వెన్నెముక విరిగినంత
బాధల్లో
పురిటినొప్పులతో
అర్ధరాత్రి పుట్టాను నేను

నా పుట్టుక తెల్లవారాకే
నా బంధు మిత్రులకి తెలిసింది
నాడు సమాచార వ్యవస్థ నేటి లా లేదు సుమా!

తెలిసీ తెలియ గానే కేరింతల్లో
నా శ్రేయస్సు కోరే వారంతా
ఏం జరిగింది
ఏం జరగబోతోంది తెలియని తనం లో
వర్తమాన కోలాహలం చరిత్ర పునాది గా

తొలినాళ్ళలో అంబాడుతూ పడుతూ లేస్తూ
బులిబులి నడకలతో తప్పటడడుగులతో నేను
తప్పొప్పుల బేరీజు తో
భారీ ప్రణాళికలతో తల్లితండ్రులు
నా ఉజ్జ్వల భవిష్యత్తు కోసం రచనలు నిర్విరామంగా

ఎదుగుతున్న కొద్దీ
నాకోసం ఆస్తుల సృష్టి
నా ఆధీనంలో ఎన్నో కర్మాగారాలు సంస్థలు
ఇరుగు పొరుగు తో సత్సంబంధాలు
నెలకొల్పుకుంటూ
సామ దాన భేద దండోపాయాల తో

ముదిమి వయస్సు లో
కొడుకులు నా ఆలనాపాలనా గాలికొదిలి
నా ఆస్తులు అమ్మి సొమ్ము చేసుకుంటూ
నా కర్మాగారాలు మూసేస్తూ
అప్పనంగా వేరే వ్యక్తులకి అంటగడుతూ
నన్ను అశక్తు రాలిని చేస్తుంటే
చేష్టలుడిగి నిస్తేజంగా

డెభై ఐదేళ్లు నిండిన
స్వాతంత్ర్యాన్ని నేను
నా జనం లో చైతన్యాన్ని
చూడాలనే వెర్రి ఆశ తో బతుకుతున్నా

2 thoughts on “చిన్ని ఆశ

Leave a Reply