మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌ గ్రామంలోనూ, మహారాష్ట్ర కొండలలోనూ ఆదివాసీ నిరసనకారులు, నాయకులు విపరీతమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సూర్జాగఢ్ ప్రాంతం కేంద్రంగా కార్పొరేటికరణ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో లాయిడ్ మెటల్ కంపెనీ గణితవ్వకాల విస్తరణ కోసం సత్వర కార్పొరేటీకరణకు లొంగిపోవాలని స్థానిక సముదాయాల మీద రాజ్యం – కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. నవంబర్ 20న, మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌లోని నిరసన ప్రదేశాన్ని పారామిలటరీ బలగాలు చుట్టుముట్టి విధ్వంసం చేసాయి. ఎనిమిది మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను వారి గ్రామాల్లో గాలించి పట్టుకుని, అరెస్టుచేసి,  జీపుల్లో తీసుకెళ్ళడం అనే సాధారణ పద్ధతిని వదిలేసి, హెలికాప్టర్ల ద్వారా అదే రాష్ట్రంలోని గడిచిరోలి అనే పట్టణానికి తరలించారు. ఈ అరెస్టులకు నిరసనగా ధర్నాకు దిగిన వారిపై లాఠీచార్జి చేశారు.

సుర్జాగఢ్‌ కొండల్లో గనితవ్వకాల వ్యతిరేక పోరాటంలో ప్రముఖ నాయకుడు, న్యాయవాది లాల్సు నాగోటి.  ఇతను మాదియా-గోండ్ ఆదివాసీ వర్గానికి చెందిన కార్యకర్త. నిరసనల చారిత్రక సందర్భాన్ని, గ్రామంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడారు. సుర్జాగఢ్‌లో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తామంటే, రోడ్డుకు బదులు అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ఆదివాసీలు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు. 2023 మార్చి 11వ తేదీ నుంచి ఈ వార్తాకథనం రాసేనాటికి(నవంబర్ 20, 2023 ) స్థిరమైన నిరసనలు కొనసాగుతున్నాయి.”

“అయితే, నిన్న అంటే 2023 నవంబర్ 20న ఉదయం 6:30-7:00 గంటల మధ్య, చాలా మంది ఉద్యమ నాయకులను పట్టుకున్నారు. కమాండోలు, బలగాలు తాత్కాలిక టెంట్‌లను కూల్చివేసారు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు, లాఠీ ఛార్జీ చేసారు. వెళ్లగొట్టారు, మగ పోలీసు అధికారులు చేసిన లాఠీచార్జీలో మహిళా నిరసనకారులు దెబ్బలు తింటూ పరుగెత్తి పోవాల్సి వచ్చింది. చివరికి ఏటపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం, ముగ్గురు, నలుగురు మహిళలతో సహా 20-21 మంది కార్యకర్తలు పోలీసుల అదుపులో ఉన్నారు. స్థానిక న్యాయవాది వారికి బెయిల్ కోసం కృషి చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదు”అని ఒక కార్యకర్త వివరించారు.

స్థానిక నాయకులు నిరంతరం అణచివేతను ఎదుర్కొంటూనే వుంటారు. వీటి మద్య నిరసనలుచేయడం కష్టతరమైంది. “2021 నుండి, చాలా మంది ఆదివాసీ నాయకులను వివాదాస్పద ‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం- ఉపా’ కింద జైల్లో పెట్టారు. నన్ను పెగాసస్ నిఘాలో ఉంచడంతో కదలికలు మరింత కష్టతరమయ్యాయి.”

నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థానిక సముదాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం నిరసనలకు మరొక కారణం. “చట్టం ప్రకారం, గ్రామసభలు, గ్రామస్తుల నుండి తగిన అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. కానీ లాయిడ్స్ కంపెనీ మోసపూరిత మార్గాల ద్వారా అనుమతి తీసుకున్నది. “అది ‘నక్సల్స్ ప్రభావిత ప్రాంతం’ కాబట్టి,  స్థానికుల దగ్గరకు వెళ్ళలేకపోయామని,  చాలా మంది ఆదివాసీ ప్రజలు కేవలం అందుబాటులో లేకపోవడం వల్ల సమావేశానికి హాజరు కాలేకపోయారు అని,  జిల్లా కార్యాలయంలో ‘ప్రజాభిసేకరణ’ జరిపామని కంపెనీ వివరాన్నిచ్చింది. ప్రతి గ్రామసభను పరిగణనలోకి తీసుకోలేదు అని కూడా చెప్పింది”అని నాగోటి వివరించారు.

“2007లో మైనింగ్ కోసం భూమిని లీజుకు ఇచ్చారు. కానీ ప్రతిఘటన చాలా బలంగా ఉండటంతో గత రెండేళ్లనుంచే పనులు మొదలయ్యాయి. మేము జిల్లా మేజిస్ట్రేట్, గవర్నర్‌, ముఖ్యమంత్రిలకు లేఖలు వ్రాయడం వల్ల అప్పుడప్పుడు గనుల తవ్వకాన్ని నిలిపివేస్తున్నారు. అనుమతి పొందిన లాయిడ్స్ కంపెనీ, వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా త్రివేణి ఎర్త్‌ మూవర్స్ సహాయం తీసుకుంది” అని కంపెనీ మైనింగ్ వ్యవహారాల గురించి న్యాయవాది చెప్పారు.

నిరసనలు గత 250 రోజులుగానే కాదు ఎప్పుడూ కూడా శాంతియుతంగా  ప్రజాస్వామిక పద్ధతులలోనే జరుగుతున్నాయి అని అడ్వకేట్ లాల్సు నగోటి తెలియచేసారు. ప్రతిరోజూ ఉదయం రాజ్యాంగ పీఠికను ఆయన మాడియా భాషలోకి అనువాదం చేసి నిరసనకారులకు వినిపిస్తారు. ఆ తరువాత ఆనాటి వరకు జరిగిన పరిణామాలపై సమీక్షా సమావేశం జరుగుతుంది. ఈ ప్రక్రియల తర్వాతే నినాదాలు, ఉపన్యాసాలు మొదలవుతాయి.

ఈ నిరసనలో వివిధ బృందాలుగా పాల్గొంటున్నారు. ఒకొక్క బృందం 5-6 రోజుల వరకు నిరసన ప్రదేశంలో వుంటే ఆ తరువాత యింకో బృందం వుంటుంది. ఈ ప్రాంతంలో చట్టాల అమలుపై దృష్టి సారిస్తూ, నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి.

పరిస్థితిలో సంక్లిష్టత ఉన్నప్పటికీ, గత విజయాలలోని సాధారణ విషయాలను తీసుకుంటుంది. నియమగిరి కొండల్లో బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజల ప్రతిఘటన వేదాంత కంపెనీ బహిష్కరణకు దారితీసింది. అదేవిధంగా, సుర్జాగర్ మైనింగ్ వ్యతిరేక పోరాటం 2007 నుండి 2014 వరకు లాయిడ్ మెటల్స్‌ను సమర్థవంతంగా నిరోధించింది, అటువంటి తీవ్రమైన వ్యతిరేకత మధ్య మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించడంలో వున్న అసాధ్యతను కార్పొరేట్-రాజ్య కూటమి గుర్తించేలా చేసింది. ప్రతిస్పందనగా, ఉద్యమాన్ని అణిచివేసేందుకు, మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించడానికి పారామిలిటరీ శిబిరాల రూపంలో పటిష్టమైన భద్రతా యంత్రాంగాన్ని సుర్జాగర్ కొండల చుట్టూ ఏర్పాటు చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-సుక్మా సరిహద్దులోని నారాయణపూర్‌లోని అమ్‌దాయ్ ఘాటి కొండలు, బైలడిల్లా ఇనుప ఖనిజం బ్లాక్‌ల చుట్టూ విస్తృతంగా పారామిలిటరీ క్యాంపులను కూడా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసారు. కార్పొరేట్ భూసేకరణ, వనరుల దోపిడీకి సాధనంగా ఈ క్యాంపులను  పరిగణించే స్థానిక ప్రజల నుండి ఏకకాలంలో ప్రతిఘటనను ఎదుర్కొంటాయి. ప్రజాస్వామిక పోరాటాలను అణచివేయడంలో, కార్యకర్తలు, స్థానిక సముదాయాల్లో  భయాందోళన వాతావరణాన్ని పెంపొందించడంలో వాటి ప్రభావం ఉంటుంది.

https://en.themooknayak.com/tribal-news/corporate-expansion-vs-community-resistance-crackdown-on-adivasi-protest-in-maharashtra?fbclid=IwAR3MubX5Yw2hi-8TRFVH7GoEVdEuvocscaYTXA384OD6vL1T2FKFU-ilpPk

Leave a Reply