అజ్ఞాత అమర కవి సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ ఈనెల 24వ తేదీ మందమర్రిలో చనిపోయింది. విప్లవకారులందరి తల్లుల్లాగే కొడుకు జీవించి ఉన్నంత వరకు అతని కోసం నిరీక్షణా భారాన్ని అనుభవించింది. అతని మరణానంతరం బిడ్డ తలపోత వ్యథతో జీవించింది. విప్లవంలోకి వెళ్లే పిల్లల వ్యక్తిత్వంతో ప్రభావితమైన తల్లుల్లాగే ఈమె కూడా కొడుకు మీది ప్రేమలో విప్లవాన్ని చూసుకున్నది. ఆ ఎడబాటుతో, అనారోగ్యంతో ఆమె వెళ్లిపోయింది.
సత్యనారాయణ విప్లవోద్యమంలో ఎన్ని పేర్లతో పని చేశాడోగాని అతని రచన సంపుటితో ‘పునరంకితం’ సత్యనారాయణగా అజరామర గుర్తింపు తెచ్చుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా దారకొండ ఘటనలో ఆయన అమరుడయ్యాడు. విప్లవ మేధావి నవీన్ కూడా ఇదే ఘటనలో మృతి చెందాడు. ఆయన పుస్తకం ‘వర్ణం నుంచి కులం దాకా’ ప్రమాణిక రచనగా నిలబడిపోయింది. ఆ రోజుల్లో ఈ ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులు తెచ్చుకోలేకపోయారు.
సత్యనారాయణ మరణం తర్వాత ఆయన రచనలను విరసం ప్రచురించింది. దానికి కామ్రేడ్ వివి, ప్రముఖ కవి కె. శివారెడ్డి వివరమైన ముందుమాటలు రాశారు. తల్లి మరణపు విషాదంలో సత్యనారాయణను మరోసారి స్మరించుకుందాం. కవిత్వ రచనలో, విప్లవాచరణలో కూడా సత్యనారాయణకు మరో అమరకవి ‘సముద్రుడు’ ప్రత్యక్ష మార్గదర్శి. ‘భూమి నా తల, వెల నిర్ణయించు’ అని ధిక్కార ప్రకటన చేసిన కనకరాజు చూపిన దారిలో నిండు జీవితాన్ని విప్లవానికి అర్పించాడు. విప్లవమెంత సున్నితమైనదో, సునిశితమైనదో, సృజనాత్మకమైనదో తెలుసుకోవాలంటే ‘పునరంకితం’ను మరోసారి చదవాల్సిందే. విప్లవం సాధారణ మానవులను అసాధారణ కార్యకర్తలుగా, నాయకులుగా, సాహిత్యకారులుగా మార్చడమేకాదు. వాళ్లను కన్న తల్లిదండ్రులను కూడా తీరని దు:ఖంలోనే మానవీయ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. దీనికి సత్యనారాయణ, ఈశ్వరమ్మ ఒక ఉదాహరణ మాత్రమే. వాళ్లిద్దరి తలపోతలో ‘పునరంకితం’కు శివారెడ్డి రాసిన ముందుమాటను పునర్ముద్రిస్తున్నాం
– వసంతమేఘం టీం
ఇది సత్యనారాయణ గారి జీవన, సాహిత్య సర్వస్వం. కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు కలగలిపిన ఒక అనుభవ సంపుటి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నప్పటి నుంచి ‘ధారకొండ’ ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యేదాకా ప్రోది చేసుకున్న అనుభవం. తన్ను తాను పరీక్షించుకుంటానికీ, ప్రోత్సహించుకుంటానికీ, ధైర్యం చెప్పుకోడానికీ పనికొచ్చిన వ్యక్తీకరణలు. జీవితానికీ, సాహిత్యానికీ అవినాభావ సంబంధం చెప్పుకుని ఆశయాన్ని ఆచరణలో నిగ్గు దేల్చుకునే క్రమంలో వెలువడిన రచనలు. మనుషుల పట్ల, సమాజం పట్ల, పోరాటం పట్ల అపార ప్రేమ, అచంచల విశ్వాసం, మనుషుల్ని సమాజాన్ని మహోన్నత దశకి తీసుకుపోయే ఉద్యమాల పట్ల అవిచ్ఛిన్న ప్రేమ, పోరాటమగ్నత అంతటా అల్లుకుని మనలోకి విద్యుత్తులా ప్రవహిస్తుంది. నా యీ సంవత్సర కాల గదినిర్బంధంలో డి.టి.పి. చేసిన ఈ సృజనని ఎన్నిసార్లు వీక్షించాను. తడిసి ముద్దయ్యాను. చదివిన ప్రతిసారి ఉద్రేకినయి, ఆవేశపరుణ్ణయి, మనచుట్టూ మృత్యువులా అల్లుకుంటున్న ఒక నిర్లిప్తత, ఒక నిరాశ, ఒక నిర్వీర్య నిష్కాముకత్వం కళ్ల ముందుకొచ్చి ` ఈ జీవితాన్ని పోల్చి చూసుకుని సిగ్గుపడి, మాయ పొరలని చించుకుని బయటికి రావటానికి ప్రయత్నించి` కార్యాచరణతో కూడిన ఆదర్శప్రాయ జీవితం ఒక పక్కన మధ్యతరగతి వ్యామోహాల్లోనూ, ఆత్మసంతృప్తిలోనూ మూలుగుతున్న జీవితం మరొక పక్కన రెండిరటిని పక్కపక్కన పెట్టి చూసుకుంటానికీ ` ఆత్మ పరిశీలన చేసుకుంటానికీ –
ఇక్కడ ఈ నగరాల్లో కూర్చుని ఉద్యోగాలు చేస్తూ పోరాటాన్ని అభిమానిస్తూ, ఆరాటపడుతూ, చేయాల్సినంత చేయలేక, చేతకాక సాహసం చేయలేక, మధ్యతరగతి పరిమితుల్ని ఛేదించుకోలేక, ఒక సందిగ్ధ ఘర్షణలో చిక్కుకున్నప్పుడు ` ఇదిగో ఈ పుస్తకం ఒక ప్రాణం, ఒక ఆక్సిజన్, ఒక ప్రేరణ, ఒక ఊపు, కళ్లముందు అద్భుతంగా వికసిస్తున్న వసంతకాలపు అడవి.
బహుశా సత్యనారాయణ కూడా కింద మధ్యతరగతి నుంచి వచ్చిన వాడే అయి ఉండాలి. సమాజపు సంక్షోభాలూ, ఆర్థిక వత్తిళ్లు అనుభవించిన వాడే అయిఉండాలి. సత్యనారాయణెవరో నాకు తెలియదు. పరోక్షంగా ఉత్తరాల పరిచయమే. అది ఏకపక్షమే. ఆయన నుంచి ఉత్తరాలు తప్ప నా ఉత్తరాలు ఆయనకు అందే అవకాశం లేదు. అతనిచ్చిన సమాచారాన్ని బట్టి ఇంటర్ దాకా చదివి క్రమక్రమంగా విద్యార్థి రాజకీయాల నుంచి ఉద్యమంలోకి వెళ్లిన వైనం. తనతో చదువుకుని తనని ఉద్యమ రాజకీయాలకీ, సాహిత్యానికీ పరిచయం చేసిన మిత్రుడు సానుభూతిపరుడిగానే మిగిలి, తను ఉద్యమంలోకి వెళ్లినప్పుడు తను సానుభూతిపరుడిగానే మిగులుతాడనీ, ఇలా ఇంతలోతులకు వెళ్తాడని అనుకోలేదని అన్న సమాచారం తన కందినప్పుడు తన స్పందనల్ని వ్యక్తీకరించే కథ కూడా ఇందులో ఉంది.
పరిమితులు ఏముంటాయి. మన శక్తిని బట్టి తెగువను బట్టి, ఉద్యమ మగ్నతని బట్టీ ఎంత దూరం వెళ్తావు, ఎంత లోతుకెళ్తావు అనేది ఉంటుంది. మధ్యతరగతి మాయపొరల్ని చీల్చుకుని క్రమక్రమంగా ఉద్యమకారుడు అయ్యే ప్రాసెస్ ఒక పరిమిత ప్రేమ నుంచి, సమాజాన్ని, ప్రపంచాన్ని ప్రేమించే ఒక అపరిమిత ప్రేమికుడుగా రూపొందే క్రమం మామూలు విషయం కాదు. ఈ క్రమ వికాసానికి సాహిత్యాధ్యయనం ఎంత పనికి వస్తుందో, వచ్చిందో తనెప్పుడు మర్చిపోలేదు. అటు కవిత్వంలోనూ, యిటు ఉత్తరాల్లోనూ రికార్డు చేశాడు.
ఒక మంచి కవిత కోసం లోపల వాళ్లెంత ఆశగా ఎదురుచూస్తారో, వేయికళ్లతో వెతుకుతారో, ఒక పదం, ఒక కవితా వాక్యం వాళ్లకెంత జీవశక్తినిస్తుందో తెలిస్తే బయట వున్న మనం యింకొంచెం బాధ్యతాయుతంగా, యింకొంచెం వీరోచితంగా, యింకొంచెం త్యాగమయంగా ఉండే వాళ్లమేమో –
‘‘నా శరీరం ముందు సాయుధమయ్యింది
ఆయుధం నా శరీరంలో భాగమయ్యింది
ఆలోచనల్లో కవిత్వం అంకురించింది
కవిత్వం కత్తిలా పదునుగా తయారయింది
నాకిప్పుడు రెండు ఆయుధాలు
కత్తిపట్టిన పరిస్థితే
కవిత అవసరాన్ని చెప్పింది
నన్ను సాయుధం చేసిన సంఘర్షణే
సమాలోచనకు కవిత్వాన్ని ఆసరానిచ్చింది’’
‘‘నేను కవిత రాయడం కోసం
కవిత్వంతో యుద్ధం చేస్తాను
నేను యుద్ధ దృశ్యాన్ని కవిత్వీకరించటం కోసం
కవిత్వంతో యుద్ధం చేస్తాను.
కవిత్వం నాపై నన్నే యుద్ధానికి పురికొల్పింది
పాపభావజాల నుండి వెంట వెంటనే
పుణ్య స్నానం చేయిస్తుంది
నన్ను నిరంతరం నిర్జీవమై పోకుండా
నిలబెడుతూ, నిలదీస్తున్న,
కవిత్వానికి జోహార్లు
అటు జైల్లోనూ, ఇటు అజ్ఞాతవాసంలోనూ, అడవిలోనూ కవిత్వాన్ని, సాహిత్యాన్ని ప్రజా పోరాటాల్లో పాల్గొనేవాళ్లు ఎలా తీసుకుంటారో పై వాక్యాలు చెబుతాయి. కవిత్వం నా ఆయువు పట్టు అన్నాడు. సాహిత్యం వాళ్లకి మామూలు అనుభవం కాదు. జాగృతం చేసే, కార్యోన్ముఖున్ని చేసే, మార్గం చూపించే ఒక అద్భుత ప్రక్రియ. ఒక జీవశక్తి. మనిషి సారాన్ని మొత్తం, తత్వాన్ని మొత్తం మార్చివేసే ఒక రసాయనిక ప్రక్రియ.
‘‘బాధా తప్త క్షణాల్లోంచి… నా నరాల్లోంచి మౌనం ప్రవహిస్తోందో, మౌనంగా నరాలు ప్రవహిస్తున్నాయో నాకు తెలియదు. చెట్ల ఆకులు ఊగి గాలిపుడుతుందో, గాలి వల్ల ఆకులు ఊగుతున్నాయో నాకు తెలియదు. కదనరంగం నుంచి వస్తున్న కమురువాసన శత్రువుదో, మిత్రునిదో నాకు తెలియదు. నాకు నేను తెలియని అచేతన స్థితిలో అదృశ్యమైపోతాను. శబ్ద విచక్షణ లేని నిశ్చల నిర్జీవినై పోతాను.’’
ఎంత బాగా అన్నాడు! ‘శబ్ద విచక్షణ లేని నిశ్శబ్ద నిర్జీవ’మయిపోవటం. ఈ స్థితిలోనున్న వాళ్లకంటే బయట వున్న వాళ్లకే ఎక్కువ వర్తిస్తుంది.
‘‘నిజానికి ప్రాణాలు పోవాల్సిన స్థితిలో
అక్షరాలకు ప్రాణం పోస్తూ
తనకు తాను ప్రాణం పోసుకోవటం
ఇక్కడ తప్పని సరి
ఇప్పుడు అక్షరం
ఎ.కె. 47 చేతిలో కొచ్చింది
గుళ్ల వర్షాన్ని కురిపించే చేతులే
అక్షరాల గలగలలు కూడా వినిపిస్తున్నాయి
ఇక్కడ
అక్షరానికి జీవం పోయటం అనివార్యం.
అక్షరాన్ని సాయుధం చేయటం అనివార్యం
తనని తాను పిండుకుని
జీర్ణించుకుని, నిగ్గు దేల్చుకుని, మొగ్గు చూసుకుని
ఒక్కొక్కరు ఒక్కో అక్షరమయ్యారు
అక్షరాన్ని ఆపోసన పడుతున్నారు
ఇప్పుడు వారి రక్తంలో
ఎర్ర తెల్ల కణాలే కాదు
అక్షర కణాలు కదులుతున్నాయి’’
‘శబ్ద విచక్షణలేని నిశ్శబ్ద నిర్జీవి’ అయిపోయే దశ నుంచి అక్షరం కాపాడుతుందని, మళ్లా నిలబెడుతుందని, అక్షరం- ఆయుధం విడివిడిగా లేవు. రెండు ఒకటే. ఒక దాన్నుంచి మరొకటి జన్మించింది. ఒకదానికి మరొకటి ప్రేరణయ్యింది. ప్రాణం పోస్తుంది చుట్టూ వస్తున్న ఆధునికాంతర వ్యాధిóగ్రస్త సాహిత్యాన్ని చదువుతున్న సమయంలో- ఈ కవితలూ, కథలూ, వ్యాసాలూ చదవటం ఒక పునర్జన్మించే అనుభవం. రిఫ్రిషింగ్ ఎక్స్ పీరియన్స్. చాలా హాయిగాను, నిర్మలమైన, ఆరోగ్యకరమైన, ప్రాణవంతమైన పైరగాలి పీల్చుకుంటున్నట్టుగా ఉంది. ఎంత సిక్‌నెస్‌లో కూరుకుపోయాం మనం అనిపిస్తుంది. ‘రోగి గాని వాడు కవిగాడనే’ నినాదం ఎక్కడ, ఇప్పుడు ‘అక్షరం ఎ.కె. 47 చేతిలో కొచ్చింది’ అన్న వాక్యం ఎక్కడ! ఎంతటి పరిణామం. ఎంతటి ఆరోగ్యకర దృక్పథం. క్రమ వికాసాలు, జీవితంలో కానీ, సాహిత్యంలో కానీ, ఆచరణలోంచీ, పోరాటంలోంచీ వస్తాయనేదే సారాంశం. ఒక మామూలు మనిషిని, పల్లెటూరు మనిషిని మహోన్నత ఉద్యమ నాయకుడిగా ఉద్యమం ఎలా మలిచిందో అల్లం రాజయ్య ‘అతడు ‘కథ చెబుతుంది. అలాగే సత్యనారాయణ గారి పరిణామక్రమం. ముషీరాబాద్ జైలులో రాజకీయ ఖైదీ నుంచి దండకారణ్య తూర్పు కనుమల్లో దళ నాయకుడిగా ఎదిగే నిర్మాణ క్రమం వరకు. అది క్రమ వికాసమే. ఆశయం ఆచరణగా రూపొందే క్రమమే.
నాకన్పిస్తుంది, లోన్నుంచే వచ్చే సాహిత్యాన్ని బయటినుంచి వస్తున్న సాహిత్యంతో కలిపి చూడటం సబబుకాదని. లోన్నుంచే వచ్చే సాహిత్యం ఒక విశిష్ట స్రవంతి. దానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. అదొక ప్రత్యేక జానర్. ఆయా అనుభవాల్నుంచీ, ఆచరణలనుంచీ, ప్రత్యేక పరిస్థితుల నుంచీ, మృత్యు సామీప్యత నుంచీ, మనుషుల్లో అజ్ఞాతంగా అల్లుకోవటం నుంచీ, ప్రాంతం నుంచి, ప్రాంతానికి పరివ్యాప్తం అవటం నుంచీ జన్మిస్తుంది. అన్నింటికీ పరిస్థితులే వాతావరణ నేపథ్యమే మూలమవుతుంది. మరుక్షణంలో నువ్వు బతికి ఉంటావో లేదో తెలియని స్థితిని ఊహించండి. ఈ తరహా సాహిత్యంలో ఒక ప్రత్యేక రక్తం ప్రవహిస్తుంది. అది రోగ గ్రస్థం గాదు. నిరాశ జనితం గాదుÑ నిష్ఫలం అంతకన్నా గాదు. ఆ పాయను ప్రత్యేకంగానే అధ్యయనం చేయాలి. బయట వస్తున్న సాహిత్యంతో పోల్చి, తులనాత్మకంగా అధ్యయనం చేయాల్సిందే.
ఒక హ్యూమన్ సిట్యుయేషన్ నుంచి ప్రతీదీ జన్మిస్తుంది. ఒక హ్యూమన్ సిట్యుయేషన్, కలెక్టివ్ సిట్యుయేషన్‌గా పరిణామం చెందే క్రమంలో వచ్చే సాహిత్యం ఎలా ఉంటుందో లోపలి నుంచి వచ్చే సాహిత్యం చెబుతుంది.
ఇన్నేళ్ల ఉద్యమ నేపథ్యం నుంచి వస్తున్న కవిత్వం పరిణామ వికాసాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన పరిపక్వత కనిపిస్తుంది. లోన్నుంచి వచ్చే సాహిత్యంలో శిల్పం – వాసి కొరబడుతున్నాయని వాళ్లకి తెలుసు. అందుకే సత్యనారాయణ రాస్తాడు అయితే లోపల వచ్చిన కవిత్వం వాసి ఇంకా పెరగాల్సి ఉంది. దీనిపై మీరు ఎందుకు పూనుకోగూడదు? కవిత్వం ఎలా రాయాలని చాలామంది అడుగుతుంటారు. నాకు తోచిన సమాధానం చెప్పాను. ‘ఇంటెన్సిఫైడ్ ఫీలింగ్’ అని. కవిత్వ ప్రమాణము నాకు ఇప్పటికీ తెలియదు.
లోన్నుంచి వచ్చే కవిత్వంలో వస్తూ గాఢతతో పాటు సాంద్రత ఉండాలని వాళ్లకి తెలుసు. అయితే వనరుల్లేక, అజ్ఞాతవాస పరిమితుల్లో, అధ్యయనం చేయటానికి పుస్తకాలు దొరక్క, సమయం దొరక్క, నిరంతరం కదిలిపోతూ – అదీ స్థితి. అందుకే కౌముది అన్నది ‘ఫార్మేషన్‌ల్లోనూ కవితనూహిస్తూ’ –
‘‘కవిత్వంతో ఒకరోజు గడపాలని ఉన్నప్పటికీ ఆ అవకాశం లేదు. ఇక్కడికి వచ్చిన కొత్తలో కవిత కోసం ఆవురావుమంటూ ఉండేవాణ్ణి. దినపత్రికలు సరిగ్గా దొరకని పరిస్థితి. వార్తల కోసం అబద్ధాల ఆకాశవాణిని, సామ్రాజ్యవాద బి.బి.సి. ల పై ఆధారపడాల్సిందే. ఏదో కోల్పోయిన వాడిలా సంచారం. కొంతకాలానికి గానీ, నెమ్మదించలేకపోయాను. ఇప్పటికీ అప్పుడప్పుడు తీవ్రమైన ఘర్షణకి గురౌతాను. సామాజిక సమస్యలు చరిత్ర వైరుధ్యాల పరిష్కారం, అంతా బిజీ బిజీ. ఒక గంట ఖాళీ దొరికితే కవిత్వాన్ని చదువుకుంటే ఎంత బాగుంటుంది అన్న దాన్ని ఊహించుకుంటూ, గులాబీ పరిమళాల్ని ఆఘ్రాణిస్తున్నాననే భావనకు గురవుతుంటాను. అప్పుడే దాడి… కవిత్వం కాసేపు పక్కకి పోతుంది. ఆ సంఘర్షణని ఒకసారి పెద్ద కవితగా రాశాను. దాన్నొక ఎన్‌కౌంటర్‌లో నా కిట్టుతో పాటు పోగొట్టుకున్నాను. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బయటపడ్డాను. లోపల్నుంచి కవిత్వం ఉప్పొంగుతుంది.’’
ఇంత సుదీర్ఘంగా ఊటంకించడానికి కారణం కవిత్వానికీ వాళ్లకీ ఉన్న సంబంధం చెప్పటానికి అది ఏ స్థాయిలో ఊపిరై వాళ్లలో కదులుతుందో చెప్పటానికీ –
సుబ్బారావు పాణిగ్రాహి నుంచి శివసాగర్, కౌముది, సత్యనారాయణ దాకా కొనసాగిన కొనసాగుతున్న ఒక వారసత్వం ఇది. ఈ కవిత్వానికి అద్భుత భూమిక ఉంది. ఒక కొత్త పరిమళం ఉంది. ఒక ఆర్ద్రత, ఒక ఆత్మీయ స్పర్శ వెచ్చగా తగులుతూ అంటుకుంటే తడి తడిగా తగులుతూ రక్తం వాసనతో జీవితాన్ని పిలుస్తున్నట్టు గొప్ప ఆశగాను ధైర్యంగాను ఉంటుంది. బయట ఉన్న కవుల నుంచి, కవిత్వం నుంచి వాళ్లు నేర్చుకుంటానికి ఎంత తహతహలాడుతారో బయట ఉన్న కవులు లోపల ఉన్న వాళ్ల కవిత్వం నుంచి నేర్చుకోవాల్సినంత నేర్చుకోలేదనేదే –
ఈ పుస్తకంలో నాలుగైదు వ్యాసాలు, రెండు మూడు సమీక్షలు, పుస్తక పరిచయాలు ఏడెనిమిది కథలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ‘ప్రజల నుంచి ప్రజలకు’, ‘తెహ్రీ డామ్’ చాలా మంచి వ్యాసాలు. ముఖ్యంగా ‘ప్రజల నుంచి ప్రజలకు’ ఆదివాసి జీవితాలతో జీవన విధానాలతో, పరిచముండి దండకారణ్యంలో తూర్పు కనుమల్లో ఉన్న అనేక గిరిజన బృందాల సాంస్కృతిక జీవితంతోనూ, భాషతోనూ పరిచయమున్న లోపలుండి పనిచేస్తున్న సత్యనారాయణ వాళ్లలాంటి వాళ్లే రాయగలది. విషయ పరిజ్ఞానం నుంచి ఎన్నుకున్న కోణం, వస్తువును విపులీకరించే పద్ధతి అద్భుతంగా ఉంది. పుస్తక పరిచయాల్లో – ‘చెంఘిజ్ ఖాన్’, ‘భారతదేశం లోని జైలు జీవితం’ అన్న రెండు వ్యాసాలు రచయిత లోతును గతాన్ని వర్తమానానికి అన్వయించి పరిస్థితుల్ని బేరీజు వేసే పద్ధతి ఆశ్చర్యం గొలిపేట్టుగా ఉంది. కవిత్వమే కాదు, మంచి వచనం రాయగల నేర్పు ఉందని ఈ వ్యాసాలు రుజువు చేస్తాయి.
పోతే కథలు. ఈ కథలన్నిటికీ ఉద్యమ నేపథ్యమే మూలం. కథకుడిగా సత్యనారాయణ తొలిదశలోనే ఉన్నాడనిపిస్తుంది. మంచి కథకునిగా ఎదిగే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి.
ఉన్న సమయంలో, ఉన్న పరిస్థితుల్లో, ఎల్లప్పుడూ అభద్రతా పరిస్థితిలో, మృత్యు నేపథ్యంలో తుపాకిని భుజానేసుకుని మైళ్లకొలది నడిచిపోయే క్రమంలో వెలువడిన కొత్త విలువల సాహిత్యమిది.
ఈ కథల్నీ, వ్యాసాల్నీ, కవితల్నీ పరిశీలిస్తే కావలసినంత వస్తు సమృద్ధి ఉండి, గొప్ప కళాఖండాలుగా తీర్చిదిద్దే సమయ రాహిత్యం కనపడుతుంది.
‘‘యుద్ధ రంగం నుండి
కవిత్వాన్ని ఆవాహన చేయటం గొప్ప ఆనందం’’
సత్యనారాయణ మనకిచ్చిపోయిన అతని జీవితం, సాహిత్యం, అతని ఆచరణ, అతని త్యాగం, ఇదొక ఆచరణాత్మక సాహిత్యం – ఉద్యమ కార్యాచరణ మామూలు మనుషులే మహోన్నతులవుతారు. అలాగే మామూలు రచయిత మహా రచయితగా మారతాడు.
ఈ కవిత్వం, కథలు, వ్యాసాలు చదివాక –
మనలో ఒక అల్లకల్లోలం బయలుదేరుతుంది. మన సాదాసీదా బతుకు లోపల అగ్గి అంటుకుంటుంది, అల్లుకుంటుంది. అగ్ని సంచలనాల పవనాలు వీస్తాయి. మన చుట్టూ అల్లుకున్న మురికి గాలుల్నుంచి మనల్ని విడదీసి శుద్ధి చేసే క్రమమేదో మొదలవుతుంది. ఒక బరువైన వాతావరణానికి మనల్ని నెట్టి వేస్తాడు. మనల్ని తన వెంట దండకారణ్య ప్రాంతాలకు, గెరిల్లా జోనుల్లోకి తీసుకెడ తాడు.
‘ఒక్కసారి చూడకపోయిన
చూచిన అనుభవాన్నిచ్చిన వాడు గొప్పవాడు’
సత్యనారాయణని ఎప్పుడూ చూళ్లేదు. కానీ ఎల్లవేళలా చూస్తూనే ఉన్నా – ఇప్పుడు మరీ స్పష్టంగా, లక్ష్య శుద్ధితో దేదీప్యమానంగా వెలుగుతున్న అతని విప్లవమూర్తి మిరిమిట్లు గొలుపుతూ కళ్లకి గడుతుంది.
అమరుడు సత్యనారాయణ సాహిత్యానికి ఈ ముందుమాటలు రాయటం గౌరవంగా భావిస్తున్నా…
30.12.2002