ఇది ముప్పై ఆరు పేజీల లహర్ సాహిత్యం.ఇందులో తొమ్మిది  కవితలు ఒక కథ ఉంది. ఈ తొమ్మిది కవితల్లో, కథలో ఒక్కటి మినహా మిగతావి అన్నీ ..

తనతో పాటు నడిచిన

తనకు ప్రేరణనిచ్చిన

తనకు జ్ఞానాన్ని ఆచరణను అలవర్చిన ….అమరుల జ్ఞాపకాల సద్దిమూట. స ద్దిమూటే కాదు. దండకారణ్య విప్లవోద్యమ వర్తమాన చరిత్రకు సాక్ష్యం ఈ సాహిత్యం.

2007 నుండి 2020 వరకు రాసిన ఈ కవితలు మరీ పిరికెడు కూడా లేవు కదా అని అనిపిస్తుండొచ్చు మనకు. నిజమే అనిపిస్తుంది కూడా.

ఐతే,

ఫాసిస్టు దోపిడీ పాలక వర్గాలు సల్వాజుడుం గ్రీన్ హంట్ సమాధాన్ ప్రహార్ ఇలా రకరకాలుగా సైనిక ఆపరేషన్స్ పేరుతో సొంత బిడ్డల మీదనే మధ్యభారతం మీద యుద్ధం ప్రకటించి బాంబు దాడులు చేస్తున్న సందర్భంలో చావు కత్తి అంచు మీద నిలబడి కవిత్వం రాయడమంటే వాసి పరంగానైనా రాసి పరంగానైనా ఇది చాలా ఎక్కువే.

అధ్యయనం సాహిత్య సృజన ఈ రెండూ జరగాలంటే మేధో విశ్రాంతి కూడా అవసరమే కదా ! అమరత్వమే విశ్రాంతి అనుకునే చోట ఇలాంటి సాహిత్య సృజన చాలా విలువైనదిగా భావించక తప్పదు.

 ఇంతకీ ఈ సాహిత్యంలో వస్తు శిల్పాలు ఏమిటీ? వస్తువుందా? శిల్పముందా ? అని ఆరా తీసే వారికి వస్తువు వంద శాతం పుష్కలంగా దొరుకుతుంది. శిల్పం అర్థం చేసుకున్న వారికి అర్థమైనంతగా ఉంటుందని సమాధానం చెప్పొచ్చు.

 మృత్యుంజయులు – అనే కవితలో

  ” గ్రామాలు స్మశానాలయ్యాయి

   కండ్లు చిదిమేసిన మొండెమొకటి

   గాలిలో వేలాడింది

   కాళ్ళు లేకుండానే…” దండకారణ్యంలో పాలక వర్గాల చేతుల్లో పురుడుపోసుకొని…వారి అండదండలతో ప్రజలపై సల్వాజుడుం సాగిస్తున్న అఘాయిత్యాలకు ఇదొక ఉదాహరణ. దీనికి సమాధానంగా..

  “పారామిలిటరీ బలగాలను

  సల్వాజుడుం గుండాలను

  గంగలూరు

  దర్భగూడెం

  ఎర్రబోరు సమాధానమని

  బైలదిల్లా బారుద్ ను పేల్చి చెప్పాం” అని శత్రువుకు బదులు సమాధానమిచ్చి విప్లవ సాహిత్యంలో సమస్యకు పరిస్కారం చూపుతాడు రచయిత.

 జులై 2 ,  2010 న భారత పాలక వర్గాలు ఒకవైపు చర్చల మంత్రాంగాన్ని నటిస్తూనే ..నమ్మించి శాంతి చర్చల ప్రతినిధిగా ముందుకొస్తున్న కామ్రేడ్ ఆజాద్ (చెరుకూరి రాజ్ కుమార్ ) ను పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారు. తనకు ప్రేరణనిచ్చిన ఆదర్శ కమ్యూనిస్టు యోధుడి గురించి

 ” ఆజాద్ మృత్యుంజయుడు

 భారత విప్లవ వేగుచుకై

దేశాన్ని దండకారణ్యం చేస్తాడు”

” సమకాలీన పరిణామాలపై

లోతైన జ్ఞాన సంపదతో

సూర్య చంద్రుల వెలుగు చేది పోస్తాడు”

ఇవ్వాళ  దండకారణ్యం అంటే జనతన సర్కార్ బీజరూపంలో ఉన్న ప్రజా ప్రభుత్వాలకు గుర్తు. రోల్ మోడల్. అలాంటి మోడల్ దేశమంతా విస్తరిస్తాడు అని కవి తన విశ్వాస ప్రకటన చేస్తాడు.

జాతీయ అంతర్జాతీయ సమకాలీన పరిస్థితులను తనకున్న అపారమైన జ్ఞానంతో మనలో జ్ఞానదీపాలు వెలిగించడానికి సూర్య చంద్రుల వెలుగు చేది పోస్తాడు అనే పదబంధంతో ఆజాద్ మీదున్న ప్రేమను ప్రకటిస్తాడు కవి.

అట్లాగే మరో కేంద్ర కమిటీ సభ్యుడు 2019 డిసెంబర్ 7న అనారోగ్యంతో అమరుడైన కామ్రేడ్ రామన్న ( శ్రీనివాస్) గురించి..

 ” నేస్తమా

బైలడిల్లా పర్వత సానువుల్లో

పారే సెలయేరులా

గలగలా మాట్లాడే నీ మోము” అని గుర్తుచేసుకుంటాడు.

అట్లాగే…

“యుద్ధంలో గాయపడ్డ సైనికుల

స్రవించే నెత్తుటి గాయాలకు

చల్లటి లేపనం లాంటి నీ స్పర్శ

ప్రతి  లే చిగురు ఆకులో

పసిపిల్లల నవ్వులో

నీ నవ్వులు

కష్టాల్లో వెచ్చటి నెగడు లాంటి నీ పలకరింపులు” – అని రామన్న జ్ఞాపకాలన  పలకరింపులను…కష్టకాలాల్లో అతనిచ్చిన సాంత్వన ను కవి తన కవితల్లో గుర్తుచేసుకుంటాడు.

 మిగతా కవితలు కూడా తనతో పాటుగా నడిచి అమరులైన తన సహచరుల జ్ఞాపకాలను తలపోసుకుంటూ రాసిన కవితలే ఉన్నాయి. ఈ కవిత్వాన్ని మూసగా కాకుండా భారత విప్లవోద్యమ మూలాల్లోకి వెళ్లి గాలిస్తే చరిత్రా కనిపిస్తుంది.కవిత్వమూ కనిపిస్తుంది.వస్తు శిల్పాలు పుష్కలంగా కనిపిస్తాయి.చీకట్లో కళ్ళు తెరిచి చూసినా… వెలుతురులో కండ్లు మూసి వెతికినా ఫలితం శూన్యమే.

ఇంతకీ, ఈ కవిత్వంలో ఏముందని అడిగితే ఒక్క మాటలో చెప్పాలంటే…

కొన్ని కన్నీళ్లు

మరికొన్ని పిడికిళ్ళు…

వీటి గతి తార్కిక చారిత్రక సంఘర్షణ మూలంగా నిర్మాణమయ్యే జనతన సర్కార్ ప్రజా ప్రభుత్వ నిర్మాణమూ ఉంది. రాంగూడలో 31 మంది విప్లవకారులను  ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడి చేసి పాశవికంగా హత్య చేసి..ప్రాణాలతో ఉన్నవారిని పట్టుకొని  వారిని దశల వారీగా చంపేసిన  పాలక వర్గాల పెంపుడు ముఠాలను బదలా తీర్చుకున్న కోరాపుట్ ప్రతి దాడి విజయాన్ని తన కవిత్వంలో ఎత్తిపడుతాడు.

 అందుకే ఈ కవిత్వంలో ఏముందని చదవాలి అంటే  – రాంగూడలో రాల్చిన తల్లుల కన్నీటి కడుపు కోత ఉందని…చదవాలి. కోరాపుట్ ప్రతిదాడిలో అర్థ సైనిక బలగాలను మట్టికరిపించిన తల్లుల కన్నీటి కత్తి పదునుందని చదవాలంటున్నాను.

మొత్తంగా,

ఈ కవిత్వం భారత విప్లవోద్యమ ముఖ్యం గా దండకారణ్య విప్లవోద్యమ  చరిత్రలోని జయాపజయాలను మన కండ్లముందుంచుతుంది.

కవి మాటలో చెప్పాలంటే… వాడి రక్షణ ప్రహార్ రహస్యాన్ని లహర్ సాహిత్యం మన ముందుంచుతుంది.

చివరగా

లహర్ – అంటే ఏమిటి?

కవి పేరా?

కవిత్వం పేరా?

రెండిట్లో ఏమిటి? అని ప్రశ్నించుకుంటే, లహర్ సాహిత్యం అని ఏక వాక్యంగా చదువుకుంటే .. లహర్ కవి పేరే అని అర్థమవుతుంది.

అప్పుడు, లహర్ …శ్రీకాకుల గిరిజనోద్యమ నాయకుడు సబ్భారావు పాణిగ్రహీ వారసుడని  తెలుస్తుంది. లహర్.. పాలకుల అంచనాలో ఈ దేశ అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకారి అని తెలుస్తుంది.

ఇదే, అసలు సిసలు నిఖార్సైన జనకవనం అని మనకు బోధపడుతుంది.

Leave a Reply