సకెండ్ వేవ్ లోనూ క్యాంపుల ఏర్పాటు, ఎన్‌కౌంటర్లు, స్తూపాల కూల్చివేత
ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తున్న కాలం ఇది. మనిషి తనకు తాను బందీగా మారుతున్న కాలం. బతకాలంటే బందీగా ఉండాల్సిన సమయం. ప్రభుత్వాలు కరోనాని కట్టడి చేయలేక అంతా మనుషులు మీద నెట్టేసి ఊరుకున్నాయి. ప్రాణ అవసరమైన ఆక్సిజన్ కూడా అందివ్వకుండా ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా ఉధృతమైందని అంతా ప్రజల మీదికే తోసేశాయి.. ఈ విషయంలో చేతులెత్తేసిన ప్రభుత్వాలు పోరాట ప్రజలపై అణిచివేతకు తన రహస్య హస్తాలను కూడా ఎప్పటి కంటే దుర్మార్గంగా వాడుతున్నాయి.
ముఖ్యంగా సకల ప్రాకృతిక సంపదల నిలయమైన దండకారణ్యంలో పాలక దాడులు నానాటికి పెరిగిపోతున్నాయి. కరోనాను ఎప్పటికి అదుపులోకి తెచ్చేదీ పాలకులు ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు అదుపు చేయాలని కూడా అనుకోవడం లేదు. కొవిడ్‌ను కలిసి వచ్చిన అదృష్టంగా భావిస్తున్నారు. కానీ జూన్ నాటికీ మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలనే లక్ష్యం మాత్రం పెట్టున్నారు. దీనికి కూడా కరోనా కల్లోలాన్ని వాడుకుంటున్నారు. ఈ కరోనా మధ్యనే తీవ్రం చేసిన సమాధాన్ యుద్ధంలో భాగంగా ఇప్పడు దండకారణ్యంలో అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.
దండకారణ్యంలో దాడులను తీవ్రతరం చేసే ఉద్దేశంతో మే మొదటి వారంలో బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని సిల్గర్ ప్రాంతంలో మరో పోలీసు క్యాంపును ఏర్పాటు చేశారు. కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో లాక్‌డౌన్ అంటూ అందరిని బందీలను చేసిన ప్రభుత్వాలు ఈ క్యాంపులు పెట్టడంపై ఆదివాసులు నిరసన చేపట్టారు. పోలీసు క్యాంపులు పెడితే ఎలా ఉంటుందో ఆదివాసులకు అనుభవం ఉంది. ఈ కాంపులు ప్రజలను రక్షించడానికి ఏర్పరుస్తున్నవి కాదు. వాళ్ళను దోచుకోడానికి, నిర్వాసితులను చేయడానికి ఏర్పాటు చేస్తున్నవి. కాబట్టి ప్రజలు వాటిని వ్యతిరేకిస్తున్నారు. అందుకే గత మూడు రోజులుగా ఈ క్యాంపును ఎత్తేయాలని నిరసన తెలుపుతున్నారు. ఈ కరోనా పరిస్థితుల్లో ఆదివాసుల అవసరాలను పట్టించుకోని ప్రభుత్వాలు క్యాంపులు మాత్రం ఏర్పాటు చేశాయి.
శాంతియుత ఆదివాసుల ఆందోళనపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు ఆదివాసులు మరణించారు. పదహారు మందికి గాయాలు అయ్యాయి. ఇక్కడ కూడా అదే పాత కథ. తమ క్యాంపు పై మావోయిస్టులు కాల్పులు జరపడటంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని బస్తర్ ఐజి సుందరాజన్ ప్రకటించారు. ఆ రకంగా ముగ్గురి హత్యను కూడా ఎన్‌కౌంటర్‌గా ప్రకటించారు. అక్కడితో ఆగలేదు. మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న ఆదివాసులను అక్కడి నుండి ఆదివాసులను తరిమివేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్నారు. ఆదివాసుల మీద వేలాది బలగాల మోహరింపుకు ఈ ఎన్‌కౌంటర్ ప్రకటన ఒక్కటి చాలు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
హత్యాకాండకు పాల్పడి, ముగ్గురిని పొట్టనపెట్టుకొని, స్థానికులను అణిచివేయడానికి, ఇక్కడ పోలీసు క్యాంపు వద్దు అనే వాళ్ల న్యాయమైన డిమాండ్‌ను దారి మళ్లించడానికి పాలకులు పన్నిన పథకం చూడండి .. ఎంత దుర్మార్గంగా ఉందో.. పోలీసు క్యాంపు వద్దు అంటున్న ఆదివాసులను అక్కడి నుంచి పంపించడానికే కాదు, మొత్తంగా ఆదివాసులను అడవి నుంచి పంపించి వేయడానికి అనేక పథకాలు అల్లడంలో దిట్ట ఈ సుందరాజన్ . ఆయన బస్తర్ ను టూరిజం హబ్ గా మారుస్తానని శాంతి యాత్రలు, మారథాన్ ర్యాలీలు నిర్వహిస్తున్న వ్యక్తి. వీటి పేరుతో ఆదివాసులను అక్కడి నుండి తరిమివేసి ప్రజలకు చెందిన వనరులు కార్పొరేట్లకు అప్పచెప్పడమే ఆయన లక్ష్యం. నిజానికి ఇది ఆపరేషన్ సమాధాన్ అనే సైనిక వ్యూహానికి ఉన్న రాజకీయార్థిక కోణం. దీని కోసమే ఆ సైనిక వ్యూహం. నిన్న సిల్గర్ ప్రాంతంలో జరిగింది ఇదే.
ఈ పనులు ఇంకా చాలా రూపాల్లో అమలవుతోంది. మే 7, 9 తేదీలలో బస్తర్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఇద్దరి మహిళా అమరవీరుల స్తూపాలను కూలగొట్టారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఒక అమరుడి స్తూపాన్ని కూలగొట్టారు. ఇలా స్తూపాలను కూలగొట్టడం, క్యాంపులను ఏర్పాటు చేయడం గతంలో కూడా జరిగాయి. ఇప్పడవి జూన్ నాటికి పెట్టుకొన్న లక్ష్యంలో భాగం.
గతంలో కడియ మెట్ట పోలీసు కాంపులో పోలీసులకు కరోనా సోకిందనే వార్తలు వచ్చాయి. వారిలో నలుగురు పోలీసులు మరణించారు కూడా. బయటి నుంచి వచ్చే పోలీసుల ద్వారా దండకారణ్యంలోకి కరోనా ప్రవేసించిందనే వార్తలు మొదటి వేవ్‌లోనే వచ్చాయి. కూంబింగ్ పోలీసుల నుంచి అక్కడి ప్రజలకు కూడా సోకే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంతం నుంచి కూంబింగ్ కి వెళ్లిన పోలీసులకు కూడా కరోనా రావడంతో ఆదివాసులు ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కూడా పోలీసుల కుటిల వాదన ఏమంటే.. మావోయిస్టుల ద్వారా ఆదివాసులకు కొవిడ్ సోకింది అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ – పాలగూడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. కానీ తాము అలాంటి దాడులు చేయలేదని పోలీసు అధికారులు ప్రకటనలు విడుదల చేశారు. వాటిని ఖండిస్తూ విప్లవకారులు దాడుల దృశ్యాలను కూడా విడుదల చేశారు. దాడికి దెబ్బతిన్న ప్రజలు మౌనంగా ఉండరు కదా. ఇది తమ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న. అందుకే కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కూడా అక్కడ విషయాలు బయటికి చెప్పటం కోసం వారం రోజులపాటు వందలాది ప్రజలు ఒకచోట కూడి తమ నిరసనను తెలియజేస్తున్నారు.
అన్ని వసతులు ఉండి, అభివృద్ధికరమైన, నాగరికమైన సమాజంలో బతుకుతున్నాం అనే భ్రమలో ఉన్న మైదాన ప్రాంత ప్రజలు రోజురోజుకూ కరోనాతో పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటువంటి సమయంలో అడవిని ఆదివాసుల్లోకి ప్రభుత్వం కరోనాను తీసికెళతోంది. ఆదివాసులకు మిగిలింది పోరాటమే కదా. కరోనాతోనూ, భద్రతా బలగాలతోనూ పోరాటం చేస్తున్నారు. అలాంటి వారి మీద ఏకపక్షంగా కాల్పులు జరిపి ఎన్కౌంటర్ అనడాన్ని ఖండించాలి. క్యాంపులు ఎత్తివేయమని నిరసన తెలుపుతున్న వారితో గొంతు కలపాలి.