కులం ఎట్లా పుట్టింది? కుల వివక్షత ఎట్లా పోతుంది?”
సమాజంలోని అసమానతల కారణంగా అభివృద్ధికి చాలా దూరంలో ,చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన దళితుల గురించిన ఆత్మగౌరవ కథలు ఎన్నో వచ్చాయి. తెలుగు సాహిత్యంలో ఈ రకం ఆత్మగౌరవ కథలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. తమ పరిస్థితుల గురించి స్వానుభవంతో వ్రాసుకున్న రచనలు. పరోక్షంగా సామాజిక సాంఘిక పరిస్థితులను అర్థం చేసుకుని సహానుభూతితో రాసిన రచనలు. నంబూరి పరిపూర్ణ గారి కథాసంపుటి “ఉంటాయి మాకు ఉషస్సులు” లోని ఈ కథ పేరు “అనల్ప పీడనం” .
అసలు సమాజంలోని అసమానతలకు కారణం అయిన కులవివక్షత ఎలా మొదలైంది? కులం ఎలా పుట్టింది? కుల వివక్షత ఎలా కనుమరుగవుతుంది? అనే ప్రశ్నలను రేకెత్తిస్తుంది ఈ కథ.
ఆమె వ్యాసాలు రాయడం, రేడియో ప్రసంగాలు చేయడం1965లోనే మొదలయింది. ఇది ఆమె మొదటి కథా సంపుటి. (1998). ఈ కథా సంపుటి తర్వాత ” కథా పరిపూర్ణం”, ఆ తర్వాత పదేళ్లకు ఆమె కథలు, వ్యాసాలతో కూడిన “శిఖరారోహణ” పుస్తకం వచ్చింది.ఆమె ఆత్మకథ “వెలుగు దారులలో ” వచ్చింది. ఆమె నిరంతర చదువరి. చివరివరకు కథలు వ్యాసాలు క్రమం తప్పకుండా రాస్తూనే ఉన్న అలుపెరగని సృజనశీలి. 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ చివరిదాకా తన జీవితమంతా ప్రజారంగానికి చెందినదే. విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, ప్రజలకు సంబంధించిన పనులతో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ ఉద్యోగం ఆమెను జీవితానికి అతి సన్నిహితం చేశాయి. ఆవిడలాగే ఆమె కథలూ సూటిగా, వాడిగా, నిష్కర్షగా ఉంటాయి. నిజజీవిత అనుభవాలనే చాలా వరకు ఆమె కథలుగా రాశారు. ఆమె తన చివరి కథను 2016 జనవరి లో రాసింది.
*
“పలురకాల స్త్రీల సమస్యల్నీ, వారెదుర్కొంటున్న సాంఘిక దురన్యాయాల్నీ శాస్త్రీయంగా విశ్లేషించి ఖండించే వైఖరినీ, శక్తినీ- దేశభక్తి, ప్రజల ప్రగతీ కేంద్రంగా కలిగిన రాజకీయ నేపథ్యమున్న మా కుటుంబం నాకు కలిగించింది. మార్కిస్టు, భౌతికవాద సిద్ధాంత బలం మరింత తోడ్పడింది. ఇందుకు తోడు మహిళాసంక్షేమ శాఖలో నా ఉద్యోగ నిర్వహణ- గ్రామీణ మహిళలను నా శక్తిమేర చైతన్యపరిచే సదవకాశాన్ని నాకు గొప్పగా కలిగించింది.గత ఐదారు దశాబ్దాల నుంచీ విద్య, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో సమర్థ నిర్వాహకులుగా స్త్రీలు ముందుకొస్తున్నకొద్దీ- అనేక కొత్త సమస్యల్నీ, హింస ఎదుర్కొనవలసి వస్తున్నది. అయినప్పటికీ- అన్ని రంగాల్లో స్త్రీల పురోభివృద్ధి కొనసాగుతూనే వుంది. స్త్రీల ప్రత్యేక హక్కుల పరిరక్షణ, ప్రగతి – ఆశయంతో రచనలు చేస్తున్న రచయిత్రుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనేక మహిళాసంస్థలూ దీక్షతో కృషి చేస్తున్నాయి. ‘వేయిపూలు వికసించనీ’ అన్న నినాదంతో అభ్యుదయ రచయిత్రులూ, మహిళా సామాజిక కార్యకర్తలూ- నిర్మాణాత్మక కృషి సల్పుతూ ముందుకు సాగుతూ ముందడుగు వెయ్యగలరన్న ఆకాంక్షతో యింక సెలవు!” (09 ఫిబ్రవరి 2016) అంటుంది నంబూరి పరిపూర్ణ తన”శిఖరారోహణ” పుస్తకంలో.
ఇదే ఆమె అంతరంగం.
“అనల్పపీడనం” కథలో తరాలు మారినా, ఉన్నత చదువులు చదివినా, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా బ్రతుకులు మారని, సమానత్వానికి నోచుకోని దళితుల వేదన గురించిన కథ ఇది. ఆత్మగౌరవ పోరాటానికి సంబంధించిన కథ. ఆత్మ గౌరవం కోసం డిమాండ్ చేస్తున్న కథ.
*
” అనల్పపీడనం”
ఉదయపు మసకచీకట్లింకా వదలక ముందే- జిల్లా ఆఫీసర్లంతా తమ వాహనాల్తో కలక్టరేట్ ముందు హాజరయిపోయారు. మరికాసే పటికి అధికార్ల బృందం, కలెక్టర్ నేతృత్వంలో జిల్లాలో జాయింట్ ఇన్స్పెక్షన్ నిమిత్తం, సందడిగా బయల్దేరింది.అనేక ప్రాంతాల్లో పగలు మొత్తం పర్యటన కొనసాగింది. వేర్వేరు చోట్ల జరిగే అభివృద్ధి పనుల తనిఖీలూ, సమీక్షలూ జరిగాయి..
అన్ని డిపార్టుమెంట్ల ఆఫీసర్లూ కలక్టర్ వద్ద శలవు తీసుకు వెళ్లాక- రాత్రి ఎనిమిదింటికి బంగళాకి చేరాడు రమణమూర్తి. శ్రీమతి పిల్లల్ని తీసుకుని సంక్రాంతికి పుట్టింటికెళ్లడంతో లంకంత బంగళా బావురుమంటోంది.
ఇంటికి చేరగానే సరాసరి బాత్రూములో కెళ్లి షవర్బన్ ముగించాడు రమణమూర్తి, లాల్చీ పైజామాతో హాల్లోకొచ్చి, ఈజీ చైర్లో వాలిపోయాడు. స్నానం. అలసటని మాయం చేసి, ఒంట్లోకి కొత్త శక్తిని తెచ్చిపెట్టింది.
నాయర్ అందించిన కాఫీకప్పు పొగల్నీ సువాసనల్నీ విరజిమ్ము తోంది. కప్పులోంచి చిన్న చిన్న గుక్కలు తీసుకుంటూ, దినపత్రిక అందుకున్నాడు. ఉదయం ప్రయాణ హడావుల్లో హెడ్ లైన్సు మాత్రమే చూడ్డానికి కుదిరింది.
ఎడిటోరియల్ ముగించి, పేజీలు తిప్పుతుండగా.. చటుక్కున ఓ వార్త రమణమూర్తి దృష్టి నాకట్టుకుంది.
‘ఇంట్లో హరిజన ఆఫీసరు గెంటివేత.’ అన్న శీర్షికతో ఉన్న ఆ వార్త అతడిని అబ్బురపరిచింది.
వార్త చదవసాగాడు. “ఆర్.డి.ఒ.గా ప్రమోటయిన ఒక హరిజనోద్యోగి, తనకు పోస్టింగిచ్చిన పట్టణానికొచ్చి, ఆఫీసులో జాయినయినాక, ఓ అద్దె ఇల్లు మాట్లాడుకుని దిగాడు. అతడు హరిజనుడన్న సంగతి ఇంటి యజామానికి తరవాత తెలిసాక , ఆ సాయంత్రలోపునే ఖాళీ చెయ్యమని పట్టుబట్టాడు. అందుకా ఉద్యోగి అంగీకరించకపోవడంతో ఇంటి యజమాని అతని సామాన్లను వీధిలోకి విసరి, ఇంటికి తాళం వేసుకున్నాడు. దానితో ఆ ఆర్.డి.ఒ. తీవ్రంగా అవమానపడి. ఇంటతని మీద అస్పృశ్యతా నేరచట్టం కింద కోర్టులో కేసు వెయ్యడం జరిగింది.
ఈ సంఘటన ఆర్.డి.ఒ. కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది.” వార్త సారాంశం రమణమూర్తి మనసును అమితంగా కలతపరిచింది. టేబులు మీదికి పత్రికను గిరాటేసి, ఆలోచనల వలయంలో కూరుకుపోయాడు. వార్త తాలూకు ఒక్కో అక్షరం పదునైన ముల్లుకుమల్లే గుండెల్ని గుచ్చుతోంది.
ఇది ఈనాటి సంగతిగాదు. వేల సంవత్సరాలుగా మాలమాదిగల్ని ఊరికి బాగా దూరంగా వుంచింది కులాధిక్య సమాజం. అందుకు ‘సవర్ణులు’ చెప్పిన కారణాలు అశుభ్రత, అనాచారాలు. మరి రకరకాలైన వ్యవసాయప్పన్లకీ, వ్యవసాయ ఉత్పత్తులకి మూలాధారం ఈ దళితులే. పశువుల్ని పెంచి పోషించడం, ఇంటి చాకిరీలు చెయ్యడం కూడా వీళ్ల వంతే. మరి అప్పుడీ అశుభ్రత అడ్డురాదేం?
మరోపక్కన ఆశుభ్రంగా ఉంటూ, క్రమజీవితమంటే బొత్తిగా తెలియని తిరుగుబోతు జాతుల్ని సమాదరించి, ఊళ్లో ఉండనిస్తారు. ఊరి బావుల్లోంచి వాళ్లు హాయిగా నీళ్లు తోడుకోవచ్చు. యానాదులకూ, గంగిరెడ్ల, పిచ్చుకగుంట్ల మొదలైన జాతులక్కూడా మాల మాదిగలు అంటరానివాళ్లు! ఆరుగాలం ఆసాములకూ, ఆధిక్య కులాలవారికీ కుడిభుజంగా వుండే కర్మజీవులు అంటరానివాళ్లు! వారివి నీచమైన జన్మలు!! ఇదివరకటికన్నా పరిస్థితులు బాగా మారాయి. నిమ్న కులజనాల్లో ఎంతో మంది చదువుకుని, మంచి సంస్కారవంతులవుతున్నారు. మంచి ఉద్యోగులుగా, కార్యనిర్వహణాధికార్లుగా తమ సమర్థతను నిరూపించుకుంటున్న సంగతి గమ నించడం లేదా ఎవరూ? అవకాశం లభిస్తే ఎంత ఎత్తుకైనా ఎదుగుతున్నారే! అయినా… అయినా… యిప్పటికీ ఆర్.డి.ఒ. స్థాయికెదిగిన వాళ్లు సైతం- కుల సంబంధ అవమాన తిరస్కారాలకు గురి కావలసిందేనా ? ఏభై ఐదేళ్ల స్వతంత్రం తరువాత కూడా కనీసం పట్టణాల్లోనైనా దళిత ఉద్యోగులకు అద్దెకిళ్లు దొరక్కపోడాన్ని ఏమనాలి? ఊర్లూ, అవాసాలూ ఒకే గడ్డమీద చిరకాలంనించీ నెలకొని వున్నప్పటికీ ఆ గడ్డ కులాలవారీగా ముక్కలు చెక్కలయిన రూపురేఖల్తోనే బతుక్కొస్తూ వుంది. వాడకట్లు ఏర్పడేది కులం పేరుతో! ఊరు- మాలపల్లి- రెండుగా చీలిన భూశకలాల మధ్య పూడ్చలేని అగాధం!
రోజంతా తిరగడం వల్ల శరీరం బాగా అలసిపోయింది రమణమూర్తికి.
భోజనం పెందలాడే కానిచ్చి పక్కమీదకి చేరాడు. కానీ ఎంత ప్రయత్నించినా కునుకు రావడంలేదు. వికలమై నిద్రకు దూరమైన మనసు చిన్నతనంలో తననెంతో చిన్నపుచ్చిన కొన్ని సంఘటనల్ని తవ్విపోస్తోంది..
*
అప్పుడు హాస్టల్లో వుండి చదువుకుంటున్నాడు తను. ఫోర్తుఫారం పరీక్షలు. వ్రాశాడు. వేసవి శలవులు గడుపుదామని మేనత్తగారి ఊరెళ్లాడు.
ఆరోజు- శివాలయం ముందర హరిశ్చంద్ర నాటకమాడబోతున్నారని బావలు చెప్పేసరికి, సంతోషంతో గంతులేశాడు తను. రాత్రి ఎప్పుడవుతుందా అని ఒకటే ఆరాటం!
రాత్రి తొమ్మిది గంటలప్పుడు అత్తయ్యా బావలతో కలిసి శివాలయం చేరుకున్నాడు తను. చంకన బెట్టుకొచ్చిన చాపపరిచి అందర్నీ కూచోబెట్టింది అత్తయ్య.
నాటకం చూస్తూ మధ్యలో మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వచ్చింది.అ తర్వాత నాటకంలో తల్లీ కొడుకులు హరిశ్చంద్రుణ్ణి విడిచిపోలేక ఘోరంగా దుఃఖిస్తున్న సీన్.
ఇటేమో నాటకం చూస్తున్న ఆడవాళ్లు వెక్కెక్కి ఏడుస్తున్నారు. తనకూ ఏడ్పు తన్నుకొస్తోంది. ఆవేశంతో తను నిలుచున్న చోటే కూలబడ్డాడు.
తను కూచుండిపోయిన చోటు- అత్తయ్య వాళ్లు కూచున్న చోటుకు బాగా దూరంగా వున్నట్టు అర్థమయ్యింది తనకు. క్షణంపాటైనా తను చూపు మరల్చ కుండా నాటకాన్ని చూడాలి… అత్తయ్య వాళ్ల దగ్గరికి ఇప్పుడెళ్లడం కుదరదు.
కొత్తగా అక్కడి జనం మధ్యకొచ్చి కూర్చున్న తనను- ఓ పెద్దాయన, “ఎవరి కుర్రాడివబ్బాయ్,” అంటూ పలకరించాడు. నాటకం చూడనివ్వకుండా ఈయనేంటీ మధ్యన, పైగా, ఆయనకు జవాబు చెప్పేందుకు తనకెందుకో సంకోచంగా వుంది. ఏమీ వినబడనట్టు స్టేజి వైపే చూస్తున్నాడు.
“ఎవళ్లబ్బాయివంటే మాట్టాడవేంటి?” మళ్లీ అన్నాడాయన. బదులివ్వక తప్పేట్టు లేదు. “మాది ఈ ఊరుగాదు లెండి; చుట్టాలింటికొచ్చాను.”
“అట్టాగా! ఎవ్వళ్లా చుట్టాలు? ఇంటి పేరేంటి ఆళ్లది?” ఒక్కసారిగా భయం పట్టుకుంది తనకు. అత్తయ్య వాళ్లింటి పేరు చెప్తే కులమేమిటో తెలిసిపోతుంది. “అంటరానోడివిగదా, మా పక్కన కూచున్నావేంటి? మమ్మల్ని ముట్టుకోగూడదని తెలియదా?’ అని దండించి, నెట్టేస్తారేమో! ఏం చెప్పాలో తెలియక గుటకలు మింగుతున్నాడు తను.
పెద్దాయన తన వాలకం కనిపెట్టినట్టున్నాడు. “ఏరా అబ్బాయ్? అసలు నువ్వెవురు తాలూకోడివి? నీ కులమేంటో జాతేంటో ముందది చెప్పు.” అంటూ నిగ్గదీశాడు.
తత్తర బిత్తరలాడుతున్న తనకు- తమ సైన్సు టీచరు చెప్పిన ఓ సంగతి. చటుక్కున గుర్తుకొచ్చింది. భూగోళమ్మీదున్న అన్ని దేశాల ప్రజల్ని గురించి బోధిస్తూ ఆమె యిలా చెప్పింది. “దేశాలన్నిట్లో వున్న ప్రజలందరిదీ ఒకే జాతి. దాన్ని మానవ జాతంటారు. మళ్లీ యిందులో మగ వాళ్లందర్నీ పురుషజాతనీ, ఆడవాళ్లను స్త్రీజాతనీ అంటారు. ఆడ మగ తేడా తెల్పడానికి, అంతేతప్ప- మనుషులు కులంతో సహా పుట్టరు. పుట్టిన తరువాతనే ఫలాని కులమనీ, జాతనీ ముద్రపడుతుంది. ఇదంతా మనుషులు కల్పించిందే.”
జ్ఞప్తికొచ్చిన టీచరమ్మ మాటలు గుండెకు ధైర్యమివ్వగా, “మాది మనిషి జాతండీ!” అని జవాబిచ్చాడు తను. ఆ మాటినగానే ఆ పెద్దాయన చర్రుమని లేచి, “ఆహాఁ! అట్టాగా… చాల్లే తెలివి. అది పక్కనబెట్టి అసల్నీ కులమేంటో చెప్పు ముందు.” అన్నాడు గద్దిస్తూ.
తనేం మాట్లాళ్లేదు. జవాబివ్వదలుచుకోలేదు. మౌనంగా నేలని చూస్తున్నాడు. కానీ ఆయనెందుకూరుకుంటాడు? పక్క వాళ్లతో, “ఇదుగో! ఇటొకసారి చూడండ్రా. ఈడెపుడో వున్నట్టుండి నాపక్కకొచ్చి కూచున్నాడు. ఎవురి కుర్రోడివి, ఏ కులపొడివని అడిగాను. తనది మనిషి జాతని చెపుతా, శానా శమత్కారం బోతున్నాడు. కులమేంటో మాత్రం చెప్పటంలా. ఒళ్లు బలిసినట్లుంది గాడ్డికోడుక్కి.” పక్కవాళ్లంతా- ఒక్కసారే తలలు చెప్పి, తనని పరిశీలనగా చూశారు.
“ఏరేగా ఆడుజెప్పేదేంది? వాలకం దెలవటంలా? ఆడు మాలోడు. ముమ్మాటికీ ఆడు మాలోడే. చూస్తారేంట్రా యింకా, నాలుగుదన్ని అవతలిగెంటక,” వాళ్లలో ఒకతనన్నాడు.
మొదటాయన ఆ వెంటనే గుడ్లురుముతూ ఈడ్చికొట్టాడు తన చెంప మీద. చెంప ఛెళ్లుమని, కళ్లనించి నిప్పురవ్వలు రాలాయి. మరో మనిషి తన మెడమీద కర్రబెట్టి- బయటికి గెంటాడు. తనకు ఏడ్పుకి బదులు గుండెల్లోంచి ఉక్రోషం ఎగదన్నుకొచ్చింది. రోషం, అవమానాల్తో ఒళ్లంతా వణుకుతూ కాలిపోయింది.
ఇక్కడ జరిగే గందరగోళాన్ని బావలు గమనించారు గాబోలు- పరుగు పరుగునొచ్చారు. సంగతి తెలుసుకున్నాక- చుట్టూ కమ్ముకున్న పెద్దలందరికీ పదే పదే క్షమాపణలు చెప్పి, తనను తమవెంట తీసుకునిపోయారు.
*
మర్నాడు మధ్యాహ్నం- మేనత్త గారింటి ముందు పెద్ద పంచాయితీ! ఆమె భర్త, మిగిలిన బంధువులూ, రాత్రి జరిగిన సంగతి మీద తీవ్ర చర్చ ప్రారంభించారు.
“చదువు వెలగబెడుతున్నావు గదా అని పెద్ద ఘనుడివయ్యావనుకోబోకు. ఊరి ఆసాముల్తో మాకు బోల్టు పన్లుంటాయి. వాళ్లవద్ద మాకెంత పరపతుందో, వాళ్లు మాకెంత అండదండగా వుంటారో, వేలెడంత కుర్రగాడివి నీకేం తెలుసు? మనమేంటో మనమెంతవరకుండాలో ఆలోచించకుండా ‘సైయోళ్ల’ మధ్యకెళ్లి కూచోటమే! పైగా కులమడిగితే కొక్కిరాయి జవాబు చెప్పటం. ఇదంతా ఏంటి?” తలొకరీతిగా చీవాట్లు, చీదరింపులు..
తనెందుకు నాటకం మధ్యలో బయటకెళ్లిందీ చెప్పాడు. తిరిగొచ్చి నాటకం చూచే రంధిలో- కనబడ్డ చోటున ఎలా కూచుండిపోయిందీ వివరంగా తెలిపాడు. పెద్దలకేదీ అర్ధమవ్వడంలేదు. తమ పట్టే పట్టు. క్షమించే వైఖరి ఎవ్వరికీ లేదు.
మర్నాడే పయనమయ్యాడు తమ ఊరికి. అత్తయ్య తన చేతిలో బట్టలు కొనుక్కోమని ఏభై రూపాయలు బెట్టి, కన్నీరు బెట్టుకుంటూ సాగనంపింది. పెద్దబావ కళదప్పిన మొఖంతో స్టేషనుకొచ్చి, తనని బండెక్కించాడు.
రైలెక్కిన సరదా బొత్తిగా లేదు తనకు. మనసునిండా ప్రశ్నలు, ప్రశ్నలు. అసలు కులమంటే ఏమిటి? ఎవరు సృష్టించారు కులాల్ని? వీటిలో కొన్ని గొప్పవనీ, కొన్ని నీచపువనీ ఎవరు నిర్ధారించారు? ఆస్తులూ భూములూ పెద్ద కులంవాళ్లకూ, పస్తులూ అగచాట్లూ చిన్నకులాల వాళ్లకీ ఎందుకుంటున్నాయి? భూమి దున్ని పంట పండించే రైతుకూలీ, పాలేళ్లూ జీతగాళ్లూ పిడికెడు గింజల్లేక కటకటపడ్డం కాలు కదపని కామందులు ఎక్కీ తొక్కీ తింటూ బొర్రలు బెంచుకోడమేమిటి? పైగా అట్లా పండించి, తిండి నమర్చి పెట్టే మనుషుల్ని ‘అసంట, అసంట’ అనంటూ దూరంగా వుంచడమేమిటి!
అత్తయ్యగారి ఊరు తనకు అంటరానితనపు లోతుపాతుల్ని ఎంతో బాగా తెలియజెప్పింది. అప్పుడు తనకు పదమూడేళ్ల వయసు. అప్పుడు, ఆనాడు. జరుగుతుండిన చేదు ఘటనలు- ఇప్పటికీ, ఏభైయేళ్ల స్వతంత్రం తర్వాత కూడా కొనసాగుతుండడ మేమిటి? ఈ దేశపు అతి ప్రాచీన ‘అంటు జాడ్యం’ ఆ ఆర్.డి.ఒ. అంతటివాణ్ణి సైతం కాటేసింది. పల్లెల్లో బావులూ, చెరువులూ, గుడిగోపురాలూ ఇప్పటికీ దళితులు గాలి సోకితే మైలబడుతున్నాయి. వేర్వేరుగా తప్ప జతగా కూర్చోము అంటున్నాయి ‘రెండు గ్లాసులు’! ఆవేదన నిండిన ఆలోచనల వల్ల- ఎప్పటికో కోడికూత వేళకు కోడినిద్ర పట్టింది రమణమూర్తికి.
*
కలెక్టర్ రమణమూర్తి తన ఆఫీసు రూము కొచ్చి కూర్చున్న కొద్దిసేపటికి ఆయన పర్సనల్ టపా తెచ్చి ముందుంచాడు అటెండరు.
అందులోంచి ఓ పెద్ద కవర్ని తీసి తెరిచాడు. మరో రెండ్రోజుల్లో ఈ పట్టణంలో జరగబోయే నాటక పరిషత్తు పోటీల తాలూకు ఆహ్వానం. నాటక ప్రదర్శనల ప్రారంభసభకు ముఖ్య అతిథిగా రావలసిందని వారం క్రితమే వచ్చి తనను ఆహ్వానించారు నిర్వాహక కమిటి సభ్యులు, రమణమూర్తికి వచ్చిన ఆహ్వాన పత్రం- ఆనందానికి బదులు తనలో అణగివున్న ఆవేదనను రగుల్చుతున్నట్టుగా వుంది. ప్రసిద్ధ నాటక రంగ ప్రముఖులు – తనను ప్రారంభసభలో ముఖ్యఅతిథిగా పాల్గొనమని కోరి ఆహ్వానించారు. ఇదే విధమైన ఒక నాటకాన్ని తన చిన్నతనంలో తన దేశీయులైన నలుగురు మనుషులు మధ్య కూర్చొని చూడదలచడం పెద్ద అపరాధమయ్యింది. తనలో కళాప్రియత్వం, సంగీతాభిరుచీ మెండుగా వున్నాయని తెలిసి ఆహ్వా నించారా తననిప్పుడు ? కాదు, జిల్లా అధికారిగా తనకిస్తున్న గౌరవమిది.
ఇతరులతో, కులాధిక్యులతో కలిసి మెలసి గౌరవప్రదంగా కూర్చోగలవారు అస్పృశ్యుల్లో, అనేకానేక బహుజన దళితుల్లో- తనవంటి స్థాయికెదిగిన వాళ్లు ఎందరుంటారు? వేయికొక్కరుంటారనుకున్నా అనుమానమే.
ఈ మధ్య కులసంఘాల రద్దీ ఎక్కువయ్యింది. ఆయా కులాలు- కుల సంఘ నాయకుల ప్రయోజనాలకు తోడ్పడం తప్ప, కుల సభ్యుల అభివృద్ధికి జరుగుతున్నది. శూన్యం. పైగా కులసంఘాలూ, వాటిమధ్య వైషమ్యాలూ వృత్తి రాజకీయనేతలకు ఎంత మంచి ఓట్ల బ్యాంకులు!
ఒక్క అంటరానితనాన్ని మినహాయిస్తే- అనేక వృత్తుల దళిత బహు జనులు సంఖ్యలో ఉత్పత్తి సృజనక్రియల్లో ఎన్ని రెట్లు అధికులు!
బహుజనులంతా ఏకమై తమ పిడికిళ్లు పైకెత్తితే అన్ని రకాల వివక్షా, పీడనం- పలాయనం చిత్తగించకేం చేస్తుంది?
5 ఫిబ్రవరి 2002 ఆంధ్రప్రభ ఆదివారం ఈ కథ మొదట ప్రచురించబడింది. ఆ తరువాత “ఉంటాయి మాకు ఉషస్సులు” కథా సంపుటిలో ముద్రితమైంది.
*
ఇదీ కథ.
ఈ కథలో రచయిత్రి వేసిన పలు ప్రశ్నలకు సమాధానాలు కాలం, రాజ్యం చెప్పాల్సి ఉంది.
ప్రశ్నించాల్సిన వాటిని ప్రశ్నించకపోవటం,
ఎదిరించాల్సిన వాటిని ఎదిరించ కపోవడం, బానిస మనస్తత్వాన్ని కలిగి ఉంటూ, అగ్రకుల అహంకారాన్ని ఎదిరించక, లొంగిపోవడం, ఈ లక్షణాలన్నీ ఉన్నత చదువులు చదివిన దళితుల్లో గమనించినప్పుడు ఆగ్రహం కలుగుతుంది.
ఇదే సమయంలో జీవనానికి ఎలాంటి హామీ లేని దినసరి కూలీలు , శ్రామికులు, నిరక్షరాస్యులు సైతం తమ బానిసత్వాన్ని నిరశిస్తూ అసమానత్వం పై కుల వివక్షత పై ఎదురు తిరగడం సమాజంలో అక్కడక్కడ కనిపిస్తుంది. సమాజంలో రావాల్సిన మార్పులు రావాల్సిన సమయంలో, రావాల్సిన ప్రాంతంలో, రావాల్సిన సందర్భంలో రాకపోయినట్లయితే తరాలకు తరాలు అనేక కష్టాలను అవమానాలను అణచివేతను భరించాల్సి ఉంటుంది.
చదువు మనిషిలో చైతన్యాన్ని, ఎరుకని, స్పృహని కలిగించకపోతే చైతన్యం కలిగించని చదువులు వృధా అవుతాయి. బానిసత్వం నుంచి విముక్తి పొందలేని, చైతన్యాన్ని కలిగించని చదువులు వృధా అని చరిత్ర పాఠాలు చెబుతూనే ఉంది. ఎంత ఉన్నత స్థాయి ఉద్యోగులు అయినా దళితులు గిరిజనులు, మైనార్టీలు సమాజంలో అవమానాలకు వెలివేతకు గురి కావాల్సి రావడం ఒక విషాదం, ఒక విపరీత పరిణామం కూడా.వివక్షత ఏ స్థాయిలో ఉన్నా ఖండించాల్సిందే.ఎప్పుడైనా ఎక్కడైనా వివక్షత మంచిది కాదు, సమ్మతం కాదు. ఈ కథా ఆ విషయాన్నే స్పష్టం చేసింది.
ఈ కథలో ఊరి పెద్దలను ఉన్నత కులాల వారిని ఎదిరించ లేని బానిస మనస్తత్వం లో నిరాశ నిస్పృహలతో బ్రతుకీడిస్తున్న గ్రామీణ దళితులు ఒకవైపు, చదువుకుని ఉన్నత ఉద్యోగిగా ఉంటూ అవమాన పరిస్థితులను ఎదుర్కొంటూ సంఘర్షణకు లోనవుతున్న ఉన్నత ఉద్యోగి మరొకవైపు. సమానత్వం కల్పించలేని సమాజంలో మార్పు కోసం, తన ఆత్మాభిమానం కోసం
ఆ విద్యావంతుడు, ఉన్నత ఉద్యోగి చట్టాన్ని ఆశ్రయించటం ఈ కథ లోని ముఖ్యమైన విషయం. తన కులం ఉనికిని చాటుకుంటూ తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ తన ఆత్మ గౌరవం కోసం అతడు చట్టం సహాయంతో న్యాయం కోసం సాగించే పోరాటం గొప్పది. సమాజంలో కుల వివక్షతకు తావులేకుండా అందరూ సమానంగా చూడగలిగినప్పుడు పిల్లలు సృజనాత్మకంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎదుగుతారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ఆ పిల్లలే రేపటి తరానికి మంచి వారసులవుతారు.
*
విద్య కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ సమాజంలో దళితులకు కల్పించని సమానత్వం మరి ఎట్లా సాధ్యపడుతుంది? ఎప్పుడు సమాజంలో మార్పు వస్తుంది? ఆమె కథల నిండా ప్రశ్నలే, సమాధానాల కోసం అన్వేషణలే. సమాజంలోని అనాగారికతను అసమానతను ప్రశ్నిస్తూ సమాధానాలు అన్వేషించమనే మంచి రచయిత్రి, సృజనశీలి నంబూరి పరిపూర్ణ గారికి నివాళులు..