(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట )

ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వం-4లో అభివృద్ధి విధ్వంసాల మాయాజాలాన్ని వివరించే వ్యాసాలు ఉన్నాయి. బహుశా ఈ సంపుటిలోకి ఇంకొన్ని వ్యాసాలు కూడా తీసుకరావచ్చనిపించింది. వాటిలో అభివృద్ధి విధ్వంసాల గురించి ఉన్నప్పటికీ నిర్దిష్టంగా హక్కుల విశ్లేషణే ప్రధానంగా ఉన్నది. వాటిని హక్కుల ఉద్యమ వ్యాసాల్లో చేర్చితే బాగుంటుందనిపించి ఇక్కడికి తీసుకరాలేదు. ఈ వ్యాసాల్లో శేషయ్యగారు అభివృద్ధి విధ్వంసాలను మానవ జీవితంలోని అనేక కోణాల్లో వివరించారు. ఘటనలు, పరిణామాలు, వివరాలు, లెక్కలు, ముఖ్యంగా పాలకుల ఆర్భాట ప్రకటనలు, వాళ్ల ప్రకటిత ఉద్దేశాలు, వాటికి భిన్నంగా వాళ్లు చేసే పనులు వగైరా ఎన్నో వైపుల నుంచి ఇందులో విశ్లేషణ సాగుతుంది. వీటన్నిటి అంతరార్థంగా భారత పాలకులు కొనసాగిస్తున్న రాజకీయార్థిక విధానాల మీద ఫోకస్‌ ఇస్తారు. ఒక బలమైన రాజకీయార్థిక విశ్లేషణకు శేషయ్యగారు పాలకులు చేపడుతున్న అభివృద్ధిని సందర్భంగా తీసుకున్నారు. దానికి ఉన్న అనేక కోణాలను చర్చనీయాంశం చేశారు. అనంతపురం కరువు దగ్గర ఆరంభించి అమరావతి రాజధాని దాకా, సింగరేణి ఓపన్‌ కాస్ట్‌ విధానం దాకా వేర్వేరు రూపాల్లో అభివృద్ధి విధ్వంసాలు ఎట్లా జరుగుతున్నాయో వివరిస్తారు.

పాలకవర్గ విధానాల ‘అభివృద్ధి’ సారమంతా విధ్వంసమే. దీనికి మూలం పెట్టుబడిలో ఉన్నది. శ్రమకు`పెట్టుబడికి మధ్య ఉన్న వైరుధ్యంలో భారత పాలకవర్గం మొదటి నుంచీ పెట్టుబడిదారుల పక్షాన తన విధానాలను రూపొందిస్తూ వచ్చింది. దీన్నంతా అభివృద్ధి అని ప్రచారం చేసుకుంటున్నది. దీని మాటున విధ్వంసం సాగుతూ ఉన్నది. అసమానత, దోపిడీ, విధ్వంసం అనే లక్షణాలు పెట్టుబడికి ఉన్నాయని తెలిసిన రాజకీయార్థికవేత్తలు మాత్రమే పెట్టుబడి కేంద్రంగా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధిని గురి చూడగలరు.

ప్రొ.శేషయ్యగారు భారతీయ పెట్టుబడిని, దాని స్వభావాన్ని కేంద్రం చేసుకొని హక్కుల ఉల్లంఘనను విశ్లేషిస్తారు. హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచినంత మాత్రాన వాటికవే ప్రజల అనుభవంలో భాగం కావు. సమాజంలో దోపిడీ సంబంధాలు కొనసాగుతూ ఉన్నంత వరకు రాజ్యం తటస్తంగా ఉండదు. దానికి ఉండే వర్గ స్వభావం వల్ల  రాజ్యాంగం ప్రకటించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యమైనది ప్రభుత్వ అభివృద్ధి విధానాల పర్యవసానమైన విధ్వంసం వల్ల కలిగే  హక్కుల ఉల్లంఘన. పెట్టుబడి కేంద్రీకరణ, వనరుల దోపిడీ, అసమానంగా సంపద పంపిణీ, అభివృద్ధి పేరుతో సాగే విస్తాపన, విధ్వంసం మొదలైన వాటి కిందపడి ప్రజల కనీస హక్కులన్నీ ధ్వంసమైపోతాయి. ఆదివాసులు, దళితులు, చేతివృత్తులవారు, చిన్న సన్నకారు రైతులు, కార్మికులు ఉపాధి హక్కులు కోల్పోతారు. చివరికి జీవించే హక్కుకు కూడా దూరమవుతారు. పాలకుల అభివృద్ధి ప్రక్రియలన్నీ సారాంశంలో హక్కుల విధ్వంసానికి దారి తీస్తాయి. సామాజిక, సాంస్కృతిక సంబంధాల్లోని అసమానత, వివక్ష వల్ల జరిగే హక్కుల ఉల్లంఘనను ఈ విధ్వంస ప్రక్రియలు మరింత జటిలం చేస్తాయి.

ప్రొ. శేషయ్యగారి హక్కుల దృక్పథం రాజ్యాంగ ఆదర్శాల వెనుక ఉన్న రాజ్యం, దాని రాజకీయార్థిక విధానం దాకా విస్తరించి ఉంటుంది. రాజ్యాంగంలో ఉన్న హక్కులు అమలులోకి రాకుండా పెట్టుబడి కేంద్రంగా సాగే అభివృద్ధి విధానాలు అడ్డుకుంటాయి. సమానత్వం అనే పునాది సమాజంలో ఏర్పడనంత వరకు ఈ సమస్య ఉంటుంది. కులం, పితృస్వామ్యం, మతం వంటి సామాజిక సాంస్కృతిక అసమానతలను సహితం రాజకీయార్థిక విధానాల వల్ల ఎప్పటికప్పుడు తలెత్తే కొత్త అసమానతలు మరింత జటిలం చేస్తుంటాయి. అందువల్ల  హక్కుల గురించి మాట్లాడటమంటే సారాంశంలో అనేక రకాల అసమానతల గురించి మాట్లాడటమే. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేసే పనులు కొత్త కొత్త అసమానతలను సృష్టిస్తూ ఉంటుందని గత నలభై యాభై ఏళ్ల చరిత్ర రుజువు చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో రాజకీయార్థిక ఉద్యమాలు జరుగుతున్నట్లే హక్కుల ఉద్యమం కూడా జరుగుతున్నది. అందులో పౌరహక్కుల సంఘం భాగస్వామ్యం కూడా ఉన్నది. దానికి గుర్తించాల్సిన పాత్ర ఉన్నది.

ఆ సంగతిని నిరూపించే వ్యాసాలు ఈ సంపుటిలో ఉన్నాయి.

పెట్టుబడి తీసుకొచ్చే అసమానతలను పౌరహక్కుల ఉద్యమం ప్రాంతాల మధ్య కూడా చూసింది. మామూలుగా వెనుకబడిన ప్రాంతాలని, అభివృద్ధి చెందిన ప్రాంతాలని అంటూ ఉంటారు. నిజానికి కొన్ని ప్రాంతాలు ఎందుకు వెనుకబడ్డాయి? కొన్ని ఎందుకు ముందుపడ్డాయి? అనే చర్చలోకి వెళ్లితే పాలకుల రాజకీయార్థిక విధానాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, అప్పుడూ ఆ తర్వాతా రాయలసీమ,

ఉత్తరాంధ్ర, పల్నాడు, ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాలు వెనుకబాటుతనానికి గురయ్యాయి. కొన్ని ప్రాంతాలు శాశ్వత కరువు పీడిత ప్రాంతాలుగా మిగిలిపోయాయి. కరువు ప్రకృతి సమస్య అనేది పాతకాలపు అవగాహన. దానికి ఎన్నడో కాలం చెల్లిపోయింది. కరువు ఏ రంగంలో కూడా సమానత్వానికి అవకాశమే లేకుండా చేస్తుందనే అవగాహన ముందుకు వచ్చింది.

సమానత్వాన్ని ఒక విలువగా భావించే పౌరహక్కుల ఉద్యమం వ్యక్తులు, సమూహాలు, స్త్రీ పురుషుల మధ్యేగాక ప్రాంతాల మధ్య, జాతుల మధ్య కూడా సమానత్వాన్ని కోరుకుంటుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల వైపు నుంచి దీన్నంతా విశ్లేషిస్తుంది. ఒక ప్రాంతం, ఒక వర్గం, ఒక కులం అభివృద్ధి కేంద్రంగా ప్రభుత్వ విధానాలు ఉన్నంత వరకు అనేక విధ్వంస పరిణామాలు జరుగుతాయి. కంటికి కనిపించని అసమానతల మధ్య ప్రజల జీవితం దెబ్బతింటుంది. పౌర ప్రజాస్వామిక హక్కులు అడుగంటిపోతాయి. హక్కులు లేకుండా ప్రజాస్వామ్య సమాజమని చెప్పుకోడానికి దేశం అర్హత కోల్పోతుంది.

అభివృద్ధి, విధ్వంసం అనేవి పౌరహక్కుల విధ్వంసం దగ్గర మొదలై సమాజ ప్రజాస్వామికీకరణకే తీవ్ర ప్రతిబంధకంగా మారుతాయి. ప్రొ. శేషయ్య ఈ విశాలమైన అవగాహనతో తనకు చిర పరిచితమైన అనంతపురం కరువు దగ్గర విశ్లేషణను ఆరంభించారు.  అభివృద్ధి పేరుతో సాగే విధ్వంసాన్ని కరువులో చూడటంలోనే ఆయన ప్రత్యేకత ఉంది. పెట్టుబడికి ఉండే అనేక విధ్వంసరూపాల్లో కరువు చాలా తక్కువ చర్చనీయాంశం అవుతూ ఉంటుంది.  కరువును ప్రకృతి సమస్యగా కొందరు చూస్తారు. దాన్ని పెట్టుబడి వైపు నుంచి చూడాలని శేషయ్యగారు అంటారు.

ఈ విశ్లేషణను ‘కరువు నివారణకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?’ అని సెప్టెంబర్‌`అక్టోబర్‌ 1993లో స్వేచ్ఛలో రాసిన వ్యాసంతో ఆయన ఆరంభించారు. దాన్ని మరింత ముందుకు తీసికెళుతూ ‘కరువు పెట్టుబడిదారుల లాభాల వేటలో సృష్టించిన సమస్య’ అనే ఒక ముఖ్యమైన సూత్రీకరణ చేశారు. ఈ వ్యాసాన్ని ఫిబ్రవరి 1998 అరుణతారలో రాశారు. ఇక్కడి నుంచి   రైతుల ఆత్మహత్యలు,  ప్రాంతాల వెనుకబాటుతనం, విస్తాపన, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఓపన్‌కాస్ట్‌ విధ్వంసం మొదలైన వాటన్నిటినీ విశ్లేషించారు.

హత్యల రూపంలోనేగాక ఆత్మహత్యల రూపంలో కూడా జీవించే హక్కు రద్దవుతుందనే ఎరుక మన సమాజాన్ని చాలా సెన్సిటైజ్‌ చేసింది. లాకప్‌లో ఆత్మహత్యల దగ్గరి నుంచి రైతుల, గృహిణుల ఆత్మహత్యల దాకా జీవించే హక్కు ధ్వంసమైపోతోంది. ఇది అక్కడి నుంచి బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు, ప్రేమికులు, ఖాయిలాపడ్డ పరిశ్రమల కార్మికులు.. ఒకటేమిటి నిండుగా జీవించాల్సిన మానవ సముదాయాలన్నిట్లో ఆత్మహత్య ఒక విషాదకరమైన ముగింపుకు దారి తీస్తున్నది. వ్యక్తి తనను తాను రద్దు చేసుకొనే  విషాదానికి సమాజం కారణం. అందుకే శేషయ్యగారు అనంతపురం రైతుల ఆత్మహత్యలకు కారకులు ఎవ్వరు? అనే వ్యాసంలో అనేక విషయాలు చర్చనీయాంశం చేశారు. ఒక పక్క కళ్లుమిరుమిట్లు గొలిపే అభివృద్ధి జరుగుతోంటే వెనుకబడిన ప్రాంతాల్లో కరువులు, వలసలు, రైతుల ఆత్మహత్యలు ఏమిటి? ఏ అభివృద్ధిలోని విధ్వంసం దీనికి కారణం? అనే మౌలిక ప్రశ్న దగ్గరికి వెళ్లకపోతే మనకు జీవించే హక్కు ఎంత విలువైనదో అర్థం కాదు.

కరువువాతనపడ్డ ప్రాంతాలను బాగు చేయడానికి అక్కడ వనరులు లేవనీ, అవకాశాలు లేవనీ, కేవలం ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద బతుకీడ్చాల్సిందేనని కొందరు అంటారు. అట్లాగే పెద్ద పెద్ద డ్యాములు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, రాజధాని కోసం అమరావతి వంటి మహానగర నిర్మాణం మొదలైన వాటి వల్ల జరిగే విధ్వంసం అనివార్యమని, అభివృద్ధి కావాలంటే ఈ మాత్రం రిస్క్‌ తీసుకోవాల్సిందేనని మరి కొందరు అంటారు. ఇవి పాలకవర్గ అభివృద్ధిని సమర్థించే వాదనలు. ఇందులో సమానత్వానికి, హక్కులకు తావు లేదు.

ఇలాంటి వాదనలను శేషయ్యగారు శక్తివంతంగా తిప్పికొట్టారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు న్యాయం చేయాలని చెబుతూ నిర్దిష్టంగా ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశాలు ఏమున్నాయో వివరిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలన్నిటినీ రాజధాని అమరావతి చుట్టూ తిప్పి, ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ రాజధానిగా అమరావతిని నిర్మించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెప్పుకున్నప్పుడు శేషయ్యగారు ఈ ప్రచారాన్నంతా తిరగేసి వాస్తవాలు చూపిస్తారు. పౌరహక్కుల సంఘం తరపున ఒక వివరమైన బుక్‌లెట్‌ను ప్రచురిస్తూ దానికి ‘రాజధాని మాయాలోకంలో హక్కులు అదృశ్యం’ అనే శీర్షిక పెట్టారు. దీన్నిబట్టి ఆయన అమరావతి అనే అభివృద్ధి వెనక ఉన్న విధ్వంసాన్ని ఎట్లా ఎత్తి చూపారో ఊహించవచ్చు. కార్పొరేట్‌ శక్తుల కోసం చేపట్టే అభివృద్ధిని ప్రజల కోసమని, జాతి కోసమని చాటుకొనే పాలకుల నైజాన్ని గుర్తించినప్పుడే ఇంత పదునైన విశ్లేషణ సాధ్యమవుతుంది. ఆ నైజం వ్యక్తులకు సంబంధించింది కాదని, కార్పొరేట్‌ ఆర్థిక వ్యవస్థ స్వభావమని ఆ విస్తృత వ్యాసం చదివితే మనకు అర్థమవుతుంది.

అంతక ముందు ‘అభివృద్ధి-విధ్వంసం’ అనే శీర్షికతో వైస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల సందర్భంలో సంస్థ తరపున ఒక బుక్‌లెట్‌ రాశారు. దానిలో అంతకముందున్న చంద్రబాబు నాయుడు ప్రపంచబ్యాంకు అభివృద్ధి విధ్వంస విధానాల కొనసాగింపును అనేక రంగాల వైపు నుంచి వివరిస్తారు. అభివృద్ధి, విధ్వంసం అనేవి అణచివేత రూపంగా, రాజ్యహింసగా మారుతాయి. ఈ వైపు నుంచి కూడా శేషయ్యగారు హక్కుల ఉల్లంఘనను లోతుగా వివరించే ప్రయత్నం చేస్తారు. పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణల సమాచారాన్ని, దేశం మొత్తానికి వర్తించే క్షేత్రస్థాయి సూక్ష్మ చలనాలను కలిసి చాలా చోట్ల అద్భుత విశ్లేషణ ఇచ్చారు. దీనికి  ఆయన ఆధ్యయనం కూడా అంతే దోహదం చేసింది.

ఈ మూడింటి  కలయిక వల్ల శేషయ్యగారి వ్యాసాలు క్షేతస్థాయి నుంచి సిద్ధాంత  స్థాయికి విస్తరిస్తాయి. ప్రజల అనుభవాలు, గణాంకాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కలిసి పాఠకులకు ఆసక్తిదాయకమైన, జ్ఞానదాయకమైన శైలిని సంతరించుకున్నాయి. 

మొత్తంగా ఈ వ్యాసాలను పౌరహక్కుల ఉద్యమ వికాస క్రమంలో  చూడాలి. అప్పుడు ఆ రెండూ వేర్వేరు కాదని కూడా తెలుస్తుంది. ఆయన చాలా ఉద్దేశపూర్వకంగా పౌర హక్కుల దృక్పథాన్ని, కార్యరంగాన్ని విస్తృతం చేయడానికి ఈ వ్యాసాలు రాశారు. సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను హక్కుల కోణంలో చూడటం, తద్వారా హక్కుల ఉద్యమ అవగాహనను పెంచడం, ఈ క్రమంలో సమాజంలో హక్కుల చైతన్యాన్ని పెంచడం, మొత్తంగానే ప్రజా ఉద్యమాలన్నీ బలోపేతం కావడానికి అవసరమైన క్రియాశీల ఆవరణను సిద్ధం చేయడం.. అనే బహుముఖీన లక్ష్యంతో ఆయన ఈ రచనలు చేశారు. వ్యక్తిగా, హక్కుల సంఘం నాయకుడిగా, మేధావిగా ఆయన ప్రజా జీవితానికి, దాన్ని ఉన్నతీకరించే ప్రజా ఉద్యమాలకు సన్నిహితంగా ఉన్నందు వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఆయన గురించి మాట్లాడుకోడానికి ఆయన రచనల సంపుటీకరణ ఒక సందర్భమేగాని, వాస్తవానికి తెలుగు సమాజాల అభివృద్ధి వికాసాల నుంచి, పోరాట ఆరాటాల నుంచి, విలువల చర్చ నుంచి, ఉద్యమాల అటుపోట్ల నుంచి వేరు చేసి చూడలేం.

హక్కుల విశ్లేషణను రాజకీయార్థిక స్థాయికి శేషయ్యగారు తీసికెళ్లారనడానికి ఈ సంపుటిలోని వ్యాసాలు ఒక ఉదాహరణ. బహుశా రాజకీయార్థిక కోణం లేని వ్యాసాలు ఆయన రచనల్లో చాలా తక్కువే.ఆయన రచనా సర్వస్వానికి ఉన్న ఈ కోణాన్ని ఈ సంపుటిలో కూడా చూడవచ్చు.

పాలకులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటే, అభివృద్ధి విధానాలు చేపడుతున్నారంటే విధ్వంసం సృషిస్తున్నట్లే.. అనే సాధారణ అవగాహన నుంచి ఈ వ్యాసాలను చదివితే అనేక సూక్ష్మ విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా హక్కుల భావజాలాన్ని ఎంత సూక్ష్మ రూపంలో స్వీకరించాలో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే ఈ సమాజాన్ని మానవీయం చేయడం, ప్రజాస్వామ్య సంస్కృతి దిశగా నడిపించడం సాధ్యం అవుతుంది. అందులో భాగంగా హక్కుల ఉద్యమ పాత్రను పునరంచనాలు వేసుకోవడానికి, హక్కుల ఉద్యమం పునస్సంఘటితం కావడానికి దారి దీపంలా ప్రొ. శేషయ్యగారి ప్రాపంచిక దృక్పథం వెలుగులను అందిస్తుంది.

ఈ వ్యాసాలను డిటిపి చేసిన రంగనాయకులు, పుస్తక రూపంలోకి తెచ్చిన వై. రామచంద్రం, ప్రూఫ్‌ రీడిరగ్‌ పని చేసిపెట్టిన  కవి, రచయిత, మానవతా రక్తదాత సంస్థ కన్వీనర్‌ తరిమెల అమరనాథ్‌రెడ్డి, అట్లాగే ఆ సంస్థ కో కన్వీనర్‌ కె. సలీంమాలిక్‌, మమత రక్తదాతల సంస్థ కో కన్వీనర్‌, ఇంజనీరింగ్‌ కాలేజీ అసోసియేట్‌  ప్రొ. ఎన్‌ నవీన్‌గార్లకు, ఈ పుస్తకాన్ని అచ్చేసి పుస్తక రూపంలో అందించిన కర్షక్‌ ప్రెస్‌ (హైదరాబాదు)యాజమన్యానికి, కార్మికులకు ధన్యవాదాలు.

Leave a Reply