తెలుస్తుంది. శికారీలను చూస్తే మనుషులు దీనంగా, సారా కాసే మంట పక్కన ఉన్నందుకా మసికొట్టుక పోయారు అన్నట్ల వుంటారు. తైల సంస్కారం లేని జుట్టు, మాసిన బట్టలు, సబ్బు ఎరుగని మొఖం అలాంటి మనుషులలో ఇంత గొప్ప నైతిక విలువలు, మానవత్వం ఆచారాలుగా కలిగివుండడం చదువుతుంటే చిన్ననాటి నుండి వారి పైన ఉండే అభిప్రాయం పోయి గౌరవం పెరుగుతుంది. ఇలా సమాజంలో నిరాదరణకు  గురౌతున్న మనుషుల గురించి ఇంకా నవలలు రావాల్సే వుంది. ఆ మేరకు పాణి మంచి వస్తువును ఎన్నుకున్నాడు.

 ఈ దేశంలో కులం అనే జాడ్యం ఎంతగా అట్టడుగు పొరలలోకి చొచ్చుకు పోయి ఎన్నిరూపాలలో వేళ్లూనుకుని ఉన్నదో  అది అనుభవించిన వారికే  తెలుస్తుంది. నిచ్చన మెట్ల వ్యవస్థలో ప్రతికూలం ఇంకో కులం కంటే అధికులం అనుకుంటూ వాడి పై కులానికి బానిసగా ఉంటూ కిందికులాన్ని అసహ్యించుకుంటారు.  నవల కొనసాగిన కర్నూల్ బంగారుపేట లో ‘మాదిగలు, శికారీల’వి కలగలిసి పోయిన జీవితాలు. శికారీల జీవన విధానం కన్నా, వారి వేష బాషలకన్నా మాదిగలు చాలా మెరుగ్గా వుంటారు. మాదిగ బజారు అనర ను  పెళ్లి చేసుకున్నందుకు కులం చెడిందని శికారీ  అనర ను  సాంఘిక బహిష్కరణకు గురిచేయడం, ఆమెకు ఆరోగ్యం బాగాలేక విలవిల్లాడుతుంటే ఎవరు సాయం పట్టకపోవడం చూస్తుంటే సమాజ నిచ్చనమెట్లా వ్యవస్థను ‘మనువు’ఎంత పగడ్భందిగా నిర్మించాడో అర్థం అవుతుంది.

మంచి వస్తువు, నవలను నడిపే విధానం అన్ని  బాగున్నాయి. అయినా నవలలో ఒక సంఘటన గురించిన సలహాలాంటి విమర్శ వుంది నాకు .’నానా’ రైలెక్కి వెళ్లిపోయిన తరువాత అటు తిరిగి ఇటు తిరిగి రోడ్డు పక్కన హోటల్ నడుపుకునే నాగమ్మ పంచన చేరుతాడు. ఆమె అతన్ని ఆదరిస్తుంది, ఆశ్రయం కల్పిస్తుంది. నవలాకారుడు ఆమె ‘మాదిగామే’ అని చెప్తాడు. కావొచ్చు కూడ అభ్యంతరం లేదు. కానీ ‘నానా’ తిరిగి వచ్చే చివరి రోజు వారిద్దరు ఏకమౌతారు అని చెపుతాడు. ఇక్కడే నాకు అభ్యంతరం.నిజానికి  ఆమె కులం చెప్పకపోతే నవలకు గాని వస్తువుకు గాని వచ్చే ప్రమాదం ఏమిలేదు.  చెప్పడం వలన వచ్చిన ప్రయోజనం కూడా శూన్యమే. ఇక్కడ ఆమె కులం చెప్పడం ద్వారా మాదిగలు మానవత్వం కలిగి వుంటారు. కష్టాలలో ఉన్న వారిపట్ల కరుణ కలిగి వుంటారు అని చెప్పడం ఉద్దేశ్యం కావచ్చు. చివరి రోజు ఏకాంతంగా కలిశారు అని చెప్పడం ద్వారా మాదిగ మహిళలు ముక్కూమొఖం తెలియని దారిన పోయే వారితో కూడా ఏకాంతంగా కలుస్తారు అని చెప్ప్పాలనుకున్నాడా? అన్నది నా  విమర్శ.  అభ్యంతరం కూడా . మాదిగ కులం పట్ల ఆ మహిళల పట్ల సమాజంలో ఉన్న పెత్తందారీ భూస్వాములకు ఉన్న అభిప్రాయాన్ని ‘పాణి’లాంటి వారి అభిప్రాయంగా చదివినప్పుడు గుండె కలుక్కు మంటుంది.  ఏది ఏమైనా ఒక అంతరించిపోతున్న జాతిని నవల వస్తువుగా ఎన్నుకుని నవలీకరించి నందుకు   పాణికి అభినందనలు.

Leave a Reply