మన దేశంలో హవాయి చెప్పులు వేసుకునే వారు సహితం విమానాలలో ప్రయాణించే స్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని ఈ రోజు పత్రికలలో ఒక వార్త వచ్చింది. అదేమేరకు నిజమో మీకూ, నాకూ అందరికీ తెలుసు. విమాన ప్రయాణం మాటేమోగాని తమపై కేంద్ర ప్రభుత్వం వైమానిక దాడులు చేస్తున్నదని, వాటిని ఆపమని ఆదివాసులు డిమాండ్‌ చేస్తున్నారు. . మనందరం దీన్ని పట్టించుకోవాలి. వాళ్లతో గొంతెత్తి అరవాలి. ఇదీ ఇవ్వాల్టి పరిస్థితి.

ఛత్తీస్‌ఘడ్‌ రాష్త్రం బీజాపూర్‌ జిల్లాలో ఫిబ్రవరి 1, 2 వ తేదీలలో జరిగిన ఘటనను మీకు వివరిస్తాను. ఈ ఘటన చెబితే దీని ద్వారా నేను మాట్లాడవలసిన సబ్జెక్టు కూడా ‘‘కార్పొరేటీకరణ -సైనికీకరణ -పౌరహక్కులు’’ అనే అంశాన్ని చర్చించుకోడానికి కొంత సమాచారం లభించవచ్చు.
సిడిఆర్‌వో తరపున 21 సభ్యుల బృందం మొత్తం 5 అంశాల్లో నిజనిర్ధారణ చేయడానికి ఫిబ్రవరి 1న బయల్దేరాము. ఆ అంశాలు ఇవి..

  1. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో వైమానిక దాడులు
  2. సిలింగేర్‌ ఆదివాసీ రైతుల ఆందోళన
  3. రహదారుల విస్తరణ మీద రైతుల ఆందోళనలు
  4. నారాయణపూర్‌ జిల్లాలో క్రైస్తవులపై దాడులు
  5. జగదల్పూర్‌లోని రైతుల ఆందోళన

ఈ అంశాలపై నిజనిర్ధారణకు మా టీమ్‌ సుకుమా జిల్లా దోర్నపాల్‌ వెళ్ళటానికి వీల్లేదని చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. తొలుత మా వాహనదారులను బెదిరించారు. మేము జిల్లా కలెక్టర్‌, అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌, సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ అధికారి లతో సుమారు మూడు గంటల పాటు జరిపిన చర్చలు ఏమాత్రం ఫలించలేదు.

మమ్మల్ని ఎందుకు అక్కడికి పోనీయ లేదు.. అనే విషయం గురించి ఆలోచించాలి. అక్కడ ఏం జరుగుతోందో బైటికి తెలియకూడదు. ఇవాళ అక్కడ జరుగుతున్న విషయాల ద్వారా ప్రపంచీకరణ, సరళీకరణ, పైవేటీకరణ అనే వాటిని సాఫీగా తెలుసుకోవచ్చు. ఈ విధానాలు ఎవరి కోసం అమలు చేస్తున్నారు? వీటి వల్ల ఎవరు లాభపడుతున్నారు? అనే విషయాలు తెలుస్తాయి.

కాంగ్రెస్‌, బీజేపీ ఏదైనా కావచ్చు. 1991లో పి వి నరసింహారావు ఆర్ధిక సంస్కరణల పేరిట ప్రపంచీకరణను మన దేశానికి తెచ్చాడు. ఈ విధానాల వల్ల మన జీవితాలు బాగుపడ్డాయా ! ప్రధానంగా భారతదేశాన్ని 5 భాగాలుగా గుర్తిస్తే ఎక్కువగా ఖనిజాలు లభించే రాష్ట్రాలు ఒరిస్సా, చత్తీస్‌గడ్‌, బెంగాల్‌, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.

గతంలో వాజ్‌పేయి గవర్నమెంటులో ఈ దేశంలో ఆస్తులు అమ్మడానికి ఒక మంత్రి వర్గ శాఖను ఏర్పాటు చేశాడు. అంటే వాటికి నిరర్థక ఆస్తులనే పేరిట ప్రభుత్వ ఆస్తులను అమ్మడానికి ఏర్పాటు చేసారు. ఆ పేరుతో ప్రభుత్వ రంగంలోని ఆస్తుల వల్ల ఉపయోగం లేదని, ప్రజలకు ఎటువంటి లాభం జరగడం లేదని నమ్మించే ప్రయత్నం చేసారు. ఆవిధంగా ఆస్తులను అమ్ముతూ వచ్చారు. ప్రభుత్వ ఆస్తులు అన్నీ అమ్మిన తర్వాత వీరి కన్ను సహజ వనరులపై పడిరది. సహజ వనరులని వినియెగంలోకి తీసుకువస్తున్నామనే పేరుతో వాటిని అమ్మి ప్రభుత్వాన్ని నడిపించవచ్చు అంటున్నారు. ఈ అమ్మకాల్లో వాళ్ల పార్టీల మనుగడ కూడా ఉన్నది. ఈ పని కాంగ్రెస్‌ పార్టీ చేసింది. బీజేపీ చేస్తున్నది. సహజ వనరులను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడం మొదలైంది. ఈ పరిస్థితుల్లోనే కార్పొరేటీకరణ అనేది ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నది.
దేశంలో ప్రధానంగా 27 శాతం బరువు ఎక్కువ లేని నాణ్యమైన ఇనుము ఒక చత్తీస్‌ఘడ్‌లోనే లభిస్తోంది. కాబట్టి అక్కడ ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం 1992 ప్రాంతంలోనే కార్పొరేట్‌ పెట్టుబడికి గేట్లు బార్లు తెరిచింది. దానితోపాటు పెట్టుబడిదారీ సంస్కృతీ కూడా వచ్చింది. ఒకవైపు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఎంఓయూలు కుదుర్చు కుంటూ మీరు కంపెనీలు పెట్టుకోవచ్చు, వనరులను తొవ్వుకొని పోవచ్చు అని అప్పటి ప్రధాని పి వి నరసింహారావు ప్రకటనలు పత్రికల్లో ఫుల్‌ పేజిల్లో వచ్చేవి. కొద్దిగా రాజకీయంగా తెలిసినవాళ్లకు అప్పట్లో పి వి నరసింహారావు ప్రజలను త్యాగాలు చేయాలని పిలుపు ఇచ్చిన విషయం గుర్తు ఉంటుంది. ప్రజలేంటి త్యాగాలకు సిద్ధపడడమేంటి? అంటే నూతన ఆర్థిక విధానాల వల్ల ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి వారు త్యాగాలకు సిద్ధపడాలి. హక్కుల గురించి మాట్లాడటం మానెయ్యాలి. ఇదీ ఆయన ఉద్దేశం. కార్పొరేటీకరణ వెనుక హక్కుల విధ్వంసానికి ఇంత పెద్ద లింక్‌ ఉన్నది.

అప్పుడే ‘జన జాగరణ్‌ మంచ్‌’ అని కాంగ్రెస్‌కు చెందిన శాసనసభ్యుడు మహేంద్ర ఖర్మ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దాదాపు అప్పటికి వందల సంఖ్యలో చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం, కేంద్రం కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు కదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు అన్నీ ఐరన్‌ ఓర్‌, అల్యూమినియం, బాక్సైట్‌కు సంబంధించినవి. ఈ ఒప్పందాలన్నీ చట్ట ప్రకారం జరగాలి. ఇవి అమలయ్యే క్రమంలో హక్కుల ఉల్లంఘన జరగటానికి వీల్లేదు. ఆడవుల్లో నివశించే ఆదివాసీ ప్రజానీకానికి నష్టం కలగకూడదు. వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని మాత్రమే ఈ మైనింగ్‌ చేయాలి. ఈ విషయాల్లో అక్కడ ఉన్న మావోయిస్టు పార్టీ ఆదివాసులకు అండగా ఉంది.

ఈ నేపథ్యంలో ‘‘జన జాగరణ్‌మంచ్‌ ‘‘అనే సంస్థ ఏర్పడి, ఆ తర్వాత ఆదివాసీల్లో ప్రభుత్వేతర సాయుధ హంతకముఠా తయారైంది. ప్రభుత్వ అండతో హక్కుల అణచివేతకు, హననానికి, రాజ్యాంగంలో ప్రజలకు కల్పించబడిన ప్రాథమిక హక్కులకు భంగం ఏర్పడిరది. ఈ జన జాగరణ్‌ మంచ్‌లో ఉన్నవాళ్లు గ్రామాల్లో వ్యక్తుల అనుపానులు కనుక్కుంటూ, వాళ్లలో ఎవరు మావోయిస్టు పార్టీకి అండగా వున్నారో, మైనింగ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో కనుక్కొని , పోలీసులకు ఉప్పందించే పని చేస్తుంటారు. వీరికి వ్యతిరేకంగా, అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఆందోళన జరిగాయి. ఈ ఉద్యమాల వల్ల మైనింగ్‌ కంపెనీలు చేసుకున్న ఒప్పందాలు ఇవాళ్టికీ అమలు కాలేదు. దీంతో మహేంద్ర ఖర్మ ఆదివాసులతో ప్రైవేటు సైన్యం తయారు చేశాడు. సుమారు 2005 నుంచి సాల్వాజుడుం పేరుతో ఈ సైన్యం పని చేసింది.వీళ్లు దాడికి వెళ్ళిపోతే ఆ గ్రామాల్లోని ముసలి, ముతక, చిన్న పిల్లలు, ఆడవాళ్ళు తేడా లేకుండా వాళ్ళ మీద విరుచుకుపడేవారు.

ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళు మావోయిస్టులకి ఆశ్రయమిస్తున్నారనే ముద్రవేసి, భయభ్రాంతం చేస్తూ, గ్రామాలను తగుల బెడుతూ వచ్చారు. పిడికిలి బిగబట్టి ఒక పిల్లవాడు చెయ్యి ఎత్తితే ఆ బాలుడి వేలు నరికిన సంఘటన కూడా ఉంది. నందినీ సుందర్‌ అనే ఢల్లీికి చెందిన ఒ సామాజిక కార్యకర్త ఈ సాల్వాజుడుం అరాచకాల మీద సుప్రీం కోర్టులో ఒక పిల్‌ వేసింది.

ఈ సాల్వాజుడుం అనే అరాచక ముఠా నిర్వహణకు కార్పొరేట్‌ కంపెనీలు సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ అనే ముద్దు పేరుతో పెట్టుబడి పెడతాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తోడవుతాయి. అట్లనే కేంద్రం భారత సైన్నాన్ని కూడా దించుతుంది. ఈ భారత సైన్యం గతంలో చెల్లా చెదురుగా దేశవ్యాపితంగా ఉండేది. కశ్మీర్‌లో, నాగాలాండ్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌ గుర్ఖాల్యాండ్‌, బోడో ఉద్యమం ఇంకా రకరకాల చోట్ల ఆందోళనలు జరిగేవి. ఈశాన్య రాష్ట్రాల్లో కొంత సైన్యాన్ని నిల్వ ఉంచేవారు. మిగతా సైన్యం అక్కడక్కడా చెల్లాచెదురుగా ఉండేది. కానీ ఆ ఉద్యమాలు అణిచివేసి ప్రభుత్వం రాజీ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉదాహరణగా నాగాలాండ్‌, మిజోరాం పోరాటకారులతో కేంద్ర శాంతి ఒప్పందాలు చేసుకొంది. ఆ తర్వాత సైన్యాన్ని తీసుకువచ్చి, ఆ రాష్ట్రాల్లో ఖనిజ సంపదను వెలికి తీయడానికి ఎం.ఓ.యులు కుదుర్చుకున్నారు.

మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, బెంగాల్‌, ఒడిషాలోని మల్కాన్‌గిరి, మహారాష్ట్ర గడ్చిరోలీ తదితర ప్రాంతాలన్నింటిలో వందల మందిని సైన్యం చంపేసింది. ఇవి ఎన్కౌంటర్లు కాదు. చుట్టుముట్టి చంపటం. నిజంగా ఉద్యమకారులకు, సైన్యానికి మధ్య ఎన్‌కౌంటర్లు జరుగుతూ ఉన్నాయా? మావోయిస్టు పార్టీని తుదముట్టించ్చి, కార్పొరేట్‌ శక్తుల దోపిడీకి తగిన సౌకర్యాలు కల్పించడానికి, ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధం భారత రాజ్యం కార్పొరేట్‌ శక్తులకు అండగా ప్రజలపై చేస్తున్న యుద్ధం.

ఈ యుద్ధాన్ని ముమ్మరం చేసి 2026 కల్లా మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచేస్తాం అని అమిత్‌షా అన్నాడు. అంతక ముందు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇలాగే అన్నాడు. ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైనది వామపక్ష తీవ్రవాదమే అన్నాడు. వీళ్ళందరూ ఎవరి కోసం ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకోసం మాట్లాడుతూ ఉన్నారు?

భూభాగంలో దాదాపు 40 శాతం అడువులున్నపుడు మాత్రమే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. అన్ని కాలాలు ఉంటాయి. వర్షాలు కురుస్తాయి. అడవుల్ని ఇష్టమొచ్చినట్లు నరికేస్తే, వాతావరణం దెబ్బతింటుంది. కార్పొరేట్‌ దోపిడీ వల్ల పరిసరాలు, పర్యావరణం, ఖనిజ సంపద, ఆదివాసుల ఊళ్లు దెబ్బతినిపోతాయి. వాళ్ళ సంస్కృతి మొత్తాన్ని కూడా నాశనం అవుతుంది. దీని గురించి ఆదివాసులు ఆందోళన చేస్తున్నారు. మేం ఎక్కడికి పోవాలి అని అడుగుతున్నారు. దీనికి సుక్మా జిల్లా కలెక్టర్‌, ఎస్‌.పి. ఏమంటారంటే ఆదివాసీలకు అక్కడి భూమికి పట్టాలు ఉంటే కదా, వాళ్ళతో మేము మాట్లాడేది, చర్చలు జరిపేది అంటున్నారు.

ఎంత సిగ్గు చేటంటే 75 యేండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో వందల సంవత్సరాల నుంచి అడవుల్లో నివసిస్తున్న ఆదివాసుల భూమి ఇది, వాళ్ళు సాగు చేసుకునేది ఇది అని ప్రభుత్వాలు నిర్ధారించలేక పోయాయి. సరైన ఆహారం లేక 45 యేండ్లకే జీవితాన్ని చాలించాల్సిన పరిస్థితి ఆదివాసులకు ఏర్పడిరది. మానవుల సూచికలో పోషణ అనేది ఎంత దిగజారిపోయింది?

ఆదివాసుల దగ్గర్నుంచి భూమి తీసుకునేటపుడు ఆదివాసులకు అధికారులు ఎందుకు చెప్పరు? సిలింగేర్‌ పోరాటం గురించి మీ అందరికీ తెలుసు. మీటింగ్‌ల్లో వినే ఉంటారు. అక్కడ ఒకాయనకు ఐదు ఎకరాలు భూమి ఉంది. తెల్లారేసరికి పొలంలో పోలీసు క్యాంప్‌ ఉంది. పోలీస్‌ క్యాంప్‌ ఎట్లా వచ్చింది ఏంటి అని అడిగితే అతన్ని లెక్క చేయలేదు. 10 మంది పోయారు లెక్కజేయలేదు. గ్రామం మొత్తం వచ్చారు. లెక్కచేయలేదు. ఇక అక్కడి నుంచి వందల గ్రామాల ప్రజలు సిలింగేర్‌ వచ్చి పోలీసు క్యాంపులు పెట్టడానికి వీల్లేదని ఆందోళన చేస్తున్నారు.

అట్లాగే ఇంకో చోట రోడ్లను విస్తరిస్తోంటే రోడ్డుల విస్తరణ చేస్తా ఉంటే, సుక్మా జిల్లా కలెక్టర్‌ను అదివాసులు అడిగారు. మా గ్రామాలకు అవసరమైన రోడ్లు వేయండి. నాలుగు లైన్ల రోడ్లు మాకు అక్కర లేదని అన్నారు. మావోయిస్టులు వెనుక ఉండి ఈ మాటలు మాట్లాడిస్తున్నారని అధికారులు అంటున్నారు. రోడ్లు వేస్తే ఆదివాసీలు డెవలప్‌ అవుతారు. అప్పుడు వాళ్లకు మావోయిస్టులతో పని ఉండదు. కాబట్టి వాళ్ళే ఇలా మాట్లాడిస్తున్నారు అంటున్నారు.

సిలింగేర్‌కి మీరెప్పుడ్కెనా వెళ్ళారా? అని కలెక్టర్‌ను అడిగాం. ఇంత వరకు ఆ ధర్నా దగ్గిరికి ఆయన వెళ్ళి మీరెందుకు ఆందోళన చేస్తా ఉన్నారు? మీ ప్రధానమైన డిమాండ్‌ ఏంటి? అని అడిగిన పాపాన పోలేదు. 600 రోజుల నుంచి, వేల సంఖ్యలో ఒక ధర్నా చేస్తా ఉంటే, ఆ ధర్నా గురించి పట్టించుకోని దాన్ని ప్రభుత్వం అంటారా? ఈ దేశ పాలకులు, ఈ దేశంలో ఓట్లు వేసిన ప్రజలు ఇంతకాలంగా ఆందోళన చేస్తా ఉంటే, ఇప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా, ముఖ్యమంత్రి గానీ, కలెక్టర్‌ గానీ, ఎవరూ అక్కడికి వెళ్లలేదు. దీన్ని ప్రజాస్వామ్య దేశం అందామా? పైగా అక్కడ సైన్యం కాల్పులు జరిపి ఆరుగురిని చంపేసింది. బేలాభాటియా లాంటి వాళ్లు అక్కడికి వెళితే కేసు పెట్టారు. ఈ ఘటనలో కాల్పులు జరిపిన పోలీసు ఆఫీసర్‌ రిపోర్టు ఇస్తే చనిపోయిన వారి మీద కేసు పెట్టారు.

ఇంతకంటే కార్పొరేటీకరణకు, సైనికీకరణకు హక్కుల ఉల్లంఘనకు ఉన్న సంబంధం ఏముంటుంది? జగదల్‌పూర్‌కి ఆనుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉండే నాగర్నార్‌ చోట ఒక ప్రైవేట్‌ వ్యక్తి ఐరన్‌ వోర్‌ కంపెనీ పెడతానంటే ఎవ్వరూ భూముల్విడానికి సిద్ధపడలేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ కంపెనీ తానే పెట్టేందుకు సిద్ధమైంది. ఏ పరిహారాలు, సౌకర్యాలు ఇచ్చేదీ ప్రజలకు రాసి ఇచ్చింది. ఆ తర్వాత ప్రజలు భూములు ఇచ్చారు. కానీ 8 సంవత్సరాలైంది. ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో సగం కూడా అమలు కాలేదు. ఉద్యోగాలు సగం మందికి కూడా రాలేదు. రాకపోగా ఇప్పుడు ఆ కంపెనీ కాస్త ప్రైవేట్‌ పరం చేస్తా ఉన్నారు.

ఒక పథకం ప్రకారం మైనింగ్‌ కంపెనీ పెట్టడానికి ప్రైవేట్‌ వ్యక్తులకు భూములు ఇవ్వమని రైతులు అంటే వాళ్ల నుంచి భూములు తీసుకొనే దాకా ప్రభుత్వం తానే కంపెనీ పెడుతున్నట్లు ప్రచారం చేస్తుంది. ఆ తర్వాత దాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు ఇచ్చేస్తుంది. ఇది ప్రభుత్వమా లేక బ్రోకరా!

కాబట్టి వనరుల దోపిడీ అనేది నూతన ఆర్ధిక విధానాల్లో భాగం. ఆ తరువాత సహజ వనరులను మొత్తాన్ని కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చేస్త్తున్నారు. దీనికి సెజ్‌లు కూడా ఒక ఉదాహరణ. 2005 నాటికి దాదాపు 295 సెజ్‌లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య వేలల్లో ఉంది.

ఈ క్రమంలో స్వాతంత్య్రం రాక ముందు నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి నాలుగే నాలుగు కార్మిక చట్టాలు తయారు చేశారు. ఇది ఒక పెద్ద హక్కుల హననం. కార్మికుల హక్కుల చట్టాలను తీసివేసి, సెజ్‌లు తీసుకువచ్చారు. నందిగ్రాంలో పంట పొలాలు మొత్తం కార్ల కంపెనీకిస్తే, అక్కడ తిరుగుబాటు జరిగింది. దీంతో సిపిఎం ప్రభుత్వం పడిపోయి ే మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు అదే మమతా బెనర్జీ తిరిగి అదే విధమైన బాటలో ప్రయాణం చేస్తా ఉంది.

అంటే పాలకులు మారుతూ ఉన్నారు గానీ, వాళ్ళ విధానాలు మాత్రం కార్పొరేటీకరణకి అనుకూలంగానే ఉంటూ ఉన్నాయి. అన్ని చోట్ల కార్పొరేటీకరణ విధానాలే సైనికీకరణ విధానాలను తీసుకొస్తున్నాయి. సైనికీకరణ ద్వారా భారత రాజ్యాంగానికి అడుగడుగునా ఉల్లంఘన జరుగుతూ ఉంది. సారాంశంలో కార్పొరేటీకరణ, సైనికీకరణ రెండూ భారత రాజ్యంగ స్పూర్తికి వ్యతిరేకమైనవి. ఈ హక్కుల ఉల్లంఘనని వ్యతిరేకిస్తూ మాట్లాడేవారు లేకుండా ప్రజాసంఘాల మీద, మేధావుల మీద క్రిమినల్‌ కేసులు పెడుతున్నారు. ఆదివాసుల మీద క్రిమినల్‌ కేసులు పెడుతున్నారు. దీనికి తగిన చట్టాలు కూడా తీసుకొస్తున్నారు. దేశాన్ని ఒక బందిఖానాలాగా చేసి, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న శక్తులు ఒకవైపు కార్పొరేటీకరణకు తోడు హిందుత్వను తీసుకొస్తున్నారు. మెజారిటీ, మైనారిటీ అనే విభజన తీసుకు వచ్చి, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని అధికారం చెలాయిస్తున్నారు. కానీ కార్పొరేటీకరణ విధానాల వల్ల నష్టపోతున్న వారు అన్ని మతాల్లో ఉన్నారు. అన్ని కులాల్లో ఉన్నారు. ఒక్క రోజులో 79 వేల మంది టెలిఫోన్‌ డిపార్టుమెంట్‌ ఉద్యోగుల్ని తీసేశారు. వాళ్లలో హిందువుల్ని ఉంచి ముస్లింలను మాత్రమే తీసేశారా? మతతత్వం ముసుగు మాత్రమే. ఇది ప్రవేశపెట్టే విధానాలన్నీ దోపిడీ విధానలే. కార్పొరేట్లకు అంటకాగే విధానాల వల్ల అన్ని మతాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు మనం ఆదానీ గురించి వింటున్నాం. రేపు ఇంకొకాయన అనిల్‌ అగర్వాల్‌ అనే అతను రాబోతున్నాడట. ఇదంతా ప్రభుత్వ విధానాల్లోని కార్పొరేటీకరణను తెలియజేస్తోంది. ఇటువంటి శక్తుల్ని గురించి ప్రజలను చైతన్యపరచాలి. ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగినా వాటికి మనం మద్దతు ప్రకటించాలి. అండగా ఉండాలి. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవడం కోసం మనందం కలిసి పనిచేయాలి

(ఫిబ్రవరి 28న విజయవాడలో పిడిఎం నిర్వహించిన సదస్సులోని ప్రసంగ పాఠం)

Leave a Reply