“మావోయిస్టుల దిష్టి బొమ్మలను తగలబెడుతున్న ప్రజలు”.
తన టాబ్ లో వార్తాపత్రికల హెడ్ లైన్స్ చదువుతూ ఆ వార్త దగ్గర జూమ్ చేసి చూసింది సుధ. ఆ వార్త కింద ఫోటోలో బిఎస్‌ఎఫ్ పోలీసులు తలకు నల్లటి గుడ్డలు చుట్టుకుని ఎక్కువ మందే వున్నారు. కొంత మంది జనాలు కూడా నిలబడి వున్నారు. కొంత మంది చేతుల్లో … “మావోయిస్టులారా ! మా గ్రామాలకు రాకండి!”. అని రాసి వున్న ఫ్లెకార్డులున్నాయి. సాధారణ దుస్తుల్లో వున్న ఇద్దరు మనుషులచేతుల్లో గడ్డితో తయారు చేసిన మానవాకార బొమ్మలకు ఆలివ్ గ్రీన్ దుస్తులు తొడిగి నిప్పు అంటించిఅవి దహనం అవుతుంటే పైకెత్తి పట్టుకుని వున్న ఫోటో. ఆ ఇద్దరూ ఎవరై వుంటారు? పోల్చుకోగలనేమో అని ఇంకొంచెం జూమ్ చేసి చూసింది. మసగ్గా వుంది. ఎవరో అర్ధం కాలేదు.
“మావోయిస్టుల స్మారక స్ట్థూపంపై మూడు రంగుల జెండా ఎగరవేసిన ప్రజలు”… మరో వార్త దగ్గర ఆమె కళ్ళు నిలిచాయి. ఈ స్థూపం ఎక్కడిదో… చాలా పెద్ద స్థూపమే. కళ్ళద్దాలు తీసి తుడిచి మళ్ళీ పెట్టుకుని కళ్ళు చికిలించి చూసింది. స్థూపం ముందు కొంతమంది పోలీసులు, చాలా మంది జనాలు వున్నారు. వాళ్ళనెప్పుడూ చూసినట్టనిపించలేదు. వార్తల వివరాల్లోకి వెళ్ళి చూస్తే అర్థమయ్యింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల సమయంలో ఆ పంచాయతీ ప్రజలంతా స్వచ్ఛందంగా చందాలు వేసుకొని సమిష్టి శ్రమతో నిర్మించిన అమరవీరుల స్టూపం. అప్పుడు అక్కడ పోలీసు క్యాంప్ లేదు. ఐదు సంవత్సరాల క్రితం బిఎస్‌ఎఫ్ క్యాంప్ ఏర్పడ్డాక పోలీసులే ఆ స్థూపంపై మూడు రంగుల జెండా పెట్టారు.
ఇప్పుడు కొత్తగా ప్రజలు జెండాను ఎగరవేయడం ఏమిటి? క్యాంప్ పక్కనే వారపు సంత జరుగుతుంది.
సంతకు వచ్చే ప్రజలను బెదిరించి తీసుకొచ్చి స్థూపం ముందు నిలబెట్టి ఆగస్టు 15 సందర్భంగా మీడియా ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేయటానికే ఈ డ్రామా అంతా. దిష్టి బొమ్మల దహనం కూడా ఇలాంటిదే అయివుంటుంది. అనుకుంటూ చిరాగ్గా పేపర్ ను జరిపేస్తూ మిగతా వార్తలను చూస్తుంటే అప్పుడు కనిపించిందా వార్త. ” మావోయిస్టుల కంచుకోట మంజరి పంచాయతీలో 70 మంది లొంగుబాటు. వీరంతా మావోయిస్టు దళ సభ్యులుగా, సంఘ నాయకులుగా, మిలీషియా కమాండర్లుగా పని చేశారు. వీరిని పట్టిచ్చిన వారికి ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో తలకు లక్ష రూపాయల రివార్డు ప్రకటించింది. వీరితో ఇటీవల లొంగిపోయిన వారి సంఖ్య 700లకు చేరుకుంది”. వార్తను చదువుతూనే ఫోటోను జూమ్ చేసింది. డిజిపి, ఎస్‌పి, ఏఎస్‌పి, బిఎస్‌ఎఫ్ బెటాలియన్ కమాండెంటు ఇంకా మరికొంత మంది అధికారులు. అందరి ముఖాల్లో విజయగర్వం ఉట్టిపడుతుంటే దర్పంగా కుర్చీల్లో కూర్చొని వున్నారు. ఎస్‌పి విలేకరులకు ఏదో చెబుతున్నట్టున్నాడు. చేతిలో మైక్ పట్టుకుని వున్నాడు. ఏం చెబుతుంటాడు? “ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న అబివృద్ది కార్యక్రమాల వలన వీరంతా చైతన్యవంతులై, పరివర్తన చెంది మావోయిస్టులను వ్యతిరేకిస్తూ లొంగిపోతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది ” …. చర్విత చరణంగా ఇదే కదా వాడు చెప్పేది. ఎప్పుడూ పాడే పాటే కదా!
పోలీసు అధికారుల వెనుక నిలబడి వున్నవారిని జూమ్ చేసి చూసింది. మహిళలు, పురుషులు
చాలా మందే వున్నారు. అందరూ తెలిసిన ముఖాలే. అందులో ఉద్యమంలో పని చేయలేక చాలాకాలం క్రితమే ఇంటికి వెళ్ళిపోయినా శత్రువుకు లొంగకుండా మళ్ళీ సంఘాల్లోను, మిలీషియాలోను పని చేస్తున్న వాళ్ళున్నారు. ఆ ప్రాంతంలో ప్రజల అధికారాన్ని నెరిపిన జనతన సర్కారు కమిటీ వాళ్ళు, పార్టీ ఏరియా, పిపిసి సభ్యులు వున్నారు. ఎన్నోసార్లు బూబీట్రాపులతో, ఆంబుష్ లతో ఆ ప్రాంతంలోకి శత్రువు రావాలంటేనే గుండెల్లో దడలు పుట్టించిన మిలీషియా కమాండర్లు వున్నారు. గ్రామంలోకి పోలీసులు వస్తే పురుషులను తమ వెనుక వుండమని చెప్పి కత్తులు, గొడ్డళ్ళు, కారప్పాడితో తామే ముందు నిలబడి, పోలీసులను ఒక్క అడుగు కూడా కదలనీయకుండా ఘెరావ్ చేసి, తమ మగవాళ్ళను వదలకపోతే మిమ్మల్ని వదిలేది లేదని ఆడ పులుల్లా మీదకురికి పోలీసుల తుపాకులు గుంజుకుని వారి
పెడరెక్కలు విరిచి కట్టేసి తమ వాళ్ళను విడిపించుకున్న అక్కలు వున్నారు. దళం ఊర్లోకి అడుగు పెట్టగానే ఎంత పనిలో వున్నా పరిగెత్తుకుని వచ్చి ఆప్యాయంగా చేతులు కలుపుతూ దళం కోసం దాచిపెట్టిన మామిడి తాండ్రో పనస తొనలో, కాల్చిన మొక్క జొన్న పొత్తులో, ఏవీ లేకపోతే కనీసం తమ చెట్లకు కాసిన జామకాయలో తమ చీరకొంగులో దాచుకుని తెచ్చి ఇచ్చిన మహిళా సంఘం అక్కలు వున్నారు. తమ వ్యక్తిగత సమస్యలను కూడా తమ తల్లి తండ్రులకు చెప్పుకున్నట్టుగా దళంతో చెప్పి పరిష్కరించుకుంటూనే ఆప్రాంతంలో ఎంతో మంది మహిళలను చైతన్య పరచి, సంఘటితం చేసి ఏన్నో మహిళా సమస్యలను పరిష్కరించిన మహిళా సంఘం నాయకురాళ్ళున్నారు. వాళ్ళంతా ఇప్పుడు నిస్సహాయంగా నిలబడి వున్నారు. వారి ముఖాలలో ఏ భావమూ అర్ధం కావడం లేదు. వరుసలో చివరన ఒక మూలన ‘లక్మో’ లాగుందే… అనుకుంటూ ఆ ఫోటోను జూమ్ చేసింది సుధ. లక్మోనే. ఆమె
తల కొంచెం క్రిందకు వాల్చి వుంది. ఆ క్షణంలో ఆమె మనసులో ఎలాంటి భావసంఘర్షణ జరిగి
వుంటుందో…. ఆమె ముఖం లోకి తదేకంగా చూస్తూ… ఊహించడానికి ప్రయత్నించింది… “నా భర్త వున్నప్పుడు మా ఏరియాలోకి రావడానికే ఉచ్చ పోసుకునే వాళ్ళు కదరా… ఊళ్ళో పట్టుకోవడం చేతకాక, డబ్బులకు కక్కుర్తి పడిన ఏ ఎదవో ఉప్పందిస్తే పని మీద బయటకెళ్ళిన వాడిని దొంగదెబ్బ తీసి పట్టుకుని కాళ్ళు చేతులు విరగ్గొట్టి, మీరంతా వచ్చి సరెండర్ అవ్వక పోతే వాడిని చంపేస్తామని మమ్మల్ని బెదిరించి ఇలా బలవంతంగా సరెండర్లు చేయించుకుంటున్న మీరేరా పిరికి పందలు” …. ఖచ్చితంగా లక్మో మనసులో ఇలాగే అనుకుని వుంటుంది.
లక్మో భర్త బిర్సును 10 రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి బూటకపు ఎన్ కౌంటర్ చేయడానికి ప్రయత్నించారు. అతన్ని పోలీసులు పట్టుకున్నారని తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఆ పంచాయతీ ప్రజలంతా కలసి మీడియాలో స్టేట్ మెంట్లు, కత్తులు, గొడ్డళ్ళతో పోలీసు స్టేషన్ ముందు ధర్నాలు చేయడంతో ఇక గత్యంతరం లేక ఆఖరి అస్త్రంగా మీ ప్రాంత నాయకులంతా వచ్చి లొంగిపోతే వదిలేస్తం, లేకపోతే చంపేస్తాం అని బెదిరించి చివరకు వీరి లొంగుబాటుతో అతడిని కోర్టులో హాజరు పర్చారు .
ఈ మధ్య కాలంలో పేపర్లలో వచ్చిన వార్తలన్నీ చదువుతుంటే సుధ మనసంతా బాధగా మూల్గింది.తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రజలు ఎంత మానసిక ఒత్తిడికిగురవుతున్నారో అనిపించింది. ఈసమయంలో వాళ్ళను కలవలేకపోతున్నామనే వేదన, ఏమీ చేయలేకపోతున్నామనే బాధ సుధనుకలవరపెడుతోంది. టాబ్ ను పక్కన పెట్టి, కళ్ళద్దాలు తీసి, రెండు చేతుల ముని వేళ్ళతో నెమ్మదిగా కణతలను నొక్కుకున్నది. వాచీలో టైం చూసింది. అరే! అప్పుడే 11 అయిపోయిందా అనుకుంటూ పక్కకు చూసింది. టెంట్ లో అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. ఎవరో చిన్నగా గురకపెడుతున్నారు. అక్టోబర్ నెల ప్రారంభమైంది కానీ ఇంకా ఎందుకో ఉక్కగా అనిపించింది. టెంట్ లో నుండి బయటకు వెళితే చల్లటి గాలి పీల్చుకోవచ్చనిపించింది. టాబ్ స్విచ్ ఆఫ్ చేసి టార్చిలైట్ వేసి జిల్లీ చివరన కాళ్ళ వైపున్న బూట్లు తొడుక్కుని టెంటు బయటకు వెళ్ళింది.
” ఎవరూ”? … సెంట్రీ లో వున్న కామ్రేడ్ అడిగింది.
“నేనే”.. అంటూ రెండడుగులు వేసి “సెంట్రీ వున్నావా”? అని అడిగింది.
అవును. నువ్వింకా నిద్రపోలేదా ?… సెంట్రీ లో వున్న కోసి అడిగింది.
” లేదు ! చదువుకుంటున్నా ..అని చెబుతూనే మూత్రానికి పోయివస్తాని చెప్పి ముందుకు వెళ్ళింది.
తిరిగి వస్తూ… ” కోసీ, నీ తరువాత సెంట్రీ ఎవరు”? అడిగింది.
“నా తరువాత మంగి ది. నా సెంట్రీ ఇంకా అరగంటే వుంది”. వాచీ చూస్తూ అన్నది కోసి.
“అంతా మంచే కదా? తుపాకి లోడ్ చేసావా? నిద్రపోవద్దు మరి.” అని చెబుతూ తిరిగి తన టెంటు దగ్గరకు వచ్చింది సుధ. ఎందుకో లోపలకు వెళ్ళబుద్ది కాలేదు. ఆ వార్తలు మళ్ళీ చదవబుద్ది కావడం లేదు. నిద్ర కూడా రావడం లేదు. టెంటు పక్కనే ఒక పెద్ద చెట్టుకు ఆనించి వున్న బండరాయిపై కూర్చుని చెట్టుకు చేరబడి తల వెనక్కు వాల్చి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. మళ్లీ వెంటనే కళ్ళు తెరిచి పైకి చూసింది. ఎత్తైన చెట్ల మధ్యలో నుండి ఆకాశం లో గుండ్రటి, చల్లటి చంద్రుడు వెలిగిపోతున్నాడు.
బహుశా పౌర్ణమి కావచ్చు. ఆకాశాన్ని భూమినీ కలిపేస్తూ అంతులేని వెన్నెల వర్షం కురుస్తోంది. నెమ్మదిగా వీస్తున్న గాలి ముఖానికి తాకి హాయిగా అనిపించింది. పెద్ద మద్ది చెట్టును కవర్ చేసుకుంటూ సెంట్రీ నిలబడిన కోసి కూడా చేతిలో తుపాకి పట్టుకుని వెన్నెల్లో స్పష్టంగానే కనిపిస్తోంది. అడవి అంచున మకాం వేయటం వలన మకాంకు కుడి వైపున అంతా మైదానం వుంది. ఆ మైదానం దాటితే ఊరు వున్నట్టుంది.
కొంచెం దూరమే వున్నట్టుంది. ఆగి… ఆగి…కుక్కల అరుపులు లీలగా వినిపిస్తున్నాయి. ఆ మైదానంలో పగలంతా బ్యటరీ చార్జింగ్ కోసం నాలుగు కర్రలు పాతి దానిపై అమర్చిన పెద్ద సోలార్ ప్లేట్ రోజూ సాయంత్రం తీసేస్తుంటారు. కానీ ఈ రోజెందుకో తీయలేదు. వెన్నెల దానిపై పడి తళుక్కున మెరుస్తున్నది.
కీచురాళ్ళు రొద పెడుతున్నాయి. అవి చాలా చిన్న పురుగులేనట కానీ దాని రొద ఎంత కర్ణకఠోరంగా వుందో. అవి ఎలా వుంటాయో చూడాలని చాలా సార్లు అనుకుంది కానీ ఇప్పటి వరకూ చూడలేకపోయింది.
నగరాలు, పల్లెలు, పట్టణాలు, మైదానాలు, అడవులు, కొండలు, చెట్లు, పూలు, పంట పొలాలు,
ఆదివాసీ ప్రజల గుడిసెలు… వీటన్నింటి మీదా ఎలాంటి తేడా లేకుండా వెన్నెల సమానంగానే
కురుస్తున్నది కదా? దీన్ని కూడా పేదవాళ్ళకు అందకుండా ధనికులే దోచుకోవడం సాధ్యమా? తనకు కలిగిన విచిత్రమైన ఊహ తనకే నవ్వు తెప్పించింది.
” పౌర్ణమి నాటి వెన్నెలకూ…ప్రేమకు ఏదో అవినాభావ సంబంధముంటుంది. వెన్నెల్లో భావుకత పుడుతుంది”…. ఎక్కడో చదివినది గుర్తుకొచ్చింది. ఏం భావుకతో?… తలనొప్పితో మాడు పగిలిపోతుంటే వెన్నెలను కూడా భరించలేమేమో? అనుకుంది. ఒకసారెప్పుడో…. “మన భావుకత భౌతిక వాస్తవికతకు భిన్నంగా ఊహల్లో విహరించకూడదు”… అన్న తన సహచరుడి మాటలు గుర్తుకొచ్చాయి. తనిప్పుడెక్కడున్నాడో? ఏం చేస్తున్నాడో ? తను కూడా ఈ వెన్నెలను చూస్తున్నాడా?…ఉద్యమ బాధ్యతలు, అవసరాల రీత్యా సుదూరాన వేరే ప్రాంతంలో పని చేస్తున్న తన సహచరుడు గుర్తుకొచ్చి తెలియకుండానే అమె పెదవులపై చిరునవ్వు మెరిసింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు.
పేపర్లో చదివిన వార్తలే మళ్ళీ ఆమె మెదడును ఆక్రమించాయి.
” మంగీ…మంగీ …సెంట్రీకి టైం అయింది …లే…” కోసి మంగిని లేపుతోంది. మంగి లేచి వెళ్లి సెంట్రీ నిలబడింది.
మన్యంలోని ఎత్తైన కొండలపైన, బిడింగులపైన, ఆదివాసీ గూడేలపైనా స్వచ్చమైన వెన్నెల ఇలాగే కురుస్తుంటుంది. ఆదివాసీ ప్రజల మనసులు కూడా ఈ వెన్నెలంత స్వచ్చమైనవే కదా! కల్మషం లేని, మాయా మర్మం తెలియని ఆ మనుషులను, వారి మనసులను కలుషితం చేసి, విషం నింపటానికి శత్రువు ఎన్ని కుట్రలు పన్నుతున్నాడో?…. ఈ మానసిక యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ప్రజలను ఎలా సిద్ధం చేయాలి ?… పరి పరి విధాల ఆలోచనలు సుధ మనసును తొలిచేస్తున్నాయి.
మన్యం ప్రజలతో సుధకున్న అనుబంధం రెండు దశాబ్దాలది. దళంలోకి వచ్చినప్పటి నుండీ ఆ ప్రాంతంలోనే పని చేసింది. అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా? అనిపిస్తుంటుంది. అసలు ఇన్ని సంవత్సరాలు బతుకుతామని అనుకుందా? దళం లోకి వచ్చిన కొత్తలో యుద్ధం మధ్య ఓ రెండు, మూడు సంవత్సరాలు, మహా అయితే ఓ పది సంవత్సరాలు… అబ్బో…పదంటే మరీ అత్యాశేమో అని అప్పుడెప్పుడో అనుకున్నది గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఇదంతా బోనసేనేమో అనుకుంది. అమ్మా నాన్నల ఒడిలో 20 ఏళ్ళు, అడవి తల్లి ఒడిలో మరో 20 ఏళ్ళు. విప్లవంలోకి తన వెనుక వచ్చిన వాళ్ళు, తనకంటే చిన్న వయసు వాళ్ళు, తనతో కలసి నడిచిన వాళ్ళు తన కళ్ళ ముందే అమరులవుతున్నప్పుడల్లా ఏదో తెలియని ఆవేదన తన మనసును మెలిపెడుతుంటుంది.
రెండు దశాబ్దాలుగా విప్లవోద్యమంలోనూ, సుధ వ్యక్తిగత జీవితం లోనూ ఎన్నో పరిణామాలు.
పదార్థం ఎప్పుడూ చలనంలోనే వుంటుంది. పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పు కు దారి
తీస్తుందన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంది. మన్యంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోను, ఒడిశాలోని కోరాపుట్, మల్కనగిరి జిల్లాల్లోనూ తను పని చేసిన ప్రాంతాల్లో సవర, జాతాపు, కువ్వి, భగత, గదబ, కొండరెడ్లు, కోయ, నూకదొర, వాల్మీకి, రాణా, పొరజ, డిడోయ్ తెగల ప్రజల సంస్కృతిని, జీవన విధానాన్ని, భూమి, అడవి, అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం వారి తెగింపును, పోరాట పటిమను, వారి త్యాగాలను ప్రత్యక్షంగా చూసింది. వారి నుండి ఎంతో నేర్చుకుంది. ఎన్నో ఎన్‌కౌంటర్లలో, దాడులలో ప్రజలు దళాలను కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రతి సందర్భం లోనూ పునర్జన్మనిచ్చిన ఈ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేయాలని మనసులోనే ప్రతిజ్ఞ చేసుకునేది. ఈ
అడవిలో పుట్టి తరతరాలుగా దోపిడీ పీడనలకు గురవుతూ, ఆ దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా అవిరామంగా పోరాడుతూ ఎన్నో ఆటుపోట్లను, మరెన్నో నిర్బంధాలనూ చవి చూసిన మన్యం ప్రజలు అనుభవం ముందు తన అనుభవం ఏ పాటిది ? ఈ ప్రజలకు తను చేసిన సేవ సముద్రంలో నీటిబొట్టే కదా!… సుధ మదిలో పాత జ్ఞాపకాలేవో ప్రవాహంలా కొనసాగుతున్నాయి.
” సుధా, పడుకోలేదా ? ఇక్కడ కూర్చున్నావెందుకు, ఏమైంది ?”…మూత్రానికి లేచినట్టుంది సుధ గార్డు లలిత ఆశ్చర్యంగా, ఒకింత ఆందోళనగా అడిగింది.
“ఏం లేదు! మూత్రనికి పోయి వచ్చి ఇప్పుడే ఇక్కడ కూర్చున్నాను.” అనడంతో ‘ఆహా’ …అనుకుంటూ సెంట్రీకి చెప్పి మూత్రానికి పోయి వచ్చింది లలిత.
“రా…సుధా…పడుకో” అని లలిత మళ్ళీ అనడంతో ఇక లేచి వెళ్ళక తప్పలేదు.
టెంటు లోపలకు వెళ్ళి తన జిల్లీలో నడుం వాల్చింది. శాలువా కప్పుకున్నా నిద్ర వస్తే కదా! మళ్ళీ ఎడతెగని ఆలోచనల పరంపర, గత 2 సంవత్సరాలుగా ఉద్యమంపై మరింత తీవ్రమైన శతృ పాశవిక దాడి అమలు జరుగుతోంది. ఎడతెరిపి లేని కూంబింగులు, ఎన్ కౌంటర్లు,అమరత్వాలు, అరెస్టులు, దిగజారడాలు, బలవంతపు లొంగుబాట్లు, దుష్ప్రచార దాడి, కార్పెట్ సెక్యూరిటీలో భాగంగా పోలీసు క్యాంపులు, రోడ్లు, మొబైల్ నెట్ వర్క్ లను శరవేగంగా ఏర్పరుస్తూ , శత్రువు కల్పిస్తున్న ఆటంకాలతో ప్రజలను, నిర్మాణాలను గతంలో లాగా ప్రత్యక్షంగా కలవడానికి దళాలకు సాధ్యం కావటం లేదు. ఇలాంటి పరిస్థితి పార్టీకి కొత్తేమీ కాదు.
నిప్పులు చెరిగే నిర్బంధంలో సైతం ఎన్నో కష్టనష్టాలకోర్చి దళాలు ప్రజలనంటిపెట్టుకుని వుంటూ, సంపుటిత పరుస్తూ, ప్రజా పోరాటాల వెల్లువను సృష్టిస్తూ, సరైన ఎత్తుగడలతో శత్రువును దెబ్బతీసి మళ్ళీ ప్రజలు పై చేయి సాధించిన అనుభవాలెన్నో పార్టీకి, ప్రజలకు వున్నాయి. కానీ ఇప్పుడేం చేయాలి ?
నేటి పరిస్థితుల్లో ప్రజలను కలవడం ఎలా?….సుధ ఆలోచనలను పుటుక్కున తెంపేస్తూ…. “హమ్ దేఖేంగే”….. సెల్ ఫోన్లో అలారం సెట్ చేసుకున్న తనకిష్టమైన పాట వస్తోంది. అలారం
ఇప్పుడెందుకొచ్చిందీ అని ఫోన్ చేతిలోకి తీసుకుని చూసింది. మధ్యాహ్నం వార్తల కోసం 12.30 కు అలారం పెట్టుకుంది. కానీ పిఎం అని పెట్టడం మరచిపోయినట్టుంది. అందుకే అర్ధరాత్రి మోగింది. నవ్వుకుంటూ ఫోన్ ఆఫ్ చేయబోయి చూసింది. తేదీ అక్టోబర్ 13. కా.సాకేత్ (కేంద్రకమిటీ సభ్యుడు) అమరుడయ్యి అప్పుడే సంవత్సరం అయిపోయిందా? ఆలోచనలన్నీ మళ్ళీ సాకేత్ వైపు మళ్ళాయి. సాకేత్ కలుస్తాడని ఎంత ఆశ పడింది? మరి కొద్ది రోజులలో కలవబోతాడనగా తన అమరత్వపు వార్త విన్నప్పుడు తన గుండె కొన్ని క్షణాలు ఆగిపోయి తిరిగి కొట్టుకున్న విషయం గుర్తుకొచ్చింది. ‘విప్లవకారులు గాఢాంధకారంలో మిణుగురుల వెలుతురును కూడా చూడగలిగే ఆశావాహ దృక్పధాన్ని కలిగివుండాలి.’ ఏదో సందర్భంగా సాకేత్ తన ఉపన్యాసంలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
మరోసారి ఏదో క్లాస్ చెబుతూ “మిన్ను విరిగి మీద పడినా చలించని దృఢత్వం వుండాలి’….అని
చెబుతూనే …అలాగని దున్నపోతు మీద వానపడ్డట్టు కాదు! మెరుపు వేగంతో స్పందించగలిగే
చురుకుదనం కూడా వుండాలి” …అని అనగానే క్లాసులో అందరూ గొల్లున నవ్విన జ్ఞాపకం మనసులో మెదిలింది. ఒకసారి మిలటరీ క్యాంపు జరుగుతుంటే మధ్యాహ్నం 2 గంటలకు ఇంకా క్లాస్ మొదలుకాలేదు. ఏదో పనిమీద అటువైపు వెళుతూ క్లాసురూంలోకి వచ్చి అక్కడున్న బోర్డుపై “శరీరాన్ని మొరటుగానూ, మనసును నాగరీకంగానూ మలచండి”. ఓ కొటేషన్ రాసి నవ్వుతూ వెళ్ళిపోయిన సాకేత్ బక్కపల్బటి రూపం కళ్ళముందు మెదిలింది.
సరిగ్గా పదేళ్ళ క్రితం ‘నారాయణపట్న’ ప్రజా ఉద్యమాన్ని అణచివేయటం కోసం ప్రభుత్వం క్రూరమైన దమనకాండను అమలు చేసినప్పుడు, శత్రువు దుప్ప్రచారంతో ప్రజలను గందరగోళపరిచినప్పుడు, ఇన్ఫార్మర్ల పేరుతో పార్టీ ఆదివాసీలను చంపుతుందని గ్రామాల్లో పెత్తందార్లు పుకార్లు సృష్టించినప్పుడు … ప్రజలు కొంత గందరగోళానికీ, భయబ్రాంతులకు గురై, దళం గ్రామానికి వెళితే తలుపులు వేసుకోవడం, అన్నం పెట్టకపోవడం, సహకరించకపోవడం, కొన్ని గ్రామాల్లో దూరం నుండే దళాన్ని చూసి పారిపోవడం
వంటి అతి దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా అక్కడి దళం ఓపికగా పస్తులుంటూ కూడా మళ్ళీ ఆ ప్రజలకు వివిధ పద్దతుల్లో లేఖలు రాసి, పోస్టర్లు వేసి, రాత్రంతా తలుపులు తీయకపోయినా ఆకలితో తెల్లారేవరకూ వుండి ప్రజలకు వాస్తవాలు వివరించి, నచ్చజెప్పినప్పుడు అదే ప్రజలు దళాన్ని గుండెలకు హత్తుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్న సంఘటనలు అక్కడి దళం కామ్రేడ్స్ చెప్పినప్పుడు, ఆ ప్రజల పట్ల, అక్కడి దళం కామ్రేడ్స్ పట్ల ఆర్థ్రతతో సాకేత్ హృదయం ఎంత ఉప్పాంగిపోయిందో. “కఠిన పరిస్థితుల్లో ప్రజలను అంటి పెట్టుకుని వుంటే మనం తప్పక గెలుస్తాం! ప్రజలే మన గురువులు, ప్రజలు అజేయులు. ఈ అనుభవం తప్పక నువ్వు రాయి. మన ‘ బోల్డివిక్ ‘ లో వేద్దాం. అని అంటున్నప్పుడు సాకేత్ కళ్ళలో చమక్కుమన్న మెరుపు తనెప్పటికీ మరచిపోలేదు.
‘ఉద్యమాలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు మనలో చాలా మంది గందరగోళ
పడతారు. మనం గెలుస్తామా? అనే సందేహాలు కూడా కలుగుతాయి. అలాంటప్పుడు మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడాలి. చరిత్రను గతితార్కిక దృక్పధంతో అర్ధం చేసుకోవాలి. వీరోచిత పోరాటాల్లో ప్రజలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలి. చరిత్రలో న్యాయమైన ప్రజాయుద్ధాలన్నీ గెలిచాయి. మనమూ గెలుస్తాం! ఓటములు, వెనుకంజలు తాత్కాలికమే. ప్రతి ఓటమీ విజయానికి తల్లి వంటిదే. ప్రతికూలతల్లోనూ అనుకూలతలను పట్టుకోవాలి’…సూటిగా, తీక్షణంగా, సాకేత్ నోటినుండి వెలువడిన పదునైన మాటలనూ, చరిత్రలో పీడిత ప్రజల అనుభవాలనూ గుర్తుచేసుకుంటే సుధకు ఎంతో ధైర్యము, మానసిక సాంత్వన కలిగాయి. తన మెదడులో ఏవో పథకాలు రూపుదిద్దుకుంటూ, తన ఆలోచనలకు ఏదో పరిష్కారం దొరికిన సంతృప్తితో…సుధ నిశ్చింతగా, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.
***
“టుబ్రీ…టుబ్రీ… నేను కందుల చేనుకి పోతున్నా… నువ్వు వంట చేసి, అంబలి పట్టుకుని
చేనుకి రా” … వంట గదిలో వున్న భార్యకు చెబుతూ గొడ్డలి భుజాన వేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చాడు దాసు. వీధి చివర నుండి తమ ఇంటి వైపే వస్తున్న పక్క ఊరి గాసి, కాతృ లను చూసి ఇంత పొద్దున్నే ఎందుకొస్తున్నారబ్బా అనుకుంటూ దాసు గుమ్మంలోనే ఆగిపోయాడు.
“ఎక్కడికి బయలుదేరావు బావా”? వస్తూనే కాతృ అడిగాడు.
“కందుల చేనుకి బావా. మీరేంటి ఇంత పొద్దున్నే వచ్చారు”? అన్నాడు.
వీళ్ళ మాటలకు ఎవరో వచ్చినట్టు అర్ధమయ్యి వంట గదిలో వున్న టుబ్రి బయటకు వచ్చింది.
“లోపలికి రండన్నయ్యా డికాషన్ తాగి వెళుదురు గానీ” చెంబుతో నీళ్ళందించింది.
” లేదురా చెల్లీ! మన చిన్న గాడు కాలేజీ నుండి ఈరోజు ఫోను చేస్తానన్నాడు. మన బావ నెంబరు ఇచ్చాము. లేటైతే వెళ్ళిపోతాడేమో? వెళ్ళేటప్పుడు మళ్ళీ వస్తాంలే! పద బావా మీ కందుల చేన్లో ఫోన్ సిగ్నల్ వస్తాది కదా”…కాతృ అనడంతో ముగ్గురూ అక్కడి నుండి కదిలారు.
“బావా, ఉత్తరం వచ్చిందిరా”… దారిలో నడుస్తూ అన్నాడు కాతృ.
“ఏం ఉత్తరం రా”… నడుస్తున్నవాడు ఆగిపోయి ఆశ్చర్యంగా అడిగాడు.
“మన వాళ్ళే రాసారురా “…లుంగీ లోపల వేసుకున్న నిక్కరు జేబులో నుండి భద్రంగా బయటకు తీసి దాసు చేతిలో పెట్టాడు. కందుల చేను దగ్గరకు వచ్చేసారు. చుట్టుపక్కల పరిసరాలను గమనించాడు దాసు. పక్క చేన్ల వాళ్ళు కూడా ఇంకా ఎవరూ రానట్టుంది. పనస చెట్టుకింద కూచోవడానికి వేసిన పలకరాళ్ళ మీద ముగ్గురూ కూర్చున్నారు.
“నేను చదువుతాను గానీ మీరు అటూ ఇటూ గమనిస్తూ వినండి”. ఉత్తరం మడతలు విప్పుతూ
అన్నాడు దాసు.
“సరే…సరే”… అన్నారు కానీ వాళ్ళ చూపులు ఉత్తరం మీదే వున్నాయి. అందులో ఏముందో
తెలుసుకోవాలనే ఆతృత వాళ్ళ కళ్ళలో కనిపిస్తోంది. దాసు కూడా ఇవేవీ గమనించే స్థితిలో లేడు.
తనకూ చదవాలనే ఆరాటంగా వుంది. మెల్లగా చదవడం మొదలుపెట్టాడు.
ప్రియమైన గ్రామ సంఘ నాయకులకూ, ప్రజలకు… లాల్ సలాం! “…తమకు ఎంతో
సుపరిచితమైన అక్షరాలు, పలకరింపు …చూడగానే అర్ధమైపోయింది ఎవరు రాసారో.
శత్రువు కల్పిస్తున్న ఆటంకాల వలన గత సంవత్సర కాలంగా మనం ప్రత్యక్షంగా
కలుసుకోలేకపోతున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం. మా కోసం మీరెంతగా ఎదురు చూస్తుంటారో మాకు తెలుసు. ఈ సంవత్సర కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. ఎంతో మంది కామ్రేడ్స్
అమరులయ్యారు. మరికొంత మంది అరెస్టయ్యి శత్రువు పెట్టిన చిత్రహింసలను ధైర్యంగా ఎదుర్కొంటూ
జైళ్ళలో నిర్బంధించబడ్డారు. మరికొంత మంది పిరికివాళ్ళు, ప్రజలపై విశ్వాసం కోల్పోయిన వాళ్ళు
దిగజారిపోయి శత్రువు పంచన చేరారు. మరోవైపు మన ప్రాంతంలో ప్రభుత్వం, పోలీసులు,
ప్రజావ్యతిరేకులు, భూస్వాములు మన్యంలో పార్టీని మొత్తం నిర్మూలించేసామనీ, ఇక పార్టీ లేదనీ, రాదనీ
విస్తృతంగా ప్రచారం చేస్తూ, ప్రజల మనోస్తైర్యాన్ని దెబ్బతీస్తూ ప్రజలపై, సంఘాలపై, తీవ్రమైన ఒత్తిడి తెచ్చి బెదిరింపులతో బలవంతంగా సరెండర్లు చేయించుకుంటున్నారు. మన ఆర్‌పిసి పాకెట్ లో కూడా మీరంతా సరెండరైన వార్త పేపర్లో చూసాం. మీరంతా ఎంత ఒత్తిడికి, ఇబ్బందులకు గరై వుంటారో అర్ధం చేసుకోగలం”….. దాసు చదవడం ఆపి కొంతసేపు మౌనంగా వుండిపోయాడు. సరెండర్ కు వెళ్ళడానికి ముందు తమ ఊరి మునసబు, సర్పంచ్, పోలీసులు కలిసి చేసిన ప్రయత్నాలు, బెదిరింపులు ఆసమయంలో పార్టీ కలిస్తే బాగుండునని తాము చేసిన ప్రయత్నాలు, పార్టీ ఎప్పటికైనా వస్తుందనీ, ఏదో రకంగా కలుస్తుందనీ నమ్మకం వున్నప్పటికీ ఈ ఒత్తిడి తట్టుకోలేక ప్రజలతో పాటు తనూ వెళ్ళి సరెండరైన విషయాలన్నీ మనసులో మెదిలాయి. భారమైన మనసును సంబాళించుకుని మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు.
” శత్రువు మనమీద ఎంత ఒత్తిడి తెచ్చినా మీరు సరెండర్ అవకుండా వుండాల్సింది. మనం ధైర్యంగా, దృఢంగా నిలబడాల్సిన సమయమిదే. ఎంతోమంది అమరులు రక్తం ధారపోసి సాధించుకున్న అడవినీ, భూమిని, అధికారాన్ని, పోరాట విజయాలను కాపాడుకోవాల్సిన సమయమిది.”….చదువుతున్న దాసు గొంతు బాధతో వణికింది. “ఛ! మనం సరెండర్ కు వెళ్ళకుండా వుండాల్సింది. ఓపిక పట్టాల్సింది.”
గొణుగుతూ బయటకే అన్న దాసు మాటల్లో పశ్చాత్తాపం ధ్వనించింది. వింటున్న గాసీ, కాతృలు
నిజమేనన్నట్టు తలూపారు.
“ప్రజలారా ! మన ముందు రెండే మార్గాలున్నాయి. లొంగిపోయి బానిసలుగా, కూలీలుగా బ్రతుకుదామా ? తెగించి పోరాడి మన అడవినీ, భూమినీ, మన ప్రజల అధికారాన్నీ కాపాడుకుందామా? ఆలోచించండి! పార్టీ అంటే వ్యక్తులు కాదు. పార్టీ అంటే మార్క్సిజం – లెనినిజం – మావోయిజం అనే సిద్ధాంత మార్గదర్శకత్వంతో రూపుదిద్దుకున్న అజేయమైన ప్రజాశక్తి. ప్రజాయుద్ధం అంటే వ్యక్తులు చేసే యుద్ధం కాదు. పీడిత ప్రజలంతా తమ అధికారం కోసం చేసే న్యాయమైన యుద్ధం. కనుక పార్టీని, ప్రజాయుద్దాన్ని సమూలంగా నిర్మూలించడం శత్రువుకు సాధ్యం కాదు. వ్యక్తులు మరణించవచ్చు, అరెస్టు కావచ్చు, లొంగిపోవచ్చు. శత్రువు లక్షలాది సైన్యాన్ని మోహరించి ప్రజలపై తీవ్రమైన నిర్బంధాన్ని అమలుచేయవచ్చు. అయినా ఇవేవీ కోట్లాది పీడిత ప్రజల శక్తినీ, ఆకాంక్షలనూ, న్యాయమైన హక్కులను
నిర్మూలించలేవు. నేడు మనం బలహీనంగా వుండవచ్చు. ఈ ఓటములు తాత్కాలికమే. ఈ నిర్బంధాలు తాత్కాలికమే. ఇంతకంటే తీవ్రమైన నిర్చంధాలెన్నింటినో ఓడించిన చరిత్ర మన మన్యం ప్రజలకుంది. కనుక అధైర్య పడకండి. మళ్ళీ మనం శత్రువు కుట్రలను సరిగ్గా అంచనా వేస్తూ, సరైన ఎత్తుగడలతో రహస్యంగా పనిచేస్తూ మన శక్తిని కూడగట్టుకోవాలి. ప్రజాశత్రువులను ఓ కంట కనిపెడుతూ, శతృ బలహీనతలను పసిగడుతూ, అదును చూసి దెబ్బకొట్టాలి న్యాయమైన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, అడవిపై హక్కు కోసం, పీడిత ప్రజల అధికారం కోసం ఎన్ని ఆటంకాలెదురైనా ధైర్యంగా, దృఢంగా ప్రజాయుద్ధంలో ముందుకే సాగాలని కోరుతూ…”
ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి బాధ, దుఃఖం, సంతోషం కలగలసిన వారి హృదయాలు
ఉద్వేగంతో బరువెక్కాయి. దళం వాళ్ళే తమ ముందు నిలబడి మాట్లాడుతున్న అనుభూతి, ధైర్యము కలిగాయి. తాము సరెండరైన విషయాన్ని పార్టీ ఎలా అర్ధం చేసుకుంటుందో? ఏమనుకుంటుందో? అని ఏదో మూలన వున్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. పార్టీ చెప్పిన ఈ విషయాలన్నీ ఎవరెవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెప్పాలి? ఎవరెవరిని ఓ కంట కనిపెట్టాలి? ఈ సారి దళం వస్తే ఊరందరికీ అర్ధం కాకుండా ఎక్కడ పెట్టాలి? వాళ్ళకు తిండి ఎలా సమకూర్చాలి? సెంట్రీలు ఎక్కడెక్కడ పెట్టాలి? ఉత్సాహంగా చర్చించుకుంటున్న వాళ్ళు దూరంగా అంబలి గంప నెత్తిమీద పెట్టుకుని, చంకలో చంటిదాన్నెత్తుకుని కొండెక్కి వస్తున్న టుబ్రిని చూసి మాటలు ఆపేశారు. “చిన్న ఫోన్ చేసాడా అన్నయ్యా?… చంటిదాన్ని దాసుకు అందించి రెండు చెతులతోనూ అంబలి గంపను దించుకుంటూ అడిగింది.
“ఆ…ఆ… చేసాడు చెల్లీ. ఫీజు కట్టడానికి డబ్బులు కావాలట. రేపు మీ వదినా, నేను వెళ్ళి ఇచ్చి వస్తాం.
“.టుబ్రికి చెబుతూనే” ఇంక వెళ్ళొస్తాం బావా “…అంటూ లేచారు గాసి, కాతృ.
“అయ్యయ్యో! అంబలి తాగి వెళ్ళండి అన్నయ్యా” …అంటూనే డొప్పల్లో అంబలి పోసి ఇచ్చింది. టుబ్రి ఇచ్చిన అంబలిని నిలబడే తాగేసి ఇప్పటి వరకూ తాము చర్చించుకున్న విషయాలనూ, చేయాల్సిన పనులనూ గుర్తుచేసుకుంటూ కొండ దిగి వెళుతున్న గాసి, కాతృలను సంతృప్తి గా చూసాడు దాసు.
***
“అక్కా! పది రోజుల వార్తాపత్రికలు, ఇతర డౌన్ లోడ్స్ పంపుతున్నాను. దీన్ని కాపీ చేసుకుని పెన్ డ్రైవ్ తిరిగి పంపగలవు.” కంప్యూటర్ ఆపరేటర్ వెన్నెల పంపిన ఉత్తరాన్ని చదివి పెన్ డ్రైవ్ ఎన్ని జిబి లుందో చూసి తన టాబ్ లో కాపీ చేసుకుని “డౌన్లోడ్స్ పంపినందుకు ధన్యవాదాలు”… అని చిన్న చీటి రాసి దాంతో పాటు పెన్ డ్రైవ్ ను వెన్నెలకు తిరిగి పంపింది సుధ. సుధ కు కాపీ చేసుకున్న వార్తా పత్రికలు చూడాలని ఎంత ఆతృతగా వున్నా సాయంత్రం 5 గంటలకు ఏదో మీటింగ్ వుందన్నారు. బహుశా రేపటి ప్రోగ్రాం ప్లానింగ్ చర్చించడానికి కావచ్చు అనుకుంటూ వాచీ చూసుకుంది. ఇంకా 10 నిముషాలే వుంది. ఇప్పుడు కాదులే అని టాబ్ ఆఫ్ చేసి పోచ్ వేసుకుని తుపాకి భుజానికి వేసుకుంటూ… ” లలితా… మీటింగ్ కు వెళ్ళాలి. హెడ్ క్వార్టర్ దగ్గరకు వెళదాం పద.” అంటూ తన గార్డ్ ను పిలిచింది. చదువుకుంటున్న పుస్తకం మూసేసి లలిత సుధతో పాటు వెళ్ళింది. మీటింగ్ పూర్తయ్యేసరికి 8 గంటలు అయిపోయింది. లలిత అన్నం తినేసి సుధ కోసం క్యారేజిలో పెట్టి వుంచింది. సుధ తన డేరాకు వచ్చి జిల్లీలో కూర్చుని టాబ్ తీయబోతుంటే… “అన్నం ఇప్పటికే చల్లగా అయిపోయింది. తిన్నాక చదువుకోవచ్చు కదా”….తను చదువులో పడి ఒక్కోసారి రాత్రి అన్నం తినడం మానేస్తుందనే భయంతో, ప్రేమగా అన్న లలిత మాటను కాదనలేక నవ్వుతూ …”సరే కామ్రేడ్ తింటాను”. అని టాబ్ ను పక్కన పెట్టి బుద్దిగా చేతులు కడుక్కుని వచ్చి లలిత వడ్డిస్తుంటే భోజనం పూర్తి చేసింది. తను చెప్పిన వెంటనే భోజనం చేసినందుకు కించిత్ సంతోషం, చిరుగర్వంతో లలిత తన జిల్లిలో కూర్చుని చదువుకోవడానికి పుస్తకం బయటకు తీసింది. టార్చిలైట్ ను చెవి పక్కన ఆనించి లైట్ వెలుతురును పుస్తకం పై పడేలా సెట్ చేసుకుని లైట్ కదలకుండా వుండేలా రుమాలుతో తలకు కలిపి కట్టింది. “సింగరేణి కార్మికుల్లాగ తలకు లైట్లు కట్టుకుని ఇప్పుడు చదవడం ఎందుకు? టైం తొమ్మిదయింది. ఇక పడుకోవచ్చు కదా లలితా..” నవ్వుతూ అన్న సుధ మాటలకు తలెత్తి “సింగరేణి కార్మికులు ఎలా వుంటారు”?
అమాయకంగా అడిగిన ప్రశ్నకు” నీలాగే తలకు లైట్లు కట్టుకుంటారు”.
నవ్వుతూ చెప్పి సుధ కూడా తన జిల్లీలో కూర్చుని టాబ్ ఓపెన్ చేసింది.” వాళ్ళూ లైట్లు కట్టుకుని చదువుకుంటారా?” లలిత ప్రశ్నకు నవ్వాగలేదు.
“అమ్మా తల్లీ | నిన్ను కదిలించడం నాదే తప్పైపోయింది. ఇప్పుడు నాకు పనుంది గానీ సింగరేణి కార్మికుల గురించి రేపు చెప్తానులే”.. ఏ కళనుందో లలిత మరో ప్రశ్న వేయకుండా మళ్ళీ తన పుస్తకంలోకి దూరిపోయింది.
సుధ తేదీల వారీగా ఒక్కో పేపర్ ను తిరగేస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా. పేపర్లంతా అధికార పార్టీ రాజకీయ నాయకులు, ఎంఎల్‌ఏలు తలపెట్టిన ‘ గడపగడపకు’ అనే కార్యక్రమం గురించే రాస్తున్నాయి.” మావోయిస్టు ప్రాభల్యం కలిగిన మన్యం ప్రాంతంలోని మంజరి పంచాయితీలో గట్టి పోలీసు బందోబస్తు మధ్య ‘గడపగడపకు’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళ్ళిన ఎంఎల్‌ఏ లకు అడుగడుగునా ఆటంకాలు”…. అనే వార్త ఆమె దృష్టిని ఆకర్షించింది. అప్పటి వరకూ యధాలాపంగా తిరగేస్తున్న పేపర్లను కొంచెం శ్రద్దగా చూడసాగింది.
‘ముఖ్యమంత్రి, ఎంఎల్‌ఏల దిష్టిబొమ్మలను తగలబెడుతూ ‘గడపగడపకు’ కార్యక్రమాన్ని అడ్డుకున్న ప్రజలు.” “మీ అధికారంలో మా గ్రామాలకు ఏం అభివృద్ధి చేసారో చెప్పండంటూ… గడపగడపకు కార్యక్రమానికి వచ్చిన మంత్రులను నిలదీసిన ప్రజలు.”…. ” చీపుర్లు, ఖాళీ బిందెలతో నిరసన తెలియజేసిన మహిళలు” …. సుధ కళ్ళు ఉత్సాహంతో వార్తల వెంట పరుగెడుతున్నాయి.
“తూర్పుగోదావరి జిల్లా నాతవరం మండలంలో బినామీ పేరుతో లేట్ రైట్ ముసుగులో బాక్సైట్
తరలించుకు పోవటాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించిన 5 పంచాయితీల ప్రజలు. 5 టిప్పర్లనూ, ౭ ట్రాక్టర్లనూ తగలబెట్టేసిన ప్రజలు.” …..
‘చిత్రకొండ పోలీస్ స్టేషన్ పై దాడి”. పెద్ద పెద్ద అక్షరాలతో వున్న వార్త. ఉలిక్కిపడి, నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది. ‘దాడా ‘? అక్కడెవరు చేసారు? పేపర్ ను జూమ్ చేసింది. ” తమ సమస్యలపై ర్యాలీ చేస్తున్న ప్రజలను అడ్డకునేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయటంతో తొమ్మిది మంది ఆదివాసులు గాయపడ్డారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు సరాసరి చిత్రకొండ పోలీసు స్టేషన్ లోకి దూసుకెళ్ళి అక్కడున్న కుర్చీలు, టేబుళ్లను, ఫైళ్లను ధ్వంసం చేసారు. ఆవరణలో వున్న 6 బైక్ లను కూడా తగలబెట్టేసారు”…… చిత్రకొండ పోలీస్ స్టేషన్ బోర్డు సగం కాలి తలకిందులుగా వేలాడుతున్న ఫోటో స్పష్టంగా కనిపిస్తోంది.
“అరకు మండలంలో చైనా క్లే తవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న ధర్నాను అడ్డుకోవడానికి వెళ్ళిన పోలీసులకు ప్రజలకు మధ్య ఘర్షణ. ఈ ఘర్షణలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలవగా, స్థానిక ఎస్‌ఐ బురదగుంటలో పడిపోయారు.”….విలేకరి ఎవరో గానీ కింద పడిపోయి వున్న ఎస్‌ఐ ఫోటోను క్లియర్ గా వేసాడు. అదే ప్రాంతంలో గతంలో ఎంఎల్‌ఏకిడారిని నిలదీసిన ప్రజలు, ఆ తరువాత అదే రోడ్డుపై కిడారిని, సివేరి సోమలను ప్రజల సమక్షంలో శిక్షించిన సంఘటనలు గుర్తుకొచ్చాయి సుధకు.
ఈ వార్తలన్నీ చదువుతుంటే ఆమెకు పట్టరాని సంతోషం కలుగుతోంది. పక్కన పడుకున్న వాళ్ళను లేపి ఈ వార్తలన్నీ చెప్పేయాలన్న కోరికను బలవంతంగా అణుచుకుంది.
నివురు కప్పిన నిప్పు…మెల్లగా రాజుకుంటోంది. దీన్నాపడం ఎవరి తరం?. ఇది మహా ప్రజ్వలనంగా మారక తప్పదు. చిన్న నిప్పురవ్వ దావానలాన్ని సృష్టిస్తుంది. చరిత్ర ఎప్పుడూ ముందుకే….మునుముందుకే… కాలచక్రాన్ని వెనక్కి తిప్పడం ఎవడికి సాధ్యం ? పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుకు దారితీయకుండా ఎవరాపగలరు ? …. ఇలా రకరకాలుగా సుధ ఆలోచనలతో, ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆమెకు బాగా సంతోషం కలిగినా నిద్ర పట్టదు. టాబ్ ను పక్కన పెట్టి టెంట్ లోనుండి బయటకు వచ్చింది.
అమావాస్య కాబోలు బయట చిమ్మచీకటిగా వుంది. చీకట్లో మిణుగురులు మిలమిలా మెరుస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పున్నమి నాటి వెన్నెల్లో అవి వెలవెలబోతాయి. అంటే అవి లేనట్టు కాదుకదా ! ప్రజలు కూడా అంతే. అణచివేత మరింత తిరుగుబాటుకే దారితీస్తుంది. ప్రజలే తమ ఉజ్వల భవిష్యత్తు ను నిర్మించుకుంటారు. కమ్యూనిస్టు పార్టీ చేయాల్సినదల్లా ఎంఎల్‌ఎం సిద్ధాంతంతో ప్రజలను చైతన్య పరచి రాజుకుంటున్న నిప్పును మరింత ఎగదోయడమే.!….. ప్రజా ప్రభంజనాన్ని సృష్టించే ఆలోచనలేవో ఆమె మెదడులో పదునెక్కుతున్నాయి.
చీకట్లో సుధ పెదవులపై చిరునవ్వు విచ్చుకుంది.
చరిత్ర కదులుతున్నకొద్ది మావోయిస్ట్లు అంతరించిపోతున్నారు. ఇప్పుడు అడవికి వెళ్ళడం ఆగిపోయిందేమో!
ముందుకు జరిగే చరిత్రలో మనల్ని కాపాడేందుకు ఒకప్పుడు దేవుడ్లు తర్వాత కామ్రేడ్లు ఉండేవారు అని చదుకుంటారు.