అమరుల త్యాగాలను స్మరించుకోవడం చట్ట వ్యతిరేకమైపోయిందా?

అమరుల బంధుమిత్రుల సంఘం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధాన్ని వ్యతిరేకించండి


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరుల బంధు మిత్రుల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది. గత నెల 30వ తేదీ తయారు చేసుకున్న జీవో 73ను ఏప్రిల్ 28న విడుదల చేసింది. ఈ ప్రకటన మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. పాలకుల దుర్మార్గం మాకు చాలా బాగా తెలుసు. మా కన్న బిడ్డల్ని, సహచరుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం వెంటాడి హత్య చేస్తే, ఆ దు:ఖాన్ని మోస్తూ జీవిస్తున్నవాళ్లం. మాకు ఈ వ్యవస్థ, రాజ్యం ఎంత అమానుషమైనవో స్పష్టంగానే తెలుసు. కానీ మాలాంటి వాళ్లం గుంపై మా వాళ్లను తలుచుకొని కన్నీరు కార్చి గుండెబరువు తీర్చుకోవడం, ఒకరిని ఒకరం ఓదార్చుకోవడం చట్ట వ్యతిరేకం అనడం కంటే అమానుషం ఏముంటుందని ఇప్పుడు అనిపిస్తోంది. ఆత్మీయులను కోల్పోయిన దు:ఖం ఒక్కటే మా సంస్థ ఏర్పాటకు, ఉనికికి ఆధారం. పిల్లల్ని కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రుల కడుపు కోత నుంచి అమరుల బంధు మిత్రుల సంఘం 2002 జూలై 18న ఆవిర్భవించింది.

విప్లవకారుల రాజకీయ ఆచరణతో మాకు ఏ సంబంధం లేదు. ఏనాడో వాళ్లు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్లను ఈ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వెంటాడి హత్య చేసింది. వాళ్లను చంపడానికి కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి, అనేక వ్యవస్థలను ఏర్పరిచి అమానుషంగా నిర్మూలిస్తున్నది. రక్త సంబంధీకులుగా వాళ్ల మృతదేహాలు అనాథ శవాలుగా కడతేరి పోకూడదని అనుకున్నాం. మేం జీవించి ఉన్నాం కాబట్టి వాళ్ల భౌతిక కాయాలకు మానవ గౌరవం దక్కాలని అనుకున్నాం. ఒక విశ్వాసం కోసం వాళ్లు ప్రాణ త్యాగం చేశారు. దాని పట్ల మాకు గౌరవం ఉంది. అందుకే ఏబీఎంఎస్ ఏర్పడ్డాక వందలాది మంది విప్లవకారుల మృతదేహాలను కుటుంబ సభ్యులతో కలిసి మా సంస్థ స్వాధీనం చేసుకున్నది. గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించింది.

సుమారు ఇరవై ఏళ్లుగా మేం చేస్తున్న పని విప్లవకారుల అంత్యక్రియలు నిర్వహించడం. వీలుంటే కుటుంబ సభ్యులు స్థూపాలు నిర్మించుకోడానికి సాయం చేయడం. వాళ్లు చనిపోయిన రోజు కాసిని పూలు చల్లి గుర్తు చేసుకోవడం. బహుశా విప్లవకారులకే కాదు, మనుషులందరికీ మరణానంతరం దక్కే గౌరవం ఇది. చాలా సహజమైనది. మానవులు మాత్రమే తమ నుంచి వెళ్లిపోయిన బంధువులపట్ల మిత్రులపట్ల నిర్వర్తించే కర్తవ్యం ఇది. చనిపోయినవారిపట్ల చేసే ఈ పనే బతికి ఉన్న వాళ్లను మనుషులని నిరూపిస్తుంది. ఈ పని చట్ట వ్యతిరేకం ఎలా అవుతుంది?

మా సంస్థ పనులను జీవో 73లో తెలంగాణ ప్రభుత్వం సీపీఐ మావోయిస్టు వ్యూహం, ఎత్తుగడల్లో, అర్బన్ గెరిల్లా పనుల్లో భాగమని అరోపించింది. చనిపోయిన బిడ్డలకు తలకొరివి పెట్టడం, కడుపులోని దు:ఖం తీరేదాక ఏడవడం, వాళ్ల జ్ఞాపకంగా స్థూపం కట్టుకోవడం సీపీఐ మావోయిస్టు వ్యూహంలో, ఎత్తుగడల్లో, అర్బన్ టాక్టిక్స్ లో భాగమని మాకు తెలియదు. నేరమని అసలే తెలియదు. మనుషులు అందరూ మానవత్వంతో చేసే పనులే అనుకున్నాం. మా రక్తసంబంధీకులకు బలమైన రాజకీయ విశ్వాసాలే ఉండవచ్చు. లేకపోతే మమ్మల్ని వదిలి ఎలా జనంలోకి వెళ్లి తారు? అంత మాత్రాన వాళ్ల హత్య తర్వాత మేం మా పిల్లల విశ్వాసాలకు తగినట్లు, మా సంబంధాలకు తగినట్లు మేం అంత్యక్రియలు చేయకుండా ఎలా ఉంటాం? అసలు ఇది విశ్వాసాల సమస్య మాత్రమే కాదు. ఇది మానవ నాగరికత అనుకుంటున్నాం. మానవ సంస్కృతిలో భాగం అనుకుంటున్నాం. తమ కళ్లెదుటే పిల్లల్ని చంపేసే ప్రభుత్వం మీద తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా ఎలా ఉంటారు? రక్త సంబంధీకుల దు:ఖంలోంచి వచ్చే ధర్మాగ్రహం మావోయిస్టు వ్యూహం, ఎత్తుగడల్లో భాగమని మేం అనుకోలేదు.

అమరుల బంధు మిత్రుల సంఘం చేసే ఈ మానవ సహజమైన పనులు తల్లిదండ్రులను కూడా నేరపూరితమని, చట్ట వ్యతిరేకమని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించవచ్చేమోగాని మా దు:ఖాన్ని చట్ట వ్యతిరేకమని అనగలదా? దీనికి ప్రభుత్వం దగ్గర చట్టాలేమైనా ఉన్నాయా? ఇరవై ఏళ్లుగా మా సంస్థ ఒక్క చట్ట వ్యతిరేక కార్యకలాపం చేయలేదు. విప్లవకారుల శవాలను ఊళ్లలోకి, జనం మధ్యకు తెచ్చిన ప్రతిసారీ మృతదేహాలే నోరు విప్పి ఈ ప్రభుత్వ చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఎలుగెత్తి చాటుతున్నాయి. ప్రభుత్వం ఎంత పాశవికంగా హత్యలు చేస్తున్నదో మేం తీసుకొచ్చుకున్న మా కుటుంబ సభ్యుల శవాలు చెబుతున్నాయి.

అందుకు మొదటి నుంచి అమరుల బంధు మిత్రుల సంఘం మీద ప్రభుత్వం కక్ష కట్టింది. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల్ని, కన్నవారిని కోల్పోయిన పిల్లల్ని అనేక రకాలుగా వేధించింది. కేసులు పెట్టింది. జైళ్లపాలు చేసింది. అయినా ప్రభుత్వం మా పిల్లలను, కుటుంబ సభ్యులను హత్య చేస్తున్నంత కాలం మాకు శవాల స్వాధీనం తప్పదు. అంత్యక్రియలు తప్పదు. ఈ పనులను చట్ట వ్యతిరేకమని ప్రభుత్వం తెచ్చిన జీవోను మేం న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొంటాం. గత ఇరవై ఏళ్లుగా మా కన్నీటిలో, కడుపు కోత దు:ఖంలో, మా వ్యక్తీకరణలో, మా ఆగ్రహ ప్రకటనలో భాగమైన సమాజం తప్పక ఈ న్యాయ పోరాటంలో కూడా అండగా ఉంటుందనే నమ్మకం మాకు ఉంది. ఈ నిషేధపు చీకట్లను అమరుల బంధు మిత్రుల సంఘం, మిగతా ప్రజా సంఘాలు తప్పక తొలగించుకుంటాయి. ఈ అప్రజాస్వామిక జీవో రద్దవుతుందని ప్రకటిస్తున్నాం.

శాంత(ఉపాధ్యక్షురాలు)
పద్మకుమారి(కార్యదర్శి)
భవాని(సహాయ కార్యదర్శి)
లక్ష్మణరావు (సహాయ కార్యదర్శి)
సత్య (కార్యవర్గ సభ్యురాలు)
కోదండరావు(కార్యవర్గ సభ్యుడు)
ఆంటోని(కార్యవర్గ సభ్యుడు)


– అమరుల బంధుమిత్రుల సంఘం

Leave a Reply