నాకు శబ్దం అంటే చాలా ఇష్టం. కవిత్వం కంటే మొదట బాణీలను ప్రేమించినవాడిని. ఇప్పటికీ పాటలోని కవితాత్మక వాక్యాల కంటే సంగీతమే మహా ఇష్టం.

అవి నేను స్కూల్ డేస్ లో ఉన్న రోజులు. చీకట్లో వుండటాన్ని భలే ఇష్టపడే రోజులు. వీధి దీపాలు సరిగ్గా వెలగని రోడ్లను వెత్తుక్కొని మరీ ఒంటరిగా ఉండటం వల్లే నాలో పాట మొదలయ్యింది. నడవటం బాగా అలవాటు. గంటలు గంటలు నడిచే అలవాటు ఇప్పటికీ అలాగే వుంది. ఒకరకంగా ఈ ఒంటరి నడకే నన్ను బతికిస్తుంది. ఈ నడకే నా ఆరోగ్యాన్ని దెబ్బ తీసే రోజొకటి వుందని నాకూ స్పృహలోకి వచ్చింది. అలా నడుస్తూ నడుస్తూ రాగం తీసేవాడిని. నాలోంచి వస్తున్న కవితలను పేపర్ పైన రికార్డ్ చేసి పెట్టుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నా కవితలు మా స్కూల్ చెత్తకుండీలో పడ్డాయి. ఓ నాలుగు రోజుల పాటు నాలుగంటే నాలుగే గదులున్న చిన్న ఇంట్లో సజ్జపైన నాకు తెలియకుండా దాచబడ్డాయి. పొయ్యిలో కాలబెడ్తానని, GHMC చెత్త కుండీలో పడవేస్తానని బెదిరింపులు మొదలయ్యాయి. నూటికి నూరుపాళ్లు తిరుగుబాటు లక్షణం వున్నవాడిని. ఆ పొట్టి పొట్టి కవితల కోసం ఇస్తారా లేక చస్తారా అనే టోన్ లో ధిక్కరించినప్పుడు మాత్రమే అవి మళ్ళీ నా చేతిలోకి వచ్చేసాయి.

***
కశ్మీర్, పాలస్తీనా. ఈ రెండూ నా మానసిక జీవితంలో ముఖ్య భాగాలుగా చేరిపోయాయి. మధ్య రాత్రి రెండున్నర గంటలకు కశ్మీర్ వెళ్ళాలని బిగపట్టి ఏడ్చినవాడిని. పాలస్తీనా తల్లుల తడి కన్నులను చూసే అవకాశం లేక, నా చుట్టూ ఏడుస్తున్న ప్రతి తల్లిలో ఓ పాలస్తీనా తల్లిని చూసుకున్నవాడిని. female genital mutilation గురించి తెలిసినప్పుడు నేరుగా ఆఫ్రికా వెళ్లి అక్కడి పసిపాపల నొప్పిని చూడాలనిపించింది. ఇదే అంశంపై సున్నితత్వం, భ‌యానకం, భీభ‌త్స రసాల్లో మార్మికత కలిగిన 16 కవితలు రాసిం తరవాత కూడా నాలో ఘర్షణ ఏమాత్రం తగ్గలేదు.

నేను కవితలు రాయడానికి నా చుట్టూ వున్న ప్రకృతి, సామాజిక సమస్యలు తప్ప వ్యక్తులెవ్వరూ కారణంగా నిలబడి లేరు. నాలో వొక భయంకరమైన ఆర్టిస్ట్ ఉన్నాడేమో. అందుకే నా కవితలు కొన్ని “డార్క్” గా వుంటాయి.

జననాట్యమండలి, చేతనా కళా మంచ్ పాటలంటే ఇష్టం. గోరటి వెంకన్న పాటలు ఎక్కువగా వినేవాడిని. అనామధేయుడి కవిత్వం, కలేకూరి పాటలు నచ్చుతాయి.

OU ఆర్ట్స్ కాలేజ్‌లో నా పుస్త‌కావిష్క‌ర‌ణ  సభ జరిగివుంటే మళ్లీ మళ్లీ అమరుల కుటుంబాలు అంటరానివాళ్లుగా నిలబడాల్సి వచ్చేది.  ఉద్యమాల పురిటి గడ్డైన ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మీద ప్రజాగాయకులు, అమరుల పాటలు వెలివేతకు గురయ్యేవి. అమరుల కుటుంబాలకు ఉస్మానియా యూనివర్సిటీ ఓ నిషిద్ధ స్థలం. నాకు నా వాళ్ళను అలా చూడటం ఇష్టం లేకనే నాకు నచ్చినట్టే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభను సంపూర్ణంగా జరుపుకున్నాం. ప్రాచీనమైన పద్యాలనూ, ఈ తరం పోరాటపాటలనూ బోధిస్తున్న యూనివర్సిటీ గోడల మధ్య అమరుల తల్లులు కన్నీళ్ల‌తో ఎందుకు మాట్లాడకూడదు, ధిక్కార గొంతులతో ఎందుకు పాడకూడదు.. అని రాజ్యంతో కొట్లాడాల్సిన వాళ్ళే నన్ను లిమిట్‌లో  పెట్టాలనుకోడం నాకు ఏమాత్రం నచ్చలేదు.

మృతదేహాలను ముద్దాడటం కోసమే ABMS ని వెతుక్కుంటూ వెళ్ళాను. నాది అమరుల కుటుంబం కాకపోయినా, ఆ సంఘంలో నాకు సభ్యత్వం లేకపోయినా, ఊపిరున్నంత కాలం నేను వాళ్ళతోనే వుంటాను.

“రాలిపడ్డ కశ్మీరీ కనుగుడ్లను ఉడకబెట్టుకొని తింటున్నాను,
రాజ్యాన్ని ఉచ్చ పోయించే రాగమై రోడెక్కుతా.”
అని కవిత్వంలో రాసుకున్నప్పుడు అది ఆచరణ రూపంలో లేకపోతే నిజంగా నేను శవాన్నే. ఒక విల్లంబు ద్రోహినే.

-చరణ్

Leave a Reply