భారతదేశంలోని మూల మూలకు ద్రవ్యపెట్టుబడి వేగంగా, దూకుడుగా విస్తరిస్తున్నఫలితమే మన దేశంలోని అడవుల కార్పొరేటీకరణ. పెట్టుబడి సంచయనం గురించి ప్రాథమిక అర్థశాస్త్ర పాఠాలు అర్థమైనవారికి ఈనాడు మన దేశంలో జరుగుతున్న అడవుల కార్పొరేటీకరణ గురించి ఆశ్చర్యమో, విచిత్రమో ఏమీ వుండదు. ఆఫ్రికా మూలవాసులు చెప్పుకునే అనుభవం జగమెరిగినదే. ఒక చేత్తో బైబిల్, మరో చేత్తో రైఫిల్తో వెళ్లిన యురోపియన్ పెట్టుబడిదారులు వారి చేతిలో బైబిల్ పెట్టి వారి భూములను కైవశం చేసుకున్నారని చెప్పుకోవడం తెలిసిందే. ఉత్పత్తి సాధనాలలో ఒకటైన భూమిని స్వంతం చేసుకోకుండా, ఆ భూమిపై ఆధారపడుతున్న రైతులను శ్రామికులుగా మార్చకుండా పెట్టుబడిదారీ విధానం వునికిలోకి వచ్చి వుండేదే కాదని చరిత్ర చెబుతుంది. మన దేశంలోనూ అదే ప్రక్రియ ఇక్కడి విశిష్ట లక్షణాల నేపథ్యంలో వేగంగా జరిగిపోతున్నది. అపారమైన వనరులున్నమన దేశ అడవులలోకి పెట్టుబడి చేరుతోంది. అడవులలోని మూలవాసులను అది నిరాశ్రయులను చేస్తుంది. వారి మనుగడకు ప్రమాదకరంగా మారుతోంది.

మన దేశంలో 1990-91లో ప్రారంభమైన సామ్రాజ్యవాద నయా ఉదారవాద లేద భూమండలీకరణ, ప్రైవెటీకరణ, ఉదారీకరణ ఆర్థిక విధానాలతో అన్ని రంగాలలోకి పెట్టుబడి చొచ్చుకు రావడం ప్రారంభమై అది 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన హిందుత్వ శక్తులతో అతి దూకుడుగా వేగాన్ని పుంజుకున్నది. నిజానికి కేంద్రంలో నరేంద్రమోదీని ప్రధాన మంత్రిని చేయడంలో ప్రపంచ పెట్టుబడి కీలక పాత్ర పోషించిన విషయం జగమెరిగిన రహస్యం. మోదీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ‘‘మేక్ ఇన్ ఇండియా’’ నినాదాన్నందుకొని తన ప్రభుత్వ లక్ష్యాన్ని తేటతెల్లం చేశాడు. ఇపుడు అన్ని రంగాలలోకి ప్రైవేట్ పెట్టుబడులు నిరాఘటంగా వచ్చి చేరుతున్నాయి. అందుకే ఆయన తన ప్రభుత్వం ‘సులభ వ్యాపారాన్ని’ ప్రోత్సహి స్తుందంటూ అందుకు ఆటంకంగా వున్నటువంటి చట్టాలను ఇప్పటికీ దాదాపు 1,800 చట్టాలను సైతం మార్చేసిండు. మరోవైపూ, ప్రజా వ్యతిరేక మోదీ విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తున్న వారిని అణచివేయడానికి వున్న చట్టాలను సవరిస్తూ, కొత్త చట్టాలను ముందుకుతెస్తున్నారు. 28 మార్చ్ 2022 నాడు డిప్యూటి హోం మినిష్టర్ అజయ్ కుమార్ మిశ్రా (లఖింపుర్ ఖీరీ రైతుల హంతకుడు) ప్రవేశపెట్టిన ‘‘నేర ప్రక్రియ (గుర్తింపు) బిల్, 2022’’ (The Criminal Procedure (Identification) Bill, 2022) ఒక ప్రబల ఉదాహరణ. మోదీ ప్రభుత్వం రూపొందిస్తున్న చట్టాలలో మన దేశంలో కార్పొరేటు శక్తులను ప్రోత్సహించడానికి అనేకం వున్నాయన్నది మనమంతా అనుభవిస్తున్నదే. అందుకే నిన్నటి వరకు మన దేశంలో లక్షలాది రైతాంగం మోదీ ప్రభుత్వం రూపొందించిన ప్రజా వ్యతిరేక మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ముక్త కంఠంతో ‘‘కార్పొరేట్లను తన్ని తరుముదాం’’ అని నినదించారు. ఇపుడు ఆ నినాదాన్ని ఈ దేశంలోని కోట్లాది మూలవాసులు రణనినాదంగా మారుస్తున్నారు. ‘‘కార్పొరేట్లను తన్ని తరుముదాం, అడవులను కాపాడుకుందాం’’ అని వారు నినదిస్తున్నారు.

ఈనాడు మన దేశంలోని అడవులను కార్పొరేటు వర్గాలకు అప్పగించడాన్ని, ఆ వర్గాల ప్రయోజనాల కోసం అడవులను ఖాకీ మయం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మూలవాసీ ప్రజలు సమరశీల పోరాటాలు కొనసాగిస్తున్నారు. వారి పోరాటాలకు అండగా వుంటున్న ప్రగతిశీల శక్తులను రాజ్యం సహించడం లేదు. వారు గాంధేయవాదులైనా వారిని ఉపేక్షించడం లేదు. వారు శాంతిప్రియులైనా క్రైస్తవ ఫాదర్ లైనా మూలవాసీల పక్షాన నిలబడితే వారి అంతం చూస్తుంది. మూలవాసుల పక్షాన నిలిచి అడవుల కార్పొరేటీకరణ, సైన్యకరణకు వ్యతిరేకంగా గళమెత్తిన స్వతంత్ర పాత్రికేయులు రూపేశ్ కుమార్ ను ఇటీవలే ఝార్ఖండ్ లో పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనీ తప్పుడు కేసులలో ఇరికించారు. 2009లో 16 మంది మూలవాసుల హత్యాకాండపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలనీ ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ శ్రేయోభిలాషి హిమాంశుకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే, ఆ కేసును  కొట్టివేయడం కాకుండా కేసు పెట్టినందుకు రూ. 5 లక్షల జుర్మానా విధిస్తూ అది చెల్లించని పక్షంలో ఆయన రెండేళ్ల కారావాస శిక్ష అనుభవించాలని అన్యాయమైన తీర్పు వినిపించింది. ముంబాయిలో విచారణాధీనంలోనున్న ఫాదర్ స్టాన్ సామికి సరైన చికిత్స అందించక రాజ్యం 2021 జులై 5నాడు హత్య చేసింది. అడవుల కార్పొరేటీకరణ, సైన్యకరణలో భాగంగా పెచ్చరిల్లుతున్న రాజ్య బర్బరత్వాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతో వుంది. అంతే కాదు, అలాంటి అణచివేత చర్యలకు రాజ్యం పాలుపడకుండా వుండేవిధంగా మూలవాసులతో కలసి మరింత ధృఢంగా పోరాడవలసి వుంటుంది.

మన దేశంలోని అడవులను కార్పొరేటీకరణ చేయడం, సైన్యకరణ చేయడానికి వ్యతిరేకంగా, మూలవాసుల మీద పెరుగుతున్న రాజ్య హింస, అత్యాచారాలు, దౌర్జన్యాలు, అన్ని రకాల అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ఈ సంవత్సరం అంతర్జాతీయంగా విశ్వ మూలవాసీ దినం పాటించాలనీ పిలుపునివ్వడం, అనేక దేశాలలో పాటించడం అభినందనీయమైనది. అలాంటి సంఘీభావం మరింత పెరుగుతుందని ఆశిద్దాం. ఆ దిశలో మన కృషిని మరింత ముమ్మరం చేద్దాం.

  మన దేశంలో ఎల్.పీ.జీ విధానాల అమలుతో ప్రపంచ పెట్టుబడి అన్ని రంగాలలోకి విస్తరిస్తున్నదని పైన చెప్పుకున్నాం. కాబట్టి ముందు మనం ఈ విధానాలకు ముందు మన దేశంలో అడవుల విషయంలో వున్న చట్టం గురించి తెలుసుకోవడం అవసరం. మన దేశంలోని అడవులను, అడవులలోని వనరులను సంరక్షించే పేరుతో భారత పార్లమెంటులో ‘అటవీ (పరిరక్షణ) చట్టం 1980’ ని రూపొందించారు. దేశంలో కొనసాగుతున్న అడవుల విధ్వంసాన్ని అరికడుతూ అడవుల పరిరక్షణ కోసం అది ఉద్ధేశించబడిందని చెపుతారు. అది 42 సంవత్సరాల క్రితం 25 అక్టోబర్, 1980 నాడు వెలుగుచూసింది.

 మన దేశంలోని అడవులను రక్షించే పేరుతో మొదట బ్రిటిష్ ప్రభుత్వమే 1865లో భారత అటవీ చట్టాన్ని రూపొందించింది. ఆ తరువాత దానిని బ్రిటిష్ వారి వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకై 1927 అటవీ చట్టంగా ఉనికిలోకి తెచ్చారు. ఈ చట్టం వాస్తవంగా మొదటిసారి మూలవాసులను అడవుల నుండి పరాయికరించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అధికార మార్పిడి తరువాత ‘‘అటవుల (పరిరక్షణ) చట్టం, 1980’’ వచ్చింది. అందులో ముఖ్యంగా మూడు విషయాలను పేర్కొన్నారు. అడవులను, అడవులలోని వృక్ష, జంతుజాలాన్ని, పర్యావరణానికి అవసరమైన అన్ని రకాల వైవిధ్యపూరితమైన వాటిని సంరక్షించాలి, అడవుల వైవిధ్యాన్ని కాపాడాలి, అటవీ భూములను వ్యవసాయ సాగుకు వినియోగించకుండా, పశువుల మేతకు లేద ఇతరత్ర వ్యాపార ప్రయోజనాలకు దుర్వినియోగం చేయకుండా కాపాడాలి. వీటితో పాటుగా ఈ చట్టం ద్వార ఒక ముఖ్యమైన మార్పును కూడ ప్రవేశపెట్టారు. అదేమంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇతర అధికార సంస్థలు కానీ అడవుల విషయంలో ఏలాంటి నిర్ణయం తీసుకోరాదంటూ కేంద్రం అడవులను తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ చట్టం జమ్మూ కశ్మీర్ మినహ యావత్ భారతదేశానికి వర్తిస్తుంది అని ప్రకటించింది.  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తరువాత ఆ రాష్ట్రానికి వర్తిస్తున్న 37 భారత చట్టాలలో ఈ చట్టం లేదన్నది గమనార్హం.

 కేంద్రం దేశ ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాల పేరుతో పై చట్టానికి మార్చ్ 2021లో కొన్ని సవరణలు చేసింది. సవరణల ప్రకారం చమురు నిక్షేపాలు, సహజ వాయువు వెలికితీతలకు ప్రభుత్వం నుండి అనుమతి అవసరం లేదు. రైల్వే నెట్ వర్క్ ను విస్తరించడానికి అవసరమైన భూ సేకరణను అడవుల (పరిరక్షణ) నుండి మినహాయించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందని అడవులను ప్రైవేటు వ్యాపారాలకు లీజ్ కు ఇచ్చిన పక్షంలో కేంద్ర ఆమోదం వుండాలి అనే సెక్షన్ కు సవరణ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆమోదం లేకుండా లీజుకు ఇవ్వవచ్చునని సవరించారు. ఇలాంటి సవరణలన్నీ వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడుల ప్రయోజనాలను ఆశించే చేశారు. వీటి దుష్పరిణామాలు అడవులలో మూలవాసుల జీవితాలను కకావికలం చేయనున్నవి.

పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే మన దేశంలోని చట్టసభలు ఏ రకంగా వ్యవహరిస్తున్నాయో ప్రబల మూలవాసీ రాష్ట్రమైన ఝార్ఖండ్ అనుభవం నుండి ముందు తెలుసుకుందాం. ఝార్ఖండ్ లో ‘పథ్తల్ ఘడీ’ వుద్యమం 9 ఫిబ్రవరి, 2017 నుండి కుంటి జిల్లాలోని భాంద్రా గ్రామం నుండి మొదలైంది. అక్కడి ప్రభుత్వం రూపొందించిన రెండు ఆర్డినెన్స్ లకు వ్యతిరేకంగా ఆ మూలవాసీ ప్రజా వుద్యమం మొదలైంది. “ఛోటా నాగ్ పుర్ కౌల్దారి చట్టం 1908” (CNT Act), సంతాల్ పరగణా కౌల్దారి చట్టం 1949 (SPT Act) చట్టాలను సవరిస్తూ రెండు ఆర్డినెన్స్ లను మే, 2016లో ముందుకు తేవడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వుద్యమించారు. దానితో ఆ ఆర్డినెన్స్ లు 23 నవంబర్, 2016కు చెల్లకుండా పోయాయి. దానితో ఇక హిందుత్వ రఘువర్ దాస్ ప్రభుత్వం అసెంబ్లీలో కల మూక మెజార్టీని వుపయోగించుకొని రెండవ విడుత ఆ బిల్లులను చట్టసభలో ఎలాంటి చర్చలకు తావివ్వకుండానే మూడే మూడు నిముషాలలో చట్టరూపం ఇచ్చింది. దీనితో పారిశ్రామిక పెట్టుబడుల కోసం ప్రభుత్వం భూములను సేకరించుకోవడానికి చట్టపరమైన ఆటంకాలు లేకుండా మార్గం సుగమం అయింది. ఝార్ఖండ్ మూలవాసులకు చెందిన 2.1 మిలియన్ ఎకరాల భూమిని ప్రభుత్వం తన భూ బ్యాంకులో జమచేసింది.

పై ప్రక్రియకు దారి తీసిన ఒక ముఖ్యమైన సంఘటనను మనం ఇక్కడ తెలుసుకోవలసి వుంటుంది. సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలలో భాగంగా మన దేశంలో సెకండ్ జనరేషన్ సంస్కరణలు  ప్రైవేటీకరణను వేగవంతం చేశాయి. అందులో భాగంగా ‘‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’’ లు జరుగడం పెరిగింది. అలాంటి సమ్మిట్ ఒకటి ఝార్ఖండ్ లో జరిగడం, ఝుర్ఖండ్ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలతో 3.10 లక్షల కోట్ల విలువగల 210 నూతన యంఓయూ లను కుదుర్చకోవడం జరిగిపోయిన నేపథ్యంలోనే పై పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది ఒక భౌతిక వాస్తవం. ఈ వివరాలు సారాంశంలో పెట్టుబడి పాత్రను తెలుపుతుండగా, ఇక దానికి అండగా నిలిచిన రాజ్యం పాత్రను చూద్దాం.

తమ భూములను కాపాడుకోవడానికి మూలవాసులు ప్రారంభించిన పథ్తల్ ఘడీ వుద్యమాన్ని ప్రభుత్వం సాయుధ బలగాలతో, నిరంకుశ చట్టాలతో అణచివేయపూనుకున్నది. ఈ వుద్యమం లేవనెత్తిన ప్రధానమైన డిమాండ్ లలో గత చట్టాల సవరణలను నిలిపివేయడంతో పాటు ‘పెసా’ (Panchayat Extension to the Scheduled Areas-PESA) అమలు ఒకటి. 1996లో కేంద్రం రూపొందించిన పెసా చట్టాన్ని 20 సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో అమలు చేయకుండా నిలిపివేయడాన్ని  ప్రశ్నిస్తూ దానిని అమలు చేయాలనీ ప్రజలు కోరారు. తమ చట్టపరమైన హక్కులను కోరిన ప్రజలను రాజ్యం నేరస్థులను చేసింది. మూడు జిల్లాలకు (కుంటి, సరయికెలా, పశ్చిం సింగ్ భూమ్) చెందిన 11,776 మంది ఉరాఁవ్, ముండా తెగలకు చెందిన మూలవాసులపై రాజద్రోహ చట్టాన్ని మోపింది. అయితే, పోలీసులు కేవలం 316 మంది పేర్లనే జాబితాలో రాసి మిగితా వారినందరిని తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు. అంటే, ఇక ఎవరినైనా వారు రాజద్రోహులుగా ఆరోపించి, నేరాన్ని రుజువు చేయగలిగితే జీవితఖైదు చేయగలుగుతారన్నమాట! పెట్టుబడి కోసం ప్రభుత్వ చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు వాటిని ఖాతరచేయడం లేదు, ప్రజలను కాపాడాల్సిన పోలీసులు వారిని దేశ ద్రోహులుగా నేరస్తులుగా ముద్ర వేస్తూ జీవితఖైదు చేస్తున్నారు. అడవుల కార్పొరేటీకరణ, సైన్యకరణకు ఇది ఒక నమూనాగా మన ముందుంది.

మన దేశంలో మరో ప్రబల ఆదివాసీ రాష్ట్రం ఒడిశా. ఒడిశాలో జనాభాలో దాదాపు నాల్గవ వంతు (23 శాతం), రాష్ట్ర భూభాగంలో దాదాపు సగం భూభాగంలో (45 శాతం) మూలవాసీ ప్రజలు నివసిస్తున్నారు. ఆ రాష్ట్రంలో అత్యంత విలువైన బొగ్గు నుండి బంగారం వరకు 60 రకాల గనులు, ఖనిజాలు వున్నవి. ఇంద్రావతి నుండి వైతరణి నది వరకు దాదాపు 10-12 నదీ తీరాల వెంట మూలవాసులు జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ ‘‘మేక్ ఇన్ ఒడిశా సమ్మేళనం’’ జరిగింది. గత రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడి బీజేడీ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల కోసం మూలవాసుల జీవితాలను బలిపెడుతున్నది.

ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ఐదవసారి ఎన్నికయ్యాక బీజేడీ ప్రభుత్వం నూతనంగా కార్పొరేట్ వర్గాలకు 29 గనులను లీజ్ కు ఇచ్చింది. వీటి తవ్వకాల కోసం రాష్ట్రం కేంద్రాన్ని అనుమతి కోరింది. దీనితో కోరాపుట్ జిల్లాలోని దేవమాలీ నుండి కొండగామాలీ, కాశీపుర్, నియంగిరి, కర్లాపాట్, సిజు-కడ్డ్ మాలీ, గంధ్ మర్దన్ వరకు అపారమైన బాక్సైట్ గనులున్నవి. ప్రస్తుతం మన దేశంలో వుత్పత్తవుతున్న బాక్సైట్ లో 54 శాతం ఒడిశా నుండే అవుతోంది. రాష్ట్రంలో 70 అభయారణ్యాలు, 2 జాతీయ పార్క్ లున్నవి. వీటన్నిటి ఫలితంగా, మూలవాసుల జీవితాలు తీవ్రమైన అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించి గనుల తవ్వకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగిరపడు తున్నాయి. ఇక్కడ కూడ పథ్తల్ ఘడీ వుద్యమం కొనసాగుతోంది. ఇక్కడి మూలవాసులు కూడ పెసాను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తుంటే 26 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఆ దిశలో ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదు.

మాలీ కొండలలో హిండాల్కోకు వ్యతిరేకంగా కువీ ప్రజలు జీవన్మరణ పోరాటం సాగిస్తున్నారు. కానీ, కార్పొరేట్ శక్తులు తమ కుట్రలు, కుహకాలతో గూండాలను, దళారీలను పెంచి పోషిస్తూ పీడిత ప్రజల మధ్య చిచ్చు  పెడుతున్నారు. మాలీ కొండల పోరాట సమితిని వారు ఏర్పర్చుకొని పోరాడుతుంటే, పోలీసులు అనేక మందిని అరెస్టు చేసినారు. కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం రాష్ట్రాలు ప్రత్యేక పోలీసు కమాండో బలగాలను ఏర్పర్చడం కూడ అన్ని రాష్ట్రాలలో ఊపందుకుంటున్నది. మావోయిస్టుల నిర్మూలనా పేరుతో ఒడిశాలో ఏర్పరిచిన డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్) ప్రజల ప్రతిఘటనను కూడా కౄరంగా అణచివేస్తూ కార్పొరేటు వర్గాల పెట్టుబడుల ప్రయోజనాలను నెరవేరుస్తున్నాయనేది కాదనలేని వాస్తవం.

 ఒడిశా రాష్ట్రంలో జరిగిన మూలవాసుల మారణకాండలు జగమెరిగినవే. ప్రస్తుతం జగత్సింగ్ పుర్ జిల్లాలో జరుగుతున్న ధానా-మీనా-పానా (ధాన్యం, చేపలు, అడవులు)ల పరిరక్షణకు ప్రజలు జరుపుతున్న సమరశీల పోరాటం వివిధ రూపాలలో అందరిని కదలిస్తున్నది. ఈ ప్రజాపోరాటం ఆ ప్రాంతంలో కార్పొరేటీకరణ (పరిశ్రమలు) కు వ్యతిరేకంగా జరుగుతున్నది. దానితో రాజ్యం జోక్యం చేసుకొని భద్రతా బలగాలను రంగంలోకి దింపడంతో పోరాట ప్రజలపై అమానవీయమైన అణచివేత చర్యలకు వారు పూనుకున్నారు. వీళ్లు గత 17 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. వారు బహుళ జాతి కార్పొరేషన్ పోస్కో కు వ్యతిరేకంగా పోరాడిన, రాజ్య హింస (నిరసనలు, లాఠీ చార్జీలు, కాల్పులు, గాయపడడం, అమరత్వాలు, అత్యాచారాలు, జైలు శిక్షలు) ను అనుభవించిన వారు.

మన దేశంలో మరో ప్రబల ఆదివాసీ రాష్ట్రం ఛత్తీస్ గఢ్. ఇక్కడ మూలవాసీ ప్రజలు రాష్ట్ర జనాభాలో దాదాపు మూడవ వంతు వుంటారు. ఇక్కడ వుత్తరాన సర్గూజా నుండి దక్షిణాన సుక్మా వరకు మూలవాసీ ప్రజలు పోరాడుతున్నారు. వుత్తరాన వున్న సర్గూజ, కోర్బా, సూరజ్ గడ్ జిల్లాలలో దాదాపు 4 లక్షలకు పైగా ఎకరాలలో వ్యాపించి వున్న హస్ దేవ్ అడవులలోనున్న అమూల్యమైన ప్రాకృతిక వనరులను కబలించడానికి కార్పొరేట్ వర్గాలు భీష్మించుకు కూచున్నాయి. ప్రపంచ పది మంది టాప్ మోస్టు కుబేరులలో ఒకడైన అదానీ ఆ అడవులను స్వంతం చేసుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రజలతో పందెం కాస్తున్నాడు. హస్ దేవ్ అడవులలో 1,879.6 చదరపు కిలో మీటర్లలోనున్న5 టన్నుల బొగ్గు నిక్షేపాలను కాజేయడానికి అదానీ చతురోపాయాలతో రంగంలో నిలిచాడు. మోదీ గద్దెనెక్కిన వెంటనే ఏర్పడిన ‘‘సుబ్రమణియన్ కమిటీ అండ్ ద డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ లాస్ (అమెండ్ మెంట్ బిల్ 2015)’’ మౌలికంగానే మార్చివేసిన పర్యావరణ చట్టాల ఫలితంగా మన దేశంలో కార్పొరేటు వర్గాల పెట్టుబడులకు అంతవరకు వున్న ఆటంకాలు చట్టపరంగానే తొలగిపోయాయి. కానీ, ప్రజా హస్ దేవ్ అడవుల పరిరక్షణ పోరాట కమిటీ పెట్టుబడులకు దారులు మూసేస్తున్నది. కేంబ్రిడ్జిలో విద్యార్థలతో సమావేశమైన రాహుల్ గాంధీ హస్ దేవ్ ప్రజల పక్షమే మేం అన్నా, లేద రాష్ట్ర ట్రైబల్ మినిష్టర్ తుపాకి తూటాలకైనా ఎదురు నిలిచి హస్ దేవ్ అడవులను కాపాడుతాననీ ప్రగల్బాలు పలికినా అదానీ పెట్టుబడుల ముందు తలవంచినవి. కానీ మూలవాసీ ప్రజలు పోరాడుతాం, గెలుస్తాం అంటున్నారు. దానితో అక్కడ ఖాకీలు పెద్ద సంఖ్యలో తిష్ట వేశారు.

ఛత్తీస్ గఢ్ లోని దక్షిణ ప్రాంతంలో నున్న బస్తర్ డివిజన్ లో గడచిన 20 ఏళ్లుగా కార్పొరేట్ వర్గాలు మరియు వారి భద్రతా బలగాలకూ ప్రజలకూ మధ్య భీకరపోరాటాలు జరుగు తున్నాయి. కార్పొరేటు వర్గాలు కార్పెట్ సెక్యూరిటీ అనే పేరుతో భద్రతా బలగాల వలయాన్ని ఏర్పర్చి అడవులను, గ్రామలను దిగ్భంధించారు. బస్తర్ డివిజన్ లోని 7 జిల్లాలలో (సుక్మా, బీజాపుర్, దంతెవాడ, నారాయణపుర్, బస్తర్, కాంకేర్, కొండగాం) వివిధ పేర్లతో అక్కడ దీర్ఘకాలిక, స్వల్పకాలిక అణచివేత కేంపెయిన్ లను కొనసాగిస్తూ అక్కడి అడవులలో, కొండలలో నిక్షిప్తమై వున్న గనులను కబలించడానికి కార్పొరేటు వర్గాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. 2005-09 మధ్య శ్వేత బీభత్సాన్ని కొనసాగించి అడవులలో నెత్తుటి ఏరులను పారించాయి. పల్లెలను వల్లకాడు చేశాయి. పసిడి పంటలను ధ్వంసం చేశాయి. అడవి పంటలను అనుభవించకుండా అడ్డుకున్నాయి. అయినప్పటికీ కార్పొరేటు వర్గాలు విజయం సాధించలేక వెనుతిరగక తప్పలేదు.

2009-17 మధ్య కార్పొరేటు వర్గాల ప్రయోజనాల కోపం కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ గ్రీన్’’ హంట్ ప్రారంభించి ప్రత్యక్షంగా రాష్ట్ర, కేంద్ర పోలీసు, పారా మిలిటరీ బలగాలనే రంగంలోకి దించాయి. గతాన్ని మించిన అణచివేత కొనసాగింది. అడవులు రక్తసిక్తమైనాయి. గనుల తవ్వకాలకు బస్తర్ డివిజన్ సరిహద్దులలో భారీ పోలీసు కాపలాలతో ప్రజలలో చీలికలు, భ్రమలు కల్పించి తవ్వకాలు ప్రారంభించారు. కానీ, అవి నిరాఘటంగా సాగడం లేదు. ప్రజా వుద్యమాల గడ్డగా దేశంలో వన్నెకెక్కుతున్న బస్తర్ లో కార్పొరేట్ వర్గాల స్వప్నాలు సాకారం కాకపోవడంతో ఆ అణచివేత పథకానికి స్వస్తి చెప్పి నూతన అణచివేత పథకాన్ని సమాధాన్ పేరుతో ప్రారంభించారు.

2017-2022 ఆపరేషన్ సమాధాన్ కాలం. కార్పొరేట్ వర్గాల పెట్టుబడులకు సమాధానం కావాలి. వాళ్లకు అడవులలోని గనులు తక్షణం కావాలి. దానితో వాళ్లు అడవులు, పల్లెలు, పట్టణాలను జల్లెడ పడుతున్నారు. తమ ప్రయోజనాలకు అడ్డు వస్తున్న శక్తుల బెడదలేకుండా చేసుకోవడానికి అపూర్వ స్తాయిలో అడవులను సైన్యకరణ చేశారు. పట్టణాలలో అర్బన్ నక్సలైట్లను సృష్టించారు. అడవులలో, ఆదివాసీ గూడాలపై డ్రోన్ దాడులకు పాల్పడుతున్నారు. కానీ, నూతన తరహ ప్రజా వుద్యమాలు తిరుగులేని విధంగా తలపడుతున్నాయి. సిలింగేర్ ప్రజా వుద్యమం గత 15 మాసాలుగా నిరవధికంగా ప్రజా ధర్నాను నిర్వహిస్తున్నది. పొంబాడ్, వెచ్చపాడ్, గొంపాడ్, నాహోడ్, కడియమెట్ట, ఆందాయి, బోధ్ ఘాట్, వెచ్చఘాట్ లలో ప్రజా పోరాటాలు రగుల్కొంటునే వున్నాయి. వాటిని చల్లార్చడానికి పాలకవర్గాలు అనేక ఎత్తులు వేస్తున్నారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ గత సంవత్సరం ఎన్ని ఆటంకాలు కల్పించినా బోధ్ ఘాట్ ప్రాజెక్ట్ ఆగేది లేదని ప్రకటించాడు. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరి ఆమోదంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందనీ మాట మార్చాడు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అనేదే ప్రజలు గ్రహించారు. వారు తమ పోరాటాన్ని కొనసాగిస్తునే వున్నారు. కార్పొరేటీకరణ, సైన్యకరణ ప్రజా పోరాటాలను ఆపలేవని వారు స్పష్టం చేస్తున్నారు.

మహారాష్ట్ర లోని విదర్భ ప్రబల మూలవాసీ ప్రాంతం. ఇక్కడ చంద్రపుర్, గడ్ చిరోలీ, బండారా, దేవురి మున్నగు జిల్లాలలో అడవులు, గనులు అపారంగా వున్నాయి. చంద్రపుర్ జిల్లా అడవులను ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ కార్పొరేటు వర్గాల పరిశ్రమలు వెలిసి గత అనేక సంవత్సరాలుగా అక్కడ రాజ్యమేలుతున్నాయి. కానీ, నాలుగు దశాబ్దాల క్రితం ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన గడ్ చిరోలీలో మాత్రం కార్పొరేటు పెట్టుబడులను ప్రజా వుద్యమం అడ్డుకుంటుంది. జిల్లాలో వేలాది పోలీసు, అర్ధ సైని బలగాలను మోహరించినప్పటికీ గనుల తవ్వకాలు వారు ఆశించిన విధంగా సాగడం లేదు. అక్కడి ప్రజలు ‘‘గనులు కాదు, అనాజ్ (ధాన్యం) కావాలనీ’’ నినదిస్తున్నారు. కార్పొరేటీకరణ, సైన్యకరణ ఆ నినాదాన్ని అణచలేవు. కార్పొరేటు జగత్తు కోసం ఖాకీమయం అవుతున్న అడవులలో వారు ఎంతటి మారణ కాండను సృష్టించినా, ఎంతటి అణచివేతను కొనసాగించినా, అరెస్టులు, అత్యాచారాలకు పాల్పడినా, హింసా దౌర్జన్యాలను ఆశ్రయించినా ప్రజావుద్యమాలు చల్లారవు. అవి అలలు అలలుగా నూతన తరహలో పురోగమిస్తాయి. ఈ రోజు దేశం ఆ పోరాటాలకు అండగా నిలుస్తున్నది. ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. వారు కార్పొరేటు వర్గాలకు గోరీ కడుతారు. దేశ వనరులను కాపాడుకుంటారు.

గత సంవత్సరం మార్చ్ లో కేంద్రం అడవుల పరిరక్షణ చట్టం, 1980 కి సవరణలు పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను ‘బలోపేతం’ (కార్పొరేట్ల పరం) చేసి 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి భారత దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే భారీ ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను చేపట్టాలని నిర్ణయించింది. అందుకు వచ్చే ఐదేళ్లలో చేపట్టే రూ. 102 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను  ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రాష్ట్రాలు తమ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ల ప్రాధాన్యతను ఇప్పటికే కేంద్రానికి తెలియ జేశాయి. ఈ నేపథ్యంలో 23 ఆగస్టు 2021 నాడు కేంద్రం జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 7,400 ప్రాజెక్ట్ లున్నాయి. ఈ ప్రాజెక్ట్ ల అవసరాలను తీర్చడానికి పెద్ద ఎత్తున భూములు కావాలి. ఆ భూములు ఈ దేశంలో చాలా వరకు అడవులలో భాగంగా వున్నాయి. ఆ భూములను కార్పొరేట్లు కాజేయడానికే అడవుల పరిరక్షణ చట్టం 1980కి తాజాగా సవరణలు ప్రతిపాదిస్తూ బిల్ ప్రతిపాదించారు. అది చట్టరూపం ధరించనుంది. దానికి వ్యతిరేకంగా దేశ మూలవాసీ గొంతులు సమైక్యంగా నినదిస్తున్నాయి. ఛత్తీస్ గఢ్, విదర్భ సహ దేశంలోని యావత్ ఆదివాసీ ప్రజానీకం ఆ బిల్లుకు వ్యతిరేకంగా విశ్వ ఆదివాసీ దినం 9 ఆగస్టు నాడు పోరాట సంకల్పం తీసుకున్నారు. అందులో భాగంగా వివిధ ప్రాంతాలలో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, బందులకు ప్రజలు సిద్దమవుతున్నారు. వారి పోరాటాలకు అంతర్జాతీయ సంఘీభావం పెరుగుతోంది. ఇటీవలే “The International Committee in Support of the People’s War in India salutes our indigenous brothers of the various continents especially the indigenous people of India, who today face the imperialist policy of destroying them along with their territories  and cultures which means to destroy once the most important guardians of the nature and environment” అంటూ తమ సందేశాన్ని అందజేశారు. వారు ఒక పోస్టర్ విడుదల చేశారు. కాబట్టి ఏ చట్టాలకు ఏ సవరణలు చేసినా, ఏ పైప్ లైన్ లు, డ్రీం ప్రాజెక్ట్ లు ప్రకటించినా తుదకు ప్రజలు వాటిని తమ పోరాటాలతోనే ఓడిస్తారు. ఇవన్నీ ప్రజా పోరాటాలను అనివార్యంగా తీవ్రతరం చేస్తాయి. ఇది విప్లవాల తొలి సంధ్యా కాలం.

Leave a Reply