టి. వెంకటేశ్ కవితలు తొమ్మిది
1
నలుదిక్కులు తిరిగే
దిమ్మరుల అజ్ఞాత జ్ఞానమే కవిత్వం
స్వప్న మార్మికతను
సత్యంగా అనువదించేదే కవిత్వం
రాసిన ప్రతిసారి
ఆనవాలు లేకుండా
నువ్వు చేసుకునే ఆత్మహత్య కవిత్వం .
2
ఒడ్డున నిల్చుంటావు
పడవ రాదు
సణుకుంటూ వెనుదిరుగుతావు
మరలిన తరువాత
పడవ వచ్చి వెడుతుంది
ఆ రాత్రి ‘ ప్రయాణం ‘ ముగుస్తుంది
పడవకు తెలియదు
వస్తూ పోతూ ఉంటుంది
ఒడ్డున నీ ఆఖరి పాదస్పర్శ
గాలి చెరిపేస్తుంది
బతికిన పద్యం
అజ్ఞాతంగా తిరుగాడుతూ ఉంటుంది
పడవ దిగిన పరదేశి ఒకరు
కవిత్వాన్ని గుర్తిస్తాడు
కవి మరణించిలేడని.
3
అలా నీవు గడ్డకట్టినపుడు
కవిత్వపు నెగడు అంటించు
పద్యం వెలుగు ఓ ప్రశాంతత.
4
అనేకులు
శబ్దం లో ఒలుకుతున్నపుడు
కవికి పద్యం ఓ ధ్యానం.
5
వరద ఉధృతిలా
నీలో అనుభూతి వానకు
మొలకెత్తె పచ్చి మట్టివాసన పద్యం.
6
ఆగిపోయి నిల్చున్నావు
అలాగే ఉండిపోకు
ఒఠ్ఠిపోతావు
రెండు పద్యాల్ని సాయమడుగు
మళ్ళీ కవి జన్మ నీకు కొత్త.
7
చూరుకు కంకులు వేలాడుతోన్నాయి
పిట్టలు వచ్చేవేళయింది
ఆలస్యమెందుకు…
పద్యమయిపో.
8
కయిత్వం రాయడం
అంత సులువేం కాదప్ప
అందరూ ఏటకు ఎడతారు
సాపల్ని పడతారు
సొరచేప ఒకనికే దొరుకుద్ది
కైత కూడి అంతే సామి
జోరీగ మాటల్ని
బోలు కబుర్లని
పద్దెంలో ఇరికించసూస్తే
అతుకు పగలవడి నవ్వుతాది
కొండ కొమ్మున కురిసే వాన్ని
ఎట్లా పొట్లం కట్టుకొని వస్తామబ్బా
అది మాయ కద!
కయిత్వంలో ఆ కనికట్టు సేస్తేనే
శిల్పం కుబుసం ఇడిసిన
తాచులా ఉంటుంది
మాట పారదర్శకంగా ఉంటేనే
వాక్యాలు జీవించేది
పదాలు ఎత్తుకొచ్చి
రంగులు వేసి
కవిత్వం అని నామకరణం
చేస్తే సరిపోదు
చెమట వాసన
మట్టి రంగు
నెత్తుటి జీవం ఉంటేనే
పిల్లల ప్రపంచమంత
మనగలుగుతుంది పద్యం.
9
మీరంతా
కవిత్వాన్ని చూస్తున్నారు
మరణించిన కవి పునరుత్థానికై
నేను ఎదురుచూస్తున్నాను
తను బయటకు రాసిందంతా డొల్ల
నెగడులో దాచిన రాతల్ని
అగ్నిదేవున్ని అడగాలి
ఎత్తయిన కొండ మీద నిల్చుని
ఆకాశానికి పద్యాన్ని
వినిపిస్తూ ఉండేవాడు
పడవలోకి పరకాయం చేసి
తన అలజడులన్నీ
నదితో నివేదించుకునేవాడు
మాగిన రేయి వద్ద
కీచురాయి వేషాన్ని కట్టి
షాయిరిని వెన్నెలలా
ఒలికిస్తుండేవాడు
రాలిన పూలను
దోసిట్లోకి తీసుకుని
ప్రేమగా విలపిస్తుండేవాడు
పసి సమూహాల్ని
వెతుక్కుంటూ వెళ్ళి
పిల్లల భాషని దొంగిలించే వాడు
చేదు జీవితాన్ని మోస్తూ
నలిగిన మనుసుల
దుఃఖపు పుప్పొడిని
జోలెలో దాచుకుంటూ
అతను కవిత్వం లోనే
సమాధిని కట్టుకుని
రాలిపోయాడు.