దంపతీ వివాహం :
దంపతీ వివాహం యొక్క అంతిమ విజయం, నాగరికత యొక్క ప్రారంభ దశకు చిహ్నం. దీనిలో మగవాడికి ప్రాధాన్యం. జన్మ కారకుడైన తండ్రి విషయంలో సందేహం లేకుండా చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తండ్రి అనంతరం, అతని ఆస్తికి అతని బిడ్డలే సకాలంలో వారసులు కావాలన్నది అక్కడున్న అవసరం. వివాహ బంధం యొక్క గట్టి దనమే జంట పెళ్ళికీ, దీనికీ తేడా. ఈ నూతన వ్యవస్థలో దంపతులలో ఎవరుకోరినా వివాహాన్ని ఛేదించడం సాధ్య పడదు. దాంపత్య ధర్మాన్ని అతిక్రమించే హక్కు కూడా అతనికే మిగిలింది. సమాజం అభివ్రుద్ధి పొందిన కొద్దీ మగవాడు తన హక్కును అమలు పరచుకుంటూ వస్తున్నాడు. భార్య మాత్రం గత కాలపు దాంపత్య జీవిత రూపాల్ని గ్న్యాపకం చేసుకొని దాన్ని పునరుద్ధరించ గోరితే కఠోర శిక్షలకు గురవుతూ వున్నది. [అంటే, మగవాడు ఉంపుడుగత్తెలతోనూ, బానిస స్త్రీలతోనూ తన కోరికలు తీర్చుకుంటున్నాడు. ఏమైనా అంటే, గతంలో బహు భార్యత్వం వున్నది కదా అంటున్నాడు. కానీ, స్త్రీ అదే మాట అని ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకుంటే, కఠినశిక్షలకు గురవుతున్నది.]
గ్రీకు ప్రజలలో ఈ నూతన వివాహ పద్దతి కనపడుతూంది. గ్రీకు వీరయుగం నాటికి మగవాని పెత్తనం స్థిరపడింది. గ్రీకు పురాణ గాధాల్లో ఇలాంటివి చాలా కనిపిస్తాయి. యుద్దంలో జయించిన తర్వాత బానిస స్త్రీలను తెచ్చుకోవడం, దాసీలను భార్యలుగా చేసుకోవడం కనిపిస్తుంది. [మన భారతంలో విదురుడు దాసికి పుట్టిన వాడే !] దంపతీ వివాహ వ్యవస్థతో పాటు పక్క పక్కనే బానిసత్వం సాగుతుండడమూ, ఇంట్లో అందమైన పడుచు బానిసలు వుండడమూ వారిమీద అధికారం మగవాడిదే కావడం కారణం. దంపతీ వివాహ వ్యవస్థలో ఏక పతిత్వం [ఒకే మగవాడి తో వుండడం] స్త్రీకే విధి. మగవాడికి ఏక పత్నిత్వం [ఒకే స్త్రీ తో వుండడం] నిబంధన కాదు. అదే ఈనాటికీ కొనసాగుతోంది.
ఇయోనియన్ల స్థితి వేరు. [ఈ ఇయోనియన్లు ఎక్కడ వాళ్ళు? ఇదంతా వేల సంవత్సరాల చరిత్ర. కొన్ని జాతుల పేర్లు ఇప్పుడు కనిపించక పోవచ్చు. లేదా అదే జాతికి పేరు మారిపోయి వుండవచ్చు. అలాగే దేశాల పేర్లు కూడా మారిపోతాయి. కొన్ని ప్రాంతాలు వేరే దేశంలోకి చేరిపోతాయి. కాబట్టి ఈ జాతి ఇప్పుడెక్కడ వుంది? అని వెతికితే దొరకక పోవచ్చు. దొరకవచ్చు కూడా. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఎలా మారింది? అన్న విషయమే ప్రధానం.] ఈ విషయంలో ఏథెన్సును ఉదాహరణగా తీసుకోవచ్చు. వడుకూ, నేతా, కుట్టుపనీ, మహా అయితే కొద్దిపాటి రాయడమూ, చదవడమూ మాత్రమే అక్కడ ఆడపిల్లలు నేర్చుకునే వారు. వారిని ఎవ్వరితోనూ కలవనిచ్చేవారు కాదు. స్త్రీల మధ్య మాత్రమే తిరుగుతుండాలి. ఇంట్లో ఆడ వాళ్ళుండే భాగం వేరుగా వుండేది. వాళ్ళు మేడమీదనో, ఇంటి వెనుక భాగం లోనో నివసించేవారు. మగవాళ్ళు, ముఖ్యంగా పై వాళ్ళు తేలికగా ఆ భాగంలో ప్రవేశించడం సాధ్యం కాదు. పై మగవాళ్ళెవరైనా ఇంటికి వస్తే, స్త్రీలు తమ భాగంలోకి తప్పుకునేవారు. బానిస పడుచు తోడులేనిదే ఆడది వీధిలోకి పోరాదు. ఇంటి వద్ద కూడా వారిమీద గట్టి కాపలా వుండేది. వ్యభిచారుల్ని హడలు గొట్టేందుకు వేటకుక్కల్ని పెంచేవారని ‘అరిస్టోఫనీస్’ రాశాడు. ఆసియా నగరాలలో స్త్రీల మీదకాపలా కోసం కొజ్జాలని వినియోగించేవారు. హెరోడోటస్ కాలం నాటికే హియోస్ దీవిలో పెద్దఎత్తున కొజ్జాలని తయారుచేసి ఎగుమతి చేయడం సాగుతుండేది.[ఇక్కడ చూడండి. కొజ్జాలను తయారు చేయడం అంటే, పురుషాంగాన్ని కోసేయ్యడం లాంటివి యేవో చేస్తారన్నమాట]
ఒక్క ఇయోనియన్ల లోనే కాక, గ్రీసు దేశం అంతటిలోనూ దాని వలస లోనూ కూడా ఏథెనియను కుటుంబాన్నే కాలక్రమేణా ఆదర్సముగా తీసుకొన్నారు. కానీ, ఎన్ని తాళాలూ, కాపలలూ వున్నా గ్రీసు స్త్రీలు ఏదో అవకాశం చూసుకొని భర్తల్ని తరచుగా మోసగిస్తూనే వుండేవారు. మగవాళ్ళు వేశ్యలతో రహస్య కామ కలాపాలు సాగించేవారు. ప్రాచీన కాలంలో బాగా నాగరీకులై అభివ్రుద్ధి చెందిన ప్రజలను పరిశీలించగా దంపతీ వ్యవస్థకు మూలం ఇదీ అని బోధపడుతున్నది. ఇది వ్యక్తుల మధ్య ప్రేమకు ఫలితంగా ఏర్పడింది కాదు. దానికీ దీనికీ సంబంధమే లేదు. అప్పటికింకా వివాహాలు పూర్వం మాదిరిగానే జరుగుతున్నాయి. సహజ పరిస్థితుల మీద కాక, ఆర్ధిక పరిస్తితులమీద తొలి కుటుంబ రూపం ఇది. ప్రాచీన కాలం నాటి సహజ సమిష్టి తత్వం పోయి, వ్యక్తిగత ఆస్తి హక్కు ఏర్పడడానికిది ఫలితం. గ్రీకులీ విషయాన్ని దాపరికం లేకుండా ఒప్పేసుకున్నారు. మగవాడికి కుటుంబంలో పెత్తనం, అతని సంపాదనకు వారసులయ్యేటందుకే, అతనికే పుట్టిన బిడ్డల్ని చూపడమే ఈ దంపతీ వివాహాల ఉద్దేశ్యాలు. మిగిలిన విషయాలలో దంపతీ వివాహం ఓ భారం ఎత్తుకోవడం గానూ, దేవ కార్యం గానూ, పిత్రు కార్యం గానూ, ప్రభు కార్యం గానూ, తప్పని సరై చేసుకొంటున్నది గానూ వుండేది. ప్రతి మగవాడూ పెళ్లి చేసుకుతీరాలనీ, కనీస దాంపత్య ధర్మాల్ని నిర్వర్తించాలనీ ఎథెనియను చట్టం శాసించింది. [ఇక్కడ చూడండి. గతంలోని గుంపు పెళ్లిలోనూ, జంట పెళ్లిలోనూ పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. కాబట్టి వారసులకు ఆస్తి అప్పజెప్పాలంటే కుదరదు. అదే దంపతీ వివాహాల్లో అయితే, తన పిల్లలు ఎవరో గుర్తించవచ్చు. ఆరకంగా తన ఆస్తి తన పిల్లలకు ఇవ్వవచ్చు. ఆ కారణంగా మగవాడు దంపతీ వివాహం వైపు మొగ్గు చూపాడు. అయినా బయట స్త్రీలతో తన సంబంధాలు వదులుకోలేదు. అదే స్త్రీలయితే శిక్షలకు గురి చేసేవాడు. అయితే, ఇది ఈ దంపతీ వివాహ వ్యవస్థ ఆస్తి వలననే ఏర్పడినా…స్త్రీ, పురుషులిద్దరికీ మంచే జరిగింది. ఖచ్చితంగా తమ పిల్లలు ఎవరో గుర్తించే మార్గం సుగమం అయింది.]
కాబట్టి స్త్రీ, పురుషుల మధ్య సహ్రుదయతకు ఫలితంగా తలఎత్తలేదు ఈ దంపతీ వివాహం. దానికి వ్యతిరేకంగా స్త్రీ జాతిని పురుషుడు తన అధీనం లోకి తెచ్చుకొనడంతో అది వచ్చింది. దానిలో ఆదిమ కాలంలో స్త్రీ పురుషుల మధ్య ఎన్నడూ ఎరగని వైరుధ్యం వ్యక్తమైంది. [ఎన్నడూ ఎరగకపోవడం ఏమీలేదు. వైరుధ్యం గతంలో కూడా వుంది. బిడ్డలకు తండ్రి ఎవరో తెలియకపోవడం వైరుధ్యమే)
దంపతీ వివాహంతో పాటు, వివాహ బంధానికి వెలుపల మగవాళ్ళకూ, కన్యలకూ లైంగిక సంబంధాలుండే ఆచారాన్ని మోర్గాన్’హెటెరిజం’ అన్నాడు. ఇది నాగరిక యుగం అంతటిలో వివిధరూపాల్లో కనబడుతూంది. అసలీ హెటెరిజానికి మూలం గుంపు పెళ్లి. తన పవిత్రతను కొనుక్కునేందు కోసం స్త్రీ తన్నునామకః సమర్పించుకునే ఆచారంలో నుంచి ఇది బయలుదేరింది. ధనం కోసం సంగమించడం మొదట మత ధర్మంగా వుండేది. ఇలాంటి సంగమాలు ప్రేమదేవతల దేవాలయలలో జరిగేవి. ఆ సంగమాల ద్వారా సంపాదించిన డబ్బు ఆ దేవాలయాలకు చెందేది. ప్రారంభంలో సమాజంలో వున్న ప్రతి ఆడదీ చేసి తీరవలసిన పనిని ఈ అర్చకురాండ్రు మాత్రమే స్త్రీ జాతి ప్రతినిధులుగా నిర్వహించారు. ఇతర ప్రజలలో వివాహానికి పూర్వం ఆడపిల్లలకు సాంగత్య స్వేచ్చనుంచి ఈ హెటెరిజం పుట్టింది. అందుచేత ఇది కూడా గుంపు పెళ్లి అవశేషమే. అనాగరిక యుగపు వున్నత దశలోనే వ్యక్తుల ఆస్తులలో అసమానత ఏర్పడింది. అప్పటికే బానిస శ్రమతో పాటు వేతన శ్రమ కూడా ప్రారంభమయింది. అదే సమయంలో దానితో సంబంధం కలిగి బలవత్సంగమానికి లోబడవలసిన బానిస స్త్రీలతో పాటు, వ్యభిచార వ్రుత్తిలో జీవించే స్వతంత్రులైన స్త్రీలు కూడా వచ్చారు. గుంపు పెళ్లినుంచి నాగరికత స్రుష్టించిన ప్రతిదానికీ రెండు ముఖాలున్నాయి. అన్నీ ఆత్మ విఘాతకాలూ, పరస్పర విరుద్ధాలూనూ. ఒకవైపు దంపతీ వివాహం, రెండవ వైపు హెటెరిజం. దానితో పాటూ వ్యభిచారం. ఆదిమ కాలం సాంగత్య స్వేచ్చ మగవాళ్ళకు లభిస్తున్నది.[గుంపు పెళ్లినుండి దంపతీ వివాహం అభివ్రుద్ది. ఏమిటా అభివృద్ధి? తల్లి గుర్తింపు నుండి తండ్రి గుర్తింపు మాత్రమే కాకుండా స్త్రీకి ఇతరులతో శారీరక సంబంధాల నిషేధం. కానీ, అది పురుషుడి విషయంలో జరగలేదు ఈనాటికి కూడా. అందుకే, వైరుధ్యాలతో కూడిన అభివ్రుద్ది.] వాస్తవానికి దాన్ని సహించడమే కాక, ముఖ్యంగా పాలక వర్గాలు చాలా ఉత్సాహంగా అమలు జరుపుతున్నప్పటికీ దాన్ని మాటల్లో ఖండించేవారే. [ఇలాంటి పరిస్థితి ఎంగెల్సు కాలంలోనే కాదు, ఈనాడు కూడా అంతే. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని t.v. ల్లోనూ, సినిమాల్లోనూ ప్రకటనలు ఇస్తూ, మద్యం అమ్మకాలకి అనుమతులు ఇచ్చే ఒక్క ఉదాహరణ చాలు ఫై మాటలు యెంత సత్యమో చెప్పడానికి] అయితే, ఈ పనిలో అపనింద అంతా ఆడవాళ్ళకే మగవాళ్ళ కేమీ లేదు.
రెండో వైరుధ్యం దంపతీ వివాహంలోనే బయలుదేరింది. హెటెరిజం ఆచరిస్తున్న భర్త ప్రక్కన అతనిచే నిరాకృతయైన భార్య [అంటే అతని చేత నిర్లక్ష్యం చేయబడిన భార్య. అతను మలిన పడితే ఇక దాంపత్యం మలిన పడినట్లే] ఏ వైరుధ్యం లోనూ, ఒక సగం లేకుండా రెండో సగం వుండదు. పండు సగం తినేశాక చేతిలో పూర్తి పండు ఉండదు. [ దంపతీ వివాహ వ్యవస్థకు ప్రధాన లక్షణం ఒకస్త్రీకి ఒకపురుషుడు. ఒకపురుషుడికి ఒకే స్త్రీ. అదే మొనోగమి. అయితే స్త్రీకి మాత్రం భర్తతో మాత్రమే సంబంధం. కొంతమంది స్త్రీలకు రహస్యంగా వేరే మగ వాళ్ళతో సంబంధాలు ఉండవచ్చు. అదివేరే విషయం.(అది చట్టబద్ధతా కాదూ, నైతికతా కాదు) కానీ, మగవాడికి ఉంపుడుగత్తెలు, వ్యభిచారులతోనూ సంబంధాలు బహిరంగంగానే వుంటాయి. అంటే, మగవాడు మలిన పడినట్టే. ఆ రకం సంబంధాలనే ఎంగెల్సు పండుతో పోల్చాడు.] ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు తండ్రి ఎవరనేది వెనకటి లాగే ఇప్పుడూ నైతిక విశ్వాసం మీదనే ఆధారపడి నిర్ణయించవలసి వచ్చింది.[ స్త్రీ రహస్యం గానైనా ఇతరుల తో సంబంధాలలో వున్నప్పుడు, తండ్రి ఎవరు?అనే ప్రశ్న నైతికత మీదే ఆధారపడుతుంది.] పరిష్కరించడం అసాధ్యమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు నెపోలియన్ శిక్షా స్మ్రుతి 321ఆర్టికల్ ఈ విధంగా వుంది. “వివాహిత దశలో కడుపున పడిన బిడ్డకు భర్తయే తండ్రి.” [వెనకటి రోజుల్లో అసలు తండ్రి ఎవరు అనేది అసలు తెలిసే అవకాశం లేదు. కాబట్టి నైతికత అనే ప్రశ్నే లేదు. కానీ, దంపతీ వివాహ వ్యవస్థ వచ్చాక ఆ ప్రశ్న వచ్చింది.] మూడు వేలసంవత్సరాల పాటు కొనసాగిన వెనుక కూడా పరిస్థితి ఇది.[ఎంగెల్సు ఈ పుస్తకం రాసేనాటికి]
నాగరికత ప్రారంభమయినప్పటి నుండి వర్గాలుగా విడిపోయిన సమాజంలో వైరుధ్యాలూ, శత్రుత్వాలూ సూక్ష్మ రూపంలో కనపడతాయి. అయితే, దంపతీ వివాహంలో గొప్ప నైతిక పరిణామం వచ్చేందుకు అవకాశం ఏర్పడింది.[అంటే, స్త్రీ ఇతరులతో సంబంధంలో వుంటే శిక్ష. అదే పురుషుడు ఇతర స్త్రీలతో సంబంధంలో వుంటే తప్పులేదు. ఈ వివక్ష ఉన్నప్పటికీ…అసలు ఇద్దరూ స్వచ్ఛంగా వుండడడమనే నైతిక ఆలోచన రావడానికి దంపతీ వివాహ వ్యవస్థ దోహదం చేసింది అని అర్ధం]
ఈనాడు బూర్జువా వివాహాలు రెండు పద్ధతుల్లో జరుగుతున్నాయి. కాథలిక్ దేశాల్లో తల్లి దండ్రులే తమ కొడుకుకు ఒక కన్నెను వెతికి తెస్తారు. దాని ఫలితంగా దంపతీ వివాహంలో సహజంగా వుండే వైరుధ్యాలు పూర్తిగా విజ్రుంభిస్తాయి. భర్త వేశ్యలతో కులుకుతుంటాడు. భార్య జారత్వనికి ఎగబడుతుంది. చావుకి లాగే జారత్వానికి కూడా మందు లేదని కాథలిక్ చర్చి విడాకుల్ని నిషేధించి వుండాలి. ఇంక ప్రొటెస్టెంట్ దేశాలలో, అక్కడ బూర్జువా కుటుంబాల యువకుడు తన వర్గంలోనుంచి తనకు నచ్చిన పడుచును చేసుకునేందుకు ఇంచుమించు స్వాతంత్రం ఉందనే చెప్పవచ్చు. మర్యాదల కోసం ప్రేమ, పెళ్లిళ్లకు కారణం అంటారు. రెండు సందర్భాలలో కూడా వధూవరుల వర్గ స్థితిని బట్టే వివాహాలు జరుగుతాయి. ప్రయోజనార్ధం జరిగే ఈ రెండు తరహాల వివాహాలూ తరచూ వట్టి వ్యభిచారాలేననాలి. ఒక్కొక్కప్పుడు ఇద్దరూ వ్యభిచారానికే దిగుతారు. భార్య విషయంలో ఆ మాట సర్వసాధారణంగా యదార్ధం. అయితే, మామూలు వ్యభిచారిణికీ, ఆమెకూ ఒకటే తేడా. కాంట్రాక్ట్ కూలిలాగ ఎప్పటికప్పుడు కొంత డబ్బు తీసుకొని కొంత కాలం పాటు తన శరీరాన్ని అమ్ముకోవడం కాక, శాశ్వతంగా తన శరీరాన్ని అమ్ముకొంటుంది.
శ్రామిక వర్గంలో భార్యాభర్తల మధ్య దాంపత్య ప్రేమ సర్వసాధారణం అయ్యే అవకాశం వుంది. ఈ వర్గానికి ఆస్తి అనేదేమీ వుండదు. ఆస్తికి వారసుల్ని కనేందుకే కదా, దంపతీ వివాహం వచ్చింది. మగవాని అధికారం దానికే కదా! ఆస్తి లేనపుడు మగవాని పెత్తనానికి బలం వుండదు. ఆ ఆధిపత్యాన్ని చట్టాలు. ఆ చట్టాలు ఆస్తి పరులకే. శ్రామికులను అణిచి పెట్టడం వాటి ఉద్దేశ్యం. చట్టాలంటే, డబ్బుతో పని. పనివాడు దరిద్రుడు. అందుచేత భార్య పట్ల అతని వైఖరి విషయంలో డబ్బుకి విలువలేదు. ఇక్కడ వ్యక్తిగత, సమాజ గత పరిస్తితులది ప్రాబల్యం. పైగా పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి స్త్రీని ఇంట్లోనుండి బయటకు తెచ్చాయి. ఆమె తన శ్రమను అమ్ముకునేటట్లు ప్రోత్సాహం ఇచ్చాయి. ఫ్యాక్టరీలలో ఆమెను ప్రవేశపెట్టారు. ఆస్తి పరుల కుటుంబాలలో వివాహ విషయంలో స్వేచ్చ అన్ని దేశాలలో అమెరికా, ఇంగ్లండూ, జర్మనీ, ఫ్రాన్సూ ఎక్కడ కూడా ఒకే విధంగా వుంది.
ప్రాచీన కాలంలో సమిష్టి గ్రుహ వ్యవస్థలో ఎంతోమంది జంటలు తమ సంతానంతో కలసి జీవించేవారు. ఈ ఇండ్లలో గ్రుహ నిర్వహణ అంతా స్త్రీలదే. మగవాడు ఆహార సంపాదన, స్త్రీ గ్రుహ నిర్వహణ సామాజిక ధర్మం. కానీ, పిత్రుస్వామిక కుటుంబం వచ్చాక, అంత కంటే దంపతీ వివాహం వచ్చాక పరిస్థితులలో మార్పు వచ్చింది. గ్రుహ నిర్వహణకు అంతవరకూ వచ్చిన సాంఘిక స్వభావం పోయింది. అది ఇప్పుడు సాంఘిక దర్మం కాదు. వ్యక్తిగత సేవ అయ్యింది.[ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో గమనించాలి. మొదట్లో ఒక సాంఘిక ధర్మంగా మొదలయ్యి, తరువాత సేవగా, చాకిరిగా రూపాంతరం చెందింది] సాంఘిక ఉత్పత్తిలో ఆమెకు ఉంటూ వచ్చిన స్థానం పోయింది. ఇంట్లోని పనిగత్తెలలో ఆమె మొదటిదయ్యింది. అయితే, పెద్దపెద్ద ఆధునిక పరిశ్రమలు వచ్చాకనే, ఆమె తిరిగి సాంఘిక ఉత్పత్తి రంగంలో అడుగు పెట్టడానికి అవకాశం లభించింది. ఆ అవకాశమైనా కార్మిక స్త్రీకి మాత్రమే లభించింది.[ఇప్పుడు మధ్య తరగతి స్త్రీ కూడా వుద్యోగం చేస్తున్నది.యంత్రాలు ఎప్పుడైతే ప్రవేశించాయో, స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా పని ఇస్తున్నారు. పెట్టుబడికి ఇదొక అనివార్య స్థితి. ] ఆమె తన కుటుంబపు స్వంత పనులు నిర్వహించ పూనుకుంటే సాంఘిక ఉత్పత్తిలో పాల్గొనలేదు. ఏమీ సంపాదించలేదు. ముఖ్యంగా ఆస్తి వున్న కుటుంబాలలో, కుటుంబానికి తిండి తెచ్చి పోషించే బాధ్యత మగవానిది. కుటుంబంలో అతని ఆధిక్యతకు మూలం అదే. దానికి ప్రత్యేకంగా చట్టాలు అక్కరలేదు. కుటుంబం లోపల అతను బూర్జువా. ఆమె శ్రామికురాలు.
ఈ విధంగా మానవ జాతి ప్రధాన అభివ్రుద్ది దశల మొత్తం మీద మూడింటి లోనూ, మూడు విధాలైన వివాహ పద్దతులు మనకు కనపడుతున్నాయి. అవి ఆటవిక కాలంలో గుంపు పెళ్లి. అనాగరిక కాలంలో జంట పెళ్లి. నాగరిక కాలంలో దంపతీ వివాహం. దానికి తోడుగా జారత్వమూ, వ్యభిచారమునూ. అనాగరిక కాలపు వున్నత దశలో జంట పెళ్లికీ, దంపతీ వివాహనికీ మధ్య ఒక స్థితిలో బానిస స్త్రీల మీద మగవాని పూర్ణాధికారం, మరోటి బహు భార్యత్వం.
మా వివరణనంతనూ చూస్తే ఒక విషయం స్పష్ట పడుతుంది. గుంపు పెళ్ళిలో వున్న సాంగత్య స్వేచ్చ క్రమంగా స్త్రీకి తగ్గించబడుతూ వచ్చింది. కానీ, మగవాడు పూర్వం మాదిరిగానే అనుభవిస్తున్నాడు. నిజం చెప్పాలంటే, ఈనాడు కూడా గుంపు పెళ్లి అమలులో వుంది. ఏ పని స్త్రీ చేస్తే నేరమో, ఏ పనికి చట్టబద్ధమూ, సామాజికమూ అయిన తీవ్ర పరిణామాలు ఉంటాయో అదే పని పురుషుడి విషయంలో గౌరవప్రదం అయింది. మహా అయితే, ఒకచిన్న మచ్చగా పరిగణించారు. ఆ మచ్చని అతను సంతోషంగా స్వీకరిస్తాడు. పెట్టుబడిదారీ విధానంలో సరుకుల ఉత్పత్తి వ్యవస్థ ప్రభావంతో పూర్వకాలపు ‘హెటియారిజం’ మార్పు చెంది ఈ ఉత్పత్తికి సమన్వయ పడుతూ బహిరంగ వ్యభిచారంగా మారుతోంది.[ ఉత్పత్తికి సమన్వయ పడడం అంటే, వ్యభిచార గ్రుహాల నిర్వహణ. కొంత డబ్బుతో ఆడవాళ్ళను కొనడం. వాళ్ళమీద వ్యాపారం చేయడం లాంటిది. స్త్రీ శరీరం కూడా ఉత్పత్తి గా మారిపోవడం]ఈ మార్పు చాలా దుష్ఫలితాలను తెచ్చింది. ఇది ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళలో ఎక్కువ దుష్పరిణామాన్ని కలిగించింది. వ్యభిచారానికి లోబడిన వాళ్ళు మాత్రమే స్త్రీ జాతిలో పతితలవుతారు. కానీ, రెండో వైపున మగ జాతి శీల సంపదనే అది పతనం చేస్తుంది.(వ్యభిచారం అనేది స్త్రీలను దిగజార్చడమే కాదు. మగవాళ్ళను కూడా పతనం చేస్తుంది అంటున్నాడు)
రానున్న సామాజిక విప్లవం ఆస్తిలో హెచ్చు భాగాన్ని ముఖ్యంగా వారసత్వంగా సంక్రమించే స్థిరాస్తిని, అంటే, ఉత్పత్తి సాధనాలను సామాజిక ఆస్తిగా మార్చివెయ్యడం ద్వారా వారసత్వం విషయంలో వచ్చే తాపత్రయాన్ని చాలా వరకు తగ్గించేస్తుంది. అయితే ఆర్ధిక కారణాల నుంచే ఉత్పన్నమైన దంపతీ వివాహం ఆ ఆర్ధిక కారణాలు తొలగగానే అంతరించిపోతుందా? [ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చివరి వాక్యం చూడండి. ఆర్ధిక కారణాల వల్ల దంపతీ వివాహ వ్యవస్థ వచ్చినపుడు,మరి ఆస్తి సంబంధాలు పొతే దంపతీ వివాహం పోతుందా?అలా జరగదు. కానీ, అందులో వైరుధ్యాలు తొలగిపోయి, సంపూర్ణ మవుతుంది.అదెలాగో ఎంగెల్స్ చెబుతాడు. అంతే కాకుండా, ఈనాడు స్త్రీ వాదులలో కొంతమంది ఏమంటున్నారంటే….”వివాహ వ్యవస్థ గత కాలం నుండి అనేక మార్పులకు లోనయ్యింది. అయితే ఇప్పుడున్న ‘మొనోగామి’ కూడా శాశ్వతం కాదు. ఇది కూడా మారుతుంది.”అని. ఆ మార్పు ఏమిటంటే, సింగిల్ పేరెంట్, తాత్కాలిక సహజీవనం లాంటివి. దానికి ఎంగెల్సు ఏమంటున్నాడో చూడండి.]
అంతరించి పోవడానికి బదులు దంపతీ వివాహం పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభ మవుతుందన్న సమాధానం ఇవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఉత్పత్తి సాధనాలు సామాజిక ఆస్తిగా మార్పు చెందగానే…వేతన శ్రమ-అంటే శ్రామిక వర్గం అద్రుశ్యమయిపోతుంది. దానితో పాటు కొందరు స్త్రీలు శరీరాన్ని అమ్ముకోవలసిన అవసరం వుండదు. వ్యభిచారం అంతరిస్తుంది. దంపతీ వివాహం క్షీణించడానికి బదులు వాస్తవ విషయంగా రూపొందుతుంది. మగవాళ్ళు కూడా ఏకపత్నీవ్రతాన్ని పాటిస్తారు.[వ్యభిచారం అనేది జీవనం గా గడపాలని ఏ స్త్రీ అనుకోదు. వాళ్ళ ఏ ఆర్ధిక స్థితి బాగాలేనందున అందులోకి వస్తారో లేదా నెట్టబడతారో ఆ పరిస్థితి చక్కబడగానే వ్యభిచారం కూడా అంతరిస్తుంది]
ఈ విధంగా మగవాళ్ళ స్థితీ, ఆడవాళ్ళ స్థితీ మారుతుంది. స్వంత ఇంటి నిర్వహణ సామాజికంగా మారుతుంది. పిల్లల పెంపకం, చదువు సామాజిక ధర్మం అవుతుంది. వివాహితుల సంతానాన్నీ, అవివాహితుల సంతానాన్నీ కూడా సమాజం సమాన శ్రద్ధతో చూస్తుంది. ఈనాడు, కన్య తన మనసిచ్చిన వానితో జీవించడానికి ఆటంకంగా వున్నది ఆర్ధిక సమస్యే. ఇక ఆ భయం పోతుంది.
ఇక్కడ ఒక కొత్త అంశం రంగంలోకి అవతరిస్తుంది. అదే స్త్రీ పురుషుల మధ్య ప్రేమ. ఇది గతంలో దంపతీ వ్యవస్థలో బీజ రూపంలో ఉన్నదే. అందం, సాన్నిహిత్యం, సమాన భావాలూ మొదలైనవి స్త్రీ , పురుషుల మధ్య సాంగత్య వాంఛను రేపుతాయనడం లో సందేహం లేదు. [ఇంకా భాషే సరిగ్గా లేని కాలంలో సమాన భావాలు ఏమిటి ?అనుకోకూడదు. అప్పుడు కూడా వుంటాయి. వున్న తెగ కూ, మరో తెగకూ యుద్ధం అయింది. ఓడిపోయిన తెగ మనుషుల్ని పట్టుకొచ్చారు. కొందరు వాళ్ళను చంపేద్దాం అన్నారు. మరికొందరు వాళ్ళు మనలాంటి మనుషులే. వారిని మనసోదరులు లాగా భావించి మనతో కలుపుకొందాం అన్నారు. అవే సమాన భావాలు. ఆ మాటలు విని ఒక స్త్రీ ఇష్టపడి ఉండొచ్చు. అందుకే ప్రేమ బీజ రూపంలో వుంది అన్నాడు ఎంగెల్సు] కానీ, ఈనాటి ప్రేమకూ, ఆనాటి వాంఛకూ పోలికే లేదు. ప్రాచీన కాలమంతటిలోనూ తలిదండ్రులు తమ బిడ్డలకు వివాహాలు కుదిర్చేవారు. ఆ కాలంలో దంపతుల మధ్య కనబడే కొద్ది పాటి ప్రేమకూ మూలం ఆత్మీయాభిరుచి కాదు. దాంపత్య ధర్మంగా మాత్రమే.
ప్రాచీన కాలం నాటి సాంగత్య వాంఛకూ, ప్రణయానికీ, మనం చెప్పే ప్రేమకూ చాలా తేడా వుంది. మొదటిది మనం చెప్పే ప్రేమ ఎదుటి వారినుంచి ప్రతి ప్రేమ వుందని తలుస్తుంది. ఇక్కడ ఆడదానిది, మగవానితో సమానమైన హోదా. కానీ, ప్రాచీన ప్రణయంలో స్త్రీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం చాలా తక్కువగా జరిగింది. [రెండిటికీ తేడా గమనించాలి. గతంలో స్త్రీ అభిప్రాయం తెలుసుకోవడం లేదు. ఈనాటికీ అలాగే వున్నా, కొంత మారింది. ఆధునిక ప్రేమలో పరస్పర ఇష్టా ఇష్టాలు వుంటాయి]
కొత్త భూఖండాలు కనిపెట్టాక, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రపంచ వ్యాపార, వస్తువుల ఉత్పత్తుల ద్వారా ప్రపంచ ఆధిపత్యం సంపాదించడానికి ప్రారంభించడానికి నాటి పరిస్థితులివి. ఆ పరిస్థితులకు ఈ మాదిరి వివాహ పద్దతే సరైనదని అనుకోవచ్చు. అదే వాస్తవ పరిస్థితి కూడా. చరిత్రగతి యొక్క ఆంతర్యాన్ని ఊహించడం సులభం కాదు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమే ఆ వివాహ పద్ధతిని విచ్ఛిన్నం చేయవలసి వచ్చింది. అదీ చిత్రం.[ఎందుకు విచ్ఛిన్నం చేయవలసి వచ్చింది. అది ఒక అనివార్య స్థితి. మానవ వనరుల కొరత. ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి, కంపెనీల్లో పనిచేయాలి. అలా చేయాలంటే, గతం లాగ ఇంటికే పరిమితం అయతే, వీలుకాదు] ఆ ఉత్పత్తి విధానం ప్రతి ఒక్కదానినీ వర్తకపు సరుకుగా మార్చేసింది. ఆ విధంగా అనుశ్రుతంగా వస్తున్నఆచారాలనూ, చారిత్రకంగా లభించిన హక్కులనూ, ప్రాచీన సంప్రదాయాలను తుడిచేసింది.
దంపతులు కాబోతున్న యువతీ, యువకులు తమనీ, తమ శరీరాలనూ, శరీరాంగాలనూ ఇస్టా పూర్వకంగా సమర్పించేందుకు అధికారం ఉండొద్దూ? వీర ధర్మం, స్త్రీ, పురుష లైంగిక ప్రేమను ఒక ఆదర్శంగా తెచ్చింది[గతంలో]. కానీ, ఆ వీరపురుషుల ప్రేమ అన్యాకాంతాసక్తం. [ఆ పద్ధతిలో వీరుడైన వాడే భర్త. ఆ వ్యక్తి మీద స్త్రీకి ఇష్టం లేకపోవచ్చు. అయినా, ఒప్పుకోవాలి] అలా కాకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ వుండడం బూర్జువా సమాజంలో సరైన ఆదర్శం కాదూ? వివాహితలు ఒకరినొకరు ప్రేమించుకోవడం ధర్మం అయినప్పుడు ప్రేమించుకొన్నవారే పెళ్లి చేసుకోవడం, ప్రేమలేని చోట పెళ్లి చేసుకోకుండా వుండడం మాత్రం ధర్మం కాదూ? తలిదండ్రుల, బంధువుల, సంధాన కర్తల హక్కుల కన్నా ప్రేమించుకున్నవారి హక్కు ఎక్కువది కాదూ? స్వతంత్రంగా పరిశీలించి నిర్ణయించుకునే హక్కును మతానికీ, చర్చికీ కూడా వర్తించేటప్పుడు యువతరం వారి శరీరాలనూ, ఆత్మలనూ ఆస్తిపాస్తులనూ, సుఖ దుఃఖాలను పెద్దలే నిర్నయించాలనే దుర్భరాధికారాన్ని సహిస్తారా? [మిగతా వాటికి స్వతంత్రత వున్నప్పుడు, పెళ్ళికి మాత్రం ఉండవద్దా? అని. కానీ, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి చేయడం పెట్టుబడికి అవసరం. స్త్రీ స్వేచ్చ గురించిన కబుర్లలో అసలు రహస్యం అదే. అయితే అది స్త్రీలకు మేలే చేసింది.]
ముఖ్యంగా ప్రొటెస్టెంట్ దేశాలలో అంతవరకూ అమలులో వున్న సామాజిక పరిస్థితులు పూర్తిగా కదిలిపోయాయి. ఆ దేశాలలో బూర్జువా వర్గం వ్రుద్ధి పొందుతూ వుంది. వారు పైన చెప్పిన విధంగా వివాహ ఒప్పందం స్వేచ్చాయుతంగా జరగాలనే దానిని కూడా అంతకంతకూ అధికంగా గుర్తించారు. వివాహం ఒకే వర్గం వారి మధ్య జరుగుతూంది. కానీ, తమ వర్గానికి సంబంధించిన వారిలోనే తమకు నచ్చిన వారిని ఎంచుకునేందుకు కొంత వరకూ స్వేచ్ఛ ఇస్తున్నారు. [ఇక్కడ చూడండి. తనకు నచ్చిన వారినే ఎంచుకునే స్వేచ్ఛని ఒప్పుకున్నారు. కానీ, తమ వర్గం వాళ్ళనే. ఇక్కడ వర్గం అంటే ఏమిటి? ధనిక, పేద అనా? వేరే మతం అనా? వేరే దేశస్థుడు అనా? వేరే జాతి అనా? వాటిల్లో ఏదైనా కావచ్చు. మనదేశం అయితే కులం] పరస్పర లైంగిక ప్రేమ లేకుండా, స్వేచ్చాయుతమైన అంగీకారం లేకుండా జరిగే పెళ్లి నీతి దూరమని కాగితాల మీద అంగీకరించారు. పద్యాలలో పాడారు. నైతిక సూత్రంగా ఒప్పుకున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రేమించి వివాహం చేసుకోవడం మానవుని హక్కు అన్నారు. మానవుని హక్కు అన్నప్పుడొక్క మగవాడిదే కాదు, స్త్రీ కి కూడా ఈ హక్కును అంగీకరించారు.
కానీ, ఇతర మానవ హక్కులకూ, దీనికీ ఒక్క విషయంలో తేడా వుంది. ఆ ఇతర హక్కులు ఒక్క పాలక వర్గానికీ, బూర్జువా వర్గానికే వర్తించుతాయి. పీడిత వర్గమైన శ్రామిక వర్గానికి అవి వర్తించవు. ప్రత్యక్షంగానో, పరోక్షం గానో వారికి అవి నిరాకరించబడుతున్నాయి. ఈ హక్కు విషయంలో కూడా చరిత్ర తన విడ్డూర విలాసాన్ని ప్రకటించింది. పాలక వర్గం విషయంలో పరిచితమైన ఆర్ధిక పరిస్థితుల ప్రభావమే కొనసాగుతోంది. అందుచేత వారిలో ఇస్టాపూర్వాకంగా జరిగిన వివాహాలు అరుదుగానే కనిపిస్తాయి. కానీ, పాలిత ప్రజలలో ఈ వివాహాలు సర్వ సాధారణం. ఈ విషయాన్నీ పైన చూశాం. దీనివలన తేలుతున్నదేమిటి? వివాహంలో పూర్తి స్వేచ్ఛ వుండాలంటే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమూ, దాని ఫలితంగా ఏర్పడిన ఆస్తి సంబంధాలూ రద్దయిపోవాలి. అప్పుడే భార్యాభర్తల ఎన్నికలో ఆర్ధిక విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వడం తొలగుతుంది. అప్పుడు పరస్పర ఆకర్షణ తప్ప వివాహానికి మరో కారణం వుండదు. [ఎంగెల్సు ఈ పుస్తకం రాసేనాటికీ, ఈనాటికీ వివాహ వ్యవస్థలో పెద్దగా మార్పులు జరగలేదు. మెజార్టీ స్త్రీల విషయంలో ఇంకా పెద్దలదే నిర్ణయం. కానీ, ప్రస్తుతం కొన్ని కొత్త ధోరణులు బయలుదేరాయి. సింగల్ పేరెంట్ అనీ, గ్లాసెడు మంచి నీళ్ళ సిద్దాంతం లాంటివి…అయితే, పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దు అయిపోయిన తర్వాత ఎలా వుండబోతోందో ఎంగెల్సు ఏం చెపుతున్నాడో చూడండి]
కాబట్టి, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం రద్దయ్యాక దాంపత్య సంబంధాలు ఎలా ఉంటాయనే దానికి బదులు ఏమేమి ఉండవో మాత్రమే చెప్పగలుగుతాం.[అంటే, ఈ దంపతీ వివాహం [మొనోగామి] ఇలాగే వుంటుంది. దానిలోని వైరుధ్యాలు తొలగిపోతాయి. అని అర్ధం]కొత్తగా వచ్చేదేమిటి?నూతన తరం బయలుదేరినపుడు వారే దానికి సమాధానం చెప్పగలుగుతారు. ధనంతో గానీ, సామాజిక అధికారంతో గానీ ఆడుదానిని స్వాధీన పరచుకోవడం మగవాడు జీవితంలో ఎన్నడూ ఎరగనప్పుడు, ఆర్ధిక కారణాలవల్ల ప్రేమికులు కలియలేని పరిస్థితులు తొలగినప్పుడు దానికి సమాధానం దొరుకుతుంది. ఆ మాదిరి జనం పుట్టాక, ఈనాడు మనం ఇచ్చే సలహాలకి వారు చిల్లి గవ్వ విలువ కూడా ఇవ్వరు. తమ అలవాట్లను తామే నిర్ణయించుకుంటారు. వ్యక్తుల ఆచరణకు అనుకూలంగా జనాభిప్రాయాన్ని తామే స్రుష్టించుకుంటారు. ఆ సమస్యకు అదే పరిష్కారం.
[ఇంత వరకూ వివాహ వ్యవస్థలో ఎన్ని మార్పులు జరిగాయో రాశాడు. ఇక్కడ నుండి వెనక్కి వెళ్లి వివిధ ప్రాంతాలలో గణ సమాజంలోని కట్టుబాట్లూ, పద్ధతులూ, మార్పులగురించి చెబుతాడు. క్లుప్తంగానైనా అవి చూడాలి]
ఇరాక్యూ గణం: ఈ గణాలలో స్త్రీల వైపునుండే వంశ పారంపర్యం గుర్తిస్తారు. ఇందులో ముఖ్యంగా సెనెకా తెగలలో వున్నా గణాలను మోర్గాన్ మొట్ట మొదట తీసుకున్నాడు. 1. గణంలో ప్రధాన నాయకుడ్నిగణం ఎన్నుకుంటుంది. గణ సభ్యులే ఎన్నుకోవాలి. ఆ పదవి వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది. వంశ పారంపర్యం అంటే, కొడుకు కాదు. ఎందుకంటే, అక్కడ తల్లి పరంపరే అమలులో వుంది. అందుచేత కొడుకు మరో గణానికి చెందుతాడు. సాధారణంగా తమ్ముడో, మేనల్లుడో అవుతాడు. అతడు తెగ సమితిలోనూ, ఇరాక్యూ సమాఖ్య లోనూ సభ్యుడు.[కొన్ని గణాలు కలిస్తే ఒక తెగ. కొన్ని తెగలు కలిస్తే ఒకసమాఖ్య.]
2. గణం తనకు ఇష్టం లేకపోతే సాకెమ్[నాయకుడు]ను తొలగించ వచ్చు. అది కూడా అందరూ కలసి చెయ్యాలి.
3. గణ సభ్యులు ఎవరూ గణం లోని వాళ్ళను పెళ్లి చేసుకోకూడదు. గణం యొక్క మూలసూత్రం ఇదే. దానిని కలిపి ఉంచుతున్న సూత్రం ఇదే. ఆటవికుల్నీ, అనాగరికుల్నీ గురించిన వార్తలలో వారి గణ వ్యవస్థకు సంబంధించిన వివిధ సంస్థలన్నిటికీ వుండే తేడాలను ఎరగక తెగ, కులం, ధమ్ మొదలయిన పేర్లను ఒకే విధంగా వాడిన పద్ధతి చూస్తే ఇది రుజువు అవుతుంది.
ఈ సంస్థ లన్నిటి మధ్యా వివాహ సంబంధాలు నిషిద్దం అని చెప్పిన ఘట్టాలు కూడా వున్నాయి. వీటన్నిటి ఫలితంగా ఎంతో గందరగోళం ఏర్పడింది. మధ్యలో ‘మాక్ లెన్నాన్’ నెపోలియన్ లాగా ముందుకు వచ్చి అంతిమ నిర్ణయాలు ఇచ్చేశాడు. అంతర్వివాహన్ని అంగీకరించినవీ, అంగీకరించనివీగా తెగలన్నిటినీ విభజించాడు. పరమ గజిబిజికి కారణమైన ఆ విభజన నిర్ణయం చేసాక వాటిలో ఏది ఆదిమం, ఏది తర్వాతది, అని అర్ధం లేని పరిశీలన ప్రారంభించాడు. రక్త సంబంధీకులతో గణాలు ఏర్పడ్డాయనీ, గణ సభ్యుల మధ్య వివాహం నిషిద్ధమనీ బయట పడ్డాక గాని ఈ గొడవ అణగ లేదు. మనకు ఇరాక్యూలు కనిపించేసరికే వారి గణాలలో అంతర్వివాహం నిషేధం. [‘నిషేధం’ అని ఒక నిబంధన పెట్టుకున్నారంటే అర్ధం గతంలో గణాల లోపల కూడా వివాహాలు వున్నాయనే]
4. మరణించిన వ్యక్తుల ఆస్తిని గణంలో మిగిలిన వారు పంచుకునే వారు. అది గణం లోనే వుండి తీరాలి. ఒకమగవాడు చనిపోతే, అతని సహజ సోదరులూ, సోదరీఅతడి మేనమామ.[తన బిడ్డలు మాత్రం కాదు. వాళ్ళు వేరే గణానికి చెందుతారు] స్త్రీ చనిపోతే ఆమె బిడ్డలూ, సహజ సోదరీమణులు ఆమె ఆస్తిని తీసుకునేవారు.
5. గణం లోని సభ్యులు పరస్పర సహాయం, రక్షణ ఇచ్చుకోవాలి. వ్యక్తి తన రక్షణకు గణంమీద ఆధారపడే వాడు. ఎవరైనా అతనిని గాయపరిస్తే, గణాన్ని గాయపరచినట్టే. దీనినిబట్టి రక్త సంబంధాలు వున్నాయనీ, రక్తానికి రక్తంతో ప్రతీకారం తీర్చుకోవాలనే సాంప్రదాయాన్ని బేషరతుగా ఇరాక్యూలు గుర్తించేవారని తెలుస్తున్నది. సాధారణంగా క్షమాపణతో పాటు కొన్ని బహుమతులతో సమస్య పరిష్కారమయ్యేది. లేదా తగవు.[ఈ అవశేషం నిన్న మొన్నటి వరకూ వుంది. పల్లెటూర్లలో తన గ్రామస్తుడిని గాయపరిస్తే వూరు ఊరంతా ఒకటై పోవడం మన దేశంలో కూడా వుంది. కొన్ని పాత సినిమాల్లో కూడా కనిపిస్తుంది. పట్టణాల్లో మాత్రం లేదు. ఎవరికి వారే యమునా తీరే]
6.ప్రతి గణానికి ప్రత్యేకమైన పేర్ల జాబితా వుండేది. మొత్తం తెగంతా ఆ పేర్లు ఉపయోగించుకునే హక్కు వుంది. ఆ వ్యక్తి పేరూ, గణం పేరు కలసి వుండడం వలన ఆ వ్యక్తి ఏ గణం వాడో తెలుసుకోవచ్చు.(ఈనాటికీ వూరి పేరే ఇంటి పేరుగా వున్న ప్రాంతాలు వున్నాయి. కేరళాలో అదే పద్ధతి అని విన్నాను. అంతేకాదు ఈ నాటి గోత్ర నామాలు గణ వ్యవస్థ తాలుకా అవశేషాలే. అందుకే సగోత్రీకుల మధ్య వివాహాలు చేసుకోరు. వాళ్ళు అన్నా చెల్లెళ్ళ వరస అవుతారని.]
7.గణం కొత్త వ్యక్తులను తనలో చేర్చుకోవచ్చు. తద్వారా వారు తెగ మొత్తంలో చేరినట్లుగా ఎంచబడతారు. చంపకుండా వున్న యుద్ధ ఖైదీలను చేర్చుకోవడం ద్వారా వారు సెనెకా తెగలో సభ్యులయ్యే వారు. తత్ఫలితంగా వారికి గణ హక్కులూ, తెగ హక్కులూ కూడా వచ్చేవి. గణ సభ్యులు కోరడం వలన, కొంతమంది కొత్త వారిని గణ సభ్యులుగా స్వీకరించేవారు. మగ వాళ్ళయితే సోదరులు, ఆడవాళ్ళయితే బిడ్డలు, స్వీకరణకు తంతు వుంటుంది. సాధారణంగా గణ సభ్యుల సంఖ్య తగ్గినప్పుడు, ఇతర గణాల అనుమతితో గణాలలోకి ప్రవేశం జరుగుతుంది.
8. ఇండియన్ గణాలలో ప్రత్యేకమైన కర్మకాండలున్నాయని రుజువు చేయడం కష్టం. అయినప్పటికీ ఇండియన్లు జరిపే మత కర్మ కాండలన్నీ గణాలకు సంబంధించినవే.(ఇక్కడ ఇండియన్లు మన దేశం కాక పోవచ్చు. రెడ్ ఇండియన్లలో అనేక తెగల్ని ఇండియన్లు అనే అంటారు]
9. గణానికి వుమ్మడి శ్మశానం వుండేది. న్యూయార్కు రాష్ట్రంలోని ఇరాక్యూల శ్మశానం, తెల్లవాళ్ళు రావడం వలన అంతర్ధానమయ్యింది.
1o. గణం లోని యుక్త వయసు వచ్చిన స్త్రీ, పురుషులందరికీ సమాన హక్కులుంటాయి.
కొన్ని గణాలు కలిసి ఒక కూటమి అయినట్లే, కొన్ని కూటాలు కలిసి ఒక తెగగా ఉండేవి. బాగా బలహీనపడిన తెగలలో మధ్యన వుండే ‘కూటమి’ లోపించిన ఉదాహరణలు చాలా వున్నాయి. [తెగ బలహీన పడడం అంటే, జనాభా తగ్గడం కావచ్చు. వేరే తెగలతో యుద్దాలు జరిగేటప్పుడు, జన నష్టం జరుగుతుంది. యుద్దాలు ఎందుకు జరుగుతాయంటే వనరులకోసం. అలాంటి సందర్భాలలో మధ్యనున్న ‘కూటమి’ లేకుండా గణాలు కలసే ‘తెగ’} [ఇక్కడ నుండి మరికొన్ని గణాల గురించిన వివరాలు వున్నాయి.ఉదాహరణకు ఒక్కటే ఇచ్చాను.)