‘ఆదివారం’ సెలవు కాదా?

కారా కథలు గతంలో (దాదాపు మూడు దశాబ్దాల క్రితం ) కొన్ని చదివాను. తన కథల్ని మనకి మిగిల్చి ఇటీవల మాష్టారు వెళ్లిపోయాక మళ్ళీ మొత్తం కథలు చదవడం మొదలుపెట్టినపుడు కొన్ని కథలని మొదటిసారిగా చదివాను. కొన్ని చదువుతున్నపుడు ముఖ్యంగా ఒకే దగ్గర చదువుతున్నప్పుడు ఆయన స్త్రీ పాత్రలను ఎంత బాగా చిత్రించారో గమనించాను. అసలు ‘కారాకథల్లో స్త్రీ పాత్రలు’ అనే అంశం మీద తప్పక రాయాలీ అనిపించింది. ఇప్పటికే  ఎవరన్నా ఆ పని చేసి ఉండకపోతే మాత్రం తప్పక చేయదగ్గ పని. నేను ప్రస్తుతానికి ఒక కథ గురించి మీతో పంచుకుంటాను.  


కారా తన పంతొమ్మిదవ యేట మొదటి కథ రాసారు. మొదట్లో ఆయన తనకు తెలిసిన అగ్రకుల మధ్య తరగతికి సంబంధించిన ఇతివృత్తాలతోనే కథలు రాసారు.  అయితే అప్పుడు కూడా ఆ స్త్రీ పాత్రలను బలమైన వ్యక్తిత్వాలున్నవిగానే చిత్రించారు. దాదాపు అరవయ్యవ దశకం ప్రారంభంలో ఆయన దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. కథల్లోని వస్తువు మారింది. వర్గ, కుల, జెండర్ స్పృహతో  పీడితుల పక్షాన నిలబడి వాళ్ళ జీవితాలను అధ్యయనం చేసి ఈ కథలు రాశారనిపిస్తుంది.  


సమాజంలో జరుగుతున్న మార్పుల క్రమం కూడా కారా కథల్లో మనకి కనిపిస్తుంది. మహిళా పాత్రల వరకూ చూస్తే కూడా, ఆనాటికి కొందరు స్త్రీలు విద్యావంతులు కావడం,  అందువల్లే వచ్చిన సాంస్కృతిక మార్పులు, వాళ్ళకీ చదువులేని వారికీ మధ్య, వారికీ మగవాళ్ళకీ మధ్య ఆ కారణంగా వచ్చే వైరుధ్యాలు వంటివి కూడా ఆ కథల్లో చక్కగా ప్రతిఫలించాయి.


పీడితుల పక్షాన నిలబడి రాసిన కథల్లోకి వచ్చే ఈ కథ ‘ఆదివారం’. దీనిని 1968లో రాశారు. ఇది రాసిన కాలం గుర్తుపెట్టుకోవడం కూడా చాలా అవసరం. ఈ కథలో అన్నీ స్త్రీపాత్రలే. ఈ కథ ఒక మధ్య తరగతి పెద్ద కుటుంబంలోని కోడలు వైపు నుండి నడుస్తుంది. ఈ కథలో నాయిక ఆయింటి పనిమనిషి  అంకాలు.


ఇంటి యజమానురాలు హోదాలోని అత్తగారు పనిమనిషిని పెట్టుకోగలిగే స్థాయిలోని మధ్యతరగతి వర్గానికి ప్రతినిధి. అరవైయ్యేళ్ళ ఆవిడ. అంకాలు కష్టించి పనిచేసే దోపిడీకి గురయ్యే శ్రామిక వర్గానికి ప్రతినిధి. అంకాలుకు ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం తో పాటు దేనికీ వెరవని ఆత్మవిశ్వాసం కూడా ఉంది. అంతే కాదు కాసింత చిలిపితనం, అపారమైన తెలివితేటలు ఉన్నాయి.


అత్తగారికి అంకాలు మీద బోలెడన్ని షికాయతులున్నాయి. అంకాలు వర్గం ఎలా ఉండాలనేదాని పట్ల ఆవిడకు కొన్ని నిశ్చిత అభిప్రాయాలున్నాయి. ‘పనివాళ్ళు ఒళ్ళు దాచుకోకుండా పని చేసుకుని, డబ్బు చాలక పోతే ఆ ఇంట్లో అర్థో, పావలో అడుక్కోవాలి’. సమయానికి రావాలి. నాగాలు పెట్టకూడదు, కాలు నోప్పో చెయ్యి నోప్పో అయితే వేరు సంగతి కానీ, ఊరికే అలా సెలవులు అనుభవించడానికి లేదు’ అని గట్టిగే నమ్మే యజమానురాలు ఆవిడ.  ఆవిడ షికాయతులకి మన అంకాలు దగ్గర దిమ్మ దిరిగిపోయే జవాబులు ఉన్నాయి. అయితే ఆవిడకు కానీ ఆవిడ ప్రాతినిధ్యం వహించే వర్గానికి కానీ అవి మింగుడు పడడం కష్టం. కారణం అవి పచ్చి నిజాలు.


అసలు కథ అంకాలు “నాగా పెట్టడం” గురించి. పనికి రావడం ఒకరోజు ఎగ్గొట్టడమే ఆవిడకు తట్టుకోలేని విషయం అయితే  ఎందుకు రాలేదన్న దానికి అంకాలు చెప్పే సమాధానం మరింత కష్టమైనది. పనిలో చేరిన వారానికి ఒక ఆదివారం అంకాలు పనిలోకిరాలేదు. అలా వరసగా మూడు ఆదివారాలు రాలేదు. మొదటి రెండు సార్లు వేరే జవాబు చెప్పినా మూడో సారి అసలు ఆదివారాలు తాను రానే రానంది. చివరకు పనిమనిషిని మార్చేయ్యాలనుకొని ముసలి సూరమ్మని పిలిచాకా అంకాలు ఎదురుగా ఆవిడ సూరమ్మతో అంకాలు గురించిన ఫిర్యాదులు మొదలుపెడుతుంది. ఆవిడ మాటల్లోనే అంకాలు జవాబులు గురించి చూద్దాం.

“ఆదివారం పనికి రాలేదు. ఏవే, అంటే ‘రాత్రి రెండో ఆట సినీమా కెళ్ళాను, పొద్దున తెలివి రాలేదు, మధ్యాహ్నం నిద్రొచ్చింది’  అన్నది. ఏదో చిన్న గుంట అనుకున్నాను. మళ్ళా ఆదివారం కూడా రాలేదు. ఏమంటే వంట్లో బాగులేదంది. మూడో ఆదివారం మానేసి అడిగితే ఆదివారాలు రానంది.” ఇదీ ఆవిడ గొడవ.


దానికి అంకాలు తిరుగులేని జవాబు చెప్పింది. “అక్కడలాగా, ఇక్కడిలాగా ఉద్యోగాలు చేసే మీ మొగోళ్ళు ఏ సంకటాలు లేకుండానే శలవు పెట్టి జీతాలు తీసుకోడం లేదా? కాఫీ హోటేళ్ళూ, కొట్లూ కట్టేయాలని గవర్నమెంటు రూలు పాస్జేసింది- పనోళ్ళకు ఒకరోజు శెలవుండాలనేకదా?”


అలాగయితే నిన్ను కూడా శెలవు తీసుకోమ్మన్నారటే అని అడిగితే – నిజంగా కాయకష్టం చేసుకొనేవారి కష్టాలు ఈ  గవన్మెంటుకు ఎప్పుడు పట్టాయి; మాకు వాళ్ళూ వీళ్ళూ రూల్సు పెట్టేదేమిటీ మేమే పెడతాం, రూల్సు. నేనాదివారాలు రాను” అంది.


అయితే నేను జీతం కోస్తాను అంది ఆవిడ. ఇక అంకాలు ఆవిడ జాతి నంతా దుయ్యపట్టింది. అల్లా మాట మాట పెరిగి ఆవిడ నీకు ఇష్టముంటే చెయ్యి లేకపోతే లేదు, అనేసింది. కానీ ఆవిడకు అర్థం కానిదీ అంకాలుకు స్పష్టంగా తెలిసింది ఒకటి ఏంటంటే ఎవరి అవసరం ఎవరికి ఉంది. ఎవరు ఎవరి మీద ఆధారపడ్డారు? అనేది. ఆవిడ అంకాలు తన దయా దాక్షిణ్యాల మీద బతుకుతోందని అనుకుంటోంది. కాదు కాదు మీకే మరొక దిక్కులేదు అనే విషయం ఆవిడ గుర్తించే వరకూ వదిలిపెట్టలేదు. అంకాలుకు పని దొరకడం కష్టం కాదు. కానీ వాళ్ళకి అంకాలు లాగా పనిచేసే మనిషి దొరకడం కష్టం. ఆ విషయం అంకాలు చాలా చక్కగా నిరూపిస్తుంది. పైగా వాళ్ళకి మూడు రోజులు సమయం కూడా ఇచ్చింది. ఆతరవాత ఫస్టు తారీఖు నుండి తాను పని మానేస్తున్నానని ప్రకటించేసింది.


ఆమె ఈ ప్రకటన చేసే లోపు వాళ్ళ మధ్య అనేక విషయాల మీద వాదోపవాదాలు జరిగాయి. ఆవిడ ఫిర్యాదుల్లో కొన్ని చాలా మంది చేసేవే. రాగానే హడావిడి పెట్టేస్తుంది. ఇంకా భోజనాలు కాలేదనో చేతిలో పనుందనో అంటే నాకు మీ ఒక్క ఇల్లేనా అంటుంది. ఒక్కో సారి తొందరగా వచ్చేసి లేపేస్తుంది. ఇంకోసారి బారెడు పొద్దెక్కినా రాదు. మధ్యాహ్నం నిద్ర పోతున్నప్పుడు దబదబ తలుపు బాదేస్తుంది.  పనిమనిషిని పెట్టుకొనేదే కాస్త విశ్రాంతిగా ఉండడానికి, అనేది ఆవిడ అవగాహన. అంతే కాదు వాళ్ళు ఎక్కువ ఇళ్ళు పెట్టుకోకుండా సమయానికి చేయగలిగినవే చెయ్యాలి. డబ్బు తక్కువైతే ఆ ఇంట్లో అర్థో పావలో అడుక్కోవాలి.


ఇవన్నిటికీ అంకాలు చెప్పిన సమాధానాలు ఒక ఎత్తు. చివరి మాటకి చెప్పిన జవాబు ఒక ఎత్తు.


“నిన్నూ నిన్నూ అడుక్కోవడానికి, నీ కాళ్ళు నీ కాళ్ళూ పట్టుకు పిసకరించడానికి నాకేం పట్టిందమ్మా. నానేం అవిటిదాన్నా, సేవిటిదాన్నా? నేకపోతే వొళ్ళోంచడానికొల్లని సోవరిపోతునా? కష్టపడతాను. తెచ్చుకున్న కూరాకు తింటాను. అవాసకో పున్నానికో ఎంగిలి మెతుకులెడతారని ఎవరి కాళ్ళూ పిసకరించను. నాకిష్టం ఉన్నదా- ఇష్టవున్నకాడ ఇష్టవున్నన్నాళ్ళూ పంజేస్తాను. నాకిష్టం లేకపోతే నాను పంజేయను.”

అదీ అంకాలు వ్యక్తిత్వం.


అంకాలు ద్వారా కారా  మాష్టారు చెప్పదలుచుకున్నది కూడా అదే. శ్రమ కు ఫలితం వేతనం. అందులో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆధారపడినప్పటికీ చేయించుకొనే వర్గం తను పై మెట్టు మీద ఉన్నాననుకుంటుంది.  శ్రమ  చేసేవారు అణిగి మణిగి ఉండాలనీ తమ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలని కోరుకుంటుంది. ఉన్నారని నమ్ముతుంది. అంకాలు ఆ నమ్మకాన్ని పునాదుల్తో సహా కదిలించివేస్తుంది.


ఇక్కడ అత్తగారు ఏదో పెద్ద దోపిడీ దారు కాదు. మధ్య తరగతి  మహిళ. కోడలు ఒక్కదాని మీదే పనంతా పడిపోవడం   నచ్చనిమనిషి. కానీ సమాజంలో ఉన్న అసమానతల వల్ల ఆవిడలోనూ ఆ భావజాలమే పనిచేసి ఎలా గైనా తనదే పై చేయి కావాలనే ఒక పట్టుదల ఉంటుంది. పని మనిషి ముందు తాను ఓడిపోవాల్సి రావడం ఆమెకు అర్థం అవుతుంది. ఓడినా  కింద పడినా ఎలాగైనా తనదే పై చేయి కావాలనుకొని, మానెయ్య మని చెప్పిన మనిషికి రెండు రూపాయలు జీతం పెంచుతానని ఆశ కూడా చూపించింది. నిజానికి మళ్ళీ పనిచేయమని అడగడానికి కూడా ఆమెకు ధైర్యం ఉండదు. కోడలి ద్వారా జీతం పెంచడం గురించి మాట్లాడిస్తే అంకాలు మరి అలాంటిదిలాంటిది కాదు. ఎందుకిస్తావు అని నిలదీస్తుంది. చివరికి ఆవిడ పరువు విలువ రెండురూపాయలు అని నిరూపించి పక పక నవ్వుతుంది. తన గురించి తన తోటి పనిమనిషికి తన ఎదుటే  ఫిర్యాదులు చేస్తుంటే  “అదేటి కలకటేరా, గవినేరా నాలాగే పంజేసుకునే కూలి ముండ. దాంతో సేప్పుకుంటే ఏటవుతాది? ఓ ఇరుగమ్మనో, పొరుగమ్మనో నీ సాటిదాన్ని పిలిస్సెప్పితే కాసింత అందంగుంటాది” అని పరిహాసం చేస్తుంది.


అంకాలు పని మానేస్తే మరొక పని మనిషి కోసం వెతికి వెతికీ చివరకు అనేక తర్జన భర్జనలు పడుతూ మాట్లాడుకుంటున్నప్పుడు ఇంటి పనికి యంత్రాలు ఉంటాయని వేరే దేశాల్లో దాదాపు అందరికీ అందుబాటులో ఉన్నాయని, స్వాతంత్రం వచ్చి రెండు దశాబ్దాలైనా తమకి ఇంకా రాలేదని ఒక పాత్రతో చెప్పిస్తారు. అలాగే మగవాళ్ళు ఇంటిపనిలో సమంగా భాగం పంచుకొంటారని ఇక్కడే అలా లేదని అంటుంది. ఈ మాటలు చదువుకుంటున్న ఆడపడుచు పాత్ర ద్వారా చర్చలోకి తెస్తారు.


అంటే 1968 నాటికి ఆయన ఇంటి పనిలో ఆడవాళ్ళ చాకిరీ గురించి ఎంతో ఆలోచించడం, సానుభూతితో గౌరవంతో ఆ విషయాన్ని పరిశీలించి పరిష్కారంగా ఇంటిపనిని యాంత్రీకరించడం గురించీ పురుషులు సమాన భాగస్వామ్యం గురించి, రాయడం, అంతవరకూ పనిమనుషులకు కూడా సెలవులుండాల్సిన అవసరం గురించీ మాట్లాడడం ఎంతో గొప్ప విషయం. ఇక్కడ పనిమనిషిని పెట్టుకొన్న ఆమె కైనా, పనిచేస్తున్న ఆమెకైనా ఇంటి పని ఒక చాకిరీనే. దానిని నుండి స్త్రీలంతా విముక్తి కావలిసిందే. ఆ విషయాలను పీడిత వర్గం వైపు నిలబడి ఒక మంచి కథగా మలిస్తే అది ‘ఆదివారం’. తప్పక చదవవలిసిన కథ.  

Leave a Reply