“You need a body to preserve your soul, not a set of abstract principles.”― Ahmed Mostafa

చాలా విరామం త‌ర్వాత మ‌ళ్లీ.  క‌విత్వంలోంచి, క‌విత్వంలోకి.  జీవితంలోకి.  ఒకింత ధైర్యంతో  పునః ప్రారంభిస్తున్నాను. శివారెడ్డిగారి గారి కవితను నాకున్న పరిమితులలో మీతో పంచుకోవడం. అదీ ఒక కవితా సంపుటిలోంచి ఒక్క కవితనే. తనొచ్చిన దారిని మరువని వ్యక్తిత్వంతో అదే వాక్యంతో అదే గొంతుతో నిరంతరం జ్వలించడం, అక్షరాకాశంలో  మెరవడం శివారెడ్డి గారి సొంతం. ఇది తనకు తానుగా ఏర్పరచుకున్న దారి. ఆ దారిలో అనేక కొత్త పుంతలను చూపుతూ నడిపించడం తన ప్రత్యేకత. తనకు తానుగా ఎప్పుడూ ఇది ఇలా నడవాలి అని చెప్పకుండానే తన దారిలో నడిపించుకు పోవడం తనకు తెలిసిన మార్మికత. మనకు మన దారి మూసుకుపోయినట్లు ఊపిరాడనితనం వెంటాడే సమయంలో తన వాక్యాన్ని తెరచి అలా నడుచుకుంటూ పోతే ఓ కొత్త ఉదయం ఎప్పుడూ ఆవిష్కృతమవుతుంది. ఇది నా అనుభవం.  అలా ఈనాటి ఈ సందర్భంలో ఉక్కపోత కాలంలో నిర్బంధ రుతువులో ఈ వాక్యాలు మనకు ఒక స్ఫూర్తినందిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. మనకి మనం నిస్పృహకో నిరాశకో లోనయినప్పుడు పాత గద్దర్ గొంతులో లీనమయితే మరల గొప్ప భరోసాను పొందుతాం. అలాగే కవిత్వంలోపలికి ప్రయాణించిన వేళ కూడా.  

చాలా సరళంగా సాగే ఈ వాక్యాలు స్వేచ్చ ఆవశ్యకతను ఎంతలా ప్రతిఫలిస్తాయో చూడండి.

కొంచెం స్వేచ్చ గావాలి
రెక్కలల్లార్చటానికి
చినుకుపడ్డ రెక్కల్ని విదల్చటానికి
ముక్కుతో ఈకల్ని సరిదిద్దుకుంటానికి

ఈ కాలు ఇలా ఆ కాలు అలా చాచటానికి-

దేశమే జైలుగా మారి ఆలోచనలు కూడా ఆ గోడలు దాటి రాని ఈ సమయంలో ఈ కవిత చదువుతుంటే ఆ పదహారు మందితో పాటు అభం శుభం తెలియని ఆ చట్టమేంటో దాని పరిధులేంటో కూడా తెలియని అమాయక ఆదివాసీలు వేలాదిమంది అలా ఆ జైళ్ళ గోడల మధ్య మగ్గుతూ వున్న అసందర్భ సందర్భంలో ఎంత అసహజ వాతావరణంలోకి నెట్టి వేయబడి మాటలకందని వేదనలో తమ వాళ్ళకు దూరంగా ప్రాణాలను నిలుపుకొని స్వేచ్చ కోసం ఎదురుచూస్తున్న వారిని కళ్ళముందు కట్టినట్లుంటుంది కదా? వీల్ చైర్ కు పరిమితమయిన వాణ్ణి కూడా ఒదలలేని పిరికితనంతో రాజ్యం వెంటాడుతూ అనారోగ్యానికి గురయ్యేట్టు చేసి ఎనభై ఐదేళ్ళ పండు ముసలి వారిని కూడా మరణశయ్యపై పడుకోబెట్టి ఊపిరాపిన పాలకుల కుట్రకు అంతం లేకుండా పోతున్న సమయంలో స్వేచ్చ గావాలి అని నినదించడం నేరమవుతున్నది కదా?


“టప్” మని ఒక చినుకు నెత్తిమీద పడితే
తలపైకెత్తి చెట్ల ఆకులకేసి చూడటానికి-
మహా మృదువుగా గాలి వీస్తే 
ముకుపుటాలు పెద్దవి చేసి
కళ్ళతో గాలి పీల్చటానికి-
కొంచెం స్వేచ్చగావాలి
మనిషిని మనిషని చెబటానికి
పశువుని పశువని చెబటానికి
కొంచెం స్వేచ్చగావాలి
రాత్రిని రాత్రని చెబటానికి
పగటిని పగలని చెబటానికి-

సత్యాన్ని చెబటానికి కొంచెం స్వేచ్చగావాలి గదా? సామాన్య మానవునిలా ఈ పాడుకాలం అని మూల్గడానికి కూడా కొంచెం స్వేచ్చగావాలి గదా? ఈయన మనిషి మా మనిషి నువ్వెందుకు నిర్బంధించావని అడగలేని సమయంలో,ఇది మా తిండి మేమిదే తినగలం మాకిదే కావాలని తినేందుకూ కొంచెం స్వేచ్చగావాలిగదా? మరిప్పుడుందా? లేదని చెప్పడానికి కొంచెం స్వేచ్చగావాలి గదా? దాని కొరకు ఎంత తండ్లాట జరగాల్సిన అవసరముంది. లక్షలాది అన్నం పెట్టే రైతులు రోడ్లమీదకొచ్చి మా ఎవుసాయం మేం జేసుకుంటామని పోరాడుతుంటే కదలమని మొరాయించి కూచుని ప్రాణాలు పోతున్న వీడని వారి పట్టుదల గురించి మాటాడేందుకూ కొంచెం స్వేచ్చగావాలిగదా? అదెందుకు లేదు. ఇది ఎవరి తప్పు. మనకు మనం తీసుకున్నామా గోయిని, లేక అసంకల్పితంగా నెట్టబడ్డామా? కార్యకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు కదా? మరి మనకు మనమే ఈ ముప్పును దాటే తొవ్వ చూసుకోవాల్సిన అవసరముంది కదా? దానికోసం నలుగురమూ కూడగట్టుకుని మరల మాటాడుకోవాలంటే కూడా కొంచెం స్వేచ్చగావాలి గదా? దావానలంలా చుట్టుముడుతున్న ఫాసిస్ట్ నిర్బంధాన్ని ఎదుర్కోవాలంటే నలుగురమూ చేతులు కలపాలి. ఇది క్రమంగా పోయేదానికి లేదు. ఉప్పెనలా జనం కదిలితేనే గాని కోల్పోయినదానిని తిరిగి పొందలేం. కవి మనకెరుకలోనికి తీసుకువచ్చిన బతుకు చిత్రం దానికదే ఒక సందేశాన్నిస్తుంది. శివారెడ్డి  గారు ఇక్కడ వరకు మనల్ని నడిపించుకు పోయారు. నడవాల్సిన అవసరం మనదే. 
చివరిగా

కొంచెం స్వేచ్చగావాలి
రెక్కలల్లార్చి గాల్లో ఎగరటానికి….

“You talk when you cease to be at peace with your thoughts.”― Kahlil Gibran, The Prophet 

ఇలా చెప్పి తనలా నడుచుకుంటూ పోతున్నారు. రండి మరోసారి కవిత్వంలోంచి ప్రయాణాన్ని కొనసాగించడానికి.

Leave a Reply