ఇంగ్లీష్ : ఫ్రెడరిక్ డగ్లస్
తెలుగు అనువాదం: ముక్త వరపు పార్థసారధి
మానవ జాతి చరిత్రలో బానిస వ్యవస్థ అనేది ఒక దశ. అలాంటి దశ ఒకటి గత కాలంలో జరిగిందనీ, బానిసలు యెంత నికృష్ట, దయనీయమైన జీవితాల్ని అనుభవించారో కొంచెంగానైనా గ్రంధస్తం కాకపొతే, వాళ్ళ కన్నీళ్లు ఆనాటి శిథిలాల కిందే ఇంకిపోయి ఉండేవి. “యెంత ప్రతిభా వంతులైన రచయితలైనా అసలు వాస్తవాలను అణుమాత్రంగా చెప్పలేకపోయారు” అనేవాడట బానిస యోధుడు స్పార్టకస్. అంటే, వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరమైనవో మనం ఊహించుకోవచ్చు. తెలుగులో ‘స్పార్టకస్, ఏడుతరాలూ, అంకుల్ టామ్స్ కేబిన్’ లాంటి పుస్తకాలు వున్నాయి. కానీ, ఒక బానిస తన బాధల్ని తనే రాసుకున్న పుస్తకం “ఒక బానిస ఆత్మ కథ”. ఏ వ్యవస్థా దానికై అదే మారదు. నిరంతర దైహిక శ్రమా, జంతువుల కంటే హీనమైన బ్రతుకులు. “బానిస విలువ అరసెంటు కన్నా చెయ్యదు. వాడు చస్తే పాతిపెట్టడానికి అంత కన్నా ఎక్కువ ఖర్చు” అని భావించేది ఆనాటి సమాజం. “నాలిక్కి పని చెప్పని వాడే జ్ఞాని” లాంటి సామెతలు ఎందుకు ఉండేవి? ఏమాత్రం చిన్న పాటి సమాధానం బానిస నోటి వెంట వచ్చిందా రక్తం ధారాపాతంగా కారే కొరడా దెబ్బలే.
దాన్ని భరిస్తున్న వాళ్ళే, భరించలేని స్థితిలో, తిరగబడినప్పుడు మాత్రమే, ఆ వ్యవస్థలు అంతరించి కొత్త వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయి. అదొక అనివార్య స్థితి. ఆ స్థితి బానిసలకే కాదు. యజమానులకు కూడా. ఇదంతా గత కాలంలో జరిగింది అంటే, నమ్మశక్యంగా వుండదు. కానీ, అవి నిజాలు. అవేమిటో తెలుసుకోవాలంటే, 190 ఏళ్ళక్రితం రచయత డగ్లస్ ఏమంటున్నాడో తెలుసుకోవాలి.
అతని వయసు ఎంతో అతనికి తెలియదు. అతని మాటల్లోనే… “తన వయసు గురించి గుర్రాలకి యెంత తెలుసో మా బానిసలకీ అంతే తెలుసు. నా తల్లి పేరు హారియట్ బెయిలీ. నా తండ్రి ఎవరో నాకు తెలియదు. అందరూ నా యజమానే, నా తండ్రి అంటారు. కానీ, ఖచ్చితంగా తెలియదు. నా తల్లి సూర్యాస్తమయం తర్వాత వస్తుంది. మళ్ళీ సూర్యోదయానికి ముందే వెళ్ళిపోతుంది. ఆమె చనిపోయినపుడు ఒక వార్త లాగ తెలిసింది అంతే. మామూలు బానిసల కన్నా మాకు మా యజమానురాలి ద్వారా బాధలు మరింత ఎక్కువ. ఎందుకంటే, మేం ఆమె భర్త ద్వారా పుట్టిన వాళ్ళం కదా! అందుకని మాలాంటి వాళ్ళంటే మరింత కోపం. మమ్మల్ని “ములాటోలు” అంటారు. నేను పని చేసేది ”గ్రేట్ హౌజ్ ఫార్మ్”. పని చెయ్యని పిల్లలకు బట్టలు ఇవ్వరు. సూర్యోదయానికి ముందే బూర చప్పుడు వినగానే లేవాలి. మా యజమాని “కల్నల్ లాయడ్”. అతని దగ్గర వెయ్యి మంది పనిచేస్తున్నారు. అక్కడ నుండి 8 ఏళ్ళ వయసులోనే నాకు విముక్తి లభించింది.
అక్కడ నుండి ‘బాల్టిమోర్’ కు వెళ్ళాను. ఇది నేను చూసిన పెద్ద నగరం. తల్లి చనిపోయింది. అమ్మమ్మ ఎక్కడో వుంది. అందుకని నేను ఎక్కడ వున్నా ఒకటే. అక్కడ ‘ఔల్ట్’ దంపతుల ఇంటికి తీసుకువెళ్ళారు. వాళ్ళ ఏకైక సంతానం ‘థామస్’. ఆ కుర్రవాడి బాగోగులు చూసుకోవడం నా పని. ఆ ఇంటి యజమానురాలు చాలా దయామయి. కొద్దిగా అక్షరాలు చదవడం, రాయడం నేర్పింది. కానీ, ఆమె భర్తకు అది నచ్చలేదు. అందుకని భర్తకు తెలియకుండా చెప్పేది. కొన్నాళ్ళకు ఆమె కూడా మారిపోయింది. అక్కడ ఉన్నప్పుడే ఎలాగైనా చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. తరువాత ఇంట్లో నుండి బ్రెడ్డు దొంగతనంగా తెచ్చి, కొంతమంది తెల్ల పిల్లలకు ఇచ్చి, వాళ్ళ దగ్గర చదువు నేర్చుకున్నాను. అప్పటికి నా వయసు 12 ఏళ్ళు. ఆ రోజుల్లో “ది కొలంబియన్ ఆరెటర్” అనే పుస్తకం దొరికింది. ఆ పుస్తకం నాలో అనేక ఆలోచనలు రేకెత్తించింది. స్వేచ్చ అనే ఊహే నన్ను నిద్రలేకుండా చేసింది.
అక్కడక్కడ బానిసల స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలకు వెళ్ళేవాడిని. ఒకసారి ఇద్దరు ఐరిష్ వాళ్ళు “ఉత్తర రాష్ట్రాలకు పారిపొమ్మని” సలహా ఇచ్చారు. వారిని అనుమానించాను. ఎందుకంటే, కొంతమంది తెల్లవాళ్ళు పారిపొమ్మని సలహా ఇచ్చి, పారిపోతే వెదికి పట్టుకొని బహుమానాలు అందుకొన్న సంఘటనలు నాకు తెలుసు. నా పాత యజమాని విల్లు రాయకుండా చనిపోతే, నేను ఎవరికి చెందుతానో తెలియక నాకు కబురు పెట్టారు. అప్పటికి నేను ఇక్కడకు వచ్చి 5 ఏళ్ళు అయ్యింది. మళ్ళీ వచ్చేశాను.1832లో అక్కడ నుండి పారిపోయి ‘సెయింట్ మైకేల్స్’ చేరుకున్నాను. నా కొత్త యజమాని పేరు మాస్టర్ ఔల్ట్, అతని భార్యా క్రూరత్వంలో ఒకరికొకరు తీసిపోరు. బానిసలకు తిండి పెట్టరు. ఎక్కువగా క్రైస్తవ ప్రార్ధనలు చేసేవారు. కొన్నాళ్ళ తర్వాత నన్ను ‘ఎడ్వర్డ్ కోవీ’ కి అప్పుగా ఇచ్చాడు. అక్కడ పొలం పనులు చెయ్యాలి. పొలం పనులు సరిగ్గా చేయలేకపోవడం వలన, కొరడా దెబ్బలు తప్పలేదు. “మూలిక కట్టుకుంటే యజమాని కొట్టడు” అని ఒకడు సలహా ఇచ్చి, మూలిక కట్టాడు. గానీ, దానివల్ల ఏమీ లాభం లేకపోయింది. ఒకసారి తిరగబడ్డాను. అప్పటి నుండీ కొట్టడం మానేశాడు. వంద మైళ్ళు ఉత్తరంగా పారిపోగలిగితే, స్వేచ్చ లభిస్తుంది.
1834లో కోవీ ని వదలి, ‘విలియం ఫ్రీ లాండ్’ దగ్గరకు వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన చదువు మరి ముగ్గురికి నేర్పించాను. అది తెలిసి మరి కొందరు బానిసలు కూడా వచ్చారు. అయితే, యజమానులకు తెలియకూడదు. ఒక నల్లజాతి వ్యక్తి ఇంట్లో రహస్యంగా స్కూలు నడిచింది. నా యజమాని మంచివాడే. ఒక్క కొరడా దెబ్బకూడా కొట్టలేదు. అయినా అతనూ యజమానే. మేము పారిపోదామని నిశ్చయించుకున్నాం. ఎలా? దొరికిపొతే, ఇప్పటి పరిస్థితి కన్నా పది రెట్లు నరకం. జాగిలాలూ, ప్రతి బాట వద్దా, ప్రతి బ్రిడ్జి వద్దా కాపలాలు. యజమానులు రాసినట్టుగా విముక్తి పత్రాలు సృష్టించాను. ఇవన్నీ గమనించి మమ్మల్ని లాక్కెళ్ళారు. పాత్రలను మంటల్లో పడేశాను. అలా మరో 3 ఏళ్ళు గడిచాయి. మళ్ళీ నా పాత వూరు బాల్టిమోర్ చేరుకున్నాను. అక్కడకు వెళ్ళిన కొద్ది నెలలకు పడవల తయారికి అప్పగించారు. 18 నెలల పాటు ఊపిరి సలపనిపని. అక్కడ పనిచేసిన డబ్బులన్నీ యజమానికి ఇచ్చేశాను. ఎందుకంటే, నేను అతని ఆస్తి.
1838 న న్యూయార్క్ చేరుకున్నాను. సంకెళ్ళు తెంచుకొని స్వేచ్చవైపు అడుగులు వేశాను. ఎలా అనేది చెప్పను. చెబితే, మాకు సహాయపడిన తెల్లవాళ్ళను క్షమించరు. అందుకే ఆ వివరాలన్నీ కాగితం మీద పెట్టలేకపోతున్నాను. అక్కడ ఎవరూ తెలియదు. ‘డేవిడ్ రగల్స్’ నన్ను చేరదీసాడు. “ఇక్కడ క్షేమం కాదు. ‘న్యూ బెడ్ ఫోర్ట్’ వెళ్ళు” అన్నాడు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బాల్టిమోర్ వుంది. ఆమెను రప్పించి, మా ఇద్దరికీ పెళ్లి చేశాడు. 5 డాలర్లు ఇచ్చి, పంపించాడు. మేం న్యూ బెడ్ ఫోర్ట్ చేరుకున్నాం. అక్కడ ‘షా’ దంపతులు మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఇక స్వేచ్చ. ఇక్కడ నా పేరు డగ్లస్ గా మారింది.”
ఇక్కడితో అతని ఆత్మ కథ ముగిసింది. తరువాత 1841 లో ఒకసారి అతడు ఒక బానిస వ్యతిరేక సంఘం సమావేశంలో తొలిసారిగా మాట్లాడాడు. అతని ప్రసంగం ఎంతగా ఆకట్టుకుందంటే, నిర్వాహకులు అతన్ని వెంటనే తమ ప్రతినిధిగా నియమించారు. క్రమంగా బానిసత్వాన్ని నిషేదించాలనే ఉద్యమానికి నాయకుడయ్యాడు. డగ్లస్ గొప్ప ప్రతిభావంతుడైన వక్త. శ్రోతల్ని తన వాగ్దాటితో మంత్ర ముగ్దుల్ని చేస్తాడు. అసలు అతను బానిసగా పుట్టలేదేమోనని అందరూ సందేహించేవారు. అలాంటి వాళ్లకు సమాధానంగా ఈ పుస్తకం రాశాడు డగ్లస్. అబ్రహాం లింకన్ కాలం నాటి అంతర్యుద్ద కాలంలో చాలామంది నల్లవారిని సైన్యంలో చేర్పించాడు. యుద్ధం తర్వాత విముక్తులైన బానిసల హక్కులకోసం కూడా ఉద్యమించాడు. తరవాత కాలంలో ‘సాంటో డోమింగ్’ కమిషన్ కు సెక్రటరీగా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా’ లో ఉన్నతోద్యోగిగా, హైటీ దేశానికి అమెరికా ప్రతినిధిగా పనిచేశాడు. డగ్లస్ 1895లో మరణించాడు.
సమాజం అనేటప్పుడు అందులో అన్ని రకాల మనుషులూ వుంటారు. బానిస యజమానుల్లోనే దుర్మార్గులు ఉన్నట్లే, కాస్త మంచివాళ్ళూ, దయమయులూ వుంటారు. ఒక యజమాని భార్య ‘సోఫియా ఔల్ట్’ డగ్లస్ కు చదువు చెప్పింది. ఆమె ఆమాత్రం చెప్పి ఉండకపోతే,డగ్లస్ మరికొంతమంది బానిసలకు చదువు చెప్పలేకపోయేవాడు. ‘ది కొలంబియన్ ఆరేటర్” అనే పుస్తకం చదవడం, తర్వాత కాలంలో బానిస నాయకుడు కావడం జరిగివుండేవి కావు. అంతేకాదు, కొంతమంది తెల్లవాళ్ళు, బానిసలకు సహకరించే వారూ వున్నారు.
ఈ ఆత్మకధలో చాలా మంది ఉత్తరాదికి పారిపోవాలని చూస్తారు. అందుకు కారణం. బౌగోళికంగా దక్షిణాదిలో పంట భూములూ, ఉత్తరాదిలో ఎక్కువగా పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలు రావడానికి కారణం బహుశా సహజంగా భూగర్భంలో ఖనిజాలు వుండడం కావచ్చు. ఆ కారణంగా అక్కడ ఎక్కువగా కార్మికులు అవసరం. ఆ అవసరం తీరాలంటే, బానిసలు, కార్మికులుగా మారాలి. సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థగా అభివృద్ధి చెందే క్రమంలో ఇదొక అనివార్య స్థితి. అయితే, అందరూ అలా ఉంటారని చెప్పలేము. కొంత మంది యజమానులు బానిసల బాధల్ని చూసి చలించిపోయి, స్వేచ్ఛని ఇచ్చే వాళ్ళూ వున్నారు. ఇక బానిసల కోణం నుండి చూస్తే, బానిస బతుకుల నుండి కార్మికులుగా మారడం అభివ్రుద్దే. అందుకే చాలామంది బానిసలూ ఉత్తరాదికి పారిపోయి స్వేచ్చగా బతకాలని చూస్తుంటారు.
డగ్లస్, తండ్రి ఎవరో కూడా తెలియని బానిసగా పుట్టాడు. కానీ, బానిసగా చావలేదు. తను చదువుకోవడమే కాకుండా, తోటి బానిసలకు, తనకు తెలిసిన మేరకు చదువు చెప్పాడు. “పోరాటమే మనకి విముక్తి” అనే భావాల్ని చెప్పడమే కాకుండా, చేసి చూపించాడు. ఆ క్రమంలో అనేక పదవులను వచ్చాయి. అయితే, డగ్లస్ మత వ్యతిరేకి కాదు. డగ్లస్ ఇలా అంటాడు. “శాంతినీ, స్నేహాన్నీ, సోదరత్వాన్నీ బోధించే క్రీస్తు ప్రతిపాదించిన క్రైస్తవాన్ని నేను ప్రేమిస్తాను. అవినీతిమయమైన, బానిసలను చెరపట్టిన, స్త్రీలను కూడా గొడ్లను బాదినట్టు బాదే, ఉయ్యాలలోనే తల్లీ పిల్లల్ని విడదీసే ఈ దేశంలోని క్రైస్తవాన్ని ద్వేషిస్తాను…..వారం రోజులు, బానిసలను కొరడాలతో కొట్టి రక్తపుటేరులు కార్చిన వాడు ఆదివారం నాడు చర్చిలో శాంతి సందేశమిస్తాడు….” ఇలా చెబుతున్నాడు. అంటే, క్రైస్తవం మంచిదే గానీ, దాన్ని ఆచరించేవారు సరిగ్గా చెయ్యరు అని. కానీ, అసలు మతమే [ఏ మతమైనా] ధనిక వర్గం వైపు వున్నదని, బానిసలనూ, పేదలను ఖర్మ సిద్దాంతం నమ్మే, కధలూ చెబుతుందని డగ్లస్ గ్రహించలేదు. అతనికి ఆవకాశం కూడా లేదు. ఎందుకంటే “మతం మనిషి పాలిట మత్తు మందు” అని చెప్పే మార్క్సిజం ఇంకా ఆనాటికి ప్రపంచానికి పూర్తిగా ప్రచారంలోకి రాలేదు. కాబట్టి డగ్లస్ కి ఆ రకమైన అభిప్రాయం ఉండడంలో ఆశ్చర్యం లేదు.