యూఏపీఏ, తీవ్రవాద సెక్షన్ల కింద నిందితుడు, ఢిల్లీలోని ఎన్‌ఐఏ పాటియాలా కోర్టు దోషిగా నిర్ణయించిన గులాం ముహమ్మద్ భట్‌కు జమ్ము ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు, అతని పాదాలకు జీపీఎస్ బెల్టును (గ్లోబల్ పోసిషనింగ్ సిస్టమ్- అతను ఎక్కడ వున్నాడో తెలియచేసే పరికరం) ధరించాలని ఆదేశం యిచ్చింది. అతని పాదాలకు ఆ బెల్ట్ వేశారు కూడా. ‘ది సండే ఎక్స్‌‌ప్రెస్’ తొమ్మిదవ పేజీలో ప్రచురించబడిన ఈ వార్త ఒక అధికారిని ఉటంకిస్తూ: “ప్రాసిక్యూషన్ చేసిన వాదన ఆధారంగా, ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు, నిందితుడి కాలుకి జీపీఎస్ ట్రాకర్లను అమర్చమని జమ్ము, జమ్ము- కశ్మీర్ పోలీసులను ఆదేశిస్తే వారు ఆ ఉత్తర్వును అమలుచేసారు.

గులాం మహ్మద్ భట్‌పైన తీవ్రవాదం, UAPA సెక్షన్ల కింద  తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కోర్టు అతనికి శిక్ష కూడా విధించింది. అతడిని జమ్మూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినప్పుడు అతనిపై విధించిన సెక్షన్ల ఆధారంగా కఠినంగా పర్యవేక్షించాలని ప్రాసిక్యూషన్ కోర్టును అభ్యర్థించింది

కోర్టు ఆదేశాల మేరకు జమ్ము – కశ్మీర్ పోలీసులు గులాం ముహమ్మద్ భట్ కు జిపిఎస్ బెల్ట్ ను కట్టినప్పుడు, అతను దేశంలో మొదటిసారిగా ఈ రకమైన బెల్ట్ ను ఉపయోగిస్తున్నామని కూడా ఆ అధికారి పేర్కొన్నాడు. పిటిఐ నుండి సేకరించిన ఈ సమాచారం ప్రకారం అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కూడా బెయిల్, పెరోల్, నిర్బంధం సందర్భాల్లోనూ, అనేక సార్లు జైళ్లలో రద్దీని తగ్గించడం కోసం ఇటువంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే అక్కడ ఈ సాంకేతికతలను ఉపయోగించిన సందర్భం లేదా ఆ నిందితులు చేశారని చెబుతున్న నేరం  ఏ కోవకు చెందుతుంది అనేది ప్రస్తావించలేదు.

యిక్కడ గులాం ముహమ్మద్ భట్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని, విచారణ సమయంలో బెయిల్‌పై విడుదల చేసినట్లు మాత్రమే వుంది. బెయిల్ మీద విడుదల చేసేటప్పుడు కోర్టు చాలా షరతులను విధిస్తుంది.

నేరానికి సంబంధించిన చట్టాలలో మార్పులు చేయాలనీ, వాటిని మరింత శిక్షార్హమైనదిగా మార్చేలా సవరణలు చేయాలనే తపనను గత రెండు దశాబ్దాలుగా, ప్రభుత్వ ఆర్డినెన్స్‌లు, చట్టాలు మొదలైన వాటిలో ఎంతగా చూస్తున్నామో అదే స్థాయిలో, కోర్టులు యిచ్చే బెయిల్, శిక్ష ఉత్తర్వులలో కూడా కనిపిస్తోంది.

ముఖ్యంగా, ఉగ్రవాదానికి సంబంధించిన చట్టాలు, నిబంధనల గురించి ఒక అసహనం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు స్వయంగా ఈ అంశాన్ని చర్చకు తెచ్చి ఉమ్మడి నిర్ణయానికి రావాలి అని అన్నది కానీ, ఇప్పట్లో ఈ అంశం ముందుకు సాగేలా కనిపించడం లేదు. ఇది మరింత తీవ్రమైన పరిస్థితిలోకి వెళుతోంది.

భీమా కొరేగావ్ కేసుగా ప్రచారం పొందిన కేసులో కొంతమందికి బెయిల్ మంజూరు అయింది. దాదాపు అన్ని సందర్భాల్లోనూ నిందితులు ముంబైలోనే ఉండాలని షరతు విధించారు. మహారాష్ట్ర వెలుపల ప్రయాణించకూడదని, వారి పాస్‌పోర్ట్‌లను యిచ్చేయాలని, ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని కూడా షరతు విధించారు.

పైన పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఈ బెయిల్‌ను రద్దు చేయడానికి ఎన్ఐఏకు అధికారం ఇచ్చింది. ఇంతకు ముందు, ఈ కేసులో సుధా భరద్వాజ్, ఆనంద్ తెల్తుంబేలకు బెయిల్ మంజూరైంది. ఆరోగ్యం కారణంగా వరవరరావుకు బెయిల్ మంజూరు చేశారు. ఇటీవల, కంటి ఆపరేషన్ కోసం మహారాష్ట్ర వెలుపల హైదరాబాద్ వెళ్ళడానికి అనుమతి కోరితే, అనేక షరతులతో ఏడు రోజులకే అనుమతి ఇచ్చారు.

 అంటే, ఒక కంటికి మాత్రమే ఆపరేషన్ సాధ్యమవుతుంది. రెండవ కంటికి ఆపరేషన్ చేయించుకోవాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం , ఫాదర్ స్టాన్ స్వామి ఒక దురదృష్టకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కోర్టు అతని వాదనలు వినడానికే నిరాకరించింది. ఆయన నిర్బంధంలోనే మరణించారు.

కేవలం భీమా కొరేగావ్ కేసులో మాత్రమే ఈ పరిస్థితి లేదు. ఉగ్రవాద ఆరోపణలపై ఖైదీలయిన వారి భయానక కథలు వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని కేసుల్లో మాత్రమే అలాంటి నిందితులను కోర్టులు నిర్దోషులుగా ప్రకటించినప్పటికీ వారు జైలు నుండి బయటికి వచ్చేటప్పటికి, మొత్తం కుటుంబం, నిందితుడి జీవితం నాశనమైపోతుంది. కానీ, ఇప్పుడు ఈ సమస్యలు ఇతర కేసుల్లో కూడా కనిపిస్తున్నాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణం, ఈడీ కేసుల్లో ఆప్ ప్రభుత్వ మంత్రులపై విచారణ కొనసాగుతున్న విచారణ, వారికి బెయిల్ ఇవ్వకపోవడం కోర్టు అనుసరిస్తున్న కొత్త ధోరణి. ఇది నేరం- శిక్షల మధ్య ఒక ప్రక్రియ, ఇది కొంతకాలం క్రితం వరకు కోర్టులోపల జరిగేది, ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది.

సాధారణంగా అభియోగానికి ముందు ‘నేరం’గా  నిర్ణయం కాదు. నేర నిర్వచనానికి అనుగుణంగా శిక్ష ఉండేలా కోర్టు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సాధారణంగా, మధ్యయుగ న్యాయ ప్రక్రియ ఈ మూడింటినీ, ఆరోపణ- నేర ప్రక్రియలను చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తుంది. కానీ, శిక్ష విధించడానికి మాత్రం చాలా కాలం పడుతుంది. ముఖ్యంగా, మరణశిక్ష ప్రదర్శనను ఉన్మాద క్షణంగా మారుస్తారు.

మన చట్టాలు, నిబంధనలు రూపుదిద్దుకున్న ఆధునిక యుగంలో ఈ పనులన్నీ తలుపులు మూసిన కోర్టు గదుల్లో, జైలు గదుల్లో జరగడం ప్రారంభించాయి. మిచెల్ ఫౌకాల్ట్ మాటల్లో, “19వ శతాబ్దం ఆరంభంతో పాటు శారీరక దండన దృశ్యం అదృశ్యమవ్వడం ప్రారంభమైంది, శారీరక హింస పక్కకు తప్పుకుంది, శిక్ష నాటకీయ ప్రదర్శన నివారణ ప్రారంభమైంది.” కానీ ఇప్పుడు శిక్షలో అలంకార (క్రమశిక్షణ-శిక్ష) ప్రదర్శన ప్రారంభమైంది.

నేడు మన దేశంలో పరిస్థితి కొద్దిగా భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆరోపణల ప్రదర్శన చేయడమే కాదు, ఆరోపణలనే నేరంగా భావించి విచారణ కూడా అంతే జోరుగా ప్రదర్శిస్తున్నారు. న్యాయం విలువను సాధించే ప్రయత్నంలో నిందితులు-ప్రాసిక్యూషన్ విభేదిస్తున్నట్లు కనిపిస్తున్నప్పుడు కేవలం న్యాయ స్వరమే చివరి ఆశగా కనిపిస్తుంది.

కోర్టు భాషలో మీరు విచారణ అని పిలిచే అంతం లేని సంభాషణలు జరుగుతున్నప్పుడు, న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఒక నిందితుడు భరించే హింస ప్రదర్శన కూడా అదే సమయంలో జరుగుతుంది. ముఖ్యంగా, అతను అనారోగ్యంతో లేదా వృద్ధాప్యంతో బాధపడుతుంటే, లేదా ఇతర కారణాల వల్ల అతని శరీరం క్షీణిస్తుంటే, అతని ప్రదర్శన అధికారానికి వ్యతిరేకంగా లేదా ప్రతిపక్షంలో ఉన్నవారికి హెచ్చరికగా మారుతుంది. విపక్ష నేత రాహుల్ గాంధీ తాను భయపడను అని అంటున్నారంటే ఎలాంటి భయానక వాతావరణం వుందో అర్థం చేసుకోవచ్చు.

అటువంటి పరిస్థితిలో, వారిని భయంకరమైన షరతులతో బెయిల్‌పై విడుదల చేసి, వారి కాళ్ళకు జీపీఎస్ బెల్ట్‌లు కట్టుకోవాలనీ ఆదేశాలు జారీ చేసినప్పుడు, అలా బెయిల్‌లపై విడుదలైన వ్యక్తులు సమాజంలో ఉన్నారు. న్యాయస్థానం యిచ్చిన ఆ హింసాత్మక ఆదేశాలను తమతో తీసుకువెళ్లి ప్రజల మధ్య ఉన్నారు. వారు కోర్టు విధించిన ఈ నిబంధనలను బహిరంగ ప్రదర్శన చేయడానికి కట్టుబడి ఉంటారు.

వాస్తవానికి, కోర్టులోపల జరగాల్సిన నేరారోపణ- నేర నిర్ధారణల ప్రక్రియను బయట ప్రదర్శించడానికి బాధ్యులవుతారు. వారు కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నారు. ఇది మధ్యయుగ శిక్షా విధానం కాదు. ఇది ప్రజాస్వామ్యం అని మనం పిలుస్తున్న ఆ రాజ్య న్యాయ ప్రక్రియ, ఇక్కడ శిక్ష వేయకముందే శిక్షా ప్రక్రియ జరుగుతోంది.

అదే విధమైన ప్రక్రియలో, నీరు త్రాగడానికి ఒక స్ట్రా కావాలనే ఫాదర్ స్టాన్ స్వామి చేసిన అభ్యర్థనను విననప్పుడు, అతని అనారోగ్య స్తితిని చూడ నిరాకరించినప్పుడు అతని మరణాన్ని ఎవరు ఆపగలరు. ముఖ్యంగా శిక్ష, జైలు దానిలో అంతర్భాగంగా ఉన్నంత కాలం న్యాయం అనేది ఖచ్చితంగా ఒక సంపూర్ణ పదం కాదు.

  • అంజని కుమార్,  స్వతంత్ర విలేఖరి
  • అనువాదం ..పద్మ కొండిపర్తి

Leave a Reply