కాళీపట్నం రామారావు   కథా రచన విషయంలో ‘చూపు’  అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది. కథా వస్తు సేకరణకు చూపు విశాలం కావాలి. అందుకు నాలుగు పక్కలూ కలయ చూడాలి అంటారాయన. చూపు అంటే కంటికి వస్తువుకి మధ్య సంబంధమే కాదు. వస్తువు వెనుక దాని చలనానికి కారణమైన శక్తులను గుర్తించటం. వస్తువు ఉపరితలాన్నిచీల్చుకొంటూ లోలోతులకు ప్రసరిస్తూ వస్తు తత్వాన్ని గాలం వేసి గ్రహించగలటం . చూపుకు ఆ నైశిత్యం ఇచ్చేది చైతన్యం. అది అనుభవం నుండి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి అంతకన్నా ఎక్కువ రాజకీయార్థిక అవగాహన నుండి అభివృద్ధి చెందుతుంది.   దానినే జీవిత దృక్పథం అంటాం.అది సమాజంలో మానవ వికాసానికి  అవరోధంగా ఉన్న విశ్వాసాలను, భావాలను, ఆచారాలను వదిలించుకొంటూ సమాజాన్ని  మంచికి మార్చటం  గురించిన ఆలోచనకు, ఆచరణకు మూలశక్తి.  కాళీపట్నం రామారావు జీవిత దృక్పథం ఏమిటి? ఎక్కడినుండి ఎలా రూపొందుతూ,  పరిణామం చెందుతూ వచ్చింది? అది ఆయన కథలలో ఎలా ప్రతిఫలించింది ? అన్న కోణం నుండి కారా కథల మథనం జరగటం ఇప్పటి అవసరం.  

సృజన శక్తుల వికాసానికి అధ్యయనానికి మధ్య సంబంధం అనేక మంది రచయితల పరిణామ వికాసాల చరిత్రలో రుజువు అవుతూనే వచ్చింది. కాళీపట్నం రామారావు విషయంలోనూ అదే వాస్తవం. ఒంట్లో బాగాలేక బడికి వెళ్లే అవకాశం లేక ఏడాదిపాటు స్వగ్రామం మురపాకలోనే ఉండిపోయిన పదహారేళ్ల వయసులో  ఊళ్లోని రామకృష్ణ  గ్రంధాలయం కాలాన్ని లాక్కువెళ్ళటానికి ఎంత ఉపకరించిందో అంతగా ఆయనలో  ఆలోచనా లోచనం విప్పారటానికి కారణం అయింది.   ఆ తరువాత కాలంలో  విజయనగరం గ్రంధాలయం, విశాఖ హిందూ రీడింగ్ రూమ్ అందుకు మరింత దోహదం చేశాయి.తండ్రికి కరిణీకపు లెక్కలలో సహాయపడుతున్న క్రమంలో గ్రామాలలో భూసంబంధాలలో వస్తున్న మార్పులను గురించి పెరిగిన ఆసక్తులు, సాహిత్య సామాజిక సంబంధాలు , సంభాషణలు కారా చదువుల జ్ఞానాన్ని సమగ్రం, శాస్త్రీయం  చేస్తూ వచ్చాయి.  కారా కథా దృక్పథం అక్కడి నుండే రూపొందుతూ బలపడుతూ వచ్చింది. 

1943 నుండి 1972 వరకు కాళీపట్నం రామారావు వ్రాసిన కథలు 43. 1992 తరువాత వ్రాసినవి మరో రెండు ఉన్నాయి.  కారా జీవిత  దృక్పథం కారా కథా దృక్పథంగా వ్యక్తమైన తీరు గురించి కొన్ని పరిశీలనలు పంచుకొనటానికి ఈ వ్యాసం. 

రంజని ( ఏ జి ఆఫీసు తెలుగు సాహితీ సంస్థ ) కారా కథల పై విమర్శ వ్యాస సంకలనం ప్రచురణ తలపెట్టినప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ కారా కథలను మూడు వర్గాలుగా విభజించారని కె. కె. మీనన్ కథా యజ్ఞం (1982) పుస్తకానికి ‘ఇదీ ఒక మహా యజ్ఞమే’  అనే శీర్షికతో  వ్రాసిన ముందుమాటలో ప్రస్తావించటం జరిగింది.’ ఆశిక్ష – అవిద్య’ వరకు వచ్చిన తొలి కథలు ఒక వర్గం. ‘తీర్పు’ నుంచి ‘యజ్ఞం’ పూర్వకథవరకు వచ్చిన మలి కథలు  రెండవ వర్గం. ‘యజ్ఞం’ నుండి ‘కుట్ర’ వరకు  వచ్చిన కథలు మూడవ వర్గం. ఈ లెక్క ప్రకారం మొదటి వర్గంలోకి  1943 లో వచ్చిన తొలి కథ ప్లాటుఫారమో  నుండి మొదలు పెట్టి 1955 లో ప్రచురించబడిన  ‘ఆశిక్ష – అవిద్య’ వరకు పన్నెండు ఏళ్ల కాలం మీద వ్రాయబడిన 26 కథలు వస్తాయి. రెండవ వర్గంలోకి 1964 లో వచ్చిన తీర్పుతో కలిపి వచ్చే కథలు మూడే. మూడవ వర్గంలో  1966 నాటి ‘యజ్ఞం’ తో  మొదలై 1972 లో వచ్చిన ‘కుట్ర’ వరకు  చేరే కథలు మొత్తం 13.  కారా కథా దృక్పథాన్ని నిగ్గు తేల్చే చర్చ అంతా  ప్రధానంగా ఈ చివరి పదమూడు కథలనే కేంద్రంగా చేసుకొని రావటం చూస్తాం. యజ్ఞం కథ   కారా చేరిన గమ్యం కావచ్చు కానీ ఒడిడుకులు, ఎత్తువంపులు, ప్రాణాంతక మూలమలుపులు  దాటుకొంటూ సాగించే గమనం లేకుండా గమ్యానికి చేరువ కావటం  సాధ్యం కాదు కదా ! అందువల్ల మూడవదశలోని కథలకు రెట్టింపు సంఖ్యలో ఉన్న తొలి కథలు, ఆ తరువాతి  మూడు కథలు కూడా కలుపుకొని అనేక పిల్లబాటల గుండా సాగిన ఆయన సాహిత్య ప్రస్థానం లో  ప్రధాన రహదారికి  చేర్చే సరైన బాటల ను గుర్తించటంలో, ఎంచు కొనటంలో చూపిన వివేకాన్ని అంచనా వేసినప్పుడే కారా కథా మూర్తిమత్వం సంపూర్ణంగా సాక్షాత్కరిస్తుంది. 

                                                1

కాళీపట్నం రామారావు కథా రచన తనకు తెలిసిన మధ్యతరగతి యువత ఆలోచనలను, ఆందోళనలను, ఊగిసలాటలను, వైఫల్యాలను,మనస్తత్వాలను వస్తువు గా చేసుకొని మొదలైంది.  యువత ఆలోచనలు ప్రధానంగా బతుకుతెరువుకు సంబంధించినవి. ఆ వయసుకు సహజమైన స్త్రీపురుషుల మధ్య ఆకర్షణకు, సంబంధాలకు సంబంధించినవి.  

‘అయితే గియితే’(1944) పేజీన్నర కథ. వానాకాలం చెరువుకు గండి పడితే జరిగే ప్రాణనష్టాన్ని , పంట నష్టాన్ని , పరిణామాలను ఊహిస్తూ చెరువు గట్టు మీద నడుస్తున్న  యువకుడి  అంతరంగంలో  కర్రపుల్లతో నానిన చెరువు గట్టుకు  గండి పెట్టటం తానే చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలగటం , ఆ ప్రయత్నం విరమించటం ఈ కథ. అయితే ఈ సంఘటనను  చెప్పటం  అంతకు మించి చెప్పదలచుకొన్న అసలు కథను సూచించటానికి. ఆ యువకుడు  ఉద్యోగానికి అప్లికేషన్ ఫారం తెప్పించుకొని నింపి కూడా పోస్టులో వెయ్యలేదు. పడేస్తే ఏమవుతుంది? అని ప్రశ్నతో కథ ముగుస్తుంది. ఇలాంటి అప్లికేషన్ లు ఇదివరకు ఎన్నో పోస్ట్ డబ్బాలో వేసి ఉద్యోగం పొందని అనుభవం ఏదో అతనిని వేధిస్తున్నది. ఇప్పుడు వేసినా అంతేగా .. వెయ్యటం ఎందుకు ? ఇదొక నిరాశాపూరిత పరిస్థితి. ఏమి చేస్తున్నావ్ అనే ప్రశ్న ను ఎదుర్కొన్న ప్రతిసారీ ఏమీ చేయటంలేదు అని చెప్పవలసి వచ్చిన యువత తలచుకొంటే ఏమైనా చేయగలం అని నిరూపించుకొనటానికి ఏ ప్రమాదకర దారుల వెంట నడవటానికి వీలుందో చూపించిన కథ ఇది. 

ఇలాంటి యువకులు ఏ చిన్నవో చితకవో బతుకుతెరువులు సంపాదించి పట్నాలకు వెళితే ఏమవుతారు? ఆశయాలను , ఆదర్శాలను వదిలేసుకొని, వదిలేసుకోవలసి వచ్చిన అశక్తత గురించిన బాధను అనుభవిస్తూ  స్నేహాలను తెంపేసుకొనే  దుస్థితికి నెట్టివేయబడతారు.( భాయీజాన్ 1944) ఈ క్రమంలో జరిగే సర్దుబాట్లు, మార్పులు ఎలా ఉంటాయో ‘వెనకచూపు’ ( 1945)  కథ చూపిస్తుంది. పండగకు సెలవ దొరుకుతుందో దొరకదో … అందుకని పండగకు పదిహేనురోజుల ముందరే సెలవు తీసుకొని ఇంటికి వెళ్లిరావటం , పండగ అంటూ ప్రత్యేక దినాలను సృష్టించింది మనిషే కదా , మనం ఇంటిదగ్గర ఉన్నరోజే పండగ అనే కొత్త తర్కాన్ని అభివృద్ధి చేసుకొనటం ఒక రకమైన సర్దుబాటు. సరస్వతీ పూజనాడు పూజ పూర్తయ్యేవరకు ఉపవాసం ఉండటం అలవాటు ఉన్నవాడు, బాల్యంలో ఒక గులాబీ  రేకు నోట్లోవేసుకొని తిన్నందుకు శీలాన్ని కోల్పోయినట్లు , జాతిని కోల్పోయినట్లు తీవ్రమైన తపన పొందిన వాడు  ఈ నాడు పండగ పూట స్నానమైనా చేయకుండా హోటల్లో తిని ఆఫీస్ లో పనిచూసుకొంటుండటం మరొక రకమైన సర్దుబాటు. నమ్మకాలనూ  , హృదయాలనూ మనుష్యులనూ కాలం మార్చేస్తుంది అన్న అవగాహన కుదిరేకొద్దీ లభించే స్థిమితత్వం , అందుకు సంసిద్ధం కావటం జీవితంలో ఎంత అనివార్యంగా జరిగిపోతుందో ఈ కథ చెప్తుంది. ఈ కథతో కారా 1940 లలో ఉద్యోగాలకోసం ఉన్నవూళ్ళు వదిలి పట్టణాలవైపు కదులుతున్న చదువుకొన్నతరం అనుభవంలోకి ఉదృతంగా తోసుకు వస్తున్న మార్పును అనివార్యమైనదిగా చెప్పినట్లయింది. వెనక చూపుకు ఇక అవకాశం లేదన్న సూచన కూడా కథ ముగింపులో ఉంది. 

ఇక స్త్రీపురుషుల మధ్య  ఆకర్షణ సంగతి. పెళ్లి దానికి షరతులు అయిన కులగోత్రాలు,  ఆస్తులు – అంతస్తులు , వీటికి తోడు లైంగిక నీతి,  అహాలు మనుషులమీద బరువై కూర్చొని మానవత్వానికి పరాయీకరిస్తున్నాయి. చలం , కుటుంబరావు అప్పటికి ఆ కోణం నుండి జీవితాన్ని శోధిస్తూ కథలు వ్రాసారు. వ్రాస్తున్నారు. వాళ్ళ మార్గంలో స్త్రీపురుష సంబంధాలను అర్ధం చేసుకొనే దృక్పథం 1940 వ దశకపు కారా కథలలో ప్రతిఫలించింది. ఒక యువకుడికి యువతికి మధ్య ఆకర్షణ, చూపులవల్ల , పలకరింపులవల్ల ఒకరినొకరు సంతోష పెట్టుకొనగలగటం శీల భంగంగా ఆయన భావించలేదు.  అలా అనుకొనే లోకం మనుషులను ఎంత యాంత్రికంగా తయారుచేస్తుందో అందువల్ల వాళ్ళు ఎంత సృజనాత్మకమైన జీవితాన్ని , అనుభవాలను కోల్పోతారో  ‘అదృశ్యము’ కథలో సూచించాడు. ఈ కథలో ఒకరినొకరు దూరం నుండే చూచుకొంటూ  పలకరించుకొని అదొక ఆటగా సంతోషపడే పెళ్లికాని యువకుడు , పెళ్లయిన యువతి గురించి చెప్పటం ముఖ్యం కాదు. వాళ్ళ ప్రవర్తనను  అనైతిక చర్యగా భావించి వాళ్ళను బహిష్కరిస్తున్నాం అనుకొని లలిత వంటి యువతులు శీలానికి సంబంధించిన మాయాజాలంలో చిక్కుకొని భారత నారి భావనకు బ్రాండ్ అంబాసిడర్ గా గర్వ పడవచ్చునేమో కానీ కోరదగిన వరులను కోల్పోయి లభించిన భర్తలతో బతికెయ్యవలసి వస్తుందన్న ఎరుక కలిగించటమే రచయిత ఉద్దేశం.  ఆకర్షణ ,  అభిమానం కలిగినప్పుడు, ఆ అభిమానం తన అహాన్ని , వ్యక్తిత్వాన్ని సంతోష పెడుతున్నప్పుడు దానిని వ్యక్తీకరించే చొరవ, చైతన్యం కొరవడినప్పుడు మిగిలేది జీవితకాలపు బాధ.బలహీనులు కథలో  నర్సు ట్రైనింగ్ లో ఉన్న అమ్మాయి అనుభవం అదే.  అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మారటానికి  సంసిద్ధం కాకపోతే జీవితం చేజారి పోతుందన్న దృష్టి కారాది.           

రేవతి తన స్నేహితురాలు సీతకు వ్రాసిన ఉత్తరాల రూపంలో నడిపిన కథలు నాలుగు 40వ దశకంలోవే. రేవతి థర్డ్ ఫారం పాసై చదువుమానేసి పెళ్లిచేసుకొని బిడ్డతల్లి అయిన సాధారణ స్త్రీయే అయినా బాగా పుస్తకాలు చదువుతుంది. అభిప్రాయలు ఏర్పరచుకోగలిగి ఉత్తరాలలో వాటిని  స్నేహితురాలతో పంచుకోగలిగిన చైతన్యం ఉంది.  జీవితాన్ని స్నేహం,  ప్రేమ మొదలైన విలువలతో వెలిగింపచేసుకొనటానికి తన పరిమితులలో ఆమె చేసిన ప్రయత్నాలు ఈ కథలకు  వస్తువు.  పెళ్లి చూపులు సంతలో కొనటానికి సాగే పశువుల ఎంపిక పద్ధతిలో ఉండటాన్నివిమర్శిస్తూ వ్రాసిన ఉత్తరం వాటిలో ఒకటి . ( నవచైతన్యం 1947)   “మాది సాంస్కృతిక జాతి అంటూ పరదేశీయులతో డంబాలు కొట్టే పురుషుల్లో ప్రజాస్వామికం కావాలంటూ అర్రులు చాచే పురుషుల్లో తమ సంఘం ఆచారాల్లోని అనాగరికత, బూర్జువా తనం గుర్తించే విజ్ఞానం , విశాల హృదయం లేదు” అని రేవతి వ్రాసిన మాటలు  ప్రజాస్వామ్యం దేశ రాజకీయాలకే కాదు , జీవితానికి కూడా అనువర్తింప చేసుకోవలసిన విలువ అన్న కారా దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  “స్త్రీలలో ఈ అవమానాల్ని గుర్తించి ఎదుర్కొనే అభిమానం, ధైర్యం లేదు”  అన్న   రేవతి  మాటలు స్త్రీలలో  మేల్కొనవలసిన కొత్త చైతన్యానికి దిక్సూచీలు. వధూవరులు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొనటానికి పెళ్ళికి ముందు స్నేహితులవలె ఎవరో ఒకరి ఇంట వారం పదిరోజులు గడప వచ్చు అని స్త్రీలకూ అవమానకరంగా ఉండే పెళ్లిచూపుల తతంగానికి గౌరవకరమైన ప్రత్యామ్నాయాన్ని కారా సూచించటం ఈ కథలో గమనించవచ్చు.  ‘దూరదృష్టి’ కథలో కట్నంలేని పెళ్లిళ్ల గురించి , ‘తల్లుల ప్రేమ’ కథలో బిడ్డల పెంపకం గురించి రేవతి వెలిబుచ్చిన అభిప్రాయాలు జీవితంలో అభ్యాసం  చేయదగిన కొత్త సంస్కారాలను సూచిస్తాయి.  

దూరదృష్టి కథలో చర్చనీయమైన మరొక అంశం ఇంగ్లీషు చదువులు , ఉద్యోగాలు వద్దనుకుని పల్లెపట్టున బ్రతకాలనుకొనే వ్యక్తి ఎంత సంస్కారి అయినా భర్తగా ఆడపిల్లలకు ఆమోదయోగ్యం కాలేకపోతున్నాడని. ఇంగ్లిష్ భాషా వ్యామోహం , పట్నం కాపురాల మోజు దాంపత్య జీవితాలపై నెరుపుతున్న ప్రభావం గురించి 1946లోనే ఆలోచించారు కారా. ఈ చిన్న కథాంశం మరొక నాలుగేళ్లకు ‘రాగమయి’ అనే పెద్ద కథ అయింది.     

ఏమైనా  కాలానుగతంగా వ్యక్తులలో రావలసిన మార్పుల గురించిన కారా దృక్పథం  సూక్ష్మగానో, స్థూలంగానో , సూచ్యంగానో వ్యక్తమైన కథలివి. 

                                                  2

తొలి నాళ్లలోని  వ్యక్తి  కేంద్రకమైన  కారా దృక్పథం సామాజికం కావటం ఈ నలభయ్యవ దశకంలోనే  ‘బలానికి లక్ష్యం’(1946) కథతో మొదలైంది.  హోటల్లో కాఫీ తాగటానికి వచ్చిన ఒక పెద్దమనిషి హోటల్ యజమాని తిరస్కారానికి గురై  వెళ్తున్న  ఒక పల్లెటూరి రైతు పక్షాన నిలబడి యజమానిచేత అతనికి క్షమార్పణలు చెప్పించటం ఈ కథలో ఘటన. హోటల్లో తిని బిల్లు చూపించి ఎంతయింది బాబూ అని అడిగిన వినియోగదారుడు రైతు. డబ్బు తీసుకోవలసిన యజమాని అధికారం ఉట్టిపడే స్వరంతో రారా  అంటూ అమర్యాదాకర  సంబోధనతో చెల్లించవలసిన డబ్బు చెప్పి,  చిల్లర ఇచ్చి పంపిన  తీరును గమనించిన పెద్దమనిషి ప్రతిస్పందన అది. హోటల్ లో వస్తువులు కొనుక్కొని వినియోగదారులు చెల్లించిన డబ్బులో మిగుల్చుకొన్న లాభమే యజమాని ఆదాయం అన్న అవగాహన , ప్రతిజాతి , ప్రతివృత్తి దేనికదే గౌరవనీయమైనది అన్న నిశ్చితాభిప్రాయం , పట్టణవాసులు  పల్లెవారిని  , ధనవంతులు బీదవాళ్లను , ఉద్యోగులు  రైతుకూలీలలను  అగౌరవపరచటానికి వీల్లేని కొత్తకాలంలో ఉన్నామన్నా స్పృహ  ఉన్నవాడుగా ఆ పెద్దమనిషి రైతు కోసం యజమానితో ఘర్షణపడ్డాడు. మనలో ఎవరిని ఎవరు అవమాన పరచినా అందరినీ అవమానించినట్లే అని ఆత్మగౌరవంతో జీవించవలసిన మానవాత్మను సంభావించాడు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు , అన్నవాళ్ళు వాళ్ళపాపాన వాళ్ళే పోతారు వంటి పాత మాటల మాయలో ఉన్న రైతును ఈ రకం అనాసక్తి మంచిది కాదని కూడా హెచ్చరించాడు. అన్యాయాన్ని అన్యాయం అని బాధితుల దగ్గరనుండి పీడితులవరకు అందరికీ అర్ధమయ్యేట్లు చెప్పటం బాధితులకి పరిహారం లభించేంతవరకు నిలబడి తలబడటం మాత్రమే కాక  ఇలాంటి పనులు ఏ ఒకరిద్దరి వల్లనో అయ్యేవి కావన్న ఎరుకతో విద్యార్థుల సామూహిక శక్తి భాగస్వామ్యం వాంఛనీయం అన్నట్లుగా మాట్లాడాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన కథకుడి మాట “ ఆఁ బలానికి లక్ష్యం అది” అదే ఈ కథకు ముగింపు వాక్యం. 

పెద్దమనిషికి పేరులేదు. కథకుడికి అతనికి మధ్య పరిచయం ఏదీ లేదు కనుక పేరులేదు. అతను బలంగా ఎత్తుగా ఉండి అదే హోటల్లో కాఫీ తాగుతున్న కథకుడిని ఆకర్షించాడు. కథకుడు ఆకారాన్ని బట్టి అతనిని పెద్దమనిషి అనుకొన్నాడు. రైతు పక్షాన నిలబడిన  చర్య  అతను నిజంగా పెద్దమనిషే అన్న గౌరవాన్ని కలిగించింది. ఖద్దరు వస్త్రాలు కట్టుకున్నాడనీ కథ మొదట్లోనూ, జైహింద్ అన్నాడని చివరలోను అతనిగురించిన కథనం జాతీయోద్యమంలో అతను భాగస్వామి అని సూచిస్తాయి. దేశానికి స్వాతంత్య్రం ఏ భేదభావాలు , అసమానతలు లేని సమస్థాయి సంబంధాలతో సమకూడాలన్న ఆశయానికి ఆ పెద్దమనిషి ఒక నిలువెత్తు రూపం. అందువల్లే కథకుడి హృదయ సంతోష భరితమైంది. చూపులతోనే అతనిని కౌగిలించుకొన్నాడు. మనిషి బలం మంచిని నిలబెట్టటానికి ఉపయోగపడాలన్న విలువను ప్రతిపాదిస్తూ ముగిసిన  ఈ కథ కారా దృక్పథంలో వచ్చిన కీలకమైన మలుపును సూచిస్తుంది. 

                                                  3

ఇక్కడి నుండి సామాజిక చలన సూత్రాలను పట్టుకొనటానికి భిన్న పార్శ్వలనుండి ఆయన   ప్రయత్నం పార్రంభం అయింది. 1949 జనవరిలో  ‘అసలు రహస్యం’  కథ వచ్చింది.  అప్పటికి బ్రిటిష్ వలసపాలన నుండి భారతదేశం స్వతంత్రమై  ఏడాది మీద నాలుగు నెలలు. ఆ కాలంలో నే వ్యవసాయ సంబంధాలలో సంస్కరణల విషయమై జరుగుతున్న చర్చలను , రాజకీయ విధానాలను గమనిస్తూ  కారా ఆ నేపథ్యంలో వ్రాసిన కథ ఇది. రెండవ ప్రపంచయుద్ధం తెచ్చిన సంక్షోభంలో నిరుద్యోగం దేశాన్ని పట్టి పీడిస్తున్న కాలంలో నిక్షేపం వంటి ఉద్యోగాన్ని వదిలేసిన సుందరం గురించిన చర్చగా ప్రారంభమైన ఈ కథలో అతను పన్నులు చెల్లించవలసిన అవసరంలేకుండా భూములను పోగేసుకొని అనుభవించగలిగిన ఇనాం దార్ అని తెలుస్తుంది. అంత ఇనాందార్ గుమస్తా పనిలో ఎందుకు చేరాడు? దేశానికి స్వాతంత్య్రం వచ్చి ప్రజాప్రభుత్వాలు ఏర్పడుతూ జమిందారీ ఇనాం దారీ విధానాల రద్దు గురించిన చర్చ జరుగుతుంటే కూర్చుని తినే రోజులు పోయాయని ఉద్యోగానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసాడు అంటే కూర్చుని తినేరోజులకు ఢోకా ఏమీ లేదన్న విశ్వాసం కలగటం వలన. ఆ విశ్వాసాన్ని ఇచ్చింది ప్రజాప్రభుత్వమే . జమిందారీ ఇనాందారీ భూముల విషయంలో అనుభవదారులకు నష్టం కలగని రీతిలో విధానాలు రూపొందించుకొనటానికి అన్ని అవకాశాలు ఉన్నాయని ఆ స్వల్ప కాలంలోనే అర్ధం అయిపొయింది.  అసెంబ్లీకి వెళ్లి విధాన నిర్ణయాలు చేసేవాళ్ళు ఇనాములు దున్నే రైతులు కాదు, జిరాయితీ రైతుకాదు , ఇనాందార్లే , జమిందార్లే అన్నది అసలు రహస్యం. సుందరానికి ఉద్యోగం అవసరం లేదిప్పుడు. అసెంబ్లీ కి ఎదగటం , ఎక్కిరావటం ఆ వర్గం లక్ష్యాలు. దేశీయ భూస్వామ్య   పాలకవర్గం రూపొందటానికి రంగం సిద్ధం కావటాన్ని అర్ధం చేసుకొని దానిని కథగా చేయటంలో కారా భారతదేశపు భవిష్యత్ చిత్రపటం ఎలా ఉంటుందో ప్రదర్శించగలిగాడు. ఆ రకంగా రాజకీయార్థిక దృక్పథం కారా కథా దృక్పథం కావటం ఇక్కడ స్పష్టమైన రూపం తీసుకున్నది. 

నిరవాకాలు, జయప్రద జీవనం అనే రెండు కథలు కూడా ఈ వరుసలో చెప్పుకోవలసినవి. 1949 మార్చ్ లో ఒకటి  డిసెంబర్ లో మరొకటి వచ్చాయి. నిరవాకాలు కథ ‘ఉగ్గుపాలతో పాటు వేదాంత సవాన్ని సేవిస్తూ పెరిగిన హిందూ సామాజికుల ముందు నోరు విప్పడానికి నాకు హడలే – కానీ గత్యంతరం లేదు’ అన్న కథకుడి వాక్యంతో మొదలవుతుంది. హిందూ సమాజం మీద, తత్వం మీద దట్టించిన మరఫిరంగి వంటి వాక్యం అది. బ్రాహ్మణీయ హిందూ సమాజపు  ఫాసిస్టు సమాజ స్వభావాన్ని బట్టబయలు చేసే వాక్యం. సేవించిన వేదాంత సవం హిందూ సామాజికులకు ఇచ్చిందేమిటి?  కార్యానికి కారణాలను మరుగుపరిచి కర్తృత్వ బాధ్యత నుండి తప్పుకొనే  ఆత్మవంచనా పరత్వాన్ని మప్పింది. ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ లక్ష్మి చంచలమైనది , ఎవడి కర్మ వాడనుభవించవలసిందే వంటి సిద్ధమైన అభిప్రాయాల మాటున తప్పించుకు తిరగటం నేర్పింది. వాస్తవ జీవితంలో ఈ వేదాంతం మానవ ప్రవృత్త్రిని  , ప్రవర్తనను  ఎలా  శాసిస్తుంటుందో  అందువల్ల జీవితం ఎంత భీభత్సంగా తయారవుతుందో నిరవాకాలు కథలో చూపిస్తారు కారా. 

వీర్రాజు పంతులు జీవిత కాలంలో పోగేసిన సంపద అతని  కొడుకు సుబ్బారావు హయాంలో ఎందుకు హరించుకు పోయింది ? తండ్రి వెనక ఉప్పుగల్లు, చింతపండు సంచులు వేసుకొని ఊరూరా తిరిగి అమ్ముకున్న గురన్న పదివేల రూపాయల ఆస్తి ఎలా సంపాదించాడు? ఈ రెండూ  ప్రశ్నలను చర్చిస్తున్నట్లుగా సాగే ఈ కథ లో ఇతివృత్తం ఉత్పత్తి తో సంబంధంలేని బ్రాహ్మణుల మీద అభిశంసగా సాగుతుంది. వీర్రాజు సంపాందించింది ఉత్పత్తి చేసి కాదు. భూసంబంధాలలోని చట్టపర సంక్లిష్టతలను స్వప్రయోజనానికి వాడుకోగల కరిణీకపు వృత్తివల్ల. తరువాతి తరంలో గురన్న సంపాదించటమైనా ఉత్పత్తిలో పాల్గొనటం వల్ల కాదు. సరుకును లాభానికి అమ్మటం ద్వారా. వడ్డీలకు అప్పులిచ్చి భూములను దఖలు పరచుకొనటం ద్వారా . తండ్రి సంపాదించింది సుబ్బారావు ఎలా పోగొట్టుకున్నాడు ? ఏ పనీ చేయకుండా దర్జాలు ఒలకబోస్తూ భక్తిలోనో , భంగుతోనో జీవితం గడిపివేయటం వల్ల. అవసరాలకు అప్పులు చేసి బాకీలకింద భూములను చెల్లువేయటంద్వారా. ఈ రకమైన  నిర్వ్యాపారమే  బ్రాహణ వర్గ పతనానికి కారణం అన్న సూచన ఈ కథలో గర్భితం.  మనుషులను శ్రమకు పరాయీకరించటమే అగ్రవర్ణుల హోదా చిహ్నం అనుకోవచ్చు గాక అదే సమయంలో అది వ్యక్తిని మనిషితనం నుండి కూడా పరాయీకరిస్తుంది.  వ్యర్థులుగా, హీనులుగా చేస్తుంది. నిష్క్రియా పరులుగా , జీవితానికి మొహం తిప్పుకొనేవాళ్లుగా చేస్తుంది.  సుబ్బారావు స్థితి అదే. అతని అసమర్ధ దుర్జనత్వం భార్యను తిట్టడంలో , కొట్టటంలో వ్యక్తమవుతుంటాయి. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు భయపెట్టినప్పుడో , బాధపెట్టినప్పుడో ఊరటకు ‘రాతిలో మండూకంబే క్రియన్ బ్రతుకు చుండున్’ అని అని మెట్టవేదాంతాన్ని అరువు తెచ్చుకొనటమో ,  మందారామకరంద మాధుర్యమున దేలు మధుపంబు ను ఆదర్శంగా తెచ్చుకొనటమో చేసే మనుషుల పట్ల రామారావు గారికి ఏ విధమైన సానుభూతీ లేదన్నది స్పష్టం. మనిషి పురోగమనానికి అవరోధంగా ఉన్న మిధ్యాడంబరాలు , మిధ్యావాదాలు వదులుకోకపోతే పతనం అనివార్యమని హెచ్చరిస్తుంది నిరవాకాలు కథ. 

అదే హిందూ వేదాంత సవం మత్తు నెత్తికెక్కిన మనుషుల చూపు , చింతన వాస్తవాలకు పెడముఖం పెట్టేవి అని నిరూపించటానికి వ్రాసిన కథ  ‘జయప్రద జీవనం’. లోకంలో అధర్మం, అన్యాయం పెచ్చు పెరిగిపోతుంటే వాటికి మూలం ఏమిటో ఆలోచించకుండా , కారకులు కళ్ళముందే కనబడుతున్నా ఎదుర్కొనే మార్గం గురించి మాట్లాడక అధర్మం , అన్యాయం చేసినవాళ్లు ఎప్పటికైనా నాశనం అవుతారు, వాళ్ళు చేసిన పాపాలకు అంతకంతా అనుభవిస్తారు అంటూ గాయాలకు మాలాములు పూసే ప్రయత్నానికి మరోపేరు హిందూ వేదాంతం. ఆ వేదాంత సవం తాగి పెరిగిన హిందూ సామాజికులలో ఒకడైన ఒకానొక వ్యక్తికి – అతనే ఈ కథలో కథకుడు-     కాలాంతర పరిణామాల పరిశీలనలో ఆ మత్తు దిగి వాస్తవాలవైపు కళ్ళు తెరుచుకొనటం ఈ కథా విషయం. అందుకు అతనిని హెచ్చరిస్తూ సహాయపడినవాడు స్నేహితుడు నారాయణ రావు.   

కథ పదేళ్లక్రితం మొదలైంది. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ లో భాగంగా ఫార్వర్డ్ బ్లాక్ సృష్టించిన రోజులు అని కథలోనే చెప్పబడింది. అంటే 1939 లో కథ మొదలైనట్లు. ఆనాటి వామపక్ష ఉద్యమాల నేపథ్యంలో రాజకీయాల చర్చల్లో భాగంగా స్నేహితులు ఇద్దరి మధ్య జరిగిన  వివాదంలో  అధర్మం నాశనకారీ అవును కాదు అన్న విషయం మీద వచ్చిన అభిప్రాయభేదాలు అప్పుడప్పుడూ చర్చకు వస్తూ అధర్మం నాశనకారి కాదు అన్న వాదం రుజువు కావటంగా  కథ ముగిసింది. అధర్మ వర్తనకు,  అన్యాయ వర్తనకు ప్రతినిధి పాత్ర జోగారావు. నారాయణరావు స్థానంలో ఉద్యోగం పొందటానికి అన్యాయపు ఆరోపణలకు పాల్పాడ్డాడు. పదేళ్లలో తహసీల్దారు అయ్యాడు . సిల్కు దుస్తులు, విందు భోజనాలు , మేడల్లో కాపురం , భార్య వంటి నిండా నగలు, అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు, ఇద్దరు తమ్ముల చదువు అన్నీ సజావుగా సాగుతున్నాయి అంటే మోసం, నమ్మకద్రోహం, లంచగొండితనం, అబద్ధం, అన్యాయం  చేయకుండా సాధ్యమే కాదు అంటాడు నారాయణరావు. అది అన్యాయ ఆర్జనే అయితే అది అతనికి దక్కదు అని కథకుడి వాదం.  కానీ అతను అన్నీ సంపాదిస్తూ అనుభవిస్తూ జీవించి నన్నాళ్లు జీవించి సంపదలు వారసత్వంగా కుటుంబానికి ఇచ్చి సునాయాస మరణం పొందటంతో కథను ముగించి కారా అన్యాయాలు అక్రమాలు చేసినవాళ్లు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని నమ్మి తృప్తి పడి  జీవించేలా మనుషులను తయారుచేసే  హిందూ వేదాంతం లోని మాయను తెలుసుకోమంటారు. 

ఈ కథలోనే “ప్రపంచంలో ఏదీ కూడా ఒకరు కోల్పోతే గాని ఒకరికి లభ్యమవదు” అని చెప్పిన  కారా అది ప్రత్యక్ష అప్రత్యక్ష పద్దతులలో   జరుగుంతుందంటారు. ఈ కథలో నారాయణ రావు ఉద్యోగాన్ని కోల్పోతే జోగారావు కు దొరికింది. వెంకట్రావు మందు దొరకక  బిడ్డను కోల్పోయిన పరిస్థితులలో జోగారావు దానిని సులభంగా సంపాదించి బిడ్డను రక్షించుకోగలిగాడు. మరొక శ్రీహరి కొడుకు ట్యూషన్ ఫీజు కట్టలేని పరిస్థితిలో కింది తరగతిలో ఉంటె జోగారావు కొడుకు మూడేళ్ల ట్యూషన్ తో పద్నాలుగేళ్లకే స్కూల్ ఫైనల్ కు వచ్చాడు. వీటిని అంచలంచెలుగా కథలో భాగం చేసి అన్ని అవకాశాలు చాలామందికి  నిరాకరింపబడి కొందరికే దక్కటంలోని అసంబద్దతను గురించిన ప్రశ్న నారాయణరావు ముఖంగా ముందుకు తెచ్చాడు.ధనం, అధికారం భేదాలకు కారణమని చెప్పాడు. ధనాధికారాలు లభించటానికి వ్యక్తుల సామర్ధ్యానికి సంబంధం లేదని నిర్ధారించి చెప్పటంలో దోపిడీ వైపు వేలు చూపించటం ఉన్నది. జోగారావు వంటి వాళ్ళను శిక్షించటం వ్యక్తులవల్ల అయ్యేపని కాదని ప్రజానీకం తలపెట్టినప్పుడే అని ప్రజా ఉద్యమాలను ఆకాంక్షించాడు. నారాయణరావు అవగాహన, ఆవేశం, సంభాషణ , నిర్ధారణ నిలకడ మీద అయినా హిందూ వేదాంత సవం కలిగించిన మత్తులో నిద్రిస్తున్న భారత ప్రజానీకంలో కదలికకు కారణం కాగలదన్న ఒక ఆశావహ ద్రుష్టి కథకుడు ‘నారాయణరావు మాటే నిజమైంది’ అని ఒప్పేసుకొనటంలో ప్రతిఫలిస్తుంది. ఒకడి ‘జయప్రద జీవనం’ అనేకుల ఓటముల పునాది మీద నిర్మాణం అవుతుందని 1949 నాటికి అనన్య సామాన్యంగా నిరూపించిన కారా కథా దృక్పథం మార్క్సిస్టు దృక్పథంగా పర్యవసించటానికి మరెంతో దూరం లేదు. 1951 లో వచ్చిన అప్రజ్ఞాతం , 1953 లో వచ్చిన పలాయితుడు ఆ దిశగా పడిన బలమైన అడుగులు. 

                                              4

“ఎవడి పొట్టో కొట్టందే మనపొట్టకు మించిన తిండి మన ఇంట్లో మిగలదు. పదిమంది ఆస్తి చెదిరితే గాని ఒకడి ఆస్తి పెరగదు.“ ఇది అప్రజ్ఞాతం కథలో సుదర్శనం మాట.   “ప్రపంచంలో ఏదీ కూడా ఒకరు కోల్పోతే గాని ఒకరికి లభ్యమవదు” అని ‘జయప్రద జీవనం’ కథలో ఏ  వాక్యం అయితే చెప్పబడిందో  దానికి విస్తరణ రూపం ఇది.  సామాన్య లౌకిక జ్ఞాన స్థాయి మార్క్సిస్టు జ్ఞానంగా పరిణితి చెందిన దశ ను ప్రతిఫలించే వాక్యం. మార్కిస్టు అవగాహన  జీవితాన్నికార్యకారణ సంబంధాల నుండి  వస్తుగతంగా అర్ధం చేసుకొనే శక్తిని ఇస్తుంది. ఆ శక్తి ఇచ్చిన ఉత్సాహం నుండే సుదర్శనం మార్కిస్టు సూత్రాలను అన్వయించి తన గ్రామంలో మానవ సంబంధాలను వివరించ పూనుకొన్నాడు. రైతుకు కూలీలకు , రైతుకు షావుకార్లకు మధ్య సంబంధాల విశ్లేషణగా అది సాగుతుంది. రైతు ఒక వైపు చాలినంత  వేతనాలు ఇయ్యక  కూలీల శ్రమను దోచుకొంటూ మరొక వైపు వ్యవసాయ అవసరాల కోసమో , పెళ్లిళ్లు మొదలైన ఇంటి అవసరాలకోసమో షావుకార్ల దగ్గర అప్పులు చేస్తూ వడ్డీలు కడుతూ తలకు మించిపోయినప్పుడు భూములు అమ్ముకొంటూ దోపిడీకి గురికావటం తెలియకుండా జీవితంలో ఎలా సాగిపోతున్నదో ఎరుకపరిచాడు సుదర్శనం.

అతను ఏ సమూహం ముందు మాట్లాడాడో ఆ సమూహంలో రైతులు, పెద్ద రైతులు, షావుకార్లు ఉన్నారుకానీ కూలీల జాడ కనబడదు. ఉదయం కాలక్షేపానికి దేవాలయ మంటపం చేరి రాజకీయాలు చర్చించే ఆ సమూహంలో రోజూ పొలానికో , పశువులు కాయటానికో , యజమాని చెప్పిన మరేపనికో  వెళ్ళటం విధాయకమైన కూలీలు , కంబార్లు ఇలాంటి చోట ఉదయం పూట చర్చకు  చేరే వీలులేదు. అందువల్ల సుదర్శనం ఏ కూలీల పక్షం మాట్లాడాడో వాళ్ళ మెప్పు పొందే అవకాశం లేదు. కూలీలా పక్షానా మాట్లాడటం రైతులకు , రైతుల పక్షాన మాట్లాడటం షావుకార్లకు ఆగ్రహ కారణం అయింది. ఇరువర్గాల ఎదురుదాడులను అతను కాయవలసి వచ్చింది. ఆ సందర్భంలో ప్రశ్నోత్తరాల రూపంలో , వాదప్రతివాదాల రూపంలో  సాగిన సంభాషణ కొన్ని కీలకాంశాల మీదకు మన దృష్టిని మళ్ళిస్తుంది.

వాటిలో ఒకటి దోపిడి.  ఎవరి సొమ్మైనా రాత్రికి రాత్రి కొట్టేసుకొస్తే దోపిడీ అని నిర్వచించి రైతులు తమది దోపిడీ కాదంటారు. తామే కూలివాళ్ళను చేరదీసి గంజిబోసి బతుకు ఇస్తున్నామని అంటారు. పైగా భూమున్నొణ్ణి కూలోడు దోచుకొంటున్నాడు అని వితండవాదం లేవనెత్తారు. అనుకొన్న కూలిగింజలు పట్టుకు పోవటమే కాక పాత బనీన్లు, దుప్పట్లు అంటూ అడిగిఅడిగి పట్టుకుపోతారని తమ ఉదారతను , చేన్లలో దొంగతనాలకు దిగి తన్నులు తినే కూలీల  చిన్న బుద్ధుల గురించి ప్రసంగించారు. మార్కిస్టులు ఎదుర్కోవలసిన వర్గం యొక్క స్వభావం ఎంత మొరటుగా ఉంటుందో సూచించారు కారా. 

సుదర్శనం దొంగతనం వేరు దోపిడీ వేరు అని చెప్తాడు. రైతులు రాత్రికి రాత్రి కూలీలనుండి కొట్టేసుకొచ్చేది ఏదీ లేదు. పట్టపగలు  అందరూ చూస్తుండగా భుజబలంతోనో, ఆయుధబలం తోనో , సంఘ బలం తోనో ప్రతిఘటించటానికి అసమర్ధులను  చేసి వాళ్ళనుండి ధనాన్నో , బంగారాన్నో , భూమినో వాళ్ళ చేతుల మీదుగా అప్పగింప చేసే విధానం దోపిడీ. అలా దోచుకొనటానికి వాళ్ళ దగ్గర కుండబొచ్చెలు, చింకిపాతలే కదా ఉన్నది అని రైతులు ఎకసెక్కమాడితే వాళ్ళ దగ్గర ఉన్న సంపదలు సృష్టించ గల శ్రమశక్తి ని చౌకచేసి కొనటంలో దోపిడీ కాక మరేమి ఉన్నదని సుదర్శనం వాదం. 

షావుకార్ల దోపిడీలో వడ్డీకి , సరుకును అమ్మటంలోని లాభానికి ఉన్న పాత్రను గురించి కూడా సుదర్శనం ప్రస్తావించాడు.అప్పు తీసుకొన్న రైతు సరుకు తనకే అమ్మాలని షరతు పెట్టటం , ధరను తానే నిర్ణయించటం  కొనేటప్పుడు కొలిచే పద్ధతికి అమ్మేటప్పుడు కొలిచేపద్ధతికి మధ్య తేడాలు ఇవన్నీ కూడా దోపిడీ రూపాలే అని చెప్పగలిగాడు. “ఎవడి పొట్టో కొట్టందే మనపొట్టకు మించిన తిండి మన ఇంట్లో మిగలదు. పదిమంది ఆస్తి చెదిరితే గాని ఒకడి ఆస్తి పెరగదు” అని సంపద కలవారి దంతా అన్యాయార్జితమే అని తేల్చేసాడు. 

అయితే ఈ వాదాన్ని నిరాకరించటానికి దోపిడీ వర్గం ముందుకు తెచ్చే భగవంతుడు రెండవ కీలకాంశం. సంపద ఎవరికైనా  భగవంతుడిస్తేనే వస్తుంది అని వాళ్ల విశ్వాసం.ఈ విశ్వాసం లోకంలో చలామణిలో ఉన్నంతసేపు దోపిడీ గురించిన అవగాహన కలగదు. ఎవరెంత చెప్పినా అర్ధం కాదు. తానంత వివరంగా చెప్పినా సూరప్పడు తనది దోపిడీ కాదని చెప్పటానికి  భగవంతుడినే రుజువుగా తెచ్చి మాట్లాడటం సుదర్శనానికి మింగుడు పడని అంశమే అయింది. అయితే అలాంటి దేవుడిని తేలికగా త్రోసిపుచ్చగల గుండెనిబ్బరం మార్క్సిస్టు అవగాహన నుండి పొందిన సుదర్శనం వంటి వాళ్ళు ఆ గుండెనిబ్బరం కోల్పోయేట్లు చేసే సామాజిక సాంస్కృతిక భావజాల చలామణి తో నిత్యం , నిరంతరం చేయవలసిన పోరాటం కూడా ఒకటి ఉంటుందని  సూచిస్తుంది ఈ కథ. 

దోపిడీ అనే మహాయంత్రంలో శీలలుగా తెలిసో తెలియకో ప్రతివాళ్ళూ దోపిడీ కొనసాగింపు కు ప్రత్యక్షంగానో , పరోక్షంగానో తోడ్పడుతుండే వ్యవస్థ ఒకటి ఉనికిలో ఉందన్న కథాంత సూచన ఒక్క సారి మనలని అందరిని ఉలిక్కి పడేట్లు చేస్తుంది. దోపిడీ గురించిన  అవగాహన శ్రామిక వర్గంలోకి పరివ్యాప్తి చెందితే గానీ అసలు పోరాటాలు మొదలు కావు అని కూడా అర్ధం అవుతుంది. 

పలాయితుడు కథలో కూడా ఈ సమస్య మధ్యతరగతి వర్గ చైతన్యం నుండి చర్చకు వచ్చింది. సున్నితమైన మానవుడు స్నేహంతో జీవితాన్ని సుందరతరంగా మలచుకోవాలనుకొని ఇంటాబయటా ప్రతికూల శక్తులమధ్య పెనుగులాడుతూ అలివికాని క్షణాన అన్నిటినీ వదిలి పలాయనం చిత్తగించిన రాజశేఖరం అవగాహన ఈ కథలో కీలకమైనది. జయప్రద జీవన నిర్మాణం మనిషి చేతుల్లోనే ఉందని,  సామర్ధ్యాన్ని బట్టి సమకూడుతుంటుందని  అనిపించవచ్చు కానీ నిజానికి అది “సర్వే సర్వత్ర ప్రపంచం నేడాశ్రయించి ఉన్న ఆర్ధికవిధానం , సర్వానర్థభూతమైన అఆర్ధిక విధానం చేతిలో ఉన్నదన్న అవగాహన అతనిది.   దానితో ఎక్కడ తలపడాలో, ఎట్లా తలపడాలో తెలియని ఒక ఒంటరి తనం ఆవరించినప్పుడు  మనుషులనుండి , జీవితం నుండి పలాయనం తప్ప మార్గం కనబడలేదు.వ్యక్తి వైఫల్యానికి ఆర్ధిక నిర్మాణాలకు మధ్య కనబడని దారాలు ఉన్నాయని 1953 నాటికి గ్రహించి  కథగా చేయగలిగాడంటే కారా పెట్టుబడిదారీ ఆర్ధిక  వ్యవస్థ అసహ్యకరమైన ముఖాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొనటం వల్లనే సాధ్యమైంది.  

సంపదనుఉత్పత్తి చేసేవాళ్ళు, మేధోశక్తులను వినియోగించి సృజన శక్తులను అభివృద్ధి పరచేవారు, వాళ్లకు సేవలు అందించేవారు సంపదలో అతితక్కువభాగం పొందుతూ అర్ధాకలితో జీవిస్తుంటే శ్రమతో సంబంధం లేని వర్గమే ఎక్కువభాగం అనుభవించటంలోని న్యాయాన్ని ప్రశ్నించటమే కాదు , భౌతిక జ్ఞాన సంపదల  సృష్టికర్తలు  సంపదను అధికంగా అనుభవించేవారు మనకన్నా ఏ విధంగా అర్హులో ఆలోచించి తమకు రావలసిన న్యాయమైన భాగం పొందటానికి మార్గమేమిటో ఆలోచించాలని హెచ్చరిస్తుంది ఈ కథ. 

                                           5 

అప్రజ్ఞాతం , పలాయితుడు వంటి కథలలో చదువుకొన్న మధ్యతరగతి వర్గం  అవగాహనగా కనబడే మార్క్సిస్టు దృక్పథం మరొక పదేళ్లకు యజ్ఞం కథ దగ్గరకు వచ్చేసరికి  గడ్డివేళ్ళ స్థాయి జీవిత అనుభవంగా , అనుభవం నుండి అభివృద్ధి చెందుతున్న చైతన్యంగా పరివర్తన చెందటం కనిపిస్తుంది. చైతన్యం ఆచరణగా మారటానికి వెతుకులాట కూడా అక్కడే ప్రారంభం.  పదమూడేళ్ల భారతదేశ స్వాతంత్య్రం రచించిన అభివృద్ధి ప్రణాళికలు అంతిమంగా ఏ శక్తులు బలపడటానికి ఏ వర్గాలు మరింత కునారిల్లటానికి తోడ్పడ్డాయో బట్టబయలు చేసిన కథ ఇది. “కొందరి బతుకులు బుగ్గయి ఆ బుగ్గిలెల్లి మరికొందరికి బువ్వలు పుట్టే” వ్యవస్థగా ఇది అప్పలనాయుడికి అర్ధం అయింది.   హరిత విప్లవ నేపథ్యంలో వ్యాపార పంటలు, మార్కెట్ ఆర్ధిక వ్యవస్థలో జూదంగా మారిన వ్యవసాయం, చిన చేపను  పెద చేప మింగేసే తీరు అంతర్జాతీయ అవసరాల విపణి అన్నీ గ్రామీణ ఆర్ధిక ముఖచిత్రాన్ని ఎంత వికృతం చేశాయో అప్పలనాయుడు అనుభవ కథనంగా తెలిసివస్తుంది. అభివృద్ధి వెలుగులు ఎవరికి చెందుతున్నాయి? అభివృద్ధి దీపపు నీడల కింద ఉపాధులు కోల్పోయి కనబడకుండా పోయినవాళ్లు ఎవరు? ఎందరు? అన్న ప్రశ్న కలవరపెట్టక మానదు.   “ఎవరిసొమ్ము ఎవరు పడేసుకోవడంవల్ల ఎవరు గొప్పోల్లాయి పోతన్నారో ఎవరికెందువల్ల కూడు బుట్టకుండా పోతున్నదో” చెప్పమని ఆనాడు అప్పలనాయుడు అంతగా నిలదీసిన ప్రశ్నకు ఇప్పటికీ జవాబులేదు. ఆ నాటి అభివృద్ధి నమూనాలోనూ ఇప్పటికీ పెద్దగా మార్పులు లేవు. భారతదేశం వెలిగిపోయేంతగా రచింపబడుతున్న కార్పొరేట్ అభివృద్ధి ప్రణాళికల నీడలలో మిగిలే అప్పలనాయుడి వారసులు ఎందరో .. ! ఒక్కరు పనిచేస్తుంటే అందరూ సుఖంగా తిని బతకగలిగిన పరిస్థితులు కొందరికి,  ఇంటిల్లిపాది కష్టపడ్డా నిండని కడుపుల వ్యధ చాలామందికి ఎందుకుఉందో తేలాలని  అనుభవం ప్రశ్నలు  వేయగలిగింది. ఆ ప్రశ్నలకు జవాబుగా సమాజాన్ని మార్చే ఆచరణ ప్రణాళిక ఈ కథ వచ్చిన మూడునాలుగేళ్ళకు నక్సల్బరిగా ఆవిష్కృతమైంది. అది నడుస్తున్న చరిత్ర . 

ఈ చరిత్ర నిర్మాణంలో భాగంగానే సాంఘిక వ్యవస్థలో అట్టడుగున ఉన్న  శ్రామిక శక్తి అయిన మాలమాదిగలను , స్త్రీలను కేంద్రంగా చేసి వాళ్ళకు లేనివి , కోల్పోయినవి ఏమిటో , వాటిని తిరిగిపొందటానికి  వాళ్ళు ఈ స్థాయిలో ఎన్నెన్ని పోరాటాలకు సంసిద్ధంగా అవుతున్నారో ఆర్తి, చావు , హింస , ఆదివారం , నోరూమ్ వంటి కథలలో చూపించారు కారా. పార్లమెంటరీ ప్రజస్వామ్య ప్రభుత్వాలు భూస్వామ్య  పారిశ్రామిక వర్గాల ప్రయోజనంకోసం పనిచేస్తూ ఆస్తులు కూడబెట్టుకొన టానికి , దోపిడీకి అనుకూలమైన శాంతి పరిస్థితులను హక్కుల కోసం అడిగే శ్రామిక వర్గం పైనా వాళ్లకు మద్దతుగా నిలబడి మాట్లాడే ప్రజాస్వామిక వాదుల మీద హింసను ప్రయోగించి సాధించటంలోని వైరుధ్యాన్ని శాంతి కథలో దేనినైతే 1971 లో కారా చూపించారో అదే ఈ నాటి రాజ్య విధానమై ప్రజస్వామిక నిరసనలను అన్నిటినీ దేశద్రోహ చర్యలుగా ప్రకటించే తెంపరి తనమై కరుడు కట్టటాన్ని మించిన విషాదం ఏముంది?

ఈ పరిస్థితులలో కారాకథలు మళ్ళీ చదివి వర్తమాన అవసరాల నుండి వ్యాఖ్యానించుకోదగినవి. 

Leave a Reply