ప్రపంచవ్యాపితంగా ఆర్థిక ద్రవ్య సంక్షోభం ఎంత తీవ్రం అవుతుందో అంత వేగంగా వెనుకబడిన దేశాలలోకి ప్రపంచ పెట్టుబడి ప్రవహిస్తున్నది. వెనుకబడిన దేశాలలోని లోతట్టు ప్రాంతాలను వెతుక్కుంటూ మరీ దూకుడుగా అది పరుగులు తీస్తోంది. సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి అది బయటపడడానికి చేపడుతున్న ప్రక్రియ ఇది. కాబట్టి అసలు సంక్షోభాల గురించి 1848 లోనే కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ లు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం.
‘‘సంక్షోభాలను మరింత విస్తృతమైన, మరింత విధ్వంసకరమైన సంక్షోభాలకు బాట వేయడం ద్వారా, సంక్షోభ నివారణావకాశాలను తగ్గించడం ద్వారా తాత్కాలికంగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా, 1. ఉత్పత్తి శక్తులలో విధిలేక కొంత భాగాన్ని ధ్వంసం చేయడం ద్వారా, 2. కొత్త మార్కెట్లను జయించడం ద్వారా, 3. పాత మార్కెట్లను మరింత కట్టుదిట్టంగా దోచుకోవడం ద్వారా’’.
(కమ్యూనిస్టు ప్రణాళిక)
మన దేశంలో 1990-91 నుండి సామ్రాజ్యవాదుల ఎల్.పీ.జీ. విధానాలు అమలవుతున్నాయి. మొదటి జనరేషన్ సంస్కరణలను మించి రెండవ జనరేషన్ విధానాలు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ప్రైవేటైజేషన్ వైపు వేగంగా తీసుకువెళుతుంది. ఈ విధానాలు కేంద్రంలో హిందుత్వ శక్తులు అధికారాన్ని చేపట్టిన తరువాత ఎలాంటి దాపరికం లేకుండానే అమలు అవుతున్నాయి. ‘మినిమం గవర్నమెంట్, మాగ్జిమం గవర్నెన్స్’ ‘‘అంటూ మేకిన్ ఇండియా’’కు పిలుపునిచ్చారు. దీనితో ఎఫ్.డీ.ఐలు, ఎఫ్.ఐ.ఐలు మన దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నవి. మరోవైపు మన దేశ చట్ట సభలలో బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఈడేర్చే దిశలోనే అనేక చట్టాలు జరుగు తున్నాయి. ఇందులో భాగంగా 23 ఆగస్టు 2021 నాడు కేంద్రం జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ (ఎన్.ఎం.పీ) (()0ను ప్రకటించింది. దాని ప్రకారం కేంద్రం 2019లో రూ. 102 లక్షల కోట్లతో 6,835 ప్రాజెక్టులను ప్రారంభించింది. తరువాత వీటి సంఖ్యను 7,400 కు పెంచింది. వీటిని అమలు చేయాలంటే నయా ఉదారవాద వకాల్తాదారులు బోధిస్తున్నట్టు రాజ్యం ప్రజలపైకి విజృంబించాలి. కానీ, విజృంభనను ప్రతిఘటిస్తున్నారు. అణచివేత ప్రతిఘటనను తీవ్రం చేస్తుందనే వాస్తవాన్ని వర్తమాన పరిస్థితులు ఎత్తిపడుతున్నాయి.
పాలకవర్గాల సంక్షోభభారాన్ని భరించాల్సి వచ్చే ప్రజలు వారి వారి చైతన్యాన్ని అనుసరించి వాటిని వ్యతిరేకించడం, పోరాడడం జరుగుతోంది. సంక్షోభ తీవ్రత ప్రజా పోరాటాల తీవ్రతను అనివార్యం చేస్తుంది. అణచివేత చర్యలు తాత్కాలికంగా పోరాటాలలో స్తబ్దతను కలగించినా తరావాతి విస్ఫోటనలు పాలకవర్గాలను అడ్రస్ లేకుండా చేస్తాయనీ వర్తమాన శ్రీలంక పరిస్థితులు ప్రపంచం ముందుకు మరోసారి తెచ్చాయి. కాకపోతే, ఆ పోరాటాలను ఏ దిశలో నడుపాలనేది వాటికి నాయకత్వం వహించే శక్తులు అనుసరించే సునిశితమైన శాస్త్రీయ విధానాలపై ఆధారపడి వుంటుంది. మన దేశంలో సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తొలినుండి ప్రజాపోరాటాలు జరుగుతునే వున్నయి. ఇటీవలే సంవత్సరకాలం దేశ రైతాంగం జరిపిన దిల్లీ ధర్నా, సాధించిన విజయం పెరుగుతున్న ప్రజా చైతన్యానికి తిరుగులేని సంకేతం. ఆ తరహలోనే గత కొన్నేళ్లుగా దేశంలోని మూలవాసీ ప్రజలు పోరాడుతున్నారు. వారూ కార్పొరేటు వర్గాలపై విజయం సాధిస్తున్నారు. సింగూర్ నుండి లోహండిగూడ వరకు టాటా పరుగులు తీసింది జగద్విదితమే. సింగూర్ లో టాటా చిన్న కార్ల ఫ్యాక్టరీ పెడుతానంటే బెంగాల్ రైతులు ‘నో’ అన్నారు. లొహండిగూడలో గనుల తవ్వకానికి టాటా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఛత్తీస్ గఢ్ అడవులలోకి వస్తే బస్తర్ ఆదివాసలు ‘నో’ అన్నారు. ఇవి రెండు కేవలం ఉదాహరణలే. ఇవి గత దశాబ్ద కాలానికి చెందినవి కాగా వర్తమాన పోరాటాల గురించి మనం చూద్దాం.
మన దేశానికి లభించిన లాంచనప్రాయమైన స్వాతంత్ర్యం తరువాత ఝార్ఖండ్ లోని బొకారో ప్రాంతంలో బొగ్గు గనులు, థర్మల్ విద్యుత్తు ప్రాజెక్ట్ లు, తెనుఘాట్ పవర్ ప్లాంట్, మందుగుండు కార్ఖానా లతో పాటు 1965లోనే తెనుఘాట్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. దీనితో ఆ ప్రాంతంలోని 31 గ్రామాలకు చెందిన 21,624 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వారి కోసం 14,434 ఎకరాల వ్యక్తిగత పట్టాలు, 10 వేల ఎకరాల సాముదాయక పట్టాల పంపిణి జరిగింది. వాస్తవానికి ఈ రిజర్వాయర్ నిర్మాణంతో మూలవాసులు, ఇతర పీడిత ప్రజా సముదాయాలు భారీఎత్తున నిరాశ్రయులయ్యారు. అనేక మందికి దశాబ్దాలు గడిచినా పునరావాసం, వుద్యోగం దిక్కు లేకుండా పోయింది. ఇక ఇపుడు ఈ ప్రాంతంలోని చెరాతాండ్ లో ప్రైవేట్ బొగ్గు గనుల తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. దీనితో ఇంకెన్ని కుటుంబాలు దౌర్జన్యపూరితంగా విస్తాపనం కానున్నాయో ఆ ప్రాంత ఆదివాసులలో తీవ్ర భయాందోళనలు నెలకొని వున్నాయి. మరోవైపు పాలకుల అండదండలతో ఇక్కడి నుండి అనేక రకాల అతి విలువైన వనరులను కొల్లగొట్టుకపోతున్న, పెట్టుబడిదారులు పడగలెత్తుతున్నారు. కానీ, ఈ ప్రాంతంలో జరిగే విద్యుదుత్పాదన నుండి మూలవాసుల గుడిసెలలో వెలుగు కానరాకుండా అంధకారంలో జీవితాలు గడుపకతప్పడం లేదు. పైగా ఈ ప్రాంతంలో రాజ్య హింసా, పౌర హక్కుల ఉల్లంఘన అనునిత్యం పెరుగుతోంది. అయితే, మరోవైపు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా విప్లవో ద్యమం కొనసాగుతున్న వాస్తవాన్ని మనం దృష్టిలో వుంచుకోవాలి. దాని ఫలితంగానే, అక్కడ కొనసాగు తున్న ప్రజా పోరాటాల పురోగమనం అనేది ఒక భౌతిక వాస్తవం. ఇపుడు ఆ పోరాటాలే ప్రపంచ పెట్టుబడిని ప్రతిఘటిస్తున్నవి. ఉల్ గులాన్ అని నినదిస్తున్నాయి. బిర్సాముండాను స్మరిస్తూ జై జోహార్ అంటున్నవి.
కార్పొరేట్ వర్గాలు రాజ్యం అండతో ప్రజలపై కొనసాగిస్తున్న అణచివేత చర్యలు ఏ విధంగా వున్నాయో ఇటీవలే వెలుగులోకి వచ్చిన నివేదిక ప్రపంచం ముందుంచుతోంది. ఉపా – గోమియా (బోకారో) పీడితుల పక్షాన ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీ 31 మంది ఆదివాసీ పీడితులను ప్రత్యక్షంగా కలిసి వారి వివరాలు సేకరించి అందించింది. అమరులు స్టాన్ సామి 3 వేల మంది విచారణలోని ఖైదీల వివరాలను వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. విప్లవోద్యమ ప్రాంతంలోని మూలవాసులను మావోయిస్టులంటూ వేదించడం, అరెస్టులు చేయడం, జైలు పాలు చేయడం, ఖైదు చేయడం, అనేక సందర్భాలలో బూటకపు ఎన్కౌంటర్లలో హత్య చేయడం న్యూ నార్మల్ గా మారుతోంది. అయినప్పటికీ, కార్పొరేట్ వర్గాలను అనుమతి ఇచ్చేదే లేదని మూలవాసీ ప్రజలు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నారు.
షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్టు డ్వెలర్స్ (రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స) ఆక్ట్, 2006 (నూతన అటవీ చట్టం) ప్రకారం మూలవాసులందరికి సాగు భూములకు పట్టాలు ఇవ్వాల్సి వుండగా మధ్యప్రదేశ్ లో ఆగస్టు 31, 2020 వరకు 57 శాతం మూలవాసులకు అవి అందలేదంటే వారిని అనివార్యంగా పోరాటాలకు నెట్టడం కాకపోతే మరేమవుతుంది? దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పాలకవర్గాల ప్రయోజనాలను నెరవేర్చడంలో భాగంగా అడవులను ప్రజలకు దక్కకుండా చేసే తీర్పు విన్పించి దేశ వ్యాప్త ప్రజలను ముఖ్యంగా మూలవాసీ ప్రజలను పోరాట రంగంలోకి దింపి తన తీర్పును తాత్కాలికంగా నిలుపుకునే విధంగా చేయడం ఆ మేరకు ప్రజల విజయంగా నిలిచిపోయింది. దానితో, ఇప్పటికీ ఆ రాష్ట్రంలోని అనేక ప్రజా సంఘాలతో పాటు జల్, జంగల్, జమీన్, జీవన్ బచావో మంచ్ వారు మూలవాసుల భూముల పట్టాల కోసం పోరాడుతున్నారు.
ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు (ISFR) 2019 ప్రకారం మధ్యప్రదేశ్ లో 7,67,419 చదరపు కిలోమీటర్ల భూభాగంలో నుండి 2,26,542 చదరపు కిలోమీటర్ల భూభాగంలో అడవులున్నాయని నివేదిస్తున్నది. ఈ ప్రాంతంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు అనేక రోడ్లు, గనుల తవ్వకాలు, ఇతర భారీ ప్రాజెక్టులు చోటుచేసుకుంటున్నాయి. మూలవాసుల జీవికకు అవసరమైన కనీస స్థాయి కమతాలలో భూములూ సాగవుతున్నాయి. కానీ, భూముల మూలంగానే అడవులు నష్టపోతున్నాయనీ విధ్వంసం పర్యవసానంగా పర్యావరణ వినాశనం తప్పడం లేదని వాస్తవాలకు భిన్నంగా విధ్వంసం పర్యవసానంగా పర్యావరణ వినాశనం తప్పడం లేదని వాస్తవాలకు భిన్నంగా దబాయిస్తూ అసలు వాస్తవాలను మరుగున పెడుతున్నారు. నిజానికి ఈ విశాల అటవీ ప్రాంతాలలో జరుగుతున్నదంతా కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలను నెరవేర్చే నిర్మాణాలు, కట్టడాలు, తవ్వకాలేననేది వాస్తవాలను జీరో గ్రౌండ్ నుండి వస్తున్న రిపోర్టుల ద్వారా సులభంగానే తెలుసుకోవచ్చు. ఈ పనులన్నీ ప్రజలను పోరాటాలకు పురికొల్పకుండా వుండవు. ఇవి వారి మనుగడనే ప్రశ్నిస్తున్న సమస్యలు. ఈనాడు సమాజంలో సమస్యల తీవ్రత ఎంతగా వుందంటే అవే వెతుక్కుంటూ విప్లవ శక్తులను ఆహ్వనిస్తున్నాయి.
మరోవైపు అదే రాష్ట్రంలో మూలవాసీ ప్రజలపై పెచ్చరిల్లుతున్నహిందుత్వ శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా కూడ ప్రజలు పోరాడక తప్పడం లేదు. ఈ విషయంలో మధ్యప్రదేశ్ అనుభవం చూద్దాం. దేశంలోనే మూలవాసులపై మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో మధ్యప్రదేశ్ మొదటి శ్రేణిలో నిలిచింది. ఇక్కడ 2020లో 2,401 కేసులు, చోటుచేసుకొన్నాయి (2019 కన్నా 25 శాతం ఎక్కువ). మధ్యప్రదేశ్ లోని మొత్తం 52 జిల్లాలలో 22శాతం (1.53 కోట్ల జనాభా) ప్రజలు మూలవాసీలుగా వున్నారు. వారు 46 రకాల మూలవాసీ తెగలకు చెందినవారు. వాటిలో 6 పెద్ద తెగలు, భిల్, గోండ్, కోల్, కుర్కు, సహారియా, బైగాలే 90 శాతానికి పైగా వుంటారు. వీటిలో సహారియా తెగను ప్రిమిలినరీ వల్నేరబుల్ ట్రైబల్ గ్రూప్ (పీవీటీజీ) గా గుర్తించారు. ఇటీవలే గుణా జిల్లా ధనోరా గ్రామ సహారియా (పీవీటీజీ) తెగకు చెందిన రాంప్యారీబాయి పై సంపన్న కులాల (థక్కడ్ కులం) దుష్ట శక్తులు ఆ మూలవాసీ కుటుంబానికి వున్న అతి చిన్న భూకమతాన్ని స్వహ చేసుకునే పథకంలో భాగంగా ఆమెపై డిజల్ పోసి సజీవంగా నిప్పంటించారు, గుణా, ఆదివాసీ జీవితాలలో ఇలాంటి ఘటనలు అతి సాధారణంగా మారాయి.
ఈ వ్యవస్థలో పాలకవర్గాలను, దోపిడీ కులాలను రక్షించడానికే రాజ్యం పుట్టిందనేది అర్థం చేసుకున్నవారికి పోలీసులు ధక్కడ్ ల పక్షమేనని విడిగా చెప్పనవసరం లేదు. ఆ రాష్ట్రంలోని మరో జిల్లా దేవస్ జిల్లాలోని మూలవాసీ ప్రజల వేదన మరింత హృదయవిదారకంగా వుంది. దేవస్ జిల్లా నేమావర్ గ్రామంలోని 5గురి ఆదివాసీల సామూహికంగా హత్య చేశారు. ఒక మహిళపై అత్యాచారం జరిపారు. హత్య (2021 జూన్) జరిగిన 45 రోజుల తరువాత పోలీసులు మృతుల శవాలు వెలికితీశారు. హత్యా కేసులో నిందుతులను పోలీసుల 9మందిని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై కాషాయ వుగ్రవాద అధినాయకులలో ఒకడు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత మూలవాసీ మహిళ, బిడ్డలను కోల్పోయిన తల్లి భారతీ కస్దేకర్ కు త్వరలో న్యాయం జరుగుతుందనీ భరోసా ఇచ్చాడు. కానీ, ‘‘న్యాయం ఆలస్యం అన్యాయంతో సమానమ’’న్న నానుడి గురించి తెలియకపోయినా మూలవాసీ భారతీ తన సోదరుడితో కలసి తన గ్రామం నుండి 200 కి.మీ దూరంలో వున్న రాష్ట్ర రాజధాని భోపాల్ కు జనవరి 2022లో ‘న్యాయ యాత్ర’ ప్రారంభించింది. 11 రోజుల తరువాత ఆమె తన గమ్యాన్ని చేరింది. కానీ అక్కడ ఆమెకు తన ఆదివాసీ సమూహానికే చెందిన గవర్నర్ మంగూభాయి పటేల్ నుండే అవమానం, తిరస్కరణ ఎదురై కనీసం తన మనోవేదననైనా చెప్పుకునే అవకాశాన్నైనా ఆ దుష్ట హిందుత్వ శక్తి నిరాకరించాడు.
తన మూలవాసీ తెగవాడు గవర్నర్ కావడంతో సీబీఐ దర్యాప్తుకు కేసును అప్పగిస్తాడనే గంపెడాశతో వస్తే కనీసం కలవడానికైనా సిద్దం కాకపోవడంతో ఆమెకున్న భ్రమలు చెదిరిపోయాయి. రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా తమ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదివాసీలకు, దళితులకు సత్వర న్యాయం చేయడానికి గ్యాంగ్ స్టర్ చట్టాన్ని చేసిందనీ, హంతకులను, దుండగులను క్షమించేదే లేదనీ చెప్పన్నారించుల ఛాతీ విరుచుకొని చెప్పాడు. మహిళ అత్యాచారం కేసులో అట్టుడికిన అలిరాజపూర్ జిల్లా, గో హత్యా కేసులో ముగ్గురి దళితులను లించింగ్ లో చంపిన శివ్నీ జిల్లాలో చెలరేగిన హింసోన్మాదం, మత మార్పిడి పుకార్లతో సత్నా జిల్లా లోని ఆదివాసీ గ్రామం దేవ్రా మూలవాసీలపై కాషాయ గూండాలు జరిపిన శివతాండవంతో లీలా అనే గర్భవతికి గర్భస్రావం జరగడం, దానికి వ్యతిరేకంగా జాగృతి ఆదివాసీ దళిత్ సంఘటన్, జై ఆదివాసీ యువశక్తి, ఆదివాసీ ఏకతా పరిషద్, ఆదివాసీ ఛాత్ర సంఘటన్, షహరీ మజ్దూర్ సంఘటన్ లాంటి పలు పలు ప్రజాసంఘాలు వేలాది మహిళలతో న్యాయం కోసం ప్రదర్శన జరిపితే న్యాయం జరిగిందా! నో, జరగలేదు, జరుగదు. కానీ, బోలెడు హమీలు మాత్రం మిగిలాయి. ఇక ఇపుడు వారి ముందు మిగిలింది హిందుత్వ దుష్ట శక్తులతో రాజీ లేని పోరాటమే. విప్లవోద్యమాలు చెలరేగడానికి ఇంతకన్నా భగ్గుమనే సమస్యలు మరేముంటాయి? దీన్ని గ్రహించి సరైన పోరాట, నిర్మాణ, నినాదాలు చేపట్టడమే మిగిలింది.
వర్తమానంలో ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో జరుగుతున్న మూలవాసీ ప్రజా పోరాటాలు దేశ వ్యాప్తంగా పోరాట శక్తులకు ఎంతో ప్రేరణను అందిస్తోన్నవి. ఛత్తీస్ గఢ్ లోని జనాభాలో మూడవ వంతు మూలవాసీలే వున్నారు. ఉత్తర ఛత్తీస్ గఢ్ లోని సర్గూజా, కోర్బా, సూరజ్ గఢ్ జిల్లాలలోని విశాల భూభాగంలో విస్తరించి వున్నహస్ దేవ్ అడవులలో భారత బడా పెట్టుబడిదారులలో అంబానీతో పోటీ పడుతున్న అదానీ బొగ్గు గనుల తవ్వకాల కోసం చిచ్చు రగిలించాడు. ఛత్తీస్ గఢ్ విధాన సభలోని అనేక మంది విధానసభ సభ్యులు అదానీ తీర్థం పుచ్చుకున్నారన్నది బహిరంగ రహస్యంగా మారింది. ఒకరకంగా ఉత్తర ఛత్తీస్ గఢ్ లోని అడవులు అదానీ రాజ్యంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కేబినెట్ మంత్రి సింహ్ దేవ్ మేం మూలవాసీ ప్రజల పక్షమేనని ఎన్ని డంబాలు పలికినా అదాని పంచన చేరిన రాష్ట్ర ప్రభుత్వం వారినెవరినీ లెక్క చేయడం లేదు. రాజ్యం జోక్యం చేసుకొని ఖాకీలను అడవులలోకి పంపినా అక్కడి ప్రజలు చెట్లను వాటేసుకొని ఈ అడవులు మావి, మా జీవిక, హస్ దేవ్ మా దేవత అంటూ మా దేశ పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం అని నినదిస్తూ అదానీకి చుక్కలు చూపుతున్నారు.
దక్షిణ్ ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ డివిజన్ లో గత మూడేళ్లుగా కార్పొరేట్ వ్యతిరేక పోరాటాలు మిన్నంటుతున్నాయి. 2019 మధ్య నుండి ప్రారంభమైన నూతన తరహ పోరాటాలు యావత్ బస్తర్ ను దావానలంలా ఆవహించాయి. పశ్చిం బస్తర్ పిట్టోడుమెట్టలో ప్రారంభమైన‘‘ జల్, జంగల్, జమీన్ మావా’’ (మాదే) అన్న నినాదం రోజు రోజుకు విస్తరిస్తూ ఈ రోజు యావత్ ఛత్తీస్ గఢ్ ను కదలిస్తున్నది. పశ్చిం బస్తర్ నుండి తూర్పు బస్తర్ కు అక్కడి నుండి దక్షిణ్ బస్తర్ కు అక్కడి నుండి ఉత్తర బస్తర్ ను చేరుకొని సమరశీల పోరాటాలను కొనసాగిస్తూ చట్టాల బూటకత్వాన్ని, నాయకుల కుతంత్రాలను, అధికారుల స్వభావాన్ని, కోర్టుల అన్యాయాన్ని చీల్చి చెండాడుతున్నవి.
దక్షిణ్ ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న పోరాటాలు కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, సైన్యకరణకు వ్యతిరేకంగా సాగుతున్నవి. ప్రధానంగా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన వుద్యమం విస్తాపన వ్యతిరేక ప్రజా ఆందోళనగా గణుతికెక్కింది. అంటే అది వారి అస్థిత్వం కోసం మొదలు కాగా, దానిని అణచివేయడానికి రంగంలో రాజ్యం దిగింది. రాజ్యం అంటే భారీ తుపాకులు, లాఠీలు, జైళ్లు అనే విషయం విడిగా చెప్పనవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో కశ్మీర్ ను తలపించే రీతిలో బస్తర్ లో భద్రతా బలగాలు తిష్ట వేసి ఆదివాసీ ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్నవి. కార్పొరేట్ వర్గాలకు బస్తర్ అడవులను అప్పగించడానికి ఆ అడవులలో మైన్ ప్రూఫ్ వాహనాలు, వేలాది కమాండో బలగాలు, వందలాది డ్రోన్ లు అణు క్షణం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నవి. బస్తర్ లో ప్రతి ఇంటా పోలీసు పీడితులున్నారు. జైలు పాలు కాని కుటుంబాలు చాలా తక్కువ. అత్యాచారాలకు గురికాని ఆడపడచులు అదృష్టవంతులు. తమ బిడ్డలను కోల్పోని గ్రామాలు కానరావు. అయినప్పటికీ వారు పోరాడుతున్నారు. మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం, అడవుల కోసం, అధికారం కోసం పోరాడుతున్నారు.
బస్తర్ లోని అడవులను హస్తగతం చేసుకోవడానికి వందలాది యంఓయూలు కుదుర్చుకొని దేశ, విదేశీ కార్పొరేటు వర్గాలు అడవులపై గద్దలా వాలాయి. పోలీసులు గ్రామాలపై విరుచుకుపడ్డారు. కానీ ఎక్కడా వాటి అండర్ స్టాండింగ్ లు, వారి అగ్రిమెంట్లు ఆచరణ రూపం ధరించడం లేదు. దానితో భద్రతా బలగాల బర్బరత్వం, ప్రజలపై ఊచకోత వారు మున్నెన్నడూ ఎదుర్కొనని రీతిలో పెరిగింది. దానితో వారు తమ ఆత్మ రక్షణకు సంప్రదాయ పద్దతులను అనుసరిస్తూ ప్రతిఘటించడం నేర్చుకున్నారు. ఈ రోజు ప్రతి ఊరు ఒక పోరాట నిలయం. ప్రతి ఇల్లు అందులో భాగం. ఊరి రక్షణకు పోలీసు కమాండోలను భయకంపితులను చేస్తున్న స్పైక్ హోల్స్, యువత రక్షక శక్తిగా మారారు. తమ తెగలోనే తమవారు కానీ దుష్ట శక్తులు, దళారీలు, కార్పొరేటు వర్గాల అనుకూలురెవరు వారికి పోరాటాలే ఎరుక చేశాయి. సమాజంలో నూతన సమీకరణలు జరుగుతున్నాయి. ఈ పోరాటం వారికి రాజ్యం నేర్పింది. అణచివేత ప్రతిఘటనను అనివార్యం చేస్తున్నది.
బస్తర్ అడవులలో 2000లకు ముందు ప్రజలు దుష్ట తెగ పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి వారి పీడ విరుగడ చేసుకున్నారు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక వారికి కార్పొరేటు వర్గాలతో పోరాటమే ప్రధానమై కూచుంది. ఈ రోజు ప్రజలు తమ భూముల కోసం, తమ ఆస్తుల కోసం పోరాడుతున్నారు. అయితే, ఆ పోరాటాలు భూస్వామ్య శక్తులతో కాదన్నది ఒక భౌతిక వాస్తవం. ఆ పోరాటాలు కార్పొరేటు వర్గాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్య పోరాటాలు. కార్పొరేటు వర్గాలు వారి మీద రుద్దిన ఫాసిస్టు సల్వాజుడుంను వారు ఎదుర్కొన్నారు. కార్పొరేటు వర్గాలు వారి మీద రుద్దిన ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వారు ప్రతిఘటించారు. కార్పొరేటు వర్గాలు వారి మీద గత ఐదేళ్లుగా కొనసాగిస్తున్న ఆపరేషన్ సమాధాన్ను వారు తిప్పికొడుతున్నారు. వారు నిన్నటి వరకు ‘రహస్య పోరాటాలు’ చేశారు. కానీ, నేడు వారు తమ చట్టపర హక్కుల కొసం నినదిస్తున్నారు. సమాజాన్ని నిలువునా చీల్చిన దుష్ట శక్తులను ఏకాకులను చేసి సమాజాన్ని సమైక్యంగా నిలపడానికి పోరాటాలే దారులు వేస్తున్నాయి.
బస్తర్ ప్రజలు దేశ ప్రజలతో కలసి పోరాడుతున్నారు. దేశం పై ధ్వజం ఎత్తుతున్న కాషాయ శక్తులకు, కార్పొరేటు వర్గాలకు వ్యతిరేకంగా నిలిచి పోరాడుతున్న శక్తులతో సమైక్యమవుతున్నారు. వారు జిల్లా కేంద్రాలను తమ న్యాయమైన పోరాటాలతో దిగ్బంధిస్తున్నారు. వారు రాష్ట్ర రాజధానికి లాంగ్ మార్ఛ్ చేయతలపెడితే పాలకవర్గాలు గాబరా పడిపోయి అసెంబ్లీ సమావేశాలనే వాయిదా వేసుకున్నాయి. ప్రజల పోరాటాలతో ఖంగు తింటున్న పాలకులు, ప్రజల ఆమోదం లేకుండా మేమేం ఏ పనీ చేయమనీ బోధ్ ఘాట్ రిజర్వాయర్ వ్యతిరేక జనాందోళనకారుల ముందు తలవంచి చెప్పక తప్పలేదు.
బస్తర్ మూలవాసీ ప్రజల కోసం గళం విప్పుతున్న మూలవాసీ హితైషీలను రాజ్యం సహించడం లేదు. వారిని కటకటాల వెనుకకు తోస్తోంది. ఝార్ఖండ్ లో ఆదివాసీ ప్రజల పక్షాన నిలిచిన పాత్రికేయులను పోలీసులు జైలు పాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో జల్, జంగల్, జమీన్ మావా, మావా నాటే మావా రాజ్ అని నినదించిన మూలవాసుల పక్షాన నిలిచిన వకీళ్లను, సామాజిక కార్యకర్తలను, రచయితలను, మేధావులను తప్పుడు కేసులలో ఇరికించి నిరంకుశ చట్టాలతో జైలు పాలు చేస్తున్నారు. అయితే, రాజ్యం చేస్తున్న ఈ దాష్టీకాన్ని ఇపుడు ప్రజలు ఎదుర్కొంటున్నారు. అడవులలోనుండి ఒక హిమాంశు కుమార్ కోసం, మరో రూపేశ్ కోసం, ఒక సురేంద్ర గడ్లింగ్ కోసం, సుధీర్ ధావ్డే, ఆనంద్ తేల్తుంబ్డే, వరవరరావు, సాయిబాబా, సోమాసేన్, సుధా భరద్వాజ్, మహేశ్ రావుత్ మరెంతో మంది ప్రొఫెసర్ల కోసం, రచయితల కోసం, కళాకారుల కోసం వారు నినదిస్తున్నారు. మీతో మేమున్నాం. మిమ్ములను మేం కాపాడుకుంటాం అని వాళ్లు దేశ రాజధానికి సైతం వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తున్నారు. వారిని అడవుల నుండి పట్టణాలకు రాజ్యం పరిచయం చేస్తున్నది. ఈ రోజు దేశంలోని ప్రజాహిత మహిళా సంఘాలు ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు ‘‘ఫ్రీ ఇడిమె’’ అని నినదిస్తున్నారు. సుక్మా జిల్లా బుర్కపాల్ కు చెందిన 121 మందిని తప్పుడు కేసులో ఇరికించి జైలు పాలు చేసి ఐదేండ్ల తరువాత నిర్ధోషులుగా విడుదల చేసిన విషయంపై ప్రభుత్వ తప్పిదనానికి బలైన ఆ 121 మందికి యేటా 2 లక్షల చొప్పున 5 యేండ్లకు గాను 10 లక్షలు ఇవ్వాలనీ సర్వ ఆదివాసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది. మరోవైపు భారతదేశంలోని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలనీ విదేశాలలోని భారతదేశ ప్రజాపోరాటాల మితృలు రాయబార కార్యాలయాల ముందు ప్రదర్శనలు చేస్తున్నారు. మన దేశం నుండి మోదీ ఏ దేశమేగినా అక్కడ మోదీ డౌన్, డౌన్ అంటూ ఆ మిత్ర శక్తులు నినదిస్తున్నాయి. వారు భారతదేశంలోని మూలవాసీ ప్రజల పోరాటాలకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.
భారత పాలకవర్గాలు ఆదివాసులను మోసపుచ్చడానికి ఇన్నాళ్లు వేసిన ఎత్తులు ఇక సాగవనీ ప్రజా పోరాటాలే తేల్చి వేస్తున్నాయి. మూలవాసుల కోసం చేసన చట్టాలను వారి సంక్షోభం వారిని అమలు చేయనీయడం లేదు. వాటిని రద్దు చేయాలనీ ఎల్.పీ.జీ విధానాలు వారిని వత్తిడి చేస్తున్నాయి. కరుడు గట్టిన హిందుత్వ శక్తుల అధినాయకుడు మోదీ మూలవాసుల వీరోచిత నాయకుడైన బిర్సాముండా యాదిలో మూలవాసుల గౌరవదినంగా ప్రకటించాడు. ఇంకా ఎన్నెన్నో ఎత్తులు వేస్తున్నాడు. అన్ని ప్రభుత్వాలు వారిని పోరాటాల నుండి తప్పించడానికి చతురోపాయాలను అనుసరిస్తున్నాయి. కానీ వారు పోరాటాలను కొనసాగిస్తున్నారు. వారు చైతన్యవంతులవుతున్నారు. వారు అడవులను కోరుకుంటున్నారు. వారు అధికారాన్ని కోరుకుంటున్నారు. దోపిడీ వర్గాల సంక్షోభాలు అనేక పోరాటాలకు దారులు తెరుస్తున్నాయి. ప్రజా పోరాటాల ద్వారానే సంక్షోభాలకు తావు లేని సమాజాలను సాధించుకోగలం.