కొల్లూరి సాయన్న …
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సుందరగిరి గ్రామంలో దళిత రైతు కుటుంబం లో పుట్టాడు. న్యాయశాస్త్ర విద్యార్ధిగా విద్యా రంగ సమస్యలపై పని చేశాడు. చదువుకున్న చదువుకు సార్ధకత చేకూరేలా, తెలంగాణా గ్రామీణ ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం , ఆదివాసీ ప్రజల కోసం పని చేయాలని ఐదేళ్ల క్రితం నిర్ణయించుకుని పని ప్రారంభించాడు. అత్యంత నిజాయితీ, నిబద్ధత కలిగిన కార్యకర్త సాయన్న.
నిత్య అధ్యయనంతో వ్యవసాయ రంగ సమస్యలపై అవగాహన పెంచుకుని వివిధ జిల్లాలకు తన పనిని విస్తరించుకుని తెలంగాణా రైతాంగ సమితి నాయకుడుగా ఎదిగాడు. ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. సాయన్నకు భార్య, నాలుగేళ్ల కూతురు ఉన్నారు.
2020 జూన్ నుండీ కేంద్రం తెచ్చిన మూడు కార్పొరేట్ చట్టలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా రైతు ఉద్యమం నిర్మించడానికి ఏర్పడిన ఏఐకేఎస్సిసి తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ గా మిగిలిన రైతు సంఘాలతో కలసి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. గ్రామీణ రైతాంగ, ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం ముందు లేవనెత్తుతూ నిత్యం బహిరంగ కార్యాచరణలో ఉన్నవాడు.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్న సాయన్న, రాష్ట్రం ఏర్పడ్డాక 2015 ఆగస్టు నుండీ తెలంగాణ రైతు జేఏసీ లో తెలంగాణ రైతాంగ సమితి ప్రతినిధిగా చురుకుగా రాష్ట్రమంతా తిరిగారు. ప్రజల సమస్యలు తీసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతూ, అధికారులతో నిత్యం చర్చించే సాయన్నపై యూఏపిఏ క్రింద కేసులు బనాయించడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు ఎలా అమలవుతున్నాయో అర్థం అవడం లేదూ..
ఇప్పుడు ఈ పరిచయమంతా ఎందుకంటే, సాయన్న మూడు నెలలౌ పైగా జైలులో మగ్గుతున్నాడు. కామారెడ్డి జిల్లా జక్రాన్ పల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 7 న ముగ్గురు నక్సలైట్లను అరెస్టు చేశామనీ, మరో ఐదుగురు తప్పించుకున్నారనీ పోలీసులు ప్రకటించి కేసు పెట్టారు. ఈ కేసులో జులై 6 న సాయన్నను ఆదిలాబాద్ పట్టణంలో తన ఇంటి నుండీ అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిన పోలీసులు తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) క్రింద కేసు బనాయించారు.
గత నాలుగు నెలల కాలంలో గజ్వేల్, ఎల్బి నగర్, చర్ల , లక్ష్మిదేవి పల్లి, గద్వాల పోలీస్ స్టేషన్ ల పరిధిలో మరో ఐదు యూఏపిఏ కేసులలో కూడా తన పేరు చేర్చారు. ఇప్పటికే మూడు కేసులలో బెయిల్ వచ్చినప్పటికీ, ఇంకా మూడు కేసులలో బెయిల్ రావాల్సి ఉంది. బెయిల్ పై సాయన్న బయటకు రాకుండా, మరిన్ని కేసులను పెట్టే ప్రక్రియ కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
నిత్యం బీజీపీ పార్టీ మీదా , కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలన మీదా, కేంద్ర దర్యాప్తు సంస్తల మీదా విరుచుకు పడి మాట్లాడుతున్న తెలంగాణా ప్రభుత్వం ప్రజాసంఘాల కార్యకర్తల విషయంలో తాను కూడా అదే వైఖరితో వ్యవహరిస్తున్నట్లు, సాయన్న పై బనాయిస్తున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి.
నిజంగా ప్రభుత్వాలు చట్టాలను అమలు చేస్తుంటే , సాయన్న లాంటి గ్రామీణ కార్యకర్తలు రైతుల పక్షాన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంటుంది? ప్రదర్శనలు, ధర్నాలు ఎందుకు చేయాల్సి వస్తుంది ? సాయన్న గత అయిదేళ్లుగా చేసిన పని అంతా చట్టాలను అమలు చేయమనే.
మిగులు భూములు తేల్చే లోపు , ప్రభుత్వ భూములు ఉన్న చోట, ఆయా గ్రామాలలో ఆ భూములను భూమి లేని పేదలకు పంచాలని భూ సంస్కరణల చట్టాల సారాంశం . కానీ మన రాష్ట్రంలో 1973 భూ సంస్కరణల చట్టమే అమలు చేయడం లేదు . దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి కొని ఇస్తానన్న ప్రభుత్వం ఆ పథకమే నిలిపి వేసింది.
ప్రభుత్వ భూములను లాండ్ బ్యాంక్ గా పెట్టి కంపెనీలకు ఇవ్వాలనుకుంటోంది .ఏడా తానే అమ్ముకుని ఖజానాకు నిధులు పోగు చేసుకోవాలనుకుంటోంది. గత ప్రభుత్వాలు పంచిన అసైన్డ్ భూములను కూడా ఏదో ఒక పేరున వెనక్కు తీసుకుంటోంది. ఈ చర్యలన్నిటినీ ప్రశ్నించినందుకే సాయన్నపై యూఏపిఏ కేసులు బనాయించారని ఆయా ప్రాంతాల ప్రజలు అనుకుంటే తప్పేముంది.
2006 నుండీ అమలు లోకి వచ్చిన అటవీ హక్కుల చట్టం 16 ఏళ్ళు గడిచినా రాష్ట్రంలో ఇప్పటికీ అమలు కాలేదు. అడవుల సంరక్షణ పేరుతో , ఆదివాసీ గూడేలపై, పోడు రైతులపై దాడులను ప్రభుత్వం కొనసాగిస్తున్నది. అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలను కూడా బలవంతంగా అడవులనుండీ ఖాళీ చేయించి బయటకు విసిరేస్తున్నది. వీటిని సాయన్న ప్రశ్నించాడు . పోడు భూములకు పట్టాల కోసం ఆదివాసీలను వెంట బెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగాడు.
తాజాగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన ప్రకటించి దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం PESA చట్టం ప్రకారం ఆదివాసీ గ్రామాల గ్రామ సభలకు అధికారం ఇవ్వకుండా, తన పార్టీ ప్రజా ప్రతినిధులు,అధికారుల చేతుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెట్టే ప్రయత్నం చేస్తున్నది . సాయన్న లాంటి వాళ్ళు ఆదివాసీల పక్షాన ఉండి, అధికారులు చేసే ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే మోసాలను అడ్డుకుంటారని ప్రభుత్వ భయం.
2011 లో ఉమ్మడి రాష్ట్రంలోనే భూ అధీకృత సాగు దారుల చట్టం అమలు లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం గ్రామ సభలలో కౌలు రైతులను గుర్తించి ఋణ అర్హత కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కార్డులపై వారి వ్యవసాయానికి కావలసిన సహాయం ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి1 నుండీ మే 31 లోపు ఈ ప్రక్రియ చేసి కౌలు రైతులను గుర్తించాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
కానీ 2015 నుండీ ఈ చట్టాన్ని అమలు చేయకుండా కేసిఆర్ ప్రభుత్వం పక్కన పడేసింది. రైతు సంఘాలౌ అడిగినా , లెక్క చేయకుండా, కౌలు రైతులు తమ అజెండాలో లేరని నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నది. సాయన్న నాయకత్వంలో తెలంగాణా రైతాంగ సమితి, ఇతర రైతు సంఘాలతో కలసి ఈ చట్టాన్ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నది.
2005 నుండీ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం అమలు అవుతున్నది . వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ల ఆధ్వర్యంలో ఈ చట్టం అమలు కావాలి . కానీ గద్వాల జిల్లాలో పత్తి విత్తనాలు పండించే రైతులు ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం అమలు కాక , ఆర్గనైజర్ల చేతుల్లో బానిసలుగా బాధపడుతున్నారు. అత్యధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి , రైతుల భూములు రాయించుకునే దుర్మార్గం ఈ ఆర్గనైజర్లది .
కావేరి సీడ్స్ తో సహా బడా విత్తన కంపెనీలు , ఇక్కడ రైతులు పండించే విత్తనాలను అమ్ముకుని లాభాలు గడిస్తున్నారు కానీ, నేరుగా రైతులతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పందాలు చేసుకోవడం లేదు . ఎప్పుడైనా రైతులకు నష్టం జరిగితే, తమకేమీ సంభంధం లేనట్లు వ్యవహరిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల మీటింగ్ లకు హాజరు కాకపోవడం ,అవసరమైతే కలెక్టర్స్ నే బదిలీ చేయించడం లాంటి దాదాగిరీ చేసే ఈ ఆర్గనైజర్లు , కంపెనీల మోశాలను ఎండగడుతూ , గద్వాల జిల్లాలో గత 8 ఏళ్లుగా సాయన్న నాయకత్వం లో రైతాంగ సమితి అనేక ఉద్యమాలు చేసింది .
తెలంగాణా రైతు జేయేసీ ప్రతినిధి వర్గంగా మేము ఆ ప్రాంతానికి వెళ్ళి నిజ నిర్ధారణ చేశాము . ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు, నివేదికలు ఇచ్చాము . ఇప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించడానికి సిద్దం కానీ ప్రభుత్వాలు , సాయన్న లాంటి వాళ్ళను జైలుకు పంపడం ఎంత వరకూ సరైంది ?
పై విషయాలన్నీ గమనిస్తే , సాయన్న ,ఆయన సంఘం ప్రభుత్వాన్ని ఏమి అడుగుతున్నారో అర్థమవుతుంది. వాళ్ళు అడుగున్నది చట్టబద్ధ పాలన . చట్టాల అమలు మాత్రమే. ఏ ప్రభుత్వాని కైనా ఇది కనీస బాధ్యత. ప్రభుత్వ వ్యవస్థ ప్రజల పక్షాన పని చేయకపోతే , చట్టబద్ధ పద్ధతుల్లో నిరసన తెలియ చేసే హక్కు కూడా ప్రజలకు ఉంటుందని సుప్రీం కోర్టు అనేక సార్లు వ్యాఖ్యానించింది. సాయన్న, ఆయన సంఘం గత ఎనిమిదేళ్లుగా అదే పని చేశారు. కానీ ప్రజా సంఘాల కార్యకర్తలు చేసే ఈ కనీస పని కూడా ప్రభుత్వాలకు మింగుడు పడడం లేదు .
అందుకే యూఏపిఏ లాంటి నిర్భంధ చట్టాలతో జైళ్లకు పంపిస్తున్నారు. బెయిల్ రాకుండా కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. ఇది పూర్తి అన్యాయం.
ప్రభుత్వ పెద్దలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమి చెప్పినా, అధికారులు తలలు ఊపుతున్నారు. తాము బాధ్యతగా అమలు చేయాల్సిన చట్టాలను అమలు చేయడానికి పూనుకోవడం లేదు.
రాష్ట్ర స్థాయి కార్యదర్శులు , జిల్లా స్థాయి పాలనా అధికారులు కూడా తాము సర్వీస్ లో చేరేటప్పుడు చేసిన ప్రతిజ్ఞ లను మర్చిపోయి, వెన్నెముక వంగి పోయి, కేవలం ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు వింటూ ఉంటే, ఉన్న చట్టాలను అమలు చేయమని సాయన్న లాంటి వాళ్ళు పోరాడాల్సి ఉంటుంది . ఆ పోరాటం ప్రభుత్వాలకు నచ్చదు . అందుకే వాళ్ళను జైలు పాలు చేస్తారు
“ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టుకున్న వాళ్ళే కాదు , ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ కలం తో రాసే వాళ్ళు కూడా ప్రమాదకారులే.వాళ్ళను కూడా అదుపు చేయాలని “ దేశ ప్రధాని చెప్పిన మాటలను , తెలంగాణా ప్రభుత్వం ఆచరిస్తున్నట్లు ఉంది.
కన్నెగంటి రవి,
రైతు స్వరాజ్య వేదిక,
ఫోన్: 9912928422