లిప్తలన్నిటినీ కొలిచిధాన్యపు గాజకు పోద్దాం

యీ రెణ్ణెల్లలో
ఒక్క నీటిగింజమిగిలితే నీమీదొట్టు

ఆగడానికే ముందక్కడ?
జల్లలో మిగలడానికి చేపలా అవి!
కారిపోయే కన్నీరేకదా
చివరకు
మన దోసిట్లో మిగిలింది
    ***   ***    ****
కాలం నిన్నూ నన్నూ గమనిస్తోంది

ఆసుపత్రుల్లో నవజాత శిశువుల కేరింతలు లేవు
నదుల్లో సృష్టినిమోసే జీవమూ లేదు
పీక్కుతినేయగా మిగిలిన అస్తుల లెక్క
నీవో, నేనో అప్పజెప్పాలి

రాజూ లేడు..మంత్రీ లేడూ పూచీపడడానికి
రాజ్యం పేరున సరిహద్దులు మాత్రమే వున్నాయి
అక్కడా మానవ హననమే
పేరు ఎదయితేనేం?
న్యాయంలేదు అడ్డుపడడానికి
చట్టం పేరున సంకెలలు మాత్రమే వున్నాయి
అక్కడ నిండా మోసమే!
***     ***      ***
తర్కించుకొని తడిమిచూసుకుందామా కాసేపు
లిప్త కాలమైనా చాలులే!

అగ్నిధారలై  ఏళ్లుగా కలసి ప్రవహించిన మనం
ఎప్పుడు  విడిపోయాం!
కలవలేనన్ని పాయలుగా

మత మానవులుగా
స్త్రీలుగా , పురుషులుగా
కులాలుగా, గుంపులుగా
తిరిగిపెనవేసుకోలేనంత బిరుసుగా!

శ్రమే మానవ సారమని నమ్మిన
పాతమనుషులమై
మూకుమ్మడిగా  
బృందగానంగా  
నిర్వ్యాపకుడయిన రాజును
మృత్యు వేదిక అయిన రాజ్యాన్నిప‌రిత్య‌జిద్దామా
లిప్త‌ల‌న్నిటినీ కొలుస్తూ
మ‌హా మాన‌వ‌యానంలో
న‌వ‌జాత శిశువులమవుదామా!

Leave a Reply