విప్లవ రచయితల సంఘం 29వ మహాసభలో పాల్గొనటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనలు!

గత సంవత్సరం జనవరి ఏడవ తేదీన హైదరాబాదులో జరిగిన విరసం అధ్యయన తరగతుల సందర్భంగా ఫాసిజాన్ని అర్థం చేసుకోవడం గురించిన చర్చలో మా అభిప్రాయాలను వివరించిన సంగతి ఒకసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.

ప్రస్తుతం మనం అత్యంత సంక్లిష్ట సంక్షోభ సాంస్కృతిక వాతావరణంలో ఇక్కడ సమావేశమవుతున్నాం. ఇదంతా మన సామాజిక జీవితంలో, ప్రజల రోజువారీ అనుభవంలో ఉన్న సంక్షోభపు వ్యక్తీకరణగా భావించవచ్చు.

75 సంవత్సరాల క్రితపు అర్థవలస అర్థఫ్యూడల్‌ వ్యవస్థనుండి మౌలికంగా తెగతెంపులు చేసుకోగలిగిన నిజమైన ప్రజాస్వామిక మార్పు ఈ దేశంలో సంభవించకపోవడం వల్ల కూడా దినదినం మరింత క్షీణ, పతన విలువలను మన సమాజం చవిచూస్తోంది.

గడచిన 50 ఏళ్లకు పైగా మన దేశంలో క్రైసిస్‌ మేనేజ్మెంట్‌ గవర్నమెంట్స్‌ని మాత్రమే చూస్తున్నాము.

భారత రాజ్యాంగంలోని ప్రజా అనుకూలమైన హక్కులు, ప్రజాస్వామిక రక్షణలు, పౌర స్వేచ్ఛలు , ఆర్టికల్‌ 51 ఏ (హెచ్‌) లాంటి వాటి పట్ల పాలకులకు ఇసుమంత గౌరవం లేదు.

తమకు అవసరమైనప్పుడు చట్టాన్ని ఉల్లంఘించడానికి పాలకవర్గాలు ఎప్పుడూ సిగ్గుపడలేదు. ప్రస్తుత ప్రభుత్వాల విధానాలకు సిగ్గు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది.

కృష్ణా గోదావరి జిల్లాల ప్రాంతంలో గత సంక్రాంతి కాలంలో చట్ట విరుద్ధంగా కోడి పందాలు విపరీతంగా సాగాయని ఏ రాజ్యాంగ పరిరక్షకులకు తెలియదు? పాలకవర్గాలు చట్టాన్ని ఉల్లంఘిస్తే పట్టించుకోని ప్రభుత్వాలు, వారి యంత్రాంగం… ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అంగన్వాడి వర్కర్ల ఆందోళనను అణచివేయచూశారు.

తమ దోపిడీ వర్గాల ప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలనన్నిటిని రాజ్యాంగ విలువగా, ప్రజలు ఆమోదించక తప్పనిదిగా ఉల్లంఘించ వీలులేనిదిగా మారుస్తారు.

బడా కుబేర్లు ఎగగొట్టిన లక్షల కోట్ల రూపాయల అప్పులను పారుబాకిల కింద రద్దు చేయగలరు. కార్పొరేట్‌ పన్నులను తగ్గించి మరెన్నో లక్షల కోట్ల మేళ్ళు వారికి అందించగలరు.

నిజానికి వారు బాగా ఎరిగినది తమ నకిలీ ప్రజాస్వామిక స్వభావాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను బులిబుచ్చే ముసుగుగా రాజ్యాంగాన్ని వాడుకోవడం!!

మెట్టు మెట్టుగా ఎన్నికల వ్యవస్థ దిగజారిపోవడం కొనసాగుతున్న వ్యవస్థీకృత ఆర్థిక, రాజకీయ సంక్షోభానికు ఒకానొక ఫలితమే. ఎన్నికల సందర్భంలో నోట్లను నడిబజారుల్లో పరిచి, మద్యాన్ని కాలువలుగా పారించి ఓట్లను పొందే ప్రక్రియ బహిరంగ రహస్యమే. అంత:సత్యమేమిటంటే అప్రజాస్వామికమైన కులమత తత్వాలు ప్రజాస్వామిక రూపమైన ఎన్నికల ప్రక్రియ ద్వారా బలోపేతం కావడం!!

ప్రజలను భక్తితో పూజించమని వారు అనునిత్యం బోధించే చట్టాలకి కట్టుబడి ఎన్నికలలో విజయం సాధించటం అనేది వారికే కష్టసాధ్యమైనదిగా తయారు చేసుకున్నారు. అందుకే రాజ్యాంగ నిర్ణయక సభ ముగింపు సమావేశంలో అంబేద్కర్‌ వెలుబుచ్చిన మౌలిక ప్రజాస్వామిక విలువలను, మొత్తంగా ఆయన స్ఫూర్తిని నిలువులోతు భూమిలో పాతిపెట్టి, ఆయన మూర్తిని మాత్రం ఆకాశమెత్తు ప్రదర్శిస్తున్నారు.

30 సంవత్సరాల క్రితం ఇలాంటి సంక్షోభానికి సులువైన పరిష్కారం అంటూ… ఆర్థిక రంగంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణను, రాజకీయంగా మతోన్మాద పూరిత ఇస్లామోఫోబియాను, సాంస్కృతికంగా పోస్టుమోడర్నిజాన్ని ఈ పాలకముఠాలే ముందుకు తెచ్చాయి. ప్రజల నడుమ ఉన్న కుల మత ప్రాంతీయ వైరుధ్యాలను విద్వేషాల స్థాయికి పెంచి వారిని అనైక్యపరచి తాము సురక్షితంగా ఈ అసమానతల వ్యవస్థను కాపాడుకోవాలని చూస్తున్నారు.

అయినా సంక్షోభం వెంట సంక్షోభం తలెత్తుతున్న కారణంగా దాని నిర్వహణకు క్రమేణా ఫ్యాసిస్టు లక్షణాలను పెంచుకుంటూ, ఉద్యమించే వివిధ వర్గాల ప్రజలతో పాటు ప్రశ్నించే గొంతులను, అప్రజాస్వామ్యాన్ని ఖండిరచే కలాలను, జర్నలిస్టులను, కవులను, కళాకారులను మేధావులను, హక్కుల కార్యకర్తలను… భయోత్పాతానికి గురిచేస్తూ నిర్బంధాలపాలు గావిస్తున్నారు.

తనతో అధికారానికై పోటీకి నిలిచే పాలకముఠాలపై కూడా వాటిని ప్రయోగించక తప్పనిస్థితికి చేరుకున్నారు.

ప్రతి చారిత్రక మలుపులోనూ సంస్కరణవాదులు సరికొత్త రూపాలతో ప్రజా ఉద్యమాలను మొద్దుబార్చడం అనేది మన అనుభవంలో ఉన్నది.  వీటన్నిటి నడుమ ప్రస్తుత పాలకులు బ్రూట్‌ మెజారిటీతో రోజురోజుకీ చట్టానికి ప్రజావ్యతిరేక కోరలను పెంచుతున్నారు.

ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా నిజమైన ప్రత్యామ్నాయం ఒక్కటే ఉంది! అది సంఘటిత ప్రజాఉద్యమం మాత్రమే!! దానిపై ప్రజలలో విశ్వాసం కలిగించటానికి గల సమస్త అవకాశాలను వినియోగించుకోవడం ప్రజా ఉద్యమకారుల పద్ధతి.

సంఘటిత ప్రజా ఉద్యమంపై అలాంటి విశ్వాసం ప్రజలకు కలగాలంటే వారి జీవన సంఘర్షణ వ్యక్తిగత స్థాయి నుండి సామాజిక రూపాన్ని సంతరించుకోవలసి ఉంటుంది. అందుకు భావజాల రంగంలో సాంస్కృతిక రూపాలలో కృషి సాగించవలసిన రచయితలు కళాకారులమైన మనం, ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడం నుండి సామ్రాజ్యవాద ప్రపంచీకరణను వ్యతిరేకించే స్థాయి దాకా వారిని చైతన్యవంతం కావించటం మన కర్తవ్యం చేసుకోవాలి. అది అడవుల నుండి మహానగరాల దాకా, కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా జరగాల్సి ఉంది.

నేటి ప్రత్యేక పరిస్థితులలో మనకు సాంస్కృతిక వారసత్వంగా కొనసాగుతూ వస్తున్న మతసామరస్యపు వివిధ ప్రాంతాల వాస్తవిక అనుభవాలను ప్రజల దృష్టికి విస్తృతస్థాయిలో తీసుకు వెళ్లాలి. ప్రజల మత విశ్వాసాలను గాయపరచకుండా మతోన్మాదపు ప్రమాదాన్ని వారికి సున్నితంగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఫాసిస్టు భావుకులు మాత్రమే అన్య మత ద్వేషాన్ని తమ మతంగా వ్యాప్తి చేస్తారనే వాస్తవం ప్రజలకు అర్థం చేయించడం మన ప్రస్తుత కర్తవ్యాలలో మరొకటి.

సాహిత్యం ద్వారా, జీవన సంక్లిష్టతలను, అస్పష్టతలను పాఠకులు సుస్పష్టంగా అర్థం చేసుకునేట్లు రచనలు చేసే కర్తవ్యం సాహిత్యకారులది అని ఒక సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు గారు అన్నారు.

ప్రజల నడుమ విద్వేషాలు పెంచే మతోన్మాద కేంద్ర పాలకులు అనుసరిస్తున్న విధానాల లోగుట్టును ప్రజలకు అర్థం చేయించడం మన తక్షణ ఉద్యమ కర్తవ్యం. సంఘటిత ప్రజాఉద్యమ ప్రత్యామ్నాయంకై భావజాల రంగంలో కృషిసల్పటం మన కీలక బాధ్యత.

ఆ కృషిలో విరసం మరింత చురుకుగా కదులుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ

29వ విరసం మహాసభ విజయవంతం కావాలని జనసాహితి మనస్ఫూర్తిగా కోరుకుంటోంది…

విప్లవాభివందనలతో

 అధ్యక్షుడు, జనసాహితి,

విజయవాడ, 28 జనవరి 2024

Leave a Reply