జార్ఖండ్‌లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా 2022 డిసెంబర్ 1 నుంచి, గోయిల్‌కెర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలయ్‌బెడ, లోవబెడ గ్రామాల సమీపంలోని లోవబెడ కొండల్లో మావోయిస్టులు, కోబ్రా పోలీసులకు మధ్య ‘ఎన్‌కౌంటర్’ జరిగినప్పటి నుంచి పోలీసులు దాదాపు ప్రతి రోజూ కాల్పులు జరుపుతూనే వున్నారు. ‘ఎన్‌కౌంటర్’ జరిగిన రోజు ఉదయం 8.15 గంటలకు నుండి, సాయంత్రం 5 గంటల వరకు రోజంతా వందలాది ఫిరంగి గుండ్ల (మోర్టార్ షెల్స్‌) వర్షం కురిపించారు. మర్నాడు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిరంగి గుండ్లను పేల్చారు.

ఆ తరువాత, 2022 డిసెంబర్ 10న ఇంజెడ్‌బెడాలో పోలీసు క్యాంపును ఏర్పాటు చేసిన సందర్భంలో, 11-12 తేదీలలో, తుంబహాకా, సర్జోంబూరు, పటాయతారోప్‌లను లక్ష్యంగా చేసుకుని రోజంతా ఫిరంగి గుండ్లు పేల్చారు. డిసెంబర్ 17న కూడా ఉదయం 8-9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గుండ్లు పేల్చారు. 2023 జనవరి 11 న, పాఠాతారోప్, తుంబహాకా గ్రామాల మధ్య మధ్యాహ్నం పూట పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ‘ఎన్‌కౌంటర్’ తరువాత, పోలీసులు వరుసగా రెండు రోజులు రాత్రింబగళ్లు కాల్పులు కొనసాగించారు.

ప్రస్తుతం పాఠాతారోప్ గ్రామం పక్కనే ఉన్న కొండపై పోలీసులు మకాం వేశారు. అక్కడి నుంచి తుంబహాకా గ్రామ దిశలో పగటిపూట ఏ సమయంలోనైనా తూటాలు పేల్చుతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు అరగంట లేదా గంట వ్యవధిలో కాల్పులు జరుపుతూనే ఉన్నారు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంలా వుంది యిక్కడి పరిస్థితి.

అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ రమేష్ బైస్‌లకు, జాతీయ మానవ హక్కుల సంఘం- ఢిల్లీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్- రాంచీ, జార్ఖండ్ జనాధికార్ మహాసభ, టీఆర్‌టిసి, జోహార్ సంస్థ, ఆదివాసీ హో మహాసభల అధ్యక్ష, కార్యదర్శిలకు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అడవుల్లో నివసించే ఆదివాసీలమైన తాము కూడా పోలీసుల కాల్పుల బాధితులమని మహాసభ -జంగిల్-జమీన్ అధికార్ రక్షా మంచ్, కోల్హాన్ (పశ్చిమ సింఘ్‌భూమ్), గావ్-గ్రామసభ మండల్‌లు లేఖ రాశాయి. 

కొల్హాన్ అటవీప్రాంతంలో 100కు పైగా రెవెన్యూ, అటవీ గ్రామాలు ఉన్నాయి. ఫిరంగి గుడ్లు పడుతున్న అడవి వైపు వున్న మేము ఇంట్లో దాక్కోవాల్సి వస్తోంది. ఊరు, ఇంటి పక్కన గుండ్లు పడుతూనే వుంటాయి. కర్ణభేరి పగిలిపోయే శబ్దంతో చెవి మొద్దుబారిపోతుంది, శరీరం వణుకిపోతుంది, ఆ గుండు తమ  ఇంటి పైకప్పుపైనే పడ్డట్లు అనిపిస్తుంది.

ఫిరంగి గుండ్లు కురిసిన రోజు చెవుల్లో వేళ్లు పెట్టుకుని వాటి శబ్దం ఎప్పుడు ఆగుతుందా అని ఎదురు చూడడం తప్ప ప్రజలు మరే పనీ చేసుకోలేరు. అవి ఆగితేనే కొంత ఉపశమనం లభిస్తుంది, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. పొలాల్లో పని చేయలేరు. అడవుల్లోకి వెళ్లి కట్టెలు, ఆకులు, పళ్లపుల్లలు తెచ్చుకోలేక పోతున్నారు. 

అడవుల్లోని కట్టెలు, ఆకులు, పళ్ల పుల్లలు అమ్ముకోవడమే ప్రధాన జీవనాధారం అయిన నిరుపేద ఆదివాసీలపై మిన్ను విరిగి మీద పడ్డట్లయింది.  

క్యాంపు వేసుకొన్న పోలీసులు రాత్రి పగలు తేడా లేకుండా జరిపే ఫిరంగి గుండు దాడి గురించి గ్రామస్తులకు ముందస్తుగా ఏ సమాచారమూ ఇవ్వరు, ఏ హెచ్చరికా చెయ్యరు. ప్రభుత్వమూ, పోలీసు-యంత్రాంగమూ కొల్హాన్ ప్రజలపై యుద్దం ప్రకటించినట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రజల ప్రాణాలను, ఆస్తులను లెక్కచేయకుండా ఎలాంటి ముందస్తు నోటీసులు, హెచ్చరికలు ఇవ్వకుండా పోలీసులు పగలు రాత్రి అనే తేడా లేకుండా కాల్పులు జరుపుతున్నారు. అంత మాత్రమే కాదు, పోలీసులు, పారామిలటరీ బలగాలు దాడులు, సోదాలు జరిపే సమయంలో అమాయక ఆదివాసీలను దారుణంగా కొడ్తారు, మహిళల మాన మర్యాదలతో ఆటలాడతారు.

ఆదివాసీల గొర్రేలు, మేకలు, కోళ్ళను పట్టుకెళ్లి తినేస్తారు. దాంతోపాటు ఇంట్లో వున్న ధాన్యం, వరి, బియ్యం, పప్పు మొదలైనవాటిని బయటపడేసి కాల్చేస్తారు. బొప్పాయి, నిమ్మ చెట్లను నరికేసి నాశనం చేస్తారు.

పోలీసులు కేవలం మావోయిస్టులను టార్గెట్ చేయడమే కాకుండా కోల్హాన్‌లోని ఆదివాసీలను కూడా టార్గెట్ చేస్తున్నారు. గత 2022 నవంబర్ నుండి పోలీసులు నిర్వహించిన కేంపెయిన్ లో ప్రజలపై జరిగిన అకృత్యాల కాండనే ఇందుకు సాక్ష్యం.

గత 2022 నవంబర్ నుండి 2023జనవరి 20 వరకు పోలీసులు నిర్వహించిన దాడి క్యాంపెయిన్, ఆ కాలంలో జరిగిన ఘటనల సంక్షిప్త వివరణ ఇలా వుంది. మొత్తం కోల్హాన్ అటవీ డివిజన్‌లోని అటవీ ప్రాంతం చుట్టూతా, అంతర్గత ప్రాంతంలో కూడా పోలీసు, కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఇదంతా పక్కా యుద్దప్రణాళికలా జరిగిందని పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరింపునుబట్టి అర్థం చేసుకోవచ్చు.

2022 అక్టోబర్ 10  నుంచి 2023 జనవరి 11 వరకు మూడు నెలల్లో ఐదు కేంద్ర పారామిలిటరీ బలగాల క్యాంపులను  ఏర్పాటు చేసారు. వీటిలో  రెంగ్‌డాహాతు పంచాయతీ, టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోవున్న రెంగ్‌డాహాతులో జార్ఖండ్ పోలీస్, కోబ్రా క్యాంపును అక్టోబర్ 10 న ఏర్పాటు చేసారు. కదమ్‌డిహా పంచాయితీ గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయ్‌తవా గ్రామంలో  నవంబర్ 10 న సీఆర్‌పిఎఫ్, జార్ఖండ్ పోలీసుల క్యాంపుని ఏర్పాటు చేశారు. 

పండాబీర్ పంచాయితీ, చైబాసా సదర్ పోలీస్ స్టేషన్, ఇంజెద్‌బెడా గ్రామంలో డిసెంబర్ 10న పోలీసు-సీఆర్‌పిఎఫ్  క్యాంపును ఏర్పాటు చేశారు. అదే పంచాయితీలో జోజోహటు గ్రామంలోనూ ఏర్పాటు చేశారు.

 డిసెంబర్ 11-12ల్లో జరిగిన మూడవ కేంపెయిన్‌లో రెవెన్యూ గ్రామం హజెద్‌బెడ, అటవీ గ్రామం గుయిలేడా, రెవెన్యూ గ్రామం పేటారోబ్, తుంబహాక, సర్జోంబూరు, అటవీ గ్రామం చిరియాబెడల మధ్యలో వున్న దుగ్లాయి కొండలపై కేంద్రీకరించి ఇంజెద్వేడా, గుయిబెడ గ్రామాల నుంచి రెండు రోజుల పాటు ఉదయం 8.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిరంతరంగా  మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో సుమారు 200 గుండ్ల వర్షాన్ని కురిపించారు.

దీనికి సంబంధించి, డిసెంబర్ 17 ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, హంజెడ్‌బెడ క్యాంపు నుంచి అటవీ గ్రామం గుయిబెడ నుండి దుంగలాయి కొండలు, అడవుల వరకు మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో నుండి 50 కంటే ఎక్కువ షెల్లులను, ఎలాంటి ముందస్తు హెచ్చరికా లేకుండా అడపాదడపా కాల్చారు. అయితే ఈ కొండ చుట్టు పక్కలా  అటవీ, రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలోని గొర్రెల కాపరులు పశువులను మేత కోసం కొండపైకి తీసుకెళ్తారు. అటువంటి పరిస్థితిలో, ముందస్తు సమాచారం లేకుండా షెల్లింగ్ ద్వారా గ్రామస్థులకు భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది.

నాలుగవ క్యాంపెయిన్  ఇంకా కొనసాగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా మోర్టార్ షెల్లింగ్ జరుగుతోంది. జనవరి 11 నుంచి మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు పగలు, రాత్రి అడపాదడపా కాల్పులు జరుగుతూనే వున్నాయి. 2023 జనవరి 11 న మధ్యాహ్నం 1:00 గంటలకు గ్రామ పయతరోవ్ మరియు తుంబాకా (పంచాయత్ రెంగ్‌డహటు, టోంటో థానా) మధ్య మావోయిస్టులతో భీకర ‘ఎన్‌కౌంటర్‌’ పోరాటం ప్రారంభమైంది.

ఆ రోజు నుండి నేటి వరకు, తుంబహాకా, సర్జోంబూరు, పటతరోవ్ గ్రామాలు  లక్ష్యంగా పారామిలటరీ, రాష్ట్ర పోలీసులు గ్రామాలు, అడవులు, కొండలలో  మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో వందల కొద్దీ షెల్లులు, అత్యాధునిక ఆయుధాలతో వేలాది బుల్లెట్లను రాత్రింబగళ్లూ కాల్చారు. ఈ గుండ్లు, బుల్లెట్లు, ముఖ్యంగా గుండ్లు, అడవులు, కొండలు మాత్రమే కాకుండా, పైన పేర్కొన్న మూడింటి మధ్యలో ప్రత్యేకించి తుంబాహాక, పటాతారోవ్ గ్రామాల మధ్య ఉన్న పొలాలు, గడ్డివాములు, తోటలు, మచాన్ (ఎండు గడ్డి నిల్వ స్థలం), ప్రాంగణాలలో డజన్ల కొద్దీ గుండ్లు పేలుతున్నాయి. ఇందులో ఇద్దరు అమాయక పిల్లలు, డజన్ల కొద్దీ మహిళలు, పురుషులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తుంబహక గ్రామానికి చెందిన ఓ చిన్నారికి మోర్టార్ గుండు ముక్క వల్ల స్వల్ప గాయాలయ్యాయి. రెండవది, పటాతారోవ్ గ్రామంలో  ఎండుగడ్డి మేట పైన పడ్డ షెల్ పేలకపోవడంతో అక్కడే ఆడుకుంటున్న పిల్లవాడు బతికిపోయాడు.

2023జనవరి 29-30 నుండి రాత్రి 7 గంటల నుంచి 10-11 గంటల వరకు 81 ఎం.ఎం. ఫిరంగి గుండ్ల దాడులు తుంబహాక, సర్జోంబురు, లోవబెడ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కురుస్తూనే వున్నాయి. ఈ గ్రామాల చుట్టుపక్కలా,  ఇళ్ల పక్కనే పడేట్లు వాటిని పేలుస్తున్నారు. గ్రామంలోని ప్రజలు భయంతో రాత్రంతా నిద్రపోలేకపోతున్నారు. పొలాల్లో పని చేయలేకపోతున్నారు., అడవికి కట్టెలు, ఆకులు, పళ్ల కోసం వెళ్లలేకపోతున్నారు. పశువులు మేత కోసం అడవిలోకి వెళ్లలేకపోతున్నాయి.

ప్రభుత్వం, పోలీసుల ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆదివాసీ  సంఘాలు చెబుతున్నాయి. గనులు, ఫ్యాక్టరీలను తెరవడానికి ప్రభుత్వం కోల్‌హన్‌ను పోలీసు కంటోన్మెంట్‌గా మారుస్తోంది. గ్రామాలు, అడవుల్లో ఆదివాసీలపై బాంబులు వేస్తూన్నా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మౌనంగా ఉన్నారు.

 జల్-జంగిల్-జమీన్ అధికార్ రక్షా మంచ్ ఆధ్వర్యంలో, కొల్హన్ రక్షా సంఘ్‌కి చెందిన ఒక యూనిట్, పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంకి బుండూ పంచాయతీ గ్రామసభ, ముండా డకువా తదితర గ్రామస్థులు సుమారు 1000 మందితో 2023 జనవరి 13న రుతఘూట్ పాఠశాలలో బహిరంగ సభ జరిపింది. ఆ సభ నిర్వాహకుల్లో ఒకరైన బీర్బల్ తుబీద్ లుయియా గ్రామానికి చెందినవారు. అతను పుఖ్రిబురు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. మావోయిస్టుల మద్దతుదారుడని చెప్పుకుంటూ సమావేశాలు నిర్వహిస్తున్నాడనే అభియోగంతో  అతన్ని 2023 జనవరి 14న ఝీంక్‌పానీ మార్కెట్‌ నుంచి పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌లో ఉంచి శారీరక, మానసిక హింసకు గురిచేస్తున్నారు. జీవితాంతం జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. అతన్ని పోలీస్ స్టేషన్‌లో కలవడానికి ఇంటివాళ్ళని, గ్రామ ప్రజలను అనుమతించడం లేదు.

రెండవది, మున్నా హెంబ్రామ్ లుయియా గ్రామంలో ఒక కిరాణా దుకాణదారుడు. అతను బీర్బల్ తుబీద్‌తో భాగస్వామిగా అద్దెకు బస్సు నడుపుతున్నాడు. మావోయిస్టు మద్దతుదారునిగా చెప్పుకుంటూ గ్రామసభ నిర్వహించాడన్న అభియోగంపై పోలీసులు అతడిని పట్టుకునేందుకు వెతుకుతున్నారు. అతన్ని  మానసికంగా వేధిస్తున్నారు, జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు.

దీనికి చాలా రోజుల క్రితం రూతాఘూటు గ్రామానికి చెందిన విజయ్ సింగ్ బాహందాను కూడా మావోయిస్టు మద్దతుదారుడని, వారికి సామాన్లు చేరవేస్తాడు అనే  తప్పుడు ఆరోపణతో రేంగ్@డాహాతు, టోంటో పోలీసులు పట్టుకొని 19 రోజుల పాటు టోంటో పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచి శారీరక, మానసిక చిత్రహింసపాలు చేసారు.

అతని భార్య, గ్రామ పెద్ద పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తరువాతనే  అతన్ని విడుదల చేసారు. అందుకు పోలీసులు కొన్ని షరతులు కూడా పెట్టారు. మావోయిస్టులు ఎక్కడ వుంటారో చెప్పాల్సి వుంటుంది. వారిని పట్టిస్తేనే విడుదల చేస్తాం, లేకుంటే మావోయిస్టు కేసు పెడతాం, జీవితాంతం జైల్లోనే కుళ్లిపోతావని అన్నారు. ఇప్పటికీ పోలీసుల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అతనికి బ్లాక్‌తో సంబంధం వుంది. ‘కిసాన్ మిత్ర’ పథకంలో వున్నాడు, అతని భార్య అంగన్‌వాడీలో పని చేస్తుంది. అతను ఆర్సిఎం కంపెనీలోనూ ఒక ఎంజీవో సంస్థలో కూడా పనిచేస్తున్నాడు. రోజూ ఆ బ్లాక్‌కు వచ్చి పోతూంటాడు. అతని గ్రామం అటవీ ప్రాంతంలో ఉంటుంది.

ఈ విధంగా కొల్హాన్ అటవీ డివిజన్ ప్రాంతాల్లో ప్రజలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వుంది. గ్రామంలోని పోలీసులు ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు చూపించాలని అడుగుతారు. కానీ పోలీసులు మాత్రం తమ పేర్లు ఏమిటో, తాము ఎక్కడి నుంచి వచ్చారో చెప్పరు, తమ ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు చూపించరు.

మరోవైపు, పోలీసులు చెప్పేది నమ్మితేకనక, కోటి రూపాయల తల వెల ప్రకటించిన నక్సలైట్ మిసిర్ బెస్రా, సుమారు 1000 మంది నక్సలైట్లతో పాటు పశ్చిమ సింగ్‌భూమ్‌లోని టోంటోలోని తుంబహాకా, కోర్ ప్రాంతాల్లో ఉన్నట్లు ఈ ప్రాంతంలో  పోలీసులకు సమాచారం వుండడంవల్ల పోలీసులు ఆ ప్రాంతాల్లో నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నారు. 

(జన్‌చౌక్ అంతర్జాల సైట్ లో 2023 మార్చి 28 నాడు వచ్చిన వ్యాసానికి తెలుగు అనువాదం )

Leave a Reply