ఇప్పుడు ఒక నిశ్శబ్దం
కమ్ముకున్నది

దుఃఖమొక్కటే
భాషగా మారింది

ఎవరికి వారు
మౌనంగా
సంభాషిస్తున్న సమయం

చిరునవ్వుల సితారా
పల్లవించని
విషాద సందర్భం

మీరలా చేరగిలబడిన
ఆ మద్ది వృక్షం
విషాద సంకేతంగా
రాల్చిన ఆకులను
మీ దేహం పై వేస్తూ

మీరు దాహం
తీర్చుకున్న ఈ సెలయేరు
దుఃఖిస్తూ ఉప్పగా మారింది

మీతో కలిసి పాడిన
పక్షుల గుంపులు
మౌనంగా రోదిస్తున్నాయి

యుద్ధానికి సంకేతంగా
మారిన సాకేత్ దాదా
ఎక్కడని కుందేళ్ళ
గుంపు అడవినంతా
గాలిస్తున్నాయి

శతృవు గుండెల్లో
పేలిన ప్రతి తూటా
నెత్తురంటిన
కంటితో వినమ్రంగా
విప్లవ జోహార్లర్పిస్తున్నాయి

మీరు నేర్పిన నడకతో
విస్తరించి సరిహద్దులను
చెరిపేసిన ప్రజా పంథా
కన్నీటిని ఒత్తుకుంటూ
ఎర్రజెండాను ఎత్తిపట్టింది

వీరునికి
తంగేడు పూల మాలలతో
వీడ్కోలు పలుకుతూ
కదులుతోంది
ప్రజా యుద్ధ కవాతు..

(కామ్రేడ్ ఆర్కే స్మృతిలో)

Leave a Reply