పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ నిర్మాత, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన  గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు  కామ్రేడ్‌  గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు  మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది. పెరూలోని నావికా స్థావరంలోని ఆస్పత్రిలో 2021 సెప్టెంబరు 11వ తేదీన గొంజాలో 86 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా పార్కిన్సన్‌, చర్మ కేన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు. ఈ స్థితిలో కూడా ఆయనకు వైద్య సాయాన్ని ప్రభుత్వం నిరాకరించింది. చివరకు తన భార్యతో ఇంటర్వ్యూను సైతం రద్దుచేసింది. దీనికి నిరసనగా ఈ ఏడాది జూలై నుంచి ఆయన ఆహారం తీసుకోవడం లేదు. జైలులో గొంజాలో ప్రారంభిం చిన నిరాహార పోరాటానికి సంఘీభావంగా లాటిన్‌ అమెరికా, యూరప్‌, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో గత రెండు నెలలుగా ప్రత్యక్ష ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆయన విడుదల కోరుతూ అన్ని దేశాల్లోని పెరూ రాయబార కార్యాలయాల ఎదుట నిరసనలు జరిగాయి. ఆయన ప్రాణాలను కాపాడాలని ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలకు వినతులు వెల్లువెత్తాయి.

భారతదేశంలోని కొన్ని నగరాల్లోనూ గొంజాలో సంఘీభావ కార్యక్రమాలు జరిగాయి. ఈ ఒత్తిళ్లకు తలవంచిన పెరూ ప్రభుత్వం చివరకు నావికా స్థావరంలోని ఆస్పత్రికి తరలించింది. జీవితాంతం సాగించిన కష్టతరమైన, దీర్ఘ‌కాలిక పోరాటాన్ని అక్కడా కొనసాగిస్తూనే గొంజాలో తుదిశ్వాస విడిచారు.

కనీసం రెండు దశాబ్దాలకాలం ప్రభాతాల జడిలో ప్రపంచాన్ని షైనింగ్‌పాత్‌ ఉద్యమం ముంచెత్తింది. ‘ఇది విప్ల‌వాల యుగం*  అని ప్రకటించిన చైనా సాంస్కృతిక విప్లవం ఈ ఉద్యమానికి స్ఫూర్తి. భారత్‌లో నక్సల్బరీ వసంతమేఘం, పారిస్‌లో ఆగ్రహ విద్యార్థులు, పెరూలో పైనింగ్‌పాత్‌ ఉద్యమం దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఉత్పత్తి- ప్రయోగం-యుద్ధం ద్వారా నిర్మాణమయి, విస్తరించే దీర్ఘ‌కాలిక‌ సాయుధ పంథాను పెరూలో గొంజాలో నిర్మించారు. గొంజాలో ఆలోచనా విధానంగా దీనిని ఉద్యమ సహచరులు పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోకి ఈ అవగాహన శరవేగంగా చొచ్చుకెళ్లింది. చాలా ప్రాంతాల్లో విప్ల‌వ భూసంస్కరణలను ఉద్యమం చేపట్టింది. ఉన్నత విద్యావంతుడైన గొంజాలో, తాను చేస్తున్న ప్రొఫెసర్‌ ఉద్యోగాన్ని వదిలి, 1960 చివర్లో పూర్తికాలం ఉద్యమజీవితాన్ని ఎంచుకున్నారు. విప్లవ తపనతో కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ, యుద్ధ స్వభావాన్ని ప్రజా సంస్కృతే నిర్ధారించాలన్న మావోయిస్టు మూల సూత్రాన్ని పెరూలో ఆచరించి అద్భుత ఫలితాలను అందుకున్నారు. కేంద్ర కమిటీ సమావేశభవనంలో మిగతా నాయకులతోపాటు గొంజాలో 1992లో అరెస్తు అయ్యేనాటికి ఉద్యమం మూడువంతుల గ్రామాలను విముక్తిచేసి, పట్టణాలపై పట్టు బిగిస్తోంది. ఒక విప్లవ సంకేతంగా  షైనింగ్‌పాత్‌ ప్రపంచవ్యాప్త పోరాటాలను, కవులు, రచయిత‌ల‌ను  ఊపేస్తోంది.

అమెరికా సామ్రాజ్యవాదులు ఎల్‌ఐసీ (మంద్రస్థాయి యుద్ధం) పద్ధతుల్లో ఈ దశలోనే ఉద్యమంపై విరుచుకుపడ్డారు. పట్టణాలను అనుకొని ఉన్న మైదాన గ్రామాల్లో ఇన్ఫార్మర్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకొన్నారు. ఉద్యమాన్ని అణచడానికి నమ్మకద్రోహులతో ప్రత్యేకంగా ఒక డిపార్టుమెంటునే పెరూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎల్‌ఐసీ ఉచ్చును వెంటనే గ్రహించలేక,  గ్రహించినా ప్రతివ్యూహం రచించేంత వ్యవధి లేక  మూకుమ్మడిగా నాయకత్వమంతా ఒకేసారి దొరికిపోవడంతో పెరూలో

తాత్కాలికంగా సామ్రాజ్యవాదులదే ‘పైచెయ్యి* అయింది. కోర్టులో గొంజాలో విచారణ ఒక ప్రహాసనంలా సాగింది. విచారణ మొద‌లై న కొన్ని గంటల్లోనే ఆయనకు కోర్టు రెండు యావజ్జీవ కారాగార శిక్షలను విధించింది. గొంజాలో క్షేమం కోసం, ఆయన విడుదల కోసం ప్రపంచమంతటా ఈ సమయంలో జరిగిన ఆందోళనల కారణంగానే అంత హడావుడిగా విచారణ తంతును పూర్తిచేశారు. పోరాట భూమిలో నిలిచిన గొంజాలోను నేరుగా ఎదుర్కోలేకపోయారు. కనీసం తమ చేతికి చిక్కిన తర్వాతైనా పెరూ పాలకులు ప్రశాంతతను పొందారా అంటే..అదీ లేదు. 

ఎంత గడ్డు కాలమది! ఏ ఉద్యమానికైనా ఆటుపోట్లు సహజం. సాధించుకున్న విజయాలను ఒక్కోసారి కోల్పోవాల్సి రావచ్చుకూడా. అయినా మొండిగానైనా కాడిని వదిలిపెట్టకుండా ఉద్యమాన్ని నిలుపుకొనే ఉదంతాలెన్నో! పెరూ ఉద్యమ అనుభవం అలాంటిది కాదు. ప్రజలు తయారుచేసుకున్న నాయకత్వమంతా ఒక్క అరెస్టుతో తుడిచిపెట్టుకుపోయింది. అంతకుమించిన నష్టం ఎల్‌ఐసీ ట్రాప్‌లో పడి నాయకుల మధ్య పెరిగిపోయిన అపనమ్మకాలు కొనితెచ్చాయి. ఈ పరిస్థితుల్లో అరెస్టు అయి జైలుకు పోయినవారు పోగా  బయట మిగిలిపోయిన కొద్దిమంది సైతం ఉద్యమాన్ని నిలబెట్టలేకపోయారు. “ఉద్యమాన్ని మా శత్రువు ఏమీ చేయలేకపోయాడు. పరస్పర అపనమ్మకాలతో మేమే చంపుకొన్నాం” అని గోంజాలో నిజాయితీగానే అంగీకరించారు. ఇంత ప్రతికూలతలోనూ.. మావోయిస్తు ఉద్యమం, ప్రజాయుద్ధ సంస్కృతి పట్ల చివరివరకు ఆయన సానుకూల దృక్పథాన్నే ప్రదర్శిం చారు. “నేను ఈరోజు ఉండవచ్చు. లేకపోవచ్చు. కానీ ఆలోచనలు మాత్రం ఉంటాయి. అవి ఒకరి నుంచి ఒకరికి ప్రవహించినం తకాలమూ కమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు  జయిస్తారు” అన్న గొంజాలో సందేశాన్ని మనమంతా ఎత్తిపడదాం!

– అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు


బాసిత్, ఉపాధ్యక్షుడు

రివేరా, సహాయ కార్యదర్శి

విప్లవ రచయితల సంఘం

Leave a Reply