కారంచేడు మారణకాండ తరువాత విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్లం. మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్ల అమలు కంటే ముందే మురళీధర్‌ రావు కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎన్‌టి రామారావు ప్రభుత్వం ఓబిసి లకు రిజర్వేషన్లను పెంచినప్పుడు విప్లవ విద్యార్థి సంఘాలకు చెందిన వారిని మినహాయిస్తే మిగతా అగ్రకులాల విద్యార్థులందరూ రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళన మొదలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల పక్షంలో బలంగా నిలబడిన రాడికల్‌ విద్యార్థి ఉద్యమంలో తొలి అడుగులు నేర్చుకున్న వాళ్లం.  అందువల్ల దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలను, కులంతో ముడిపడిన ప్రశ్నలను మొదటి నుండి ఏదో ఒక మేరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మా విప్లవ ప్రస్థానం సాగింది. ఈ ప్రశ్నల నేపథ్యంలోనే జీవితంలో మొదటిసారిగా జ్యోతి రావు ఫూలేతో పాటు బ్రాహ్మణవాద వ్యతిరేక పోరాటం చేసిన ఎందరో సాంఘిక విప్లవకారుల గురించి తెలుసుకున్నాం. అకడమిక్‌ చదువులలో భాగంగా తెలుసుకున్న అంబేడ్కర్‌ను మాత్రమే కాకుండా కుల నిర్మూలన గురించి ఆయన పడిన తపనను, పోరాటాలను, సిద్ధాంతాన్ని ఏదో మేరకు తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాము.

విప్లవోద్యమం కుల సమస్య పట్ల విస్పష్టమైన వైఖరిని తన అవగాహనా పత్రం ద్వారా వెల్లడిరచడం ఈ విషయం పట్ల సాపేక్షికంగానైనా సమగ్ర దృష్టి అలవర్చుకోవడానికి తోడ్పడిరది. మేము బీహార్‌ రaార్ఖండ్‌ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో విప్లవోద్యమంలో పని చేయడానికి వెళ్లడం వల్ల మన దేశంలోని కులాల డైనమిక్స్‌ను మరింత విశాలంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిరది. ఏదేమైనా విప్లవోద్యమం  ఆచరణలో ప్రజా పంథాను అమలు పరచడంలో భాగంగా ప్రజల నుండి నేర్చుకోవడానికి ఎట్లాగైతే ప్రాముఖ్యతను ఇస్తుందో అట్లాగే సైద్ధాంతిక రంగంలో కూడా విభిన్న ఉద్యమాలు, అస్తిత్వ సమూహాలు ఆచరణకు సంబంధించి, సైద్ధాంతిక విషయాలకు సంబంధించి లేవనెత్తిన అంశాలను అర్థం చేసుకోవడానికి, అవగాహనను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్నది. పితృస్వామ్యం, కుల సమస్య, జాతుల సమస్య, మత మైనారిటీల సమస్య, ఆదివాసీల సమస్య, పర్యావరణ సమస్య వంటి నేరుగా వర్గ సమస్యలుగా కనిపించని వాటి పట్ల కూడా విప్లవోద్యమం అవగాహనా పత్రాలను రూపొందించుకుంది.

మేము 2009లో అరెస్టు అయ్యి హజారీబాగ్‌ జైలులో ఉన్న కాలంలో మా కంటే కొద్ది కాలం ముందు శ్రీధర్‌ శ్రీనివాసన్‌, వెర్నన్‌ గొంజాల్వెస్‌ అరెస్టయి నాగపూర్‌ జైలులో ఉన్నారు. వారికీ, మాకూ మధ్య రెగ్యులర్‌గా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. అందులో సుదీర్ఘంగా కుల సమస్య పట్ల కూడా చర్చ సాగేది. ముఖ్యంగా శ్రీధర్‌ ఈ విషయంలో ‘కులం పట్ల మార్క్సిస్టు అవగాహన దిశగా ఒక నోట్‌’ అని చాలా విస్తారంగా రాసాడు. అందులో విప్లవ శిబిరం నుండి అంబేడ్కర్‌ గురించి మునుపెన్నటికన్నా పాజిటివ్‌గా రాసిన అవగాహన ఉండిరది. ఆ నోట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఒక వ్యాస రూపం ఇచ్చి వీక్షణానికి ప్రచురణ కోసం ఆయన పేరుతోనే పంపిస్తానన్నప్పుడు తన విడుదల దగ్గర పడిన కారణం వల్ల, ఇతర కారణాల వల్ల అలా వద్దన్నాడు. దానితో ఆ వ్యాసాన్ని నా పేరుతోనే రాజకీయ ఖైదీల చర్చల క్రోడీకరణగా పంపించాను. ఆ వ్యాసం ప్రధానంగా శ్రీధర్‌ నోట్‌ మీద, కొద్ది మేరకు ఇతర రాజకీయ ఖైదీలతో జరిగిన చర్చల మీద ఆధారపడి రాసిన వ్యాసం. కాబట్టి వీక్షణంలో ప్రచురితమైనప్పుడు అది నా పేరుతో ప్రచురితమైనా ఈ వ్యాస సంకలనంలో శ్రీధర్‌ పేరునే ప్రథమ రచయితగా చేర్చాను. జైలు నుండి విడుదలై విప్లవోద్యమంలో తిరిగి చేరిన తరువాత కొద్ది నెలలలోనే ఆ కామ్రేడ్‌ అమరుడు కావడంతో విప్లవోద్యమం ఒక గొప్ప మేధావినీ నాయకుణ్ణి కోల్పోయింది.

ఈ వ్యాస సంకలనంలోని ‘కులం-విప్లవోద్యమ అవగాహన, ఆచరణ’ అన్న వ్యాసం తప్ప మిగిలిన వ్యాసాలు వివిధ సందర్భాలలోని ప్రసంగ వ్యాసాలు. ఈ వ్యాసాలను ఈ సంకలనంలో చేర్చినప్పుడు కొన్నింటిని అప్‌టేడ్‌ చేసాను. కొన్నింటలోి అవసరమైన చిన్న మార్పులు చేసాను.

విప్లవోద్యమం కులాన్ని పట్టించుకోలేదన్న ఆరోపణ, చర్చలకు ఈ వ్యాసాలు కొద్ది మేరకైనా సమాధానం చెప్పగలిగితే, కుల నిర్మూలనకు సంబంధించిన సరైన అవగాహనను పెంపొందించేందుకు దోహద పడగలిగితే ఈ సంకలన ప్రయోజనం నెరవేరినట్టే.

Leave a Reply