కా.రా కధల్లో తొలిదశ కథలన్నీ కొ. కు. ప్రభావంలో వచ్చిన కథలు.బ్రాహ్మణ మధ్య తరగతి మానవ సంబంధాల్ని ట్రీట్ చేసిన కథలివి.అందులో కారా సొంతతనం కనిపించదు.మలి దశ కథల్లోనే కా.రా తనం కనిపించేది. ఇందులో వీరుడు- మహా వీరుడూ, శాంతి,కుట్ర,  భయం,తీర్పు  జీవితం తాలూకు మార్క్సిస్టు  ఆర్ధిక రాజకీయ నైతిక పాఠాల్లాంటివి. ఆర్తి, చావు, నో రూమ్,యజ్ఞం, మరి కొన్ని కధల్లో కుల వాస్తవికతను కేంద్రీకరించి రాశాడు.ఇందులో యజ్ఞం, నోరూమ్ కధల్లో తప్ప మిగతా కధలన్నింటిలోనూ ఆనాటి మార్క్సిస్టు ఆర్ధిక నిర్ణాయక కోణం నుంచి కుల సమస్య ను చూపుతాడు.


‘ఆర్తి’ కథలో దళితుల్ని ఆర్ధిక పీడితులుగా తప్ప ఆత్మగౌరవ మానవులుగా చూపలేకపోయాడు రచయిత. సన్నెమ్మ కాపురం కన్నా ఆమె సంపాదించగల కూలి డబ్బులే ముఖ్యంగా తల్లిదండ్రులు భావించి వాటికోసం వ్యూహాల మీద వ్యూహాలు వేయడం కథలో చూస్తాం.ఎక్కడో ఒకచోట తారసపడే ఇలాంటి విషయాన్ని దళిత జీవితంలో సాధారణంగా జరిగేట్లు చూపించడం ఎంతవరకు సబబు?పేదరికం మానవ సంబంధాల్ని విచ్చిన్నం చేసి వికృతీకరిస్తుందనే ఆర్ధిక నిర్ణాయక వాదాన్ని చొప్పించటానికి దళితుల ఆర్ధిక  సమస్యకు కారణమైన అంటరానితనాన్నీ దానికి ఆలంబనగా ఉన్న కుల సమస్యనూ రచయిత పక్కన బెట్టడం ఈకథలో కనిపిస్తుంది.దళితుల్ని ఆర్ధిక పీడితులగానే తప్ప కుల పీడితులుగా చూడలేని ఆనాటి మార్క్సిస్టు అవగాహనకు లోబడే కా.రా. ఈ కథను రాశాడనే దానికి ఇంతకన్నా ఏ నిదర్శన కావాలి. శ్రమ సొమ్ముగా  లేక సరుకుగా మారే క్రమంలో జరిగే వికృతానికి దళిత వాస్తవికతను వికృతీకరించే సృజనకు ఈ కధ ఇలా దోహదపడింది.ఇదే ఆర్ధిక ఇతివృత్తపు వ్యూహం’చావు’ కథలోనూ కనబడుతుంది.మాలపల్లెలో కుటుంబ సభ్యులంతా పిల్లల్నీ, ముసలమ్మనూ వదిలి పొలం వెళ్ళటం మామూలే.ముసలమ్మ చనిపోయాక  పిల్లల దుస్థితి, పొలం నుంచి తిరిగి వచ్చే కుటుంబ సభ్యుల దయనీయతా వర్ణించడం బాగానే వుంది.ముసలమ్మ చావు వార్త విన్న నారమ్మ మాత్రం శవాన్ని కాల్చడానికి తన కడియాలు అమ్ముకోవాల్సి వస్తుందేమో అని భయపడుతుంది. “గోయిందా .. నా సేతెండి కడియాలు గోయిందా” అని వాపోతుంది.తెల్లారి కూలిపనికి ఆటంకం లేకుండా ఉండటం కోసం ఆ రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేయడానికి కట్టెల్ని దొంగిలించే దానికి పూనుకోవటంలో శవాన్ని పూడ్చి పెట్టే అవకాశాన్ని  కొట్టిపారేయడంలోనూ  ఆర్ధిక వాద సృజన లేదని చెప్పలేం.దీన్ని కప్పిపుచ్చటానికా అన్నట్లు ముసలమ్మ కొడుకు ఎరకయ్య చేత ఒక ముచ్చట చెప్పిస్తాడు కధకుడు. ” ఒక్కోపాలి మాయమ్మ అనీది. అయ్యా నానెప్పుడేనా యీ సలికే సచ్చిపోతాన్రా, ఈ సలి సంకటం తోనే సచ్చిపోతాను.సీతాకాలం – కర్రలెక్కడా దొరకవు.కర్రల్దొరకవనికప్పెట్టీ కిమీ – ఎక్కడేనా కొనే, కాసింత అడుక్కునో , సివరికి దొంగతనవే సేసినా సరే, నన్ను కాల్సీయాల, బండెడు కర్రల్తెచ్చి కాల్చీ – నా యిన్నాళ్ల సలీ కాష్టమ్మీ నైనా కాలిపోవాల అనీది మా యమ్మ” అని ఎరకయ్య చెప్పిన ముచ్చట  రచయిత తన ఆర్ధిక నియతి వాదాన్ని జస్టిఫై చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ఇలా ఈ రెండు కథల్లోనూ దళిత పాత్రల్లో మానవీయ స్పృహ  కంటే ఆర్ధిక స్పృహ ప్రబలంగా ఉన్నట్లు చూపటంలో  రచయిత దళిత వాస్తవికతను తన దృక్పధానికనుగుణంగా ఎడిట్ చేసుకున్నట్లు అర్ధమౌతుంది.


కుల సమస్యను కేవలం ఆర్ధిక సమస్య గా కుదించి చూపిన ఈ ధోరణి 1953లో  రాసిన’ సేనాపతి వీరన్న’ కథనుంచే కనపడుతుంది.నేత పనిజేసే సాలీల జీవితం కధ ఇతివృత్తం. వృత్తిని పట్టించుకోకుండా సాము గరిడీల పిచ్చిలో పడటం వల్ల  నేతగాని జీవితం కూలిపోయినట్లు ఇందులో చిత్రిస్తాడు రచయిత.వృత్తిని విడవకుండా చేసే నేత పనివారంతా బాగా బతుకుతున్నట్లేనా మరి? వెనకబడ్డ కులాలూ, దళిత కులాలూ వాటికి అంటగట్టబడిన వృత్తుల వల్లే ఆర్ధిక లేమిలో కూరుకుపోయింది.ఈ వాస్తవాన్ని వదిలి వృతిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ కులస్తులు నాశనమైనట్లు చూపటంలో వ్యక్తమయ్యేదేమిటి? ‘కుల వృత్తిని మించినది లేదు గువ్వల చెన్నా’ అనే బ్రాహ్మణవాద సామెతను అంగీకరించినట్లేకదా ఇది.


తొలి నాళ్ళలో రాసిన ‘అభిశప్తులు’ కథలో మానవ సంఘర్షణకు మూలాలు కుల భేదాల్లో, లింగ భేదాల్లో, వర్గ భేదాల్లో ఉన్నాయనే దృష్టి వ్యక్తమయ్యింది.’నో రూమ్’ కథలో దళిత జంటకు హోటల్ లో బసకు రూములు కూడా దొరకని పరిస్తితిని వాస్తవికంగా చిత్రించడం ఉంది. అంటరానితనంతో, పేదరికంతో బతికిన గోలీ నూకరాజు కష్టపడి కొంచెం, కొంచెం డబ్బు దాచుకుని తన భార్యతో ఒక్క రోజు లాడ్జింగ్ గదిలో  రోజువారీ కసాటుకు దూరంగా సేద తీరాలనుకోవడంలోని సహజ జీవితేచ్ఛను సహజంగా చిత్రించగలిగాడు.ఇక్కడ కులసమస్యను కేవల ఆర్ధిక సమస్య గా కుదించ లేదు.ఇదే ధోరణి ‘యజ్ఞం’ లోనూ కనబడుతుంది.కుల వ్యవస్థ లో భాగంగా వస్తున్న కంబరితనాన్నీ దాని భయంకర ఆర్ధిక, మానసిక పర్యవసనాల్నీ  సీతారావుడి పాత్ర ద్వారా గొప్పగా పలికించాడు కధకుడు.ఈ కథను నిర్మించే క్రమంలో అనేక అర్ధాల పొరలకు చెందిన అనేక సంకేతాల్ని పొందుపరిచాడు కా.రా. కవిత్వం స్థాయికి ఎదిగిన కధ ఇది.ఆ క్రమంలో అంతంలేని చర్చకు తావిచ్చిన కధ.ప్రపంచ స్ధాయి కథగా నిలిచిపోయింది.అయితే ఈ కథను విశ్లేషించిన మార్క్సిస్టు మేధావులు చాలామంది అందులోని అభివృద్ధి తాలూకు విషాదాన్నీ, వ్యవసాయ రంగ వ్యాపారీకరణనీ తదితర ఆర్ధిక అంశాల చట్రంలోనే విశ్లేషించారు.కథలో చిత్రితమైన  కులవ్యవస్థాధారిత పీడననూ, అన్యాయాన్నీ  మైనర్ అంశంగా పక్కకు నెట్టారు.


కనుక కుల వాస్తవికతను డీల్  చేయడం లో రెండు కధల్లో తప్ప మిగిలిన వాటిలో విఫలమైనట్లుగా అనిపిస్తుంది.

One thought on “కుల సమస్యను చిత్రించడంలో కా.రా. సఫలమా? విఫలమా?

Leave a Reply