టీచరమ్మ చేతిలో బెత్తం 
ఎంత గట్టిగా కొట్టినా 
అప్పుడు ఏడుపొచ్చేది కాదు
నాకు రాని వారం పేరేదో 
గుర్తుంచుకోవాలని కొట్టారనో
హోం వర్కు చేయడం డుమ్మా కొట్టాననో
ఇంట్లో నూనెలేక తలకు పెట్టుకోలేదనో
నా తోటి మిత్రున్ని ఆట పట్టించాననో 
చింత బెత్తంతో తగిలిన 
బాధను పంటి బిగువన పట్టి
చేయి దులుపుకునే వాణ్ణి! 

కానీ ఇప్పుడు నా ముఖంపై 
ముద్ర వేసిన మతం 
నన్ను వెక్కిరిస్తూ తరగతి గదిలో
నన్నొంటరిని‌ చేసి 
రోజూ హత్తుకుని ఖుషీగా 
ఆటలాడుకుంటూ ఒకరికొకరం
అన్నదమ్ములా భుజాలపై చేతులేసుకుని
గంతులేసే మా మధ్య గోడను కట్టే 
ఈ తృప్తి త్యాగి టీచరమ్మలు 
మొలుచుకొచ్చి మా దేహానికి 
మా మనసుల్లోకి రాని మతం 
మృగాన్ని మేల్కొలిపి 
తరగతి గదిలో సరిహద్దు రేఖలు గీస్తూ
హుకుం జారీ చేస్తున్నారు!

దేవుడెప్పుడూ మాటాడాడా ఇలా
అని అమ్మాజాన్ ని అడిగితే 
లేదు బేటా జర భద్రం బేటా అని 
హృదయానికి‌ హత్తుకుంటే తగిలిన గాయం
ఒక్కసారిగా మాయమయింది!!

(యూపీలో ముస్లిం విద్యార్థిని కొట్టమన్న తృప్తి త్యాగి టీచరమ్మ‌ వార్త చదివి) 

Leave a Reply