చంద్రయాన్ మీద కవితలు ప్రశంసలై రాలుతున్నాయి
దేశంలో స్త్రీలను మనువాదులు నగ్నంగా నడిపిస్తే
కలాలు చూస్తూ మనకెందుకులే అనుకుంటున్నాయి
మన జాతి కీర్తి ఆకాశంలోకి రాకెట్లలా దూసుకుపోతుందని
అక్షరాలతో నమ్మబలికి,
రోడ్ల మీద ఆదివాసీలపై మూత్రం పోస్తున్న
కవుల కలాలు చోద్యం చూస్తూ
మధ్యయుగాలలోకి కాలయానం చేస్తూ
ఈ గళాలు మౌనంగా ప్రభుత్వాలను శ్లాఘిస్తున్నాయి
మానుషం అతి భయంకర అమానుషమై
ద్వేషం దేశభక్తి తోలు కప్పుకొని
విచ్చలవిడిగా దేశాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నా,
వంధిమాగదులైన కవుల కలాలు ప్రజాద్రోహులై
నిరంకుశ పాలకులతో సన్మానాలు సత్కారాలు పొందుతూ
ముసి ముసిగా మురిసి పోతున్నాయి
మానవత్వం కోసం పరితపించే మేధావులను
న్యాయం కోసం నినదించే ప్రజా గళాలను
ప్రజల కోసం సిరాతో కదిలిన ప్రజా కలాలను
కాలం చరితార్థులను చేసి అమరత్వాన్ని ఇస్తుంది.
Related